శ్రీకృష్ణ జననం
- Yasoda Gottiparthi
- 1 day ago
- 4 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #SrikrishnaJananam, #శ్రీకృష్ణజననం, #TeluguDevotionalStories

Srikrishna Jananam - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 17/08/2025
శ్రీకృష్ణ జననం - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“అమ్మా! చాలా షాపింగ్ చేయాలన్నావు ఎందుకని?" అడిగింది చిన్నారి కుముద. "తమ్ముడికి కూడా కొంటావా? నాకు మాత్రమేనా?" అనుకుంది లోలోపల.
చిన్నారి తల్లి — "మీ ఇద్దరికీ కొంటాను. వచ్చే పండుగకు ఇద్దరికి కొత్త బట్టలు ఉండాలి కదా!" అంది తల్లి రేవతి.
"ఏ పండుగమ్మా! బర్త్‌డే నాది కదా! తమ్ముడికి ఎందుకు?" అనగానే,
"ఆ రోజు కృష్ణుని పుట్టినరోజు కూడా.. జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమి అని కూడా అంటారు. అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి.. "
తనకోసం ప్రత్యేకంగా ఉండదని ముఖం చిన్నబుచ్చుకుని, "ఎవరి పుట్టినరోజు అయితే వాళ్లే వేసుకోవాలి.. కానీ అందరూ వేసుకుంటారా?"
"సరే తల్లి! నీ సందేహం కరెక్టే.. కానీ పండుగ కాబట్టి వేసుకోవాలి" అంటూ రేవతి ప్రక్కనున్న కృష్ణుని విగ్రహానికి కూడా కొలతలు తీసుకుంటుంటే..
"బొమ్మకు ఎందుకమ్మా?" అనగానే,
ఇంతలో భర్త రాము వచ్చి — "ఇదేం హడావిడి? ఇంకా ఇరవై రోజులు ఉంది కదా!" అనగానే,
"కృష్ణ విగ్రహం కోసం మంచి డిజైన్ క్లాత్ తీసుకొని కుట్టిద్దామని అనుకుంటున్నాను. అందుకే ముందుగా తీసుకుంటున్నాను. "
"ఏమేమి కొంటావు?" అనగానే, "ముందు కారులో వెళ్దాం, పదండి" అంటూ కదిలారు అందరూ.
సంపూర్ణ మార్కెట్ రానే వచ్చింది. దిగి లోపల రంగుల పూసలతో ఉన్న ఊయల ఒకటి తీసుకుంది రేవతి.
కొడుకు శ్రీను — "భలే ఊయల! నేను ఎక్కవచ్చా?" అన్నాడు.
"నీ కోసం కాదు, కృష్ణుడు కోసం, " చిన్నపిల్లవాడు కృష్ణుడు బొమ్మ చూపించి "ఇలా పడుకుంటాడు, 'కృష్ణా!' అని పిలవాలి" అని చెప్పింది.
"అవునా! కథ చెప్పు" అనగానే —
"కృష్ణుడి తల్లి దేవకి, తండ్రి వసుదేవుడు. అన్న కంసుడు మధురకు రాజు. దేవకి, వసుదేవుడికి పెళ్లి చేసి, పెద్ద రథంపై తన రాజ్యానికి తీసుకెళుతుండగా, ఆకాశం నుండి మాటలు వినబడ్డాయి — 'కంసా! నీ చెల్లెలు కడుపులో పుట్టిన ఎనిమిదవ సంతానం వల్ల నీకు మరణం తప్పదు' అంటూ ఆకాశవాణి పలికి మాయమైంది.
చాలా కోపంతో కత్తి తీసి "చెల్లెలు తల నరికేస్తాను" అనగానే,
భర్త వసుదేవుడు — "ఆమె ఏం పాపం చేసింది! ఆమె సంతానం వల్ల కదా నీకు మరణము. ఎనిమిదవ పిల్లవాడు పుట్టగానే నీ చేతిలో పెడతాను బావా! దేవకిని ఏమీ చేయవద్దు" అంటూ కాళ్లపై పడ్డాడు.
"నీకు పుట్టిన పిల్లలందరినీ చంపేస్తానని ఒప్పించుకొని, దేవకి, వసుదేవులను చెరసాలలో బంధించాడు. భటులను నియమించి, కాన్పు కాగానే చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు. పుట్టిన ప్రతిసారి పిల్లలను తన చేతితో చంపేశాడు. "
కుముద పాపం — "కంసుడు చెడ్డవాడు!" అనగానే,
శ్రీను — "కంసుని ఎవరు చంపేయలేదా అమ్మా?" అని అడిగాడు.
"అవును నాన్నా! చంపాలి. కానీ వాడు కఠిన తపస్సు చేసి బ్రహ్మతో వరం పొందాడు. "
"ఏం వరమమ్మీ?" అనగానే —
"ఉగ్రసేనుడు అనే రాజు మధురను పాలించేవాడు. అతని కుమారుడు కంసుడు దుష్టుడు. రాజ్యాన్ని ఆక్రమించి సొంత తండ్రిని జైలులో పెట్టాడు. తాను మధురకు రాజుగా ప్రకటించుకుని, ఆజ్ఞాపిస్తూ సైనికులను, అమాయక ప్రజలను, ఋషులను చంపేవాడు. "
దీనిని భరించలేని భూమి తల్లి ఆవురూపంలో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి – “కంసుడు లాంటి నిరంకుశుడి భారాన్ని నేను మోయలేను. అతనికి న్యాయం, నైతికత లేవు. గొప్పతనానికి గొప్ప శత్రువు..” అని ఫిర్యాదు చేసింది.
బ్రహ్మ విష్ణువు దగ్గరికెళ్లగా, విష్ణువు వారికి – “నేను భూమిపై పునర్జన్మ పొంది కంసుడిని సంహరిస్తాను” అని హామీ ఇచ్చాడు.
సాక్షాత్తు విష్ణువే, కృష్ణుడిగా నీల మేఘ ఛాయతో, శ్రావణ శుక్ల అష్టమి అర్ధరాత్రి దేవకీ గర్భం నుంచి జన్మించాడు.
భటులు గాఢనిద్రలో ఉండగా జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. అప్పుడే పుట్టిన కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో పెట్టి తలపై పెట్టుకుని, పరవళ్ళు తొక్కే యమునా నది దాటసాగాడు. కుండపోత వర్షం కురుస్తున్నా, శేషశాయి తన ఫణాలతో గొడుగువలె కప్పి కృష్ణుడిని రక్షించాడు.
వసుదేవుడు గోకులానికి చేరుకుని, నందు–యశోదలింటి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో యశోదకు ఒక ఆడబిడ్డ పుట్టి నిద్రిస్తోంది. వసుదేవుడు ఆ పాపను తీసుకుని, కృష్ణుడిని ఆమె ఒడిలో పరుండబెట్టి, తిరిగి జైలుకు వచ్చేశాడు.
తర్వాత కంసుడు అక్కడికి వచ్చి దేవకీ పక్కన ఆడపిల్లను చూసి – “నన్ను మోసం చేశారు! మగబిడ్డకు బదులు ఈ ఆడపిల్ల ఏమిటి?” అంటూ కోపంతో పాపను గోడకు కొట్టబోయాడు.
అప్పుడా పాప ఆకాశంలోకి ఎగిరి – “నిన్ను చంపేవాడు గోకులంలో పెరుగుతున్నాడు!” అని చెప్పి అదృశ్యమైంది.
అలా యశోదమ్మ ఒడిలో కృష్ణుడు పెరుగుతూ, ఉయ్యాలలో ఊగసాగాడు. మనమూ కృష్ణుడిని ఊయలలో పెట్టి ఊపుతాము.
కథంతా ఆసక్తిగా విన్నారుగా? – “పదండి” అంటూ పిల్లలను రంగుల తాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది.
పిల్లలు అడిగారు: “ఇవి ఎందుకమ్మా?” “వాటిని ఉట్టి అంటారు. పూర్వం పెంకుటిళ్లకు వాసాలు ఉండేవి. వాటికి కట్టేవారు. అందులో గోవుల పాలు, పెరుగు కుండలు పెట్టేవారు. కింద పెడితే పిల్లలు తాగేస్తారు కాబట్టి పైకెక్కించి కట్టేవారు.
కృష్ణుడు తన స్నేహితులను పిలిచి వారి భుజాల మీద ఎక్కి పాలు, పెరుగు, వెన్న తీసి అందరితో పంచుకొని తినేవాడు. ఇంకా నిద్రపోతున్న కోడళ్ళ ముఖానికి పూసేవాడు. అత్తలు చూసి – ‘కోడళ్ళు తిన్నారు’ అని కోప్పడేవారు. కానీ గోపికలు మాత్రం – ‘కృష్ణుడి మాయే’ అంటూ నవ్వేవారు. ”
కృష్ణుడికి వెన్న ముద్దలు చాలా ఇష్టం. అందుకే పండుగ రోజు సాయంత్రం దేవాలయాల్లో ఉట్టి కొట్టే వేడుక చేస్తారు. రెండు గుంజలు పాతి, పైన కట్టిన ఉట్టి కుండను పైకీ కిందికీ గుంజుతారు. ఎవరు తెలివిగా ఎక్కి పాల కుండను పగులగొడతారో వారికి కానుకలు ఇస్తారు.
ఇద్దరూ పోటీ పడుతూ – “నేనంటే నేనన్నా!” “అక్కా! నువ్వు ఎగరలేవు. నన్ను నాన్న భుజాల మీద ఎత్తుకుంటే నేను కొడతాను” అని పిల్లలు సంబరంగా చెప్పుకుంటుంటే, రేవతి–రాము వాళ్ల ఆనందం చూసి సంతోషపడ్డారు.
తర్వాత – “పాపకు గోపిక డ్రెస్ — పరికిణీ, జాకెట్, ఓణీ కుట్టాలి” అని కొలతలు తీసి టైలర్‌కి ఇచ్చారు. “శ్రీనుకి ధోతి, లాల్చీ కట్టిస్తాను. అచ్చు కృష్ణుడిలా ఉంటాడు.
‘అమ్మా! నాకు కిరీటం, నెమలి పింఛం పెడతావా? నాకు ఫ్లూట్ కావాలి.. నేను కృష్ణుడిని అవుతాను’ అన్నాడు కుముద.
‘నువ్వు గోపిక వేషం వేయాలి మనింట్లో. మా స్కూల్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారు. నన్ను కృష్ణుడు వేషం వేయమన్నారు. ’
‘నేను నీ టీచర్‌కి చెబుతాను. నువ్వు గోపికలా బాగుంటావు. తమ్ముడిని కృష్ణుడిగా తీసుకెళ్ళమంటాను’ అని బుజ్జగించింది. ”
*******
పండుగ రోజు తెల్లవారు జామునతెల్లవారుజామున తల స్నానం చేసింది. ఇంటి ముందు తుడిచి ముగ్గులు పెట్టింది. కృష్ణ పాదాలు వాకిలి నుండి గుమ్మం వరకు చక్కగా వేసింది. పిల్లలు లేచి చూసి కృష్ణుడు వచ్చాడా? పాదాలున్నాయి అంటూ, లోపల చేరారు. తలసీ దళాల, పూలమాలలతో అలంకరించి ఉన్న కృష్ణుడు విగ్రహాన్ని పూజా మందిరములో పెట్టీ పూజకు రండి పిల్లలూ అని పిలిచింది రేవతి. "గోవింద హరే గోపాల హరే" అనికృష్ణుని పాటలు పాడుతూ, వచ్చిన వాళ్లందరికీ ప్రసాదాలు పంచింది.
******
స్కూల్లో నంద గోపాలుడి పాత్రలో మా ఫ్రెండ్ రవి వేషం వేస్తున్నాడమ్మా అన్నాడు శ్రీను. యశోద నందుల ఇంట్లో చిన్న బాలుడు కృష్ణుడు జన్మించే ముందు కల వస్తున్నట్లు, విష్ణువే పుట్టుతాడు ప్రజలంతా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఒక యోగి అంత ఏదైనా మవుతాడు. నవీన్ యోగి గా చేస్తాడు. గోవుల పాలు రుచి గల నైవేద్యాలు చేసుకుని వచ్చారట. ఉయ్యాల అలంకరించి కృష్ణుడిని పడుకోబెట్టి "జ్యో అచ్చుతానంద జోజో ముకుందా, లాలి పరమానంద రామ గోవింద" అని పాడాలీ.. స్టేజ్ పైన.. మా స్కూల్ టీచర్ "గోపికమ్మ" పాట ప్రాక్టీస్ చేయమంది. పేరెంట్స్ కూడా రావాలి అన్నది. పదండి ఇక ఆలస్యమెందుకు అని వెళ్లారందరూ..
**************
యమునా నదీ తీరం బృందావనంలో "రాధాకృష్ణుల నృత్యం""గోపికమ్మా.. నీ నవ్వులే చందనాలు మల్లె పూల సుగంధాలు కృష్ణా నీ అడుగే నా ఆరాధనం" అందరూ ఆనందించారు. ******* సాయంత్రం "ఉట్లు కొట్టుడు" ప్రతి దేవాలయంలో వేడుక పండుగగా జరిగింది. పిల్లలు! భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక పురాణ గాథ ఉంటుంది. సంప్రదాయాలతో జరుపుకుంటే ఆనందం, భక్తి కలుగుతాయి. మీకు చాలా బాగా నచ్చింది కదా జన్మాష్టమి అనగానే, "జై శ్రీకృష్ణ" అని మురిసిపోయారు
శుభం
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Kommentare