కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
yOUTUBE Video link
'Srirama Navami Sambaralu' New Telugu Story
Written By M R V Sathyanarayana Murthy
రచన : M R V సత్యనారాయణ మూర్తి
శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి . . . . .
శ్రీరాముడు …
ఈ పేరు చెబితే యావద్భారత దేశం పులకించిపోతుంది, పరవశించి పోతుంది.
చిరంజీవి హనుమ నోట నిరంతరం పలికే మహిమాన్విత ‘రామ’ నామం ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుని తమ జీవనగమనాన్ని సుసంపన్నం చేసింది. శ్రీరాముని అరణ్యవాస సమయంలో తెలుగు నేల లోని భద్రాచలం కూడా శ్రీరాముని పవిత్ర పాదస్పర్శ తో పునీతం అయ్యింది.
అటువంటి పుణ్యచరితుని కళ్యాణం శ్రీరామ నవమి నాడు భారతదేశం లోని ప్రతి పల్లె లోనూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ క్రమం లోనే మా పెనుగొండలోనూ వీధి వీధినా శ్రీరామ నవమి సంబరాలు వైభవంగా జరుగుతాయి.
మా పెనుగొండలో జరిగే శ్రీరామ నవమి సంబరాలు చూడటానికి చుట్టుపక్కల పాతిక గ్రామాల నుండి జనం వస్తారు. అదీ విశేషం . . అదీ మా పెనుగొండ ప్రత్యేకత.
ఉగాది రోజునే శ్రీరామ నవమి పందిళ్ళకోసం మొదటి స్తంభాన్ని పాతుతారు. దీన్నే ‘స్తంభం ముహూర్తం’ అని మా కుర్రకారు అంటారు. నగరేశ్వర స్వామి గుడికి దగ్గరగా ఉన్న బీళ్ళ వారి రామాలయం దగ్గర జరిగే శ్రీరామ నవమి సంబరాలు మా కుర్రకారుకి మాంచి ‘కిక్కిచ్చే’ రోజులు.
అలా అని మీరు మా కుర్రకారుని ‘మరోరకంగా’ జమ కట్టేయకండి.
‘కిక్కు’అంటే మా పేర్రాజు గాడి భాషలో హుషారు అని అర్ధం. మా కుర్ర బ్యాచ్ కి లీడర్ పేర్రాజే. శోభన్ బాబులా మావాడు మంచి అందగాడు. వాడు ర్యాలీ సైకిల్ ఎక్కి వెళ్తుంటే ఆడపిల్లలు కిటికీల్లోంచి తొంగి చూసేవారు. జమీందారు గారి హై స్కూల్ లో పదవతరగతి చదవుతున్న మావాడు పరుగు పందెం లో ఎప్పుడూ ఫస్టే.
తాడి బాబ్జి గారి మామిడి తోటలో మామిడికాయలు దొంగతనంగా కోసి పారిపోవడంలోనే వాడికి ఈ ‘విద్య’ బాగా పట్టుబడిందని మా బ్యాచ్ అంటే కిట్టని వాళ్ళు అంటారు. అది మేం పట్టించుకోం. ఎందుకంటే ఓడిపోయినాడు అక్కసు పట్టలేక ఏదో ఒకటి అంటాడని మా ‘ఫిలాసఫీ’.
బీళ్ల అప్పలస్వామి శ్రీరామ నవమికి ఊళ్ళో పెద్దల దగ్గర చందాలు తీసుకునేవాడు. అదిగాక తన వ్యవసాయంలో వచ్చిన ఆదాయంలో కొంత రాములు వారి సేవకి ఖర్చు పెట్టేవాడు. ఐదు రోజులూ మంచి మంచి ‘ప్రోగ్రాములు’ పెట్టేవాడు. నవమినాడు హరికథ, రెండవ రోజు బుర్రకథ, మిగతా మూడురోజులూ నాటకాలు ఉండేవి.
రామాలయం నుండి బెజవాడ సూర్యనారాయణ ఇల్లు దాటే వరకూ పెద్ద పందిరి. పందిరి స్తంభాలకు కొబ్బరాకులు చుట్టేవారు. ఆ పందిరిలో ఆడపిల్లలు ఒప్పుల కుప్ప ఆడుకునేవారు. ఇంకో పక్క పెద్ద గిరి గీసి మగపిల్లలు ‘బచ్చాలాట’ఆడే వారు. పందిరి మధ్యనుంచే సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు వెళ్తూ ఉండేవి. అయినా వీళ్ళ ఆటలకు ఆటంకం ఉండేదికాదు. ఎందుకంటే వాళ్ళే నెమ్మదిగా వెళ్ళేవారు, పిల్లలు ఆడుకుంటున్నారని.
ఇప్పటికి మళ్లే, ‘’రోడ్డు మీద ఆటలేంటి, మీ ఇంటికి వెళ్లి ఆడుకోండి , పొండి పొండి ‘’ అని ఎవరూ గదమాయించేవారు కాదు. ఆ రోజులు పిల్లలకి స్వర్ణయుగం అని చెప్పాలి.
శ్రీరామనవమి రోజు పొద్దున్నే మా కుర్ర బ్యాచ్ బీళ్ల వారి రామాలయం ముందు ప్రత్యక్షమ య్యేవాళ్ళం. సీతారాముల కళ్యాణం పదిగంటలకు జరుగుతున్నా పానకం ఏర్పాట్లు చూడాలిగా. అందుకన్నమాట.
అప్పలస్వామి అటక మీద ఉన్న రెండు పెద్ద ఇత్తడి గుండిగలు ముందురోజే బాగా తోమించి పందిట్లో పానకం కలపడానికి రెడీగా ఉంచేవాడు. పెద్ద తాటాకు చాపమీద బెల్లం బుట్టలు మాకు నోరూరిస్తూ సిద్ధంగా ఉండేవి. ఆడాళ్ళు పెద్ద పెద్ద రోకళ్ళు తీసుకుని బెల్లం అచ్చులను చిన్న చిన్న ముక్కలుగా కొట్టేవారు. ఆ చిన్నముక్కల్ని మా బ్యాచ్ పచ్చడి బండలతో పొడుం పొడుం గా చేసేవాళ్ళం.
అప్పుడే ఎవరూ చూడకుండా బెల్లం ముక్కల్ని ‘గుటుక్కు’ మనిపించేవాళ్ళం. అప్పలస్వామి భార్య సింహాచలం ‘పిల్లలకి రాములోరంటే ఎంత భక్తో’ అని మమ్మల్ని చూసి మురిసిపోయేది. సీతారాముల కల్యాణం అయ్యాక సింహాచలం మా కుర్రకారుకి పెద్ద పెద్ద ఇత్తడి గ్లాసుల్లో మిరియాలు వేసిన పానకం పట్టుకు వచ్చి ఇచ్చేది. పానకం గబ గబా తాగేసి లింగాలవీది రామాలయం దగ్గరకి వెళ్లి పానకం తాగేవాళ్ళం.
అక్కడినుంచి జవ్వాదివారి వీధి రామాలయం, బజారు రామాలయం కూడా వెళ్లి పానకం తాగేవాళ్ళం. ఎన్ని పందిళ్ళలో పానకం తాగితే అంత ‘పుణ్యం’ వస్తుందని సత్తిపండు బామ్మ చెప్పింది. మామూలుగా ఆమె మాట ఎప్పుడూ ఖాతరు చెయ్యని మేము శ్రీరామనవమి రోజున
మాత్రం ఆమె మాట ఖచ్చితంగా పాటించేవాళ్ళం. మా ఆలోచన మాదైతే, పేర్రాజు గాడి ఆలోచన వేరుగా ఉండేది. నాలుగు పందిళ్ళు తిరిగితే చాలా మంది అమ్మాయిలకు ‘సైట్’ కొట్టవచ్చు అని.
‘అన్ని రోజులూ ఒకేలా ఉండవు’ అన్నది మా గాంధీ గాడి, ఊతపదం. ఒక శ్రీరామనవమి రోజున అది నిజం అయ్యింది. లింగాల వీధిలో ఉంటున్న శకుంతల కి మా పేర్రాజు గాడు లైన్ వేస్తున్నాడు. శకుంతల జమీన్డారు గారి హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎర్రగా, బుర్రగా బాగానే ఉంటుంది. యధా ప్రకారం లింగాల వీధి రామాలయం దగ్గర పానకం తాగడానికి మా బ్యాచ్ వెళ్ళింది.
అనుకోకుండా అప్పుడే శకుంతల కూడా అక్కడా వుంది. ఆమె చేతిలో పానకం గ్లాసు ఉంది. మా పేర్రాజు గాడిని చూసి నవ్వింది. గూఢ చారి నూట పదహారు సినిమాలో జయలలిత నవ్వులా సమ్మోహనంగా ఉంది ఆ నవ్వు. వెంటనే మా వాడు ‘పులై’ పోయాడు. తనూ నవ్వాడు. పానకం గ్లాసు చూపించి ‘కావాలా’ అన్నట్టు కళ్ళతో సైగ చేసింది.
ఇన్నాళ్ళకు కదా నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కరుణించి మాట్లాడు తోందని పొంగి పోయాడు. వెంటనే తనూ ‘కావాలి’ అన్నట్టు తలాడించాడు. శకుంతల నవ్వుతూనే పానకం గ్లాసు పెర్రాజుకి దగ్గరగా తీసుకు వచ్చింది. పేర్రాజు ఆనందంగా తీసుకోబోతున్నాడు. అంతే. శకుంతల చేతిలోని గ్లాసులోని పానకం పేర్రాజు షర్టు మీద ఒలికిపోయింది.
‘అయ్యో సారీ’ అంది శకుంతల బాధగా మొహంపెట్టి. ‘ఫరవాలేదు’ అన్నాడు నవ్వుతూ పేర్రాజు. శకుంతలని ఆమె ఫ్రెండ్ పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పేర్రాజు కొత్త వైట్ షర్టు నిండా పానకం మరకలు మాత్రం మిగిలాయి. ఆ అమ్మాయి చెయ్యి వణికి , పానకం షర్టు మీద పడిందని పేర్రాజు సమర్ధించుకున్నాడు.
కానీ గాంధి గాడు మాత్రం, 'ఇది నీ మీద పగ తీర్చుకోవడమే' అని ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరం ఆశ్చర్యంగా వాడికేసి చూసాం.
"అవును గత ఏడాది శ్రీరామనవమి నాడు, పానకం గ్లాసు తీసుకుంటూ ఏమీ ఎరగనట్టు శకుంతలకి ‘డాష్’ ఇచ్చి వచ్చావు. అది గుర్తు పెట్టుకుంది శకుంతల. ఇప్పుడు కసి తీర్చుకుంది.
అందుకే అంటాను రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని" అన్నాడు స్వామీజీ లా చిరునవ్వు నవ్వుతూ. వెంటనే పేర్రాజు ఇంటికి వెళ్ళిపోయాడు షర్టు మార్చుకోవడానికి.
------------
మెయిన్ బజార్ నుండి లింగాలవీది మలుపు తిరిగే ఎడమవైపున ఉంది వరహాల రెడ్డి పెంకుటిల్లు. వరహాలరెడ్డి భుజలవరకూ గిరజాల జుట్టుతో పాత సినిమాలలో విలన్ ఆర్. నాగేశ్వర రావు లా ఉంటాడు.
పెద్ద గొంతుతో మాట్లాడుతూ ఉంటాడు. అతనికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. రెండవ వాడు వెంకట రెడ్డికి భక్తి ఎక్కువ. మిత్రులని కూడగట్టుకుని ఇంటి ముందే కొబ్బరి ఆకులతో పందిరివేసి శ్రీరామ నవమి చేసేవాడు.
మా కుర్ర బ్యాచ్ లో సత్తిపండు వెంకట రెడ్డి కి ఫ్రెండ్. అందువలన మేం కూడా వెంకట రెడ్డి కి సాయం చేసేవాళ్ళం. పందిరి కింద తెల్లటి పంచలు కట్టేవాడు రెడ్డి. రంగు రంగుల కాగితాలతో చేసిన జాలర్లు పందిరి మధ్యలో వేలాడదీసేవాడు. ఈ పందిరిలో విశేషం ఏమిటంటే, జాలర్ల పక్కనే మామిడికాయ గుత్తులు, ఉసిరి కాయల గుత్తులు ఆకులతో వేలాడ దీసేవాడు రెడ్డి.
రంగు రంగుల జెండాలు, జాలర్ల తో పందిరి చాలా అందంగా ఉండేది. పక్కనే ఉన్న కోమట్లు తుమ్మలపల్లి కుటుంబ సభ్యులు, నూలి శ్రీరామ మూర్తి కుటుంబ సభ్యులు, వరహాల రెడ్డి ఇంటి పక్కనే ఉన్న వీర్రెడ్డి కుటుంబ సభ్యులు, అబ్బీసు రెడ్డి కుటుంబ సభ్యులు, తవ్వా పుత్రయ్య గారు ఎంతోమంది సీతారామ కళ్యాణం చూడటానికి వచ్చేవారు.
మా బ్యాచ్ ఇక్కడ పానకం తాగడమే కాకుండా, వచ్చిన వాళ్ళు అందరికీ పానకం గ్లాసులలో పోసి ఇచ్చేవాళ్ళం. ఏ మాత్రం సిగ్గు పడకుండా గ్లాసులు కడిగేసి శుభ్రం చేసేవాళ్ళం. అప్పట్లో ప్లాస్టిక్ గ్లాసులు లేవు. ఓ పడి గ్లాసులు ఉండేవి. కొంతమంది తాగగానే వాటిని నీళ్ళతో శుభ్రంగా కడగడం, వాటినే మరి కొంత మందికి ఇవ్వడం జరిగేది. దాదాపు ప్రతి శ్రీరామ నవమి పందిరిలోనూ ఇదే విధానం ఉండేది.
కొంతమంది ఇళ్ళకు పట్టికెళ్ళడానికి పెద్ద పెద్ద చెంబులుతెచ్చుకుంటే వాటి నిండా పానకం పోసి ఇచ్చేవారు. ఇంటిదగ్గర ఉన్న పెద్ద వయసువాళ్లకు ఈ పానకం పట్టుకునివెళ్ళేవారు.
శ్రీరామ నవమి మర్నాడు నుంచి మా బ్యాచ్ మకాం సంత మార్కెట్లో ఉన్న శ్రీరామ నవమి పందిరికి మారిపోయేది. పెనుగొండ లోని నీరుల్లి, కూరగాయల సంఘం వారు
మార్కెట్లో చాలా పెద్ద పందిరి వేసేవారు. ఐదు వందల మంది సౌకర్యంగా కూర్చోడానికి అనుకూలంగా ఉండేది ఆ పందిరి. పైగా ఆ పందిరి డెకరేషన్ పాలకొల్లు వాళ్లకు అప్పచెప్పేవారు.
పందిరికింద వేసిన తెల్లని గుడ్డకు, రంగు రంగుల పూల గుత్తులు, గ్లోబులు లా ఉండే రంగు రంగుల కరెంట్ బుల్బులు వేలాడదీసేవారు. ప్రతి స్తంభానికి ఒక ట్యూబ్ లైట్ ఉండేది. పందిరి స్తంభాలకు కొబ్బరి ఆకులు కాకుండా, రంగు రంగుల బట్టలు చుట్టేవారు.
కళా ప్రదర్శనలకు చాలా పెద్ద స్టేజి ఉండేది. రాష్ట్రం లోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న రంగస్థల నటీ, నటులతో నాటకాలు ఏర్పాటుచేసేవారు. సత్య హరిశ్చంద్ర, కురుక్షేత్రం, ఉషా పరిణయం, బొబ్బిలి యుద్ధం వంటి నాటకాలు ప్రదర్శన పూర్తి అయ్యేసరికి తెల్లవారు ఝాము నాలుగు, ఐదు గంటలు అయ్యేది. నాటకం చూడటానికి వచ్చిన రైతులు స్టేజి దగ్గర నుండి సరాసరి పొలాలకు వెళ్ళిపోయేవారు.
ఏడు రోజులు జరిగే ఈ ఉత్సవాలు లో ప్రత్యేక ఆకర్షణ ఇంకోటి ఉంది. అదేనండి బాబూ, కుర్రాళ్ళను, నడివయసు వాళ్ళను ‘కిర్రెక్కించి’ వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసే ‘భోగం మేళం’. ప్రతీ రోజూ ఉదయం పదిగంటల నుండి వంటిగంట వరకూ, మరలా సాయంత్రం ఆరు గంటలనుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ వీళ్ళ డాన్సులు ఉండేవి.
రాత్రి పది గంటలకు నాటకం ప్రారంభం అయ్యేదన్నమాట. ఉదయం సమయాలలో పెద్దవాళ్ళు ఎక్కువగా వచ్చేవారు కాదు. ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సాయంత్రం తప్పని సరిగా పందిట్లోకి వచ్చి వాలిపోయేవారు. అందుచేత ఉదయం ఊళ్ళోని కుర్ర బ్యాచ్ లు అన్నీ మార్కెట్లోని నవమి పందిరి దగ్గర హాజరు అయ్యేవి.
పేర్రాజు పాండ్స్ పౌడర్ మొహానికి గట్టిగా దట్టించి సత్తిపండు ఇంటికి వచ్చాడు. అప్పటికే మా బ్యాచ్ మొత్తం రెడీగా ఉంది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం. పుత్రయ్య గారి కిరాణా కొట్టు దగ్గర సరుకులు కట్టిస్తున్న నల్లాకుల వీర రాఘవ నాయుడు కంట్లో పడటం జరిగింది.
‘ఏమయ్యా సావుకారూ, ఈ కుర్ర బ్యాచ్ సంత మార్కెట్ కేసె వేల్తన్నారంటావా’ అని అడగడం నా చెవిని పడింది. పుత్రయ్య గారు నాయుడు ప్రశ్నకి జవాబుగా చిన్న నవ్వు నవ్వి, కాటా లోని కందిపప్పు పొట్లం కట్టసాగాడు.
ఆ విషయమే సత్తిపండుతో అంటే ‘ఆ వీళ్ళందరూ, వయసులో ఉన్నప్పుడు జల్సాగా తిరగలేదేమిటి, నువ్వు అనవసరంగా భయపడకురా బాబీ’ అని అభయం ఇచ్చాడు.
పది నిముషాలలో మార్కెట్లోని శ్రీరామ నవమి పందిట్లో ఉన్నాం. అప్పటికే భోగంమేళం డాన్సులు మొదలయ్యాయి. మంచిమనసులు సినిమాలోని ‘నన్ను వదలి నీవు పోవలేవులే’ పాటకు ఇద్దరు పిల్లలు డాన్స్ చేస్తున్నారు. పొరుగూరి నుంచి వచ్చిన నలుగురు పెద్దాళ్ళు కుర్చీలలో కూర్చుని ఉన్నారు, కొంతమంది మాలాంటి కుర్రకారు ఉన్నారు. సరిగ్గా అప్పుడే వచ్చాడు సత్తిపండు ఫ్రెండ్ వీరన్న నాయుడు.
‘ఏరా, డాన్సులు చూడటానికి వచ్చారా, రండి’ తీసుకెళ్ళి మమ్మల్ని కుర్చీలలో కూర్చోపెట్టాడు. మేనా నాయకురాలు దగ్గరకు వెళ్లి ‘రత్నం, మా ఫ్రెండ్స్ వచ్చారు. నాలుగు పాటలు ఊపేయాలి’ అన్నాడు. అతని మాటలకు రత్నం ‘అలాగే నాయుడు గారూ, మా తాంబూలాల సంగతి మర్చిపోకండి’ అని ముసి ముసిగా నవ్వింది.
‘అమ్మ నీ యమ్మ, నిద్దట్లో కూడా నీ తాంబూలం సంగతి మరిచిపోవే, ’అన్నాడు వీరన్న గట్టిగా నవ్వుతూ.
శ్రీరామ నవమి ఉత్సవకమిటీ లో ముఖ్యుడైన సింగంసేట్టి నరసింహ నాయుడు పెద్ద కొడుకు వీరన్న నాయుడు. అందుకే మేనా నాయకురాలు అతని మాట మన్నిస్తుంది.
వీరన్న నాయుడు మాకేసి తిరిగి ‘ఏరా ఏ పాట కావాలి’ అన్నాడు.
వెంటనే పేర్రాజు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటె, చెలికాడే సరసన ఉంటె’ ఆత్మబలం లోని పాట కావాలి’ అని అన్నాడు.
‘’అబ్బో బాబుగారికి అప్పుడే వాన పాటలు కావాల్సి వచ్చాయి’’అంది మేనా నాయకురాలు మొహం అంతా నవ్వు పులుముకుని. వీరన్న నాయుడు ఆమె కేసి తిరిగి ‘ఇదిగో కళని, స్వప్న ని చెయ్యమను డాన్స్’ అని పురమాయించి ఎవరో పిలిస్తే స్టేజి పక్కకు వెళ్ళాడు మాట్లాడటానికి.
స్టేజి మీద నిలబడి ఉన్న వాళ్ళలో కుర్ర వయసులో ఉన్న ఇద్దరు పిల్లలు ముందుకు వచ్చి, నాయకురాలికి, హార్మనీ వాయించే వాడికి, డోలక్ వాయించే వాడికి దణ్ణాలు పెట్టి డాన్స్ చేసారు. కళ నెత్తిమీద పెద్ద జేబురుమాలు కట్టుకుని నిజంగా వర్షంలో తడుస్తున్నట్టు బాగా అభినయించింది. ఆ తర్వాత మరో మూడు యుగళగీతాలకు డాన్సులు చేసారు వారు ఇద్దరూ. అచ్చు సినిమాలో హీరో హీరోయిన్లు ఎలా చేస్తారో అలా చేసారు డాన్స్.
డాన్సులు అయ్యాక కళ , స్వప్న స్టేజి దిగి వచ్చి అందరికీ రెండేసి తమలపాకులు ఇచ్చారు. పొరుగూరి నుంచి వచ్చిన వాళ్ళు తాంబూలాలలో డబ్బులు పెట్టి ఇస్తూ వాళ్ళతో వేలాకోలం ఆడేరు. వాళ్ళు మా దగ్గరకు రాగానే తలో పదిరూపాయలు తాంబూలాలలో పెట్టి ఇచ్చాం.
నందం వాళ్ళ అబ్బాయి ప్రసాదు , స్వప్నని ‘నీకు ఎన్ని పాటలకు డాన్సులు వచ్చును’ అన్నాడు.
‘ఏభై పాటలకు’ అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆమె వెనకే కళ కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు ఇద్దరూ తెచ్చిన డబ్బుల్ని జాకెట్లో పెట్టుకుంది నాయకురాలు. ‘అమ్మాయిలూ మీరెళ్ళి రెస్టు తీసుకోండి’ అంది.
వాళ్ళు ఇద్దరూ మొహానికి పట్టిన చెమట ఓణీ తో తుడుచుకుంటూ కూర్చున్నారు. వీరన్న నాయుడు రెండు కూల్ డ్రింకులు తీసుకువచ్చి వాళ్లకి ఇచ్చాడు. ‘నాయుడు గారు నన్ను మర్చిపోయారు’ అంది నాయకురాలు నవ్వుతూ.
‘నువ్వేం కష్టపడ్డావు. గుమ్మటంలా స్టేజి మీద కూర్చున్నావ్. అంతేగా’ అన్నాడు వీరన్న.
‘పాటలు పాడి పాడి గొంతు తడారిపోయింది. బాబ్బాబు , నాక్కూడా డ్రింక్ ఇవ్వండి’ అంది గారంగా నాయకురాలు.
వీరన్న ఆమెకి కూడా కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు.
ఒక గంట సేపు డాన్సులు చూసి కన్యకా పరమేశ్వరి గుడి అరుగు మీద చేరాం నలుగురం. మేము మార్కెట్లో పందిట్లో ఉన్నప్పుడు చాలా కళ్ళు మమ్మల్ని చూసాయని మేము గ్రహించలేదు. ప్రోగ్రాములు లేనప్పుడు వాళ్ళు డాన్సులు ఎలా ప్రాక్టీసు చేస్తారో పేర్రాజు తనకున్న తెలివితేటలతో వర్ణించి చెబితే నోళ్లు తెరుచుకుని మరీ విన్నాం. పన్నాస వారి షోడా షాప్ కి వెళ్లి నాలుగు నిమ్మ షోడాలు తాగి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లాం.
కానీ ఆ రాత్రి మా పాలిటి ‘కాళరాత్రి’అవుతుందని ఎవరం ఊహించలేదు. మా బ్యాచ్ అంటే కిట్టని కొంతమంది పెద్దలు, ఉదయం మార్కెట్లో మేం చేసిన ఘనకార్యం మా వాళ్లకు చెప్పడం, మా వాళ్ళు మాకు ఘనంగా ‘బడితే పూజ’ చేసారని మేము మీకు వేరేగా చెప్పాలా, మీరు విజ్ఞులు. మీరు గ్రహించగలరు.
హాయిగా బీళ్ల వారి నవమి పందిట్లో పులి-మేక ఆడుకోక, మార్కెట్లో పందిట్లోకి వెళ్లి నందుకు దెబ్బలు తినడం ఎందుకు, అని మీరు అడుగుతారు. కానీ ఆ డాన్సులు చూడటం, వాళ్ళతో మాట్లాడటం లో ఉన్న ‘కిక్కే’ వేరని మా బ్యాచ్ ఏకగ్రీవ అభిప్రాయం.
***శుభం***
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
Comentarios