విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ
'Sreegandham' - New Telugu Story Written By Dr. Kanupuru Srinivasulu Reddy
'శ్రీగంధం' తెలుగు కథ
రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఏవండీ! మావయ్యకు, అత్తమ్మకు మాత్రలు సాయంత్రానికి ఉంటాయి" అంటూ నవ్వుతూ చూసింది. అందులో అసంతృప్తి గాని, నిసృహతగాని కనిపించలేదు.
ఒకరికి ఆస్తమా షుగర్. నాన్నకేమో గుండె జబ్బు, నరాల బలహీనత వొణుకుడు రోగం. ఒక్క పూట మాత్రలేకపోయినా చివరి గడియలన్నట్లు అయిపోతారు.
“అసిడిటీ కి కూరల్లోకారం తక్కువ చేస్తున్నానండి. సుగరుకు వేరే! అందరికీ వొకేరకం పనికి రాదుకదా! అందరూ మాట్లాడకుండా తినేస్తారు. అదొక అదృష్టం" అంటూ నవ్వింది.
ఆ నవ్వులో నిండుతనం, ధైర్యం, కనిపించింది.
“నువ్వు లేకపోతే నా తల్లిదండ్రులు, అత్తమామలు, ఎవ్వరూ ప్రాణాలతో ఉండరు!!”
“మీరు లేకపోతే మేము ఎవ్వరం లేము. ఇంటి యజమాని మూలస్థంభం సంసార మనుగడకు. మాకు ఆత్మ విశ్వాసం మనోధైర్యం మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించే గురుతుల్యులు మీరు”
“మరీ గ్రాంధికంగా ఉందికదూ! అలా ఉంటేనే వాటి గౌరవం తెలుస్తుందేమో!?”
“నేటి జెనరేషన్ మారిందని గుర్తుకు రాదు” అంటూ నవ్వింది.
'మరి ఆమె, నేను ఏ జనరేషన్ ??'
“అనుకూలవతి అయిన భార్య ఆదిదేవత. అసలు నువ్వు మనిషివా మాకోసమే పుట్టిన దేవతవా అని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాను. సాయంకాలం అలిసి ఇంటికి నీ చూపుల శీతలవనాల కనుచూపుల్లో ప్రపంచాన్ని మరిచి పోవాలని పరుగెత్తుకు వస్తున్నా!”
“ఇది మరీ నాటకీయంగా ఉంది. సాయంత్రం నాలుగు గంటలకే మీ రాక కోసం ఎదురు చూసే నా గుండె చప్పుళ్ళను ఏమని చెప్పాలి ? సరేగాని స్నానం చెయ్యండి. చల్లని కాఫీ ఇస్తా!?”
“అదేవిటి ?”
“మీరే కదా ఐస్ ముక్కలకోసం పరుగెత్తుకు వచ్చానన్నారు”
“ఏవిటి ఇంత తీరిగ్గా మాట్లాడగలుగుతున్నావు. నవగ్రహాలు ఏమయ్యారు ?”
“లోకం చదవడానికి వెళ్ళాయి. మరిచి పోయారా ఈ రోజు మన స్వాతంత్ర దినం. మా నాన్న కూడా మామయ్యను బలవంతంగా తీసుకెళ్ళాడు ఏదో రాయితీలు ప్రకటిస్తారని!!"
“ఏవిటో ఆ ప్రశ్నాపత్రం ?”
“ఎక్కడో అడివిలో తలా రెండు ఎకరాలు ఇస్తారట."
“మన కొద్దుగా" అని ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తుండిపోయాను.
“సిగ్గు ముంచుకొస్తోంది. అలా చూడకండి!”
“ఎక్కడ దాచావు ఇంతకాలం?”
“మీ హృదయంలో!”
దగ్గరకు తీసుకుని గట్టిగా ఎదపై దాచుకున్నాను.
"మళ్ళీ ఎంత కాలమవుతుందో ఈ జన్మలకు” అంటూ వొదిగిపోతూ కళ్ళెత్తి నా వైపుచూసింది. బహుమతి ప్రధానం చాలనుకున్నాను.
మా అమ్మ గారికి ఆరోగ్యం అంత బాగుండేదికాదు. ఆస్మా, షుగర్ రెండూ ఇబ్బంది పెట్టేవి. ఒక్కగానొక్క చెల్లెలు. నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ తో కొంత చేతి అప్పుతో మాకు తగ్గట్టుగా పెండ్లి చేసాము. అబ్బాయి ఇంజినీరు. ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఊహించని రీతిలో అతను మరో పెండ్లి చేసుకుని మా చెల్లెల్ని పిల్లలని తరిమేసాడు. మా చెల్లెలు డిప్రషన్లోకి వెళ్లిపోయింది. ఎవ్వరితో మాట్లాడదు. పిల్లల్ని, పరిసరాల్ని పట్టించుకోదు.
'ఇది మన బాధ్యతరా' అనేవాడు ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో మా నాన్న! ఆ చిరునవ్వే నా జీవితం అయ్యింది. ఆయన ఫిలాసఫీ ఏ వేదాంతీ బోధించలేనిది, మనసును క్రమబద్దం చేయగలది మరొకటి లేదు. అనవసరంగా నువ్వు తప్పనిసరిగా భరించ వలసిన భాద్యత అయినప్పుడు మనస్పూర్తిగా భరించడం నేర్చుకోవాలి.
అలాగాక ఇన్ని బాధలు నాకేనేనా అని ప్రతీక్షణం గుండెలు బాదుకునే దానికన్నా నీ అదృష్టాన్ని ప్రతి నిముషం తిట్టుకునే దానికన్నా 'ఇది నేను, నాకే ఉంటాయి ఇవన్నీ' అని తృప్తిపడి జీవితాన్ని గడపడం మంచిది అని ఆయన నమ్మకం. అదే నాదారి అయ్యింది.
రాత్రి పదకొండుకు నాకు తీరిక. ఉదయం నాలుగు గంటలకు నా డ్యూటీ మెదలవుతుంది. అన్నీ చేసి తొమ్మిది గంటలకు ఆఫీసుకు వెళతాను.
మందులకు, ఖర్చులకు నాన్నకు వచ్చే పెన్షన్ ఇవ్వబోయినా నేను తీసుకొను. అంతులేని తృప్తి కలిగేది వాళ్ళను చూసుకోగలుగుతున్నాను అని. అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. నాన్నకూడా ముందులా లేడు. ఎప్పడూ కూతురితో దేవుడి గదిలోనే ఉంటాడు. నా మేనల్లుడు కోడలు చాలా తెలివిగల వాళ్ళు. గవర్నమెంటు స్కూలు మా స్తోమత! ఆ స్కూలే వాళ్ళ భవిష్యత్తుకు పునాది.
వయసు వచ్చేస్తుందని నన్ను పెండ్లి చేసుకోమ్మన్నారు. చెల్లెలికి లేని సుఖం నాకెందుకని వొద్దు అన్నాను. మాకు అవసరం అన్నారు. వంటకంటే ఇంటికంటే నా మనసుకు చేదోడు వాదోడుగా ఉంటుందని అడ్డు చెప్పలేదు. ఆవిడ మాలో కలుస్తుందా లేదా అనే ఆలోచనే రాలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రుల నిర్ణయం మీద ఎనలేని నమ్మకం నాకు.
మా నాన్న స్నేహితుడు, భావాలలో ఆపోజిట్ దృవం గారి కూతురు. బాగా చదువు కుంది చేసుకుందాం అంటే మీ ఇష్టం అన్నాను. మా ఇంటి పరిస్థితులు అన్నీ తెలిసే ఇంట్లో అడుగు పెట్టింది ఆమె. మా మావ గారు స్వాతంత్ర సమరయోధుడు. మానాన్న ఆయన వాదించుకున్నట్లు ఏ రోజు చూడలేదు. అది వాళ్ళ వ్యక్తిత్వం!!
మావగారికి గవర్నమెంటు అప్పుడెప్పుడో కొంత ఇండ్ల స్థలం చెత్తా చెదారం వేసే మురుగు కాలువ పక్కన ఇచ్చారు. సిటీ పెరిగిపోతున్నందు వలన కాబోయే రాజకీయనాయకులు, స్ట్రీట్ రౌడీలు ఆక్రమించుకున్నారు. దాన్ని సొంతం చేసుకోవడానికి నిరంతర పోరాటం చేసి సగం దక్కించుకున్నాడు.
అది మగ పిల్లలు తీసుకుని కొంత ఈయనకు బిక్ష వేసి త్యాగానికి పలితంగా బైట వెళ్ళమన్నారు. రక్త పాశం కదా సర్దుకున్నాడు. అదే ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చి ఇండ్లు తను కట్టిస్తానన్నాడు. దానికి నాన్న వొప్పుకోక ఇద్దరం కలిసి కట్టుకుందాము అనే హామీ మీద ఉన్న కాస్త డబ్బుతో రెండు రూములు వేసి ఇద్దరూ తృప్తి చెందారు. చెల్లెలి కుటుంబాన్ని అమ్మానాన్నల రూములో ఉంచుకున్నారు.
మేమిద్దరం... ?!
ఇంటిలో వీలుగాక, అందరూ నిదురపోయినప్పుడు ఆరుబయట కూర్చుని మా శ్రీమతి నేను ఊసులాడుకునే వాళ్ళం. అలిసి పోయి నా ఎదపై నిదురపోయేది. ఇది కష్టమనిగాని. అది లేదు ఇదిలేదు అనిగాని, ఇప్పటి వరకు ఆమె నోట నేను వినలేదు. ఉద్యోగం చేస్తావా అని అడిగితే ఈ సంసారమే నా ఉద్యోగం అంది. నా సంసారం కూడా పెరిగింది రెండు రూములకు మరో రెండు తప్పని సరి అయ్యాయి.
బ్యాంకు లోను తీసుకుని పైన రెండు గదులు వేసి వాళ్ళ అమ్మానాన్నలకు, మా అమ్మానాన్నల పడకలు క్రిందనే ఉంచి పిల్లలను పైకి పంపించాము. మా అమ్మా, వాళ్ళమ్మ నా శ్రీమతిని ప్రతి చిన్నదానికి పిలుస్తూనే ఉంటారు. చిరునవ్వు తప్ప విసుగు కోపం ఇంతవరకు నేను చూడలేదు. లోను కట్టడం పిల్ల చదువులు తల్లి దండ్రుల మందులు అవసరాలు లోటు లేకుండా వచ్చే డబ్బును సర్దేది ఆవిడ.
నూటికి తొంబై మంది సెల్ఫోన్లు వాడుతారు. మా ఇంటిలో ఒక్కటి మాత్రమే ఉంటుంది. అదే అందరు వాడుకుంటారు. అడగనుకూడా అడగరు. వాటి వలనకలిగే దుష్పలితాలు మా కంటే కూడా వాళ్ళకే బాగా తెలుసు. అలా మలిచింది నా శ్రీమతి ఆ శిల్పాలను.
ఊహలు కూడా నీ అదుపులో ఉండాలి. గొంతెమ్మ కోరికలు మీకు మంచి చెయ్యవు అని మా ఆవిడ చెప్పకనే ఒప్పిస్తుంది. వింటారు. అది వాళ్ళ సంస్కారం. పుర్రెకో బుద్ధి అన్నా పెద్దలనడవడిక, పిల్లమీద తప్పక ఉంటుందని నా అభిప్రాయం.
ఆఫీసునుంచి వచ్చి కూర్చుని షూష్ తీస్తున్నాను.
కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, "ఏవండి! అత్తమ్మకు ఆయాసం ఎక్కువగా ఉంది. రాత్రి మావయ్య నేను నిదుర పోలేదు. కూర్చునే ఉన్నాము" అంది కాస్త దిగులుగా శ్రీమతి.
“రోజు ఉండేదే కదా!”
“కాదండి నాకేదో భయంగా ఉంది. మావయ్యకూడా ఆయాస పడుతున్నట్లు అనిపించింది. రాత్రి బాత్ రూమ్లో పడ్డాడు. కుంటుతూ నడుస్తున్నారు. మీరు పడుకోండి అంటే ఒప్పుకోలేదు."
లేచి రూంలోకి వెళ్లి అమ్మను చూసాను. గోడకు ఆనుకుని దిండ్లు ఎత్తుగా పెట్టుకుని, నోరు తెరుచుకుని గాలి కష్టంగా పీలుస్తూ అటు ఇటుకదులుతూ చిరాగ్గా పడుకోనుంది.
మెల్లగా బయటకొచ్చి," భోంచేసారా ?” అడిగాను.
“జావ కాసిచ్చాను. కొద్దిగా తాగింది. మావయ్య రెండు ఇడ్లీలే తిన్నారు."
“హాస్పిటల్కు తీసుకెళితే బాగుంటుందేమో?” అప్పుడే లేచి వచ్చిన నాన్న.
“ఆటో పిలుస్తాను. నువ్వు త్వరగా రడీగా!” అంటూ వెళ్ళబోతుండగా దగ్గరకు వచ్చి ఆవిడ చెప్పిన మాట విని నిలిచిపోయాను. మా పాప పెద్దమనిషి ఈరోజే అయ్యిందని తను రాకూడదని చెప్పింది.
“ఆటోలో కష్టంరా! ఏదైనా... ?” అన్నాడు నాన్న.
యంబులెన్సు పిలిచి బయలుదేరబోతే నాన్న ఎంత చెప్పినా వినకుండా ఎక్కి కూర్చున్నాడు.
యమర్జేన్సీ వార్డులో చేర్చాము. పరిక్ష చేసి కండిషన్ సీరియస్ గా ఉంది, హార్టుఅటాక్ వచ్చింది ఉదయం అయితేగాని చెప్పలేం అన్నారు డాక్టర్లు. ఆ మాటతో దేనికి తొణకని నాన్న దిగులు పడిపోయాడు. నాకు భయగాని బాధగాని అనిపించలేదు. ప్రేమలేకకాదు. ఇదొక జీవిత అంతిమ పరిణామం. సహజం అనిపించింది. ఎప్పుడూ భగవద్గీత చదివి వినిపించేవాడు నాన్న.
ఉదయం అందరూ హాస్పిటల్ కు వచ్చారు. సిగ్గుపడుతూ దూరంగా దిగులుగా భయంగా చూస్తున్న పెద్ద పాపను దగ్గరగా తీసుకుని ముద్దుపెట్టి చేతికి ఉన్న ఒక్కగానొక్క ఉంగరం నా శ్రీమతి కానుక ఇచ్చాను. కన్నీటిని దాచిపెట్టుకుంటూ వాళ్ళ అమ్మను చూసి నవ్వింది. ఆమె నా వైపు చూసి నవ్వింది.
“ఏమయినా చెయ్యాలా ?’ అని మెల్లగా అడిగాను.
“స్నానం చేయించాను. నేను దేవుడికి కొబ్బరికాయ కొట్టాను”
“నువ్వు ఎప్పుడూ కొట్టవుకదా!”
“మీరున్నప్పుడు మరో దేవుడికి ఎందుకు మొక్కు కుంటాను. మరో వింత. మానాన్నఅమ్మలను వాళ్ళు కొడుకులు రమ్మని బలవంతం చేస్తున్నారట. వెళతారట!! మీ అక్క వాళ్లకుకూడా వేరుగా ఉండాలనే కోరికను ఈ మధ్య మాటల్లో గమనించాను."
ఆశ్చర్యంగా నమ్మలేనట్లు చూసి తలదించుకున్నాను. నిజమే! ఎవరి జీవితాలు వాళ్ళవి. కొడుక్కి ఇంజినీరింగ్ పూర్తి అయి ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా మాకు బరువు తగ్గించాలని ఏమో? అంతేగాని ఇక్కడ బాగలేదని కాదు అని గట్టి నమ్మకం.
ఆలోచనను దాటేస్తూ,"మీ అమ్మా నాన్న, కొడుకులకు ఎందుకు జ్ఞాపకం వచ్చారు” అడిగాను.
“మొన్న స్వాతంత్ర దినం రోజు, బ్రతికున్న సమరయోధులకందరికి అడివిలో రెండు ఎకరాలు ఇచ్చారట. బంధం గుర్తొచ్చింది!!” నవ్వింది.
ఆనవ్వులో అసంతృప్తి కనిపించలేదు.
“డబ్బులేమయినా ఉన్నాయా?” మొట్టమొదటిసారి సిగ్గుపడుతూ అడిగాను.
“మనం తీసుకున్న లోనుకు, ఇంటి ఖర్చులకుపోను...!?” అని నవ్వింది.
“ఎందుకు నవ్వుతున్నావు?’
“మిమ్మల్ని మిగుల్చుకోగలిగాను కనుక, నేను మీకు మిగిలాను గనుక!!”
నవ్వాను.
“మీరెందుకు నవ్వుతున్నారు?”
“ఖర్చు లేనిదిగనుక, మధ్యతరగతి మనుగడకు మంచి గంధంగనుక!!”
చాలీ చాలని జీవితాలలో నవ్వే, శ్రీ గంధపు పరిమళం అన్నట్లు మస్పూర్తిగా నవ్వింది..
*****
డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..
నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.
@potlurumanyam1861 • 30 minutes ago
Super story...చదవడం కూడా ఆసక్తిగా ఉంది.. పొట్లురు సుబ్రహ్మణ్యం.
కథ బాగుంది అభినందనలు