top of page

సునయన


'Sunayana' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 06/12/2023

'సునయన' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్సుధాకర్, సుమతి దంపతులకి చాలా ఆనందం కలిగించిన రోజది. జీవితంలో మరువలేని రోజది! సునయన యు. పి. ఎస్. సి. లో తను కోరుకున్నట్లు విజయం సాధించిన రోజది. ఆ వార్త తెలియగానే సునయన కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి తను కోరుకున్నది సాధించిన ఆనందంలో వచ్చిన ఆనందబాష్పాలవి. అభినందనలు తెలుపడానికి వచ్చిన శశిధర్ని సాదరంగా ఆహ్వానించారు వాళ్ళు. తమ అమ్మాయి జీవితంలో ప్రవేశించిన అంధకారాన్ని పారదోలి, వెలుగు నింపి, ఆమెకి దిశానిర్దేశం చేసిన శశిధర్కి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియజేసాడు సుధాకర్. సుమతికైతే కళ్ళ నీళ్ళు ఆగడం లేదు.


"సార్! కష్టాల్లో, బాధల్లో క్రుంగిపోకుండా జీవితంలో ముందడుగు వెయ్యాలని మీ ద్వారానే తెలుసుకున్నా సార్! నా లక్ష్యం సాధించాను! ఇక ముందు కూడా మీరు చూపించిన బాటలోనే నడుస్తాను. నాలాంటి వాళ్ళకి నేను అండగా నిలుస్తానని మాట ఇస్తున్నాను. " ఉద్వేగంతో చెప్పింది సునయన.


"శభాష్ సునయనా! నువ్వు కోరుకున్నది సాధించావు! అచంచలమైన కృషి, ఆత్మ విశ్వాసమే నిన్ను ఈ రోజు విజయ శిఖారాల మీద నిలబెట్టింది. నీ విజయ పరంపర ఇలాగే జీవితాంతం కొనసాగాలని ఆశిస్తున్నాను. " అన్నాడు శశిధర్ ఆమెని మనసారా ఆశీర్వదిస్తూ.


సుధాకర్కి, సుమతికీ పదిహేనేళ్ళ క్రిందటి దృశ్యం కళ్ళముందు మెదిలింది. ఇప్పటికీ ఆ విషయం తలచుకుంటూంటే మనసంతా చేదుగా అయిపోతోంది. అలాంటి పరిస్థితి తమకు అలా అశనిపాతంలా ఎదురవుతుందని ఎన్నడూ ఊహించలేదు వాళ్ళు.


********

అందమైన ముఖం సునయనది. ఆమె ముఖానికి చారెడేసి కళ్ళే అందం. కలువరేకలాంటి ఆమె కళ్ళు చూసి మురిసిపోయి, సునయన అని పేరు పెట్టారు ఆమె తల్లి తండ్రులు సుధాకర్, సుమతి. అలాంటి సునయనకి ఇంకా పట్టుమని పది వసంతాలు కూడా పూర్తిగా నిండకుండానే కళ్ళముందు ప్రపంచమంతా మసకబారిపోయిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా రాతిపూట కంటి చూపు సమస్య ఎక్కువై చదువుపై మనసు లగ్నం చెయ్యలేకపోవడం తల్లి సుమతి గ్రహించింది. కంటి సమస్యకి వినికిడి సమస్య కూడా తోడవడంతో దిక్కుతోచలేదు సుమతికి.


చాలా రోజుల నుండి తనకి అంతా మసకమసకగా కనిపిస్తుందని చెప్పడంతో ఆ రోజు డాక్టర్ ఆనంద్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు సునయన తండ్రి సుధాకర్. ఇంతకు ముందు మరో డాక్టర్కి చూపించి కళ్ళద్దాలు వాడినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది. తనకి తెలిసిన వాళ్ళు డాక్టర్ ఆనంద్ పేరు సూచించడంతో అతన్ని కలవాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు సాయంకాలం తమకు కేటాయించిన సమయానికి అరగంట ముందే డాక్టర్ ఆనంద్ క్లినిక్కి చేరుకున్నారు సునయనతో ఆమె తల్లి తండ్రులు సుధాకర్, సుమతి.


ముప్ఫావు గంట తర్వాత, లోపలినుండి ఓ అమ్మాయి వచ్చి వాళ్ళ పేర్లు చదవడంతో, సునయనతో డాక్టర్ చాంబర్లోకి అడుగుపెట్టారు ఆమె తల్లి తండ్రులు.


వాళ్ళని నవ్వుతూ ఆహ్వానించాడు డాక్టర్ ఆనంద్. సునయనని తన ముందు ఉన్న స్టూలు మీద కూర్చోమని చెప్పి, "ఏమిటి సమస్య?" అని అడిగాడు.


సుధాకర్ ఇంతకు ముందు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ రిపోర్టులు అతనికి అందించి, "డాక్టర్ గారూ! ఇంతకు ముందు చూసిన ఐ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రం చెప్పడంతో అమ్మాయి కళ్ళద్దాలు వాడుతోంది. ఐ డ్రాప్స్ వేసుకున్నా కూడా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈ మధ్య చూపు ఇంకొంచెం మందగించింది. రాత్రిపూట ఈ సమస్య తనకి ఎక్కువవుతోంది. ముందు లేదుగానీ, ఇప్పుడు సరిగ్గా వినిపించడం లేదు కూడా! ఈ సమస్యల వల్ల చదువుమీద సరిగ్గా దృష్టి పెట్టలేక క్లాసులో వెనకబడి పోతోంది. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చే మా అమ్మాయి, రెండు టెర్ములైంది పదిహేనో రాంక్కి పడిపోయింది. " అంటూ తన మనోవేదన బయటకు చెప్పాడు.


సునయనని పరీక్ష చెయ్యటం ఆరంభిస్తూ, "దయచేసి మీరు అమ్మాయిని రాంకుల కోసం ఇబ్బంది పెట్టొద్దు. చదువుకి, ఆరోగ్యానికి ముడిపెట్టవద్దు. ఇదేదో చాలా తీవ్రమైన సమస్యగా నాకు తోస్తోంది. కొన్ని ముఖ్యమైన టెస్టులు రాస్తున్నాను. వాటి రిపోర్టులు వచ్చాక ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. " చెప్పాడు డాక్టర్ ఆనంద్.


డాక్టర్ ఆనంద్ సునయనని చూసి చిరునవ్వు నవ్వుతూ, "ఏంటి పాపా! నీ పేరేమిటి?" అని ఆమెకి వినపడేలా అడిగాడు.


"సునయన!" అమాయకంగా చెప్పింది తను కూడా నవ్వుతూ.

'ఎంత అందమైన పేరు! అంత అందమైన పేరుగల పాపకి పాపం ఇక ముందు కళ్ళు కనబడవు!'అని అనుకునేసరికి అతనికి కూడా కించిత్ బాధ కలిగింది. ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకొని, అందులో ఏమేం టెస్టులు చెయ్యాలో వివరంగా రాసి ఇచ్చాడతను.


సుధాకర్, సుమతి ఇద్దరికీ చాలా ఆందోళనగా ఉంది రిపోర్టులు వచ్చిన తర్వాత డాక్టర్ ఏమని చెప్తాడోనని. సుమతి అయితే కనిపించని దేముళ్ళందరికీ దండం పెట్టుకుంది మనసులో, బోలెడన్ని మొక్కులు మొక్కుకుంది కన్నీళ్ళతో.


తన తండ్రులెందుకు కంగారు పడుతున్నారో పాపం అర్థం కాని సునయన, "అమ్మా! నాకేమీ కాదు. డాక్టర్ అంకుల్ మళ్ళీ కొత్త కళ్ళద్దాలు రాస్తారు. అవి వాడితే నాకు బాగానే కనిపిస్తుంది. " అని భరోసా ఇస్తూ తల్లిని అనునయించింది. ఆమె కళ్ళల్లోని అమాయకత్వం చూసి, సుమతి కళ్ళలో నీళ్ళు పొంగాయి.


రెండు రోజుల తర్వాత వచ్చిన రిపోర్టులన్నీ చూసాడు డాక్టర్ ఆనంద్. అతను ఏం చెప్తాడోనని ఆత్రతగా అతనివైపే చూస్తూ ఉండిపోయారు సుధాకర్, సుమతి.


ఓసారి వాళ్ళ మొహంలోకి తేరిపార చూసాడు డాక్టర్ ఆనంద్. ఆత్రతగా చూస్తున్న వాళ్ళ మొహాల్లోకి చూస్తూ, "ముందు మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. " అన్నాడు చెప్పబోయేదానికి ఉపోద్ఘాతంగా.


ఇద్దరి కళ్ళలోన ఆందోళన కనపడింది. ఒక్క క్షణం ఆగి, "పాపకి వచ్చిన కంటి సమస్యని వైద్య పరిభాషలో 'యుషర్స్ సిండ్రోం' అని అంటారు. ముందు వినికిడి శక్తి తగ్గుతుంది. తర్వాత వినికిడి సమస్యతో పాటు కంటి చూపు కూడా మందగిస్తుంది. సాధారణంగా ఇది పుట్టుకతో వచ్చిన జబ్బే అయినా, ఒక్కోసారి పదిపన్నెండేళ్ళ వయసులో కూడా ప్రారంభమవడానికి ఆస్కారం ఉంది. అంతేకాక, ఇది వంశ పారంపర్యంగా వచ్చే సమస్యే! మీ వంశంలో ఎక్కడో ఎవరికో ఉండే ఉంటుంది" అని వివరంగా చెప్పాడు ఆనంద్.


ఇద్దరి మొహాలూ పూర్తిగా వాడిపోయాయి డాక్టర్ మాటలు వినగానే. అతనివైపు ఆందళనగా చూసాడు సుధాకర్. సుమతి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. చలించిపోయారు వాళ్ళిద్దరూ.


దూరంగా కుర్చీలో కూర్చున్న సునయనకి ఇవేమీ వినపడకపోయినా తల్లి ఏడుస్తుస్తోందని మాత్రం గ్రహించింది. తన గురించే ఏదో మాట్లాడుకుంటున్నారని ఆ పసి మనసుకి అర్థమైంది.


"డాక్టర్! కంటికి ఆపరేషన్ చేస్తే ఫలితమేమైనా ఉంటుందా? మందులవల్ల నయం కాదా?" అని అడిగాడు సుధాకర్ బేలగా.


"మందులవల్ల పెద్దగా ఫలితమేమీ ఉండదు. ఆపరేషన్వల్ల కూడా నయం అయ్యే అవకాశం లేనిదిది. ‘రెటినిటిస్ పిగ్మెంటోసా’ అని సాంకేతిక భాషలో పిలువబడే ఈ కంటి వ్యాధిలో రెటినా దెబ్బ తింటుంది. క్రమంగా చూపు బాగా మందగిస్తుంది. నిజానికి ఈ వ్యాధికి ఎలాంటి చికిత్సా లేదు. కాకపోతే, వినికిడి సమస్య కోసం 'హియరింగ్ ఏయిడ్' వాడితే సరిపోతుంది. అయితే, ఈ విషయంలో నేను మీకో సలహా మాత్రం ఇవ్వగలను. " ఆగాడు డాక్టర్ ఆనంద్.


"ఏమిటది డాక్టర్?" కళ్ళు తుడుచుకుంటూ ఆత్రుతగా అడిగింది సుమతి.


సుధాకర్ కూడా డాక్టర్వైపు చూసాడు సజల నయనాలతో.

"మన దేశంలో ఇలా కంటి చూపు కరువైన వాళ్ళను ఆదుకొనే సంస్థలు చాలానే ఉన్నాయి. వాళ్ళు సామాజిక సేవ చేస్తూ, ఇలాంటి వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని సరైన విద్యా సంస్థల్లో చదివించి, ఉద్యోగాల్లో చేరే విధంగా భవిష్యత్తు తీర్చి దిద్దడానికి వాళ్ళ సాయశక్తులా సహాయపడుతూ ఉంటారు. మీరు వాళ్ళ సహాయం తీసుకుంటే మీ సమస్య కొద్దిగానైనా తీరుతుంది. " చెప్పాడు ఆనంద్.


"చెప్పండి డాక్టర్! అలాంటి సంస్థల గురించి మీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి డాక్టర్!" అన్నాడు సుధాకర్.

తల ఊపుతూ ఆ సంస్థ వివరాలు ఓ కాగితంలో రాసి ఇచ్చాడు.


ఇంటికి చేరిన తర్వాత, "అమ్మా! ఏమైందమ్మా నాకు? డాక్టర్ అంకుల్ ఏమని చెప్పారు?" అమాయకంగా అడిగిన కూతుర్ని చూస్తూనే గుండె తరుక్కు పోయింది సుమతికి.

"అమ్మా సునయనా!" బావురుమంటూ ఆమెని గుండెలకి హత్తుకుంది సుమతి. బిత్తరపోతూ తల్లి వంక చూస్తూ ఉండిపోయింది సునయన.. సుధాకర్ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు.


సునయన సమస్య తెలిసిన తర్వాత, ఆమె చదివే స్కూల్ ప్రిన్సిపాల్ అక్కడ ఆమె చదువు కొనసాగించడానికి ఏ విధమైన సహకారం చెయ్యలేనన్నాడు. తమ స్కూల్లో దృష్టి శక్తి లోపించిన వారికి చదివించే పరికరాలు గానీ, అందులో అనుభవజ్ఞులైన సిబ్బందిగానీ లేరని చెప్పాడు. కూతురి భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది సుధాకర్కి. అప్పుడు సుధాకర్ డాక్టర్ ఆనంద్ రాసి ఇచ్చిన కాగితం తీసాడు. అందులో రాసి ఇచ్చిన 'న్యూ విజన్‘సంస్థ నంబర్కి ఫోన్ చేసాడు. అవతల పక్క నుండి ఫోన్ ఎత్తిన తర్వాత సునయన గురించి వివరంగా చెప్పి వాళ్ళ సహాయం అర్థించాడు. న్యూ విజన్ డైరెక్టర్ శశిధర్ సుధాకర్ చెప్పినదంతా సావధానంగా విన్నాడు.


వాళ్ళ సంస్థ అధ్వర్యంలో నిడిచే 'విజన్ ఏయిడ్ స్కూల్' అనే పేరుగల స్కూలు సూచించాడు. దృష్టిలోపంగల విద్యార్థులకి ప్రత్యేకంగా శిక్షణ అక్కడ ఇస్తారని చెప్పాడతను. ఆ స్కూల్లో సునయనని జాయిన్ చెయ్యమన్నాడు. ఆమె బాధ్యత తను తీసుకుంటానని అతను భరోసా ఇవ్వడంతో సుధాకర్కి చాలా రిలీఫ్ కలిగింది.


శశిధర్ చెప్పిన విధంగానే ఆ విద్యాలయంలో సునయనని జాయిన్ చేసారు ఆమె తల్లి తండ్రులు. రోజురోజుకీ క్షీణిస్తున్న దృష్టిశక్తితో ఆమె అక్కడ ఎలా నెట్టుకు వస్తుందోనని ఓ మూల భయంగానే ఉంది సుమతికి. ఇప్పుడు తను మారిన స్కూలు కొత్తగా అనిపించినా, పరిస్థితి అర్థమైన సునయన తల్లి తండ్రులకి సహకరించింది. త్వరలొనే అక్కడ అలవాటు పడిపోయింది. ఆమెని రోజూ దిగబెట్టడం సుధాకర్ వంతైతే, తీసుకు రావడం సుమతి వంతైంది. అక్కడ టీచర్ల ప్రోత్సాహం వల్లనైతేనేమీ, తన పట్టుదల వల్లనైతేనేమి బాగా చదివి మంచి మార్కులతో పాసైంది సునయన. అక్కడ చదివే ప్రతీ విద్యార్థి వెనుక సంస్థ డైరెక్టర్ శశిధర్ ప్రోత్సాహం కూడా వెలకట్టలేనిది.


అక్కడ చదువు పూర్తి చేసి, సునయన డిగ్రీ చదవడానికి ఇంకో కాలేజీలో చేరడానికి వెళ్ళేముందు, తన ధన్యవాదాలు తెలపడానికి అక్కడకి వెళ్ళాడు శశిధర్. "నిజంగా మీరు సహాయం చెయ్యకపోయి ఉంటే మా అమ్మాయి భవిష్యత్తు ఎంత అంధకారంగా మారేదో తలచుకుంటేనే భయం వేస్తోంది. మా సునయన మంచి మార్కులతో పాసైనందుకు మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలీయటం లేదు. " అన్నాడు సుధాకర్ కళ్ళు చెమర్చుతూండగా.


అతని మాటలకి కల్మషం లేని చిరునవ్వు నవ్వుతూ, "సాటి వారికి ఉపయోగపడాలన్నదే నా ధ్యేయం. నాలాంటి వాళ్ళు ఎందరో? అలాంటివారి జీవితాల్లో వెలుగు నింపాలని నేను కన్న కలలు సాకారమవుతున్నాయి. " అని కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకున్నాడు శశిధర్.


అప్పుడు చూసాడు సుధకర్ అతని కళ్ళలోకి. అతని గాజుకళ్ళు సుధాకర్ని చూసి నవ్వుతున్నాయి. ఆశ్చర్యపోయి శశిధర్వైపే చూస్తూ ఉండిపోయాడు. అతని ఆత్మవిశ్వాసంకి అచ్చెరువొందాడు. అంతపెద్ద సంస్థ నడుపుతూ, తోటి వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపాలన్న అతని ప్రయత్నానికి జోహార్లు అర్పించాడు.


"మీరు... మీరు కూడా... " మరేం మాట్లాడాలో తెలియలేదు సుధాకర్కి.


"అవును సుధాకర్ గారూ! మీ అమ్మాయిలాగే నాకూ పదేళ్ళ వయసులోనే కంటి చూపు పోయింది. అప్పటివరకూ రంగురంగుల ప్రపంచం చూసిన నాకు, లోకమంతా చీకటై కనిపించింది. అప్పుడు ఈ సంస్థ అధిపతి రామాచంద్రారావు నన్ను చేరదీసి ఉండకపోతే నేనేమై ఉండేవాణ్ణో? నాలో ధైర్యం నూరిపోసి నన్నో మనిషిగా నిలబెట్టారాయన. అందుకే నా చదువు పూర్తైనా అతన్నే అంటిపెట్టుకొని ఇక్కడే ఉండిపోయాను. అతను నాపై గురుతర బాధ్యతలే నిలిపారు. కనులు లేని వారి కలతలు తీర్చి, ఉన్నత వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం. వెలుగంటే ఏమిటో తెలియని జీవితాల్లో వెలుగు నింపడమే నా లక్ష్యం. " అన్నాడు శశిధర్.


అతని అకుంఠిత దీక్షకి కళ్ళు చెమర్చాయి సుధాకర్కి.

సునయన ఆ స్కూలు వదిలిన తర్వాత కూడా పై చదువుల్లోనూ ఆమెకి సహాయపడ్డాడు. ఆమె ఆకాoక్షననుసరించి పోటీ పరిక్షల్లోనూ ఆమె విజయం సాధించడానికి సాయపడ్డాడు శశిధర్. సునయన విజయం వెనుక అతని ప్రోత్సాహం ఎంతైనా ఉంది.


*************

జరిగినదంతా గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి వాళ్ళిద్దరికీ. శశిధర్ వాళ్ళిద్దరికీ దేముడిలా అనిపించాడు.


అప్రయత్నంగా అతనిలోని దైవత్వానికి చేతులు జోడించారు ఆ దంపతులిద్దరూ.


**************

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


67 views0 comments

Comments


bottom of page