సుపుత్రుడు
- Karlapalem Hanumantha Rao

- 12 hours ago
- 3 min read
#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు, #సుపుత్రుడు, #Suputhrudu

Suputhrudu - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao Published In manatelugukathalu.com On 23/02/2026
సుపుత్రుడు - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
రాఘవయ్యగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. క్రమశిక్షణే ప్రాణంగా బతికిన మనిషి. కానీ ఆయన కొడుకు కిరణ్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. జూదానికి, చెడు అలవాట్లకు బానిసైన 'సుపుత్రుడు' అతగాడు.
మూడునెలల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కిరణ్ చనిపోయాడు.
కొడుకు పోయిన పదమూడో రోజు వాడి రూమ్ సర్దిస్తుంటే ఓ డైరీ కంటబడింది రాఘవయ్యగారికి! అందులోని ఓ పేజీ ఆయన దృష్టిని ఆకర్షించింది.
"తప్పు చేశాను. ఈ రెండు లక్షల 'బాకీ' తప్పకుండా తీర్చెయ్యాలి. అప్పుడే నా పాపానికి నిష్కృతి" అని రాసి ఉంది. ఆ మాటల పక్కనే ఒక ఫోటో, అడ్రసు కనిపించాయి.
ఫోటోలోని వ్యక్తులను చూసిన తరువాత రాఘవయ్యగారి గుండె బద్దలయింది. ఒక పండుముసలి మనిషి, ఆమె పక్కన ఓ చక్కదనాల చుక్క, పది పన్నెండేళ్ళ పిల్ల! వాళ్ళ కట్టూ బొట్టూ చూస్తే కటిక దరిద్రంలో ఉన్నవాళ్ళని ఇట్టే తెలిసిపోతుంది.
తన ఘనుడు ఈ తల్లీ కూతుళ్ళని ఏ మోసమో చేసి రెండు లక్షలు కొట్టేసినట్టున్నాడు. సుపుత్రుడి నిర్వాకానికి రాఘవయ్యగారు ఖిన్నుడయ్యారు.
చేసిన పాపం చెబితే పోతుందంటారు. తప్పు చేసింది తాను కాకపోయినా ఆ తప్పు చేసిన వాడిని కన్న పాపిష్టి తను. పోయినవాడు పోనే పోయాడు... తండ్రిగా వాడి తప్పును సరిదిద్దటం తన బాధ్యత.
బ్యాంకు నుంచి రెండు లక్షలు డ్రా చేసి, ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లారు రాఘవయ్యగారు.
ఊరి చివరి మురికివాడలో ఉంది ఆ చిరునామా తాలూకు పూరిగుడిసె. ఆ పాత కొంపలో కనిపించిన తల్లీ కూతుళ్ళు డైరీలోని చిరునామాలో ఉన్న వాళ్ళే!
ఆ ముసలి మనిషి కుక్కి మంచం మీద మూలుగుతూ పడి ఉంది! వంటికి అనువైన దుస్తులైనా లేకుండా దీనస్థితిలో ఉన్న ఆ పసిపాపను చూసి తన కొడుకు ఎంత ఘాతుకానికి ఒడిగట్టాడో అర్థమైంది రాఘవయ్యగారికి.
అపరాధభావన ఆయనను నిండా ముంచెత్తింది. అతికష్టం మీద గొంతు సవరించుకుని ముసలమ్మతో అన్నారు రాఘవయ్యగారు, "అమ్మా, నేను కిరణ్ కన్నతండ్రిని. ఆ త్రాష్టుడు మీకు చేసిన ద్రోహానికి నన్ను క్షమించండి! మావాడు మీ దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చాను" అంటూ వెంట తెచ్చిన రెండు లక్షల కట్టను ఆమె చేతిలో పెట్టారు రాఘవయ్యగారు.
ఆ ముసలమ్మ ఒక్క క్షణంపాటు నివ్వెరపోయింది. వెంటనే తేరుకుని కంట నీరు పెట్టుకుంటూ గద్గద కంఠంతో అంది, "అయ్యా, మీ అబ్బాయి మా దగ్గర డబ్బు కొట్టేయటమేంటి? అల్లరి చిల్లరగా తిరుగుతాడు కాబట్టి అంతా మీవాడిని చెడ్డవాడు అనుకుంటున్నారు. ముందులో నేనూ అలాగే అనుకున్న మాట నిజం. కాని మీ బిడ్డ దేవుడయ్యా! ఎప్పుడూ ఈ ఎదుటున్న తుప్పల్లో పడి పేకాడుతుండేవాళ్ళు మీ అబ్బాయి, ఇంకొందరు అతని స్నేహితులు. వాడిలో ఏ వెధవ కాలిన సిగరెట్టు పీక ఇటు వైపు విసిరేశాడో గానీ క్షణాల్లో పాకకు నిప్పంటుకుంది. ఆ మంటల్లో నా కూతురు బూడిదయింది. అసలే తండ్రిలేని బిడ్డ, తల్లినీ పోగొట్టుకున్న ఈ పసిదాన్ని సమయానికి ఆదుకున్నది మీ బిడ్డేనయ్యా! ఆ మంటల మధ్యలో ఇరుక్కుని వళ్ళంతా కాలిని ఈ పసిదాన్ని ఆసుపత్రిలో చేర్పించాడు మీ అబ్బాయి. అయిన ఖర్చంతా ఆ బంగారు తండ్రే పెట్టుకున్నాడు! ఆ బిడ్డ నాకు బాకీ ఏంటి?! ఈ పేదముండే ఆ పుణ్యాత్ముడికి రుణపడి ఉంది!"
ముసలమ్మ మాటలు విన్న రాఘవయ్యగారు కొయ్యబారిపోయారు. బ్యాంకులో వెయ్యమని తానిచ్చిన రెండు లక్షలు వెళ్ళే దారిలో పోయాయని చెప్పాడు ఆ రోజు. ఆ డబ్బు మూలకంగా తామిద్దరి మధ్యా అయిన దెబ్బలాటలు అన్నీ ఇన్నీ కావు. ఏ పేకాటకో నా కష్టార్జితం తగలేసాడనుకున్నాడు గానీ ఇలా ఓ ధర్మకార్యానికి వెచ్చిస్తాడని కలలో కూడా ఊహించలేకపోయాడు. రాఘవయ్యగారి కళ్ళు కట్ట తెగిన చెరువులే అయ్యాయి. అంత దుఃఖంలోనూ ఆయన మదిని మెలిపెడుతున్న సందేహం అలాగే ఉండిపోయింది.
"మరి డైరీలో రాసి ఉన్న ఆ 'బాకీ' అనే మాట?!" మనసులోని మాట తెలియకుండా బైటికే వచ్చేసింది రాఘవయ్యగారి నోటిగుండా.
"ఆ బాకీ మీకే బాబూ! అవును... ఈ పిల్లకు బాగయి ఇంటికొచ్చిన రోజు ఆ బంగారుతండ్రి నాతో ఏమన్నాడో తెలుసా సామీ! 'నాకు ఓ ఉద్యోగం వేయించి ప్రయోజకుణ్ణి చెయ్యాలని మా నాన్నగారు తపించేవారు. పాప కోసం వాడిన సొమ్మంతా ఆయన నా కోసమని దాచిన డబ్బు నుంచి తెచ్చిందే! ఏదైనా చేసి ఆయన సొమ్ము ఆయనకు తిరిగి ఇచ్చెయ్యాలి. నాన్నగారి బాకీ తీర్చేదాకా నాకు మనశ్శాంతి లేదు' అన్నాడయ్యా ఆ పిచ్చినాయన."
రాఘవయ్య గారికి అప్పుడు అర్థమైంది... వంశానికి మచ్చలా పుట్టుకొచ్చాడీ సుపుత్రుడు అనుకున్నాడు గానీ... వంశానికి వన్నె తెచ్చేలా ప్రవర్తించిన తన కొడుకు నిజమైన 'సుపుత్రుడు' అని.
తెచ్చిన డబ్బు తీసుకోడానికి ససేమిరా అంది ముసలమ్మ. అయినా సరే... బలవంతంగా డబ్బు ఆమె చేతుల్లో కుక్కి, "అమ్మా, మావాడు నా దగ్గర తీసుకున్నది వట్టి కాగితాల కట్ట మాత్రమే. కానీ మీకు ఇచ్చింది ఒక బిడ్డ నిండు జీవితాన్ని. ఈ డబ్బు మీ పాప బాగోగుల కోసమైనా తీసుకోవాలి! అప్పుడే పోయిన నా కొడుకు ఆత్మకు శాంతి" అంటున్న రాఘవయ్యగారు, ఇక కంటి ముందు ఎన్నటికీ కనిపించని తన కన్న సుపుత్రుడు కిరణ్ మనసులో మెదిలి వలవలా ఏడ్చేశారు.
సమాప్తం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.




Comments