top of page

శుభస్య శీఘ్రం

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #SubhasyaSeeghram, #శుభస్యశీఘ్రం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Subhasya Seeghram - New Telugu Story Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 01/06/2025

శుభస్య శీఘ్రం - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


ఇల్లంతా సందడిగా ఉందంటే, ఏదైనా పండుగ హడావుడి అయినా ఉండాలి లేదా ఎవరైనా దగ్గర బంధువు లైన వచ్చి ఉండాలి. పండుగ అయితే ఊరంతా ఒక్కరోజు జరుపు కుంటారు. బస్సు దిగి, వీధి గుండా వస్తుంటే ఎవరి ఇంటి ముందూ పచ్చ తోరణాలు, పసుపు గడపలు, ముంగిట ముగ్గులు ఏవి కనిపించడం లేదు.. కానీ లోనికి వెళ్లి చూస్తే తెలుస్తుందిగా అనుకుంటూ ఇంటిలోకి అడుగు పెట్టాడు వాసు. 


 గంగాధరం పెద్ద కొడుకైన భార్గవ్ కొడుకు వాసు. 


 వసారాలో కుర్చీలు వాటి ఎదురుగా బల్లలు వాటి పైనా దస్తావేజులు తీర్చిదిద్దినట్లు కనపడి ఆశ్చర్యపోయాడు. 


 అలాంటి సన్నివేశం ఎన్నడూ చూడలేదు పండుగ సంబరం అనుకుంటే పార్లమెంట్ భవనంలా కనిపించింది. సమావేశం కారణమేమిటి? అంత అవసరం ఏమి వచ్చింది? చాలా సందేహాలు మెదడులో తొలుస్తుండగా ఇంటిలోకి అడుగు పెట్టాడు. 


 ముందుగా ఎదురు వచ్చిన తాతయ్య స్నానo, పూజ ముగించుకొని కడిగిన ముత్యములా మెరుస్తున్నాడు గంగాధరం. 


బాగున్నారా తాతయ్యా!" అంటూ కౌగిలించుకున్నాడు. తాత అంటే పంచప్రాణాలు. తాతయ్య కాళ్లకు దండం పెట్టి పక్కకు జరిగాడు. 


ఒకరి తర్వాత ఒకరు వచ్చి హడావిడిగా పనుల కోసం వెళుతూ ఉన్నప్పటికీ, తన కళ్ళు వెతుకు తున్నాయి కనబడని వారి కోసం. వంటగది మూలలో వంట పనిలో నిమగ్నమై ఉన్న నానమ్మను వెనుక నుండి వెళ్ళి వాటేసుకునే "నానమ్మ" అని అనగానే " నాన్న! ఎప్పుడు వచ్చావురా" అంటూ రెండు చేతులతో ముఖాన్ని పట్టుకొని నుదుటిపై ముద్దు పెట్టింది ప్రేమతో.


“ఈ హడావుడి ఏమిటి.. ఇల్లంతా సందడి.”

 

“నాన్న! ఉన్నత కుటుంబం ఉలిక్కిపడి చీలిపోతుంది. 

ఆస్తి పంపకాలు జరుగు తున్నాయి అందుకే అందరూ వచ్చారు"


“అలాగా మనకున్న ఆస్తి ఏమాత్రం ఇంత హడావుడి?”


“అందరి సమక్షంలో జరగాలని తాతయ్య ఇష్టప్రకారం ఇలా చేస్తున్నారు. పెద్దవాళ్ల సమక్షంలో ఉదయాన్నే పొలాలకు వెళ్లి కొలతలు చేస్తున్నారు. రెండు రోజుల నుండి వేసవికాలం కదా ! ఎండలకు తట్టుకోలేరు. మధ్యాహ్నం ఆస్తుల వివరాలు లెక్కలు చేస్తున్నారు". 


తాతయ్య పిలుపుతో వస్తున్నా అంటూ, తాతయ్య ! నాపేరు మీద ఆస్తి రాస్తున్నారా? సంతకాలు ఏమైనా చేయాలా?” అడిగాడు.


“నీవు పిల్లవాడివి. ఆస్తుల గురించి అలా మాట్లాడవద్దు. బాగా చదువుకోవాలి. ముందు నీ మేనత్తలు వకుళ, వసంత కూడా వచ్చారు కదా! నీవు వాళ్ళను మన రామాలయం తీసుకెళ్లి కార్లో ఆలా త్రిప్పి తీసుకు రారా! వాళ్లకు కాస్త కాలక్షేపం. అలాగే చిన్నాన్న పిల్లలు దీపు, కమల ను తీసుక వెళ్ళు.”

 

‘సరే తాతయ్య!’ అని తలూపి, వెనక్కుతిరిగి చూసేవరకల్లా తన కళ్ళు ఇక్కడేనా చూసేది అన్నట్లు నమ్మలేక పోయాయి. సరిగ్గా పదేళ్ల క్రితం చూస్తున్న అమ్మాయిని పోల్చు కోలేక, తికమక పడుతుంటే ‘బావ..’ అంటూ వచ్చి వాటేసుకొని ‘నేను రమ్య నీ’ అన్నది ముద్దుగా.. 


ముందు బిడియం, ఆశ్చర్యం తో, “హాయ్ రమ్య! పొట్టి గౌను, పిలక జడలు"


“అవును నేనే రమ్యనీ..”

 

“రమ్య ! ఇలా ఎలా?”


ఇంతలో అక్కడికి వచ్చిన తల్లి రాధాదేవి పరిచయం చేస్తూ, మా అన్నయ్య కూతురు, నీకు మేనత్త కూతురు అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చిందరా ! ఆడ పిల్లలు ఎoతలో ఎదిగిపోతారో రమ్య కూడా అంతేరా! అక్కడి అలవాట్లు, వేషం అన్నీ నీకు క్రొత్తగా అనిపిస్తుంది". 


“రమ్య.. రెడీ కావాలి.. రామాలయం వెళ్లి దర్శనం 

చేసుకుని వద్దాము” అనగానే, 


“అత్తయ్యా! నేను పల్లెటూరు వచ్చానని నచ్చని చోటికల్లా రమ్మన్నా నేను రాలేను. బావ! పదా!అలా పెద్ద చెరువు గట్టుకు వెళదాం. భలేగా స్విమ్మింగ్ చేస్తాను. నన్ను తీసుకెళ్ళు.. టూ వీలర్ మీద స్విమ్మింగ్ డ్రెస్ తో వస్తాను”

 

“వద్దు వద్దు.. ఇక్కడ ఇలాంటివి డ్రెస్ ఇష్టపడరు”.

 

“ఎవరికోసమో నేను మాను కుంటానా? మనం ఇద్దరం అలా అలా టూ వీలర్ మీద జామ్ జామ్ గా వెళ్దాం..” అంటూ తీసుకు వెళుతుంటే.. 


కాస్త విడ్డూరంగా ఉన్న రమ్య, వాసును చూసి, వకుళ, రాధాదేవి ఇద్దరూ చూడముచ్చటైన జంట అని లోలోపల మురిసి పోయారు. 


“తాతయ్య కంటపడకుండా వెళ్ళండి. చిన్నప్పుడు మమ్మల్ని మా నాన్న గుమ్మం బయట కూడా అడుగుపెట్టనిచ్చేవాడు కాదు. నా కూతుర్లకు చదువు లేకుండా చేస్తారా అని మా అమ్మ అంటే ఇల్లే పాఠశాలను చేసేసాడు మా నాన్న. 


ఇంటికి ఉదయాన్నే ఉపాధ్యాయుడు వచ్చి మాకు చదువు నేర్పేవాడు.. అలా పదవ తరగతి ప్రైవేట్ గా పాస్ అయ్యాను. 


 కట్న కానుకలు ఇవ్వడం ఇష్టపడక, పెళ్లి నిరాడంబరంగా చేయడం వంటివి” తన మాటల ద్వారా చెప్పేవాడు గంగాధర్. 

*****

పెద్ద కొడుకు భార్గవ్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గా ఉద్యోగంలోకి రావడం తో చాలా సంతోషించాడు. ఆ సంతోషం కొద్ది కాలంలోనే ఉండకుండా పోయింది. 


 ఆ కళాశాలలో ప్రొఫెసర్ గా వచ్చిన రాధాదేవిని ప్రేమించడంతో ఏమీ అనలేక ఆడవాళ్ళకు చదువు, ఉద్యోగము అంటేనే ఇష్టపడని తను, కొడుకు పై ప్రేమతో పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకు ఒక షరతు పెట్టాడు. ఆలాగైనా వాళ్ళి ప్రేమ పెళ్లి ఒప్పుకోరేమో అనుకున్నాడు. 


తన కూతురు వకుళ ను, రాధాదేవి అన్న భాను ప్రకాష్ పెళ్లి చేసుకోవాలని, అలా అయితేనే తాను పెళ్లి చేస్తానని కఠినంగా చెప్పడము తో, భాను ప్రకాష్ అన్నగా బాధ్యత తీసుకొని వకుళ ను పెళ్లి చేసుకున్నాడు. 


లోపల కోపంతో ఉన్న భాను ప్రకాష్ అత్తవారింటికి ఒక్కసారి, రెండుసార్లు మాత్రమే వచ్చాడు. ఇప్పుడు గంగాధర్ బిడ్డలకు కూడా ఆస్తి పంచి యిస్తున్నాడని తెలిసి వచ్చాడు.


ఆస్తిలో కొడుకులకు బిడ్డలకు సమానంగా పoచాలని పట్టుపట్టాడు. అసలు వకుళను పెళ్లి చేసుకున్నప్పుడే ఆస్తికి ఇల్లరికం అల్లుడిగా రావాలని అనుకున్నాడు భాను ప్రకాష్.. కానీ గంగాధర్ కు ఆ కుటుంబం మీద ఏమాత్రం సద భిప్రాయం లేదు. తన కొడుకు భార్గవ్ ను తన నుండి విడదీయాలనీ ఆ రోజుల్లోనే పన్నాగం పన్ని ఎన్నో రకాలుగా కుట్రలు చేశారు. 


యూనివర్సిటీ ప్రిన్సిపల్ గా భార్గవ్ కు ఉద్యోగం రావడం కూడా భాను ప్రకాష్ కు నచ్చలేదు. రాధాదేవి అదే కాలేజీలో ప్రొఫెసర్ గా జాయిన్ కావడo కొన్నాళ్ళ వరకు భాను ప్రకాష్ 

ఇష్ట పడలేదు. 


రాధా దేవి అణుకువ, ఉద్యోగ పనితీరు, బాధ్యత తో పాటు ఆమె అంద చందాలు కూడా నచ్చాయి భార్గవ్ కు. 


 ఉద్యోగ రీత్యా ఇద్దరూ. పార్టీలు, ఫంక్షన్స్, టూర్లు తిరుగుతూ సన్నిహితుల య్యారు. ప్రేమలో పడ్డారు. 

 ********* 

 భార్గవ్ ను ప్రేమిస్తు న్నానని అతనినే పెళ్లి చేసు కుంటానని, లేకపోతే చనిపోతానని ఏడ్చేది రాధాదేవి. 


కేవలం రాధా దేవి.. భార్గవ్ ను ప్రేమిం చింది అన్న ఒక్క కారణంగానే వకుళ ను పెళ్లి చేసుకున్నాడు భాను ప్రకాష్. 


పెద్ద చదువులు చదువు కోలేదని వకుళ ను కూడా ఏదో విధంగా సూటిపోటి మాటలతో వేధించేవాడు. 

********

 వాసు, రమ్య అలా బయటకు వెళ్తుంటే, భార్గవ్ కు తన గతం అంతా గుర్తుకు వచ్చి, వాసును తన కనుసన్నలలో లోనే కాపాడుకోవాలని, తన కుటుంబానికి తగిన సంప్రదాయ కుటుంబం లోని కోడలును తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. 


వాసును రమ్య నుండి దూరం పెట్టాలని ఎంతో ప్రయత్నిస్తు న్నాడు. జరిగిన విషయాలు చెప్పాలని అనుకున్నా ఇంత వరకు ఆ అవకాశం రాలేదు. ఇకనైనా చెప్పాలి అని మనసులో అనుకున్నాడు. 

**********


రమ్య చురుకుదనం, కలుపుగోలు తనం వాసును ఆకర్షిస్తున్నాయి. కాసేపు కనపడక పోయినా ఏదోలా ఉంటుంది. 


“రమ్యా, నువ్వు మళ్ళీ అమెరికా వెళ్లాలా? మేము అందరం ఇక్కడే ఉన్నాం కదా! నువ్వు ఇక్కడే ఉండవచ్చు కదా!”


“బావా! నీతో కలిసి ఉంటే సమయమే తెలియడం లేదు. నేను అమెరికాలో కొద్దిరోజులు ఉన్నా అక్కడి వేషధారణ, ఆహార అలవాట్లు ఎలా నచ్చాయో? ఇక్కడికి రావడం మొదటిసారి అయినా బుద్ధి తెలిసిన తర్వాత కాబట్టి, ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నాను. నీతో గడుపుతున్న క్షణాలు అన్నీ మధురస్మృతులుగా గుర్తుంటాయి.”

 

“రమ్యా! నువ్వు నేను ఒకరి కోసం ఒకరం పుట్టామా! అనిపిస్తుంది. ఇంతవరకు మన ఇద్దరు కుటుంబాలు కూడా దూర దూరంగా ఉన్నాయి. మన వల్ల దగ్గరవుతాయి. ఇప్పుడున్న మన బంధుత్వాలు మరింత సన్నిహితం అవుతాయి.. పెద్దవాళ్ళ ఆశీర్వాదాలుoటాయి.”

 

“బావా! సినిమా డైలాగులు మాట్లాడుతున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు."


ఇప్పుడే తొందరపడి ప్రేమిస్తున్నానని చెప్తే, వేరే విధంగా అనుకుంటుంది..


“ఏమి లేదు రమ్య, మనమంతా సంతోషంగా కలిసిమెలిసి ఎప్పుడూ ఇలాగే ఉండాలి.”

 

“మూడు నెలల సెలవు లున్నాయి కదా! ఇక్కడే ఉంటాను బావా!. సరేనా బావ!”


ఇప్పటికైతే నా దగ్గరే ఉంటాను అంటుంది. అమ్మాయిలు అంత తొందరగా మనసులో ఉన్నది చెప్పరు. మెల్లమెల్లగా మంచి ప్రేమతో రాబట్టు కోవాలి. 


“బావ! ఉన్న మూడు నెలలు ఇక్కడే ఉంటే నాకు బోర్ కొడుతుంది. రేపు సిటీలోనీ పబ్బుకు పోదామా? చాలా రోజులైంది.”

 

“అంత దూరం మనం ఇద్దరమే వెళ్తామంటే మా నాన్న ఒప్పుకోరు. ఇప్పటికే నన్ను ఎక్కువ తిరగవద్దు అంటున్నారు.” 


“నువ్వు ఇంకా మామయ్యకు భయపడు తున్నావా? చంటి పిల్లాడిలా? నువ్వు మారాలి బావా! మారుస్తాను! నేనంటే ఇష్ట పడుతున్నావు కదా” అను కున్నది లోలోపల. 


“నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు బావా! ఈ చిన్న కోరిక తీర్చలేవా? అక్కడైతే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు.”


“సరే సరే రేపు క్రాoతి నగర్ వెళ్దాము.. కారులో బయలు దేరుదాము.”

 

తండ్రిని ఒప్పించాడు భార్గవ్. కాదన లేక అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాడు తండ్రి. 


“ఇదే చివరిది. వచ్చేవారం మనం మన ఊరు విట్టల్ నగర్ వెళ్ళిపోతాము. మిగతా వేసవి సెలవుల్లో అక్కడ గడుపుదాం” అని చెప్పగానే.. 

“అదేమిటి నాన్న! తాతయ్య వాళ్ళతో స్పెండ్ చేయాలి. అప్పుడేనా?” అని వాదించాడు. 


వాసు రమ్య తో తిరగడం అనుమానానికి దారి తీస్తుంది. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటున్నాడు. ఒక్కగా నొక్క కొడుకుని బుట్టలో వేసుకుని అమెరికా తీసుకపోతుందేమోనని భయం పట్టుకుంది. 


ఆమె తండ్రి ఏమో ఆస్తి సగం పంచమని తగాదాలు పెడుతు న్నాడు. 

 వీటన్నిటినీ ఆలోచిస్తూ భార్గవ్ రాధాదేవికి కూడా నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. 

***********, *******

మొదటిసారి అడుగు పెట్టిన వాసు పబ్బులో విచ్చలవిడి త్రాగడం, అందరూ చేసే డ్యాన్సులు ఇక ఇకలు, పకపకలు తనకు నచ్చడం లేదు. 


“బావా! కమాన్..” అంటూ ఒక రంగుల గ్లాసు నోటికి అందించింది. 


“కేవలం నీకోసమే వచ్చాను రమ్య.. ఇవన్నీ నాకు అలవాటు లేదు..” అని దూరం పెట్టబోతుంటే.. 


“నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు? నేను అమెరికా వెళ్ళిపోతాను.”

 

“ఎక్కడికి పోవద్దు సరేనా?”


“అయితే ఒక సిప్ చేయి, స్వర్గం ముందుంటుంది” అనగానే, తాగిన వెంటనే మైకం కమ్మినట్లయి తాను ఏం చేస్తున్నాడో తనకే అంతా అయోమయం.. చుట్టూ స్టెప్పులేస్తూ ఆడ మగ అలా తూలుతూ ఉంటే.. కాసేపటికి వెళ్ళిపోదాము.. అని పక్కన కుర్చీలో కూర్చున్నాడు. నడవ లేనట్టు అయ్యాడు. 

 వెంటనే డ్రైవర్ని పిలిచి కారులో ఎక్కించి ఇద్దరు తెల్లారేసరికి ఇల్లు చేరుకున్నారు. 

**********

మర్నాడు తాను చేసిన పనికి నలుగురు ముందు తలెత్తుకోలేక పోయాడు వాసు. 


“బావ! ఇది చాలా చిన్న విషయం. అంతగా ఫీల్ అవ్వాల్సిన పనిలేదు.” అంటూ మరిచిపోయేలా తన మాటలతో మురిపించింది రమ్య. 

********

డ్రైవర్ ద్వారా జరిగిన విషయం తెలుసుకొని లోలోపల ఆందోళన పడుతూ, 'ఎదిగిన కొడుకు ఏమన్నా అంటే ఎదురు తిరుగుతాడో ఏమో? తల్లి ద్వారా చెప్పించాలి' అనుకున్నాడు భార్గవ్. 

 ******

“ఏమండీ! మన వాసు, రమ్య జంట చూడ ముచ్చటగా ఉందండి. రమ్య ఇక్కడి పద్ధతులకు కూడా అలవాటు పడుతుంది.” - రాధా దేవి.

 

ఆ మాటల ద్వారా రమ్యని కోడలుగా చేసుకోవాలని ఇష్ట పడు తున్నట్లు పసిగట్టి, 

“రమ్య అమెరికా వెళ్ళుతుంది, అప్పుడు మన వాసు మనల్ని వదిలి అక్కడ ఉండలేడు. మనం వాడిని వదిలి ఉండలేము. అక్కడ మనం లేకపోతే, ఇద్దరిమధ్య సఖ్యత ఉండక పోవచ్చు.. ఇప్పటి ఆకర్షణ అప్పుడు ఉండక, చేసిన వాటికి చిన్న గొడవలు పెద్దగా అవుతాయి.


 చూడు రాధా!.. వాసు నీకు ఒక్కదానికే కాదు నాకు కొడుకే. వాడి జీవితం ఎలా ఉండాలి అనే దానిమీద నాకు స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉన్నాయి. రమ్య మీ అన్న కూతురు అనే ఒక అంశం తప్ప ఎందులో వాసు గాడికి సరిపోతుంది చెప్పు. నీ మాట కాదన్నానని నన్ను తప్పుగా అనుకోకు. నాకు వాసు భవిష్యత్తు ఎంత ముఖ్యమో, నువ్వు.. నీ మనోభావాలు.. అంటే అంతే గౌరవం. ప్రశాంతంగా కూర్చొని, ఆలోచించి నీ మాట ఏమిటో చెప్పు. నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది" అన్నాడు భార్గవ. 


 భర్త మాటలకు చిరాగ్గా తల త్రిప్పుకో బోయి గుమ్మం దగ్గర ఏదో అలికిడి అవడంతో అటు తిరిగి చూసింది ప్రొఫెసర్ రాధాదేవి. 


అక్కడ కనిపించిన దృశ్యానికి చేష్టలుడిగిన సర్ప ద్రష్ట లా నిలబడి పోయిందామె. అప్పుడే వచ్చిన రమ్య, వాసు తమ మాటలు విన్నారేమోనని ఆశ్చర్యం, ఆందోళన కలిగింది. 


రమ్య వాసు గుమ్మ ముందు నిలబడి చేతుల్లో క్యాబిన్ బ్యాగులు, పాస్ పోర్ట్ లు చూపిస్తూ, “మేము కాశ్మీర్ టూర్ వేసుకున్నాము..” అనగానే,

 

అది గమనించిన భార్గవ్ అవాక్కయి, “ఒంటరిగా మీరు ఇద్దరు హఠాత్తుగా ప్రయాణము. ఈ రోజుల్లో కాశ్మీరు అంత సరియైన ప్లేస్ కాదు. ఉగ్రవాదుల గొడవలు..” అంటూ ఆపై గుండెలో సన్నగా మెలి తిరుగుతూ నొప్పి రాగా, రాధా అంటూ నేల కొరిగి పోయాడు. 


“అయ్యో నాన్నా!" అంటూ లేవనెత్తి గదిలోకి తీసుకెళ్లి బెడ్ పైన పడుకో బెట్టి, అప్పుడప్పుడూ వేసుకునే టాబ్లెట్ వేసి గుండె నిమిరాడు.

 

“నాన్న.. నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. అలా ఏమి ఉండదు? రమ్య చూసి వద్దాము అంటుంది.”

 

“ఏమోరా! మీరు చెప్తే వినరు కదా!" 


వెంటనే రాధాదేవి “ఏమిటండి మీరు! వాళ్ళు చిన్న పిల్లలా.. అన్ని తెలుసుకునే వెళ్తారు. మీరు విశ్రాంతి తీసుకోండి "అని చెప్పింది. 


భార్గవ పరిస్థితి చూసి అందరూ కలిసి, 

“రమ్య, వాసు! మీరు ఎక్కడికి వెళ్లొద్దు. భార్గవ ఆరోగ్యం కుదుట పడ్డాక వెళ్ళండి" అనగానే, 

వద్దులే అమ్మ! మేము ఎక్కడికి వెళ్ళము" అనగానే, . భార్గవ సంతోషం తో లేచి కూర్చున్నాడు. 


“నాన్న! నేను ఎప్పుడైనా చూడవచ్చు, మీ సంతోషమే మా సంతోషం". 


రమ్య మాత్రం ముభావంగా ఉంది. గమనించిన వాసు, రమ్య సంతోషం కోసం తన కాలేజీ కబుర్లు చెబుతూ నవ్విస్తున్నాడు. అప్పుడప్పుడు తను మాత్రం ఏదో లోకంలో ఉన్నట్టు కనిపెట్టాడు. 

రమ్యను పెళ్లి చేసు కుంటానంటే ముందు నాన్న అంగీకరించడు. తాతయ్యకు భాను ప్రకాశ్ అంటే ఇష్టం లేదు. అల్లుడుగా మాత్రమే చూస్తాడు. ఒక్క అమ్మకు మాత్రమే ఇష్టం తన మేనకోడల్ని చేసుకోవాలని. డైరెక్ట్ గా రమ్య నుండి తన మీద అభిప్రాయం ఏమిటో తెలుసు కోవడం కూడా బాగుండదు. 

************

రమ్య అమెరికా ప్రయాణం దగ్గర పడుతుంది. నేనే తెలుసు కుంటాను అనుకుని, "రమ్య! నువ్వు వాసు ను ఇష్టపడితే చెప్పమ్మా ! వాడితో ఎంతో ప్రేమగా మెలుగు తున్నావు. వాసు అభిప్రాయం తెలుసుకొని వాడికి ఇష్టమైతే పెళ్లి చేస్తాము" అంది రాధాదేవి


“అత్తయ్య! వాట్ ! బావతో చనువుగా తిరిగినంత మాత్రాన పెళ్లి చేసుకునేంత ప్రేమ అనుకున్నారా? మీకు తెలియని నిజo ఉంది. అమెరికాలో నేను ప్రతి ఒక్కరితో ఆడ మగ తేడా లేకుండా అలానే ఉంటాను. ఇక్కడ అలాగే బావతో తిరిగాను. అంతే.. కానీ నాకు బావను పెళ్లి చేసుకోవాలని లేదు. బావ కూడా అలా ఊహించుకుంటే మానుకోమని చెప్పు. అయినా నాకు అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మేము డేటింగ్ లో ఉన్నాము. అమ్మా నాన్నకు చెప్పి పెళ్లి చేసుకుంటాము. నేను రెండు రోజులలో అమెరికా వెళ్ళిపోతు న్నాను.”

 

 ఆమాటలు విన్న రాధాదేవి ఏమీ మాట్లాడలేక పోయింది. 

 వెనక నుండి చాటుగా ఆ మాటలు విన్న వాసు ఒక్కసారిగా నిశ్చేష్ఠుడయ్యాడు. 


జరిగిందంతా ఒక పీడకలగా భావించుకొని తండ్రితో, 

“నాన్నా! నాకు రమ్య అంటే ఇష్టం లేదు, మీకు ఇష్టమైన అమ్మాయిని చూడండి, నేను పెళ్లి చేసుకుంటాను” అని చెప్పాడు. 


అందరూ "శుభస్య శీఘ్రం" అన్నారు. 


శుభం. 


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments


bottom of page