top of page

స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోయీ ఈవెనింగ్'Stopping By Woods On A Snowy Evening' - New Telugu Story

Written By M. Laxma Reddy Published In manatelugukathalu.com On 19/05/2024

'స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోయీ ఈవెనింగ్' తెలుగు కథ

రచన: M. లక్ష్మా రెడ్డి


ఉదయం ఐదు.. 

అలారం మోగితే కానీ లేవని దేహానికి

కాస్త అలసట కల్పించాలనే సదుద్దేశంతో.. 

దేహదారుఢ్య సంకల్పంతో.. నిద్దరకి సెలవని.. 

సాక్స్ వెతుక్కుని.. షూ తొడుక్కుని.. 

చల్లగాలికి వీధిలోకొచ్చి పడ్డాను.. 


వేసవికాలం కదా.. అప్పటికే తెలవారడానికి 

ఆకాశం సిద్ధంగా ఉన్నట్టుంది. 

మనకి బద్ధకం కదా.. కాళ్ళు కాస్త మొరాయిస్తున్నా 

హేయ్ పదండ్రా అంటూ వాటిని అదిలించి మరీ 

నడక ప్రారంభించా.. 


ఒక రెండు నిమిషాల నడక తర్వాత.. 

 అంతే రెండు నిమిషాలే అయ్యుంటుంది.. 

 కాసేపు అలాగే ఆగిపోయానేమో

 అని ఇప్పుడు అనిపిస్తుంది.. 


అలా.. ఎన్ని సెకనులు ఆగకుండా పరిగెత్తాయో.. 

ఎన్ని నిమిషాలు అలా వచ్చి ఇలా మయమయ్యాయో.. 

మరీ గంటలు అంటే అతిశయోక్తి కానీ.. నిమిషాలే.. 

ఎందుకలా. ? ఏం జరిగింది.. ?


ఎప్పుడో ఇంటర్ లో చదివిన ఇంగ్లీష్ పోయెమ్ లాంటి ఫీలింగ్.. Stopping by woods on a snowy evening by Robert Frost.. 


అంతే.. 


నా నడక సాగిన కాసేపటికి, ఏదో మాయగా.. 

ఆకాశం నీలం నుండి నారింజ వర్ణంలోకి అలా జారుకుంటూ.. 

పొరలు పొరలుగా ఆకాశం కొత్తగా కనబడసాగింది.. 


భలే ఉందే అనుకుంటూ.. 

నా నడక ఉద్యమానికి కాస్త విరామం ప్రకటించి.. 

 అలానే చూస్తూ ఉండిపోయా.. 


ఎక్కడో ఓ మూల ఇంకా చందమామ 

అంతర్థానం అవవడానికి కాస్త బాధ పడుతున్నట్టు.. 

ఉండీ లేనట్టు.. పాపం జాబిల్లి.. ఈ పూటకి సెలవేలే.. అయినా.. నన్ను అంతలా విభ్రమంలోకి విసిరేసిన ఉదయ సొగసులు ఏంట్రా అని.. తీరిగ్గా పరికించసాగా.. 

మరీ నేను ఆగిపోయా అంటే అక్కడేదో సౌందర్యం 

తిష్ట వేస్కుని ఉండాల్సిందే.. అంతే.. 


 వేసవికాలం అన్నానుగా.. మరో సాక్ష్యంగా 

 మోడువారిన ఓ చెట్టు.. 

 పత్రాలు లేకున్నా.. పద్ధతిగా ఉంది.. 


చెట్టుకి పద్ధతీ పాడు ఏంటని.. మొహం చిట్లించకండి.. ఎండిన చెట్టు అయినా.. అందంగా ఉంది.. అని నా ఉద్దేశ్యం.. 


నల్లగా ఉన్న ఆ బలమైన కొమ్మల్లో నుండి ఆకాశం ఇంకొంచెం కొత్తగా.. నీలం ఆకాశం పై నలుపు గీతల్లా కనిపిస్తుంది.. 


 ఇంకాస్త తెలవారుతూ.. నారింజ రంగు ఎరుపు రంగులోకి పరివర్తనం చెందడం.. ధరిత్రి ఆత్మీయ బంధువు నుండి వచ్చే కిరణాల ఫలితం అని తెలుస్తూనే ఉంది.. 


 కోయిలలే అనుకుంటా.. 

 ప్రకృతికి పులకరిస్తున్నాయో.. 

తమ మిత్రులని పలకరిస్తున్నాయో.. 


 నాలాంటి శిలా విగ్రహాన్ని చూసి ఏమైందీ వీడికి అనుకుంటూ శ్రావ్యంగా అరుస్తున్నాయో.. 

 శ్రావ్యంగా.. అరవడం అన్న వెంటనే.. 

మీకు నా మానసిక స్థితి అర్థం అయి ఉండాలి.. 


నన్నేను కోల్పోయి కొన్ని సెకనుల కాలం కాలగర్భంలో కలిసి ఇంకొన్ని సెకనులు అయి.. ఉంటుంది.. 


 ఆ కోయిలలు తీరిగ్గా అదే చెట్టు చివర.. 

ఠీవిగా వాలి నావేపు కొంటెగా చూస్తుంటే ముచ్చటేసింది.. అలా వాటి మాయలో పడేలోగానే.. 

పక్కనే తెలుపు రంగు కాగితం.. పతంగి కాబోలు.. 

ఒక్కసారిగా నా మనసుని లాగేసుకుంది.. 


ఇది మరీ శ్రీకృష్ణ దేవరాయల తలపై కిరీటంలా.. పచ్చదనానికి తాత్కాలిక విడాకులిచ్చి

 మోడువారిన ఆ వృక్షరాజం కీరిటంలో

 తెలుపు రంగులో మెరిసే మాణిక్యంలా.. అబ్బ.. 

రెండు కళ్ళు దాచుకోలేని అందం.. అరే.. 


 ఎండినా.. ఇంతందమా అనుకుంటూ ఉండేలోగానే.. 

నా దృష్టిని.. ఆ మార్గం ఆక్రమించేసింది.. 

ఇది నే రోజూ తిరిగే ప్రదేశం అని మరిచేలా.. 


ఎగుడు దిగుడు రాళ్ళు.. భానుని లేత కిరణాలతో ఒక కొత్త మెరుపును సంతరించుకుని.. 

కళ్ళు విప్పార్చి నన్నే చూస్తున్నట్టు.. 


అరే ప్రకృతిలో ప్రతిదీ ఇంత సౌందర్యమా అన్న సంశయంలోకి నన్ను ఉన్నపళంగా తోసేస్తూ.. 

 ఆ దారి చివర చిన్న పొదలు.. 


అవి కూడా ఎండిన రాగాలే అలాపిస్తున్నా.. 

ఏదో మాయ మాత్రం కమ్మేస్తూనే ఉంది.. 

నే బానే ఉన్నానా.. 

 నాకే ఇలా ప్రతిదీ ఇంత అందంగా కనబడేనా.. 

అని ఆలోచించేలోగానే.. 


ఒక్కసారిగా నిద్దర నుండి లేస్తూ ఒళ్ళు విరుచుకున్న

 వంశీ సినిమా కథానాయిక నుదుట బొట్టులా.. 

ఆకాశాన ఎరుపు వర్ణం.. తిలకంలా.. !

 సూరిడే అని మళ్ళీ చెప్పాలా.. !


ఏంటా వేగం.. ఎంత సోయగం.. 

సరసర దూసుకొస్తూ.. వెలుగులు విరజిమ్ముతూ.. 

ఇప్పటివరకు ఉన్న అన్ని భావాలని దాటుకుని.. 

ఈ రోజుకి నీ సౌందర్య పిపాసన సమయం ముగిసినది

మిత్రమా అంటూ.. 


చురుక్కున తన కిరణంతో ముద్దు పెట్టి.. 

పద పద పనిలో నిమగ్నం అవ్వాలిరా భడవా అని ప్రేమగా కసిరినట్టు అనిపించి.. 

ఎంత అందమైనా, ఆగడం ప్రకృతికి విరుద్ధం అని.. 

ఏ స్థితి నుండి అయినా సాగడం.. సరైనదని.. 


అయినా

 నిమిషం కిందటి అందం ఇప్పుడు లేదక్కడ.. 

ఎండిన చెట్టు.. చిరిగిన గాలిపటం.. 

పనిలేని పక్షులు.. రోడ్డంతా రాళ్ళు.. ముళ్ళకంపలు.. చూస్తున్న కళ్ళు వేరు.. అనిపించేలా, 

పది నిమిషాల క్రితం.. సౌందర్యం.. 

అద్భుతం.. అనన్య సామాన్యం.. చూసిన దృష్టి వేరు.. 


మనిషి ఎప్పుడూ ఇంతే.. తాత్కాలిక ఆనందాభిలషి.. 


 అందుకే.. 

ఆ క్షణం మనసు నింపే సౌందర్యాన్ని

 గుండెలో దాచేసేయ్.. అలానే ఉండనీ.. 

మళ్ళీ మళ్ళీ చూస్తే.. నిన్నటి అందం ఇవాళ ఉండదుగా.. 

ఎందుకంటే నిన్నటిలా ఇవాళ నువు లేవు.. 


నీ మనసూ ఉండదు.. అని జ్ఞానిలా అనుకునేలోగా.. 

పద పద.. పనికి వేళాయేరా అని మనసు తొందర పెడుతుంటే.. 

ఎండాకాలం భానుని ఉదయం ఆరు దాటక.. 

 భరించడం కష్టమని తెలిసి.. 

పది నిమిషాల కింది భావనని.. 

మనసు పొరల్లో దాచేసి.. అక్షరాల్లో ఇలా పోగేసి.. 

నే బయల్దేరా పనికి.. 


పోగేసిన నాలుగు అక్షరాలని మీకో రెండు మూడు వందల సెకనులు కాలం నా భావనల్లో 

ముంచేయ. ఇలా అందించి.. 

చదివిన మీ మనసుకు ఒక్క వాక్యమైనా నచ్చితే.. 


 ఒక సందేశం నా inbox కి.. 


కృతజ్ఞతలు.. మీ సమయానికి.. 


***

M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నేను లక్కీ.. లక్మారెడ్డి 

రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..

అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..

నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..

నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...

ధన్యవాదాలు...

81 views2 comments

2 Comments


బాగా రాశారు సర్

Like
Replying to

Thank uuuuuuuu andi

Like
bottom of page