top of page

శ్రీమతి 2.O'Srimathi 2.O' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 25/02/2024

'శ్రీమతి 2.O' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్రాజేశ్వరి కి పెళ్ళయి ఇరవై సంవత్సరాలు దాటింది. భర్త తో హ్యాపీ గానే ఉంది. పిల్లలు చదువుకోసం ఫారిన్ వెళ్లారు. ఇంట్లో ఉన్నది తను, భర్త రామారావు మాత్రమే. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలను చూస్తే, వాళ్ళు లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో.. అని తెగ ఫీల్ అయ్యేది రాజేశ్వరి. నేటి జనరేషన్ స్పీడ్ ని చూసి.. తను కుడా ఆ స్పీడ్ ని అందుకోవాలని అనుకుంది రాజేశ్వరి. పెళ్ళైన కొత్తలో.. ఇంత ఎంజాయ్ చెయ్యడానికి లేదు తనకి.. ఆ రోజులే వేరు కదా.. ! అని తన గతం గుర్తు చేసుకుంది.. 


*****

"మన అమ్మాయి రాజేశ్వరికి మంచి సంబంధం వచ్చింది.. " అన్నాడు భార్య తో రాజీవ్.

 

"అబ్బాయి ఏం చేస్తున్నాడండీ.. ?". 


"గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు.. "


"అమ్మాయిని కుడా ఒక మాట అడగండి.. " అంది భార్య.

 

"అమ్మాయి రాజేశ్వరి నా మాట ఎప్పుడూ కాదనదు. అయినా, మనకన్నా బాగా ఎవరు ఆలోచిస్తారు చెప్పు.. !" అని సమర్దించుకున్నాడు రాజీవ్.


అప్పట్లో.. రాజేశ్వరికి ఒక్క మాట కుడా చెప్పకుండా, పెళ్ళి ఖాయం చేసేసారు. రామారావు కు మాత్రం అమ్మాయి బాగా నచ్చింది.. ఒప్పుకున్నాడు. తండ్రి మాటకు విలువ ఇచ్చి పెళ్ళి చేసుకుంది రాజేశ్వరి. భర్త ఎప్పుడూ ఆఫీస్ తో బిజీ గా ఉండేవాడు. ఇంట్లో వంట, ఇంటి పని చేసుకోవడం.. అత్తగారికి, మావగారికి సేవలు చెయ్యడం.. తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన భర్త కు సేవలు చెయ్యడం.. ఇలాగే రాజేశ్వరి జీవితం సాగిపోయేది. ఎప్పుడైనా.. ఒక సినిమాకి తీసుకుని వెళ్ళేవాడు రామారావు. ఆ తర్వాత పిల్లలు పుట్టేసారు. వాళ్ళని పెంచి, పెద్ద చెయ్యడానికే సరిపోయింది ఇన్ని సంవత్సరాలూ.. 


కొన్నాళ్ళకి అత్తగారికి ఒంట్లో బాగోలేకపోవడం.. ఆమెకి దగ్గరుండి.. మంచం పైనే అన్ని సేవలు చేసేది రాజేశ్వరి. ఆ తర్వాత కొంత కాలానికి అత్తగారు కాలం చేసారు. ఆ తర్వాత మావగారి వంతు. ఆయనకీ సేవలు చేసింది రాజేశ్వరి. ఆయన కాలం చేసిన తర్వాత.. రాజేశ్వరి కి నలభై దాటేసాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవారు అయ్యారు.. చదువుకోసం ఫారిన్ వెళ్లారు. ఇప్పుడు కొంచం తీరిక ఉన్నా.. వయసు లేదు.. ఓపిక తగ్గింది. 


*****

అప్పుడే.. రోబో సినిమా చూసింది రాజేశ్వరి.. నా చిన్నప్పుడు ఉన్న సినిమాలే వేరు అనుకుంది రాజేశ్వరి.. ఆ తర్వాత రోబో శ్రీమతి 2. O వచ్చింది. సడన్ గా ఒక ఆలోచన వచ్చింది. 

'నేను ఎందుకు మారకూడదు.. ? ఇప్పుడు లైఫ్ ని ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చెయ్యకూడదు.. ? ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ? శ్రీమతి నుంచి శ్రీమతి 2.O గా మారతాను' అని డిసైడ్ చేసుకుంది రాజేశ్వరి.. 


ఆ రోజు సాయంత్రం.. నీట్ గా రెడీ అయి.. భర్త కోసం వెయిట్ చేస్తోంది రాజేశ్వరి.. 


"ఏమండీ! ఈ రోజు ఎందుకు ఇంత లేట్ అయ్యింది.. ?"

"ఎవరండీ మీరు.. ? నేను పొరపాటున వేరే ఇంటికి వచ్చినట్టున్నాను.. సారీ.. " అని చెప్పి వెళ్ళబోయాడు రామారావు.. 

"నేనేనండీ.. మీ శ్రీమతి రాజేశ్వరి.. "

"అవును.. గుర్తుపట్టనేలేదు.. ఎంత మారిపోయావు.. హెయిర్ స్టైల్ మార్చావు.. ఎప్పుడూ చీరకట్టే నువ్వు.. ఈ డ్రెస్ లో మెరిసిపోతున్నావు.. "

"అట్టే.. పొగడకండీ.. ! ఇదేమి చూసారు. నేను పెళ్ళైన కొత్తలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నవన్నీ.. లేటెస్ట్ గా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను.. "

"ఏమిటో.. అవి.. ?"

"మీరు రేపటి నుంచి.. నన్ను 'డార్లింగ్' అని అనాలి.. నేను మిమల్ని 'రామ్' అంటాను.. "

"అదేమిటి.. ?"

"ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఇలానే భర్తలను పిలుస్తారు.. "

"ఇప్పుడు మీరు నన్ను ఎత్తుకుని.. గిరి గిర తిప్పాలి.. సినిమా లో హీరో చేసినట్టుగా.. మొన్న కొత్తగా పెళ్ళైన రాధ ని వాళ్ళాయన తిప్పడం చూసాను రామ్"

"పెళ్ళైన కొత్తలో.. అయితే చాలా స్లిమ్ గా ఉండేదానివి. ఇప్పుడు ఏమో రుబ్బు రోలు లాగ ఉన్నావు.. ఎలా తిప్పను.. ? నా నడుము పడిపోతుందే.. !"

"నొప్పికి మందు రాస్తాను లెండి.. తిప్పండీ!.. పెళ్ళైన కొత్తలో అడగలేకపోయాను.. "

"అంతే అంటావా మరి.. !"

"అంతే.. !!!"


మొత్తానికి రామ్ కష్టపడి.. శ్రీమతి కోరిక తీర్చడానికి ప్రయత్నించగా.. నడుము పట్టేసింది. చెప్పిన ప్రకారమే.. రాజేశ్వరి మందు పూసింది.. తన కోరిక ఒకటి తీరినందుకు చాలా హ్యాపీ అయింది రాజేశ్వరి. 


"ఇప్పుడు నొప్పి తగ్గిందా రామ్.. ?"

"ఇప్పుడు బాగానే ఉందిలే.. "


"నెక్స్ట్ మన పెళ్ళిరోజు వస్తోంది కదండీ! ఆ రోజు సూపర్ గా ప్లాన్ చేస్తున్నాను. ఒకప్పుడు, ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నా లైఫ్ ని.. ఇప్పుడు కొత్త గా లేటెస్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను.. "

"దానికి నేను ఇంకా ఏమిటి చెయ్యాలో.. ?"

"మీకు మాత్రం ఎంజాయ్ చెయ్యాలని ఉండదా చెప్పండీ.. ! రేపు మనం ఉదయం సినిమా కు వెళ్ళాలి.. మర్చిపోకండీ.. ! కార్నెర్ సీట్స్ బుక్ చెయ్యండి. ఆ తర్వాత.. ఏం చెయ్యాలో మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు.. అంతే.. ! ప్రిపేర్ అయిపోండి. ఆ తర్వాత మంచి హోటల్ లో ఫుడ్ తిని.. ఎంజాయ్ చేద్దాం "

"తప్పదా.. రాజేశ్వరి.. ?"

"ఇప్పట్లో భర్తలు.. ఇంకా చాలా చేస్తున్నారు.. నా కోసం ఈ మాత్రం చెయ్యలేరూ రామ్.. ? " అని బుగ్గ గిల్లింది రాజేశ్వరి 

"ఇలా ఒక్కసారిగా అన్నీ అడిగితే.. ఎలాగే రాజేశ్వరి.. "

"రాజేశ్వరి కాదు.. మర్చిపోతున్నారు.. "

"అ.. అదే.. డార్లింగ్.. ఎలా చెప్పు.. ?"

"తప్పదు రామ్.. "


మర్నాడు.. పెళ్ళిరోజు ఉదయం సినిమా కు బయల్దేరారు ఇద్దరు. కార్నెర్ సీట్స్ లో సినిమా చూస్తునప్పుడు.. ఏదో తేడ అనిపించింది రామారావు కు. పెళ్ళాం చేస్తున్న కొత్త ముచ్చట అనుకుని ఊరుకున్నాడు. ఇంటర్వెల్ లో లేచి చూస్తే, జేబులో పర్సు లేదు. ఎవడో కొట్టేసాడని లబో దిబో అన్నాడు. ఆ దిగులకి రామారావు కి తలనొప్పి వచ్చేసింది. 


"మీకోసం అమృతాంజన్ తెచ్చానండీ.. డోంట్ వర్రీ.. " అని తలకి పూసింది రాజేశ్వరి.. 


కొంచం సర్దుకున్న తర్వాత.. మంచి హోటల్ కి వెళ్లారు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని.. 


"ఈ రోజుల్లో అందరూ.. వెరైటీ ఫుడ్ తింటారు. ఈ కొత్తగా ఉన్న డిషెస్ అన్నీ ఆర్డర్ చేసెయ్యండి.. " అని ఆర్డర్ వేసింది రాజేశ్వరి.. 


ఆర్డర్ చేసిన కొత్త డిషెస్ అన్నీ వచ్చాక, ఒక పట్టు పట్టారు ఇద్దరు. ఫుడ్ తిన్నాక.. ఇంటి దారి పట్టారు. ఆ రోజు రాత్రి ఎంతో మధురంగా ఉహించుకున్న రాజేశ్వరికి.. నిరాశే మిగిలింది. కడుపులో ఉన్న గందరగోళానికి రాత్రంతా బాత్రూం లోనే ఎక్కువ సేపు గడిపాడు రామారావు. ఉదయానికి నీరసించి.. హాస్పిటల్ లో చేరాడు. వచ్చిన బిల్ చూసి.. పాపం షాక్ అయ్యాడు రామారావు. 


"దీనికన్నా.. ఇంట్లో నువ్వు కమ్మగా వండిపెడితే.. తింటూ.. ఓటీటీ లో కొత్త సినిమా చూస్తుంటే.. ఎంతో హాయిగా ఉండేది.. మన వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి.. " అని భార్యను మందలించాడు రామారావు.. 


**********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


77 views0 comments

Comments


bottom of page