top of page

తస్మాత్ జాగ్రత్త!

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguInspirationalStories, #TasmathJagrattha, #జాగ్రత్త


Tasmath Jagrattha - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 31/05/2025 

తస్మాత్ జాగ్రత్త!తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


"నువ్వు ఒక్కదానివే వెళుతున్నావు నానమ్మా! ప్చ్! నా ఎక్జామ్స్ లేకపోతే నేను తోడుగా వచ్చేదాన్ని!" అంది మనుమరాలు మాల్య


"వాళ్ళ చిన్నప్పటి క్లాస్ మేట్స్ ని కలవడానికి గెట్ టుగెదర్ కోసం వెళుతోంది మీ నానమ్మ.


"నువ్వు ఎందుకు వెళ్లడం? నాకు బోర్ కొట్టిందని మళ్లీ ఏడవడానికా?" అంది మాల్య తల్లి భార్గవి

"నేను ఒక్కదాన్నే వెళతాలేవే! నాకేం భయం? ట్రైన్ లోనేగా వెళ్ళేది! సెల్ ఫోన్ ఉంది టైం పాస్ కి. బుక్స్ ఉంటాయి" అంది మనుమరాలితో లీలారాణి


లీలారాణి భర్త రామరాజు రిటైర్మెంట్ కి దగ్గర్లో వున్నాడు. టూరింగ్ జాబ్! లీలారాణి కొడుక్కి పెళ్లి చేసి, మనుమరాలు పుట్టాక, కోడలికి వంటింటి బాధ్యత అప్పజెప్పేసి, హాయిగా కూర్చుని టీవీ చూడడమో చేస్తుండేది. ఆ మధ్య ఫేస్బుక్ చూడడం అలవాటు అయి, ఎన్నో గ్రూపుల్లో యాక్టీవ్ మెంబెర్ అయ్యింది. దీని పుణ్యమా అని ఇంటర్ కాలేజీ ఫ్రెండ్స్ కొందరు కలిశారు. అలా అందరూ ఎవరు ఎక్కడున్నారో కనుక్కుని, అందరూ కలుసుకోవాలని పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్ణయించారు. దూర ప్రాంతాల వాళ్లకు స్టే చేయడానికి ఏర్పాట్లు కూడా చేసేశారు. ఆ గెట్ టుగెదర్ కోసమే ఈ ప్రయాణం.


 *****


రైల్వేస్టేషన్ కి కూడా వచ్చింది మనుమరాలు మాల్య. జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి, సీట్లో కూర్చోబెట్టి క్రిందకు దిగింది. 


"నీ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసి రా నానమ్మా! వచ్చాక అక్కడి విశేషాలు అన్నీ చెప్పు!" అని చెప్పింది నానమ్మ లీలారాణికి


ఇంతలో ట్రెయిన్ కదిలింది.

"అలాగే!" అని చెయ్యి ఊపింది లీలారాణి నవ్వుతూ


 *****


లగేజ్ తక్కువే తెచ్చుకుంది. స్ట్రాలీ, ఒక హ్యాండ్ బ్యాగు. స్ట్రాలీ బెర్తు క్రిందకు పెట్టేసి, హ్యాండ్ బ్యాగు దగ్గరే పెట్టుకుని సీట్లో కూర్చుంది. ముందుగా కోడలు కాల్ చేస్తే మాట్లాడింది. తర్వాత కాసేపు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. సెల్ ఛార్జింగ్ తక్కువగా ఉందని చూసి, ఛార్జింగ్ పెట్టుకుందామని చూస్తే తన వైపు ఉన్న ప్లగ్గు పనిచేయడం లేదు. పవర్ బ్యాంక్ కోసం అంతా వెదికింది. కానీ దొరకలేదు. పెట్టుకోవడం మర్చిపోయానే అనుకుంది.


కాసేపు బుక్ చదువుకుంటూ కాలక్షేపం చేసింది. కానీ సెల్ వాడడం అలవాటు అయిపోయి, తోచలేదు. 


ట్రెయిన్ లోకి ఛాయ్ అమ్మేవాడు, చిరుతిండ్లు అమ్మేవారు, కూల్ డ్రింక్స్ అమ్మేవారు వచ్చి పోతున్నారు. కావాల్సినవారు, అవసరం లేకపోయినా టైం పాస్ కోసం తినాలని, చాయ్ తాగాలని అనుకున్నవారు కొంటున్నారు. అలా గజిబిజిగా తిరుగుతూ వున్నారు. 


అప్పుడు ఒక పిల్లవాడు వచ్చాడు. పద్దెనిమిది ఏళ్ళు వుంటాయేమో! సెల్ ఫోన్ కవర్లు, ఇయర్ ఫోన్స్ అమ్ముకుంటూ వచ్చాడు. వాడిని చూసేసరికి ఒక ఆలోచన వచ్చింది లీలారాణికి. 

"బాబూ! నీ దగ్గర పవర్ బ్యాంకు ఉందా?" అని అడిగింది


"ఉందమ్మా! ఫోన్ కు సంబంధించినవి అన్ని అమ్ముతాను. చాలా మంచి కంపెనీలవి! బయట అయితే రేటు ఎక్కువ. ఇక్కడ తక్కువ రేటుకే అమ్ముతున్నాం!" అన్నాడు ఆ పిల్లవాడు.


"ఎందుకు తక్కువ రేటుకు అమ్ముతున్నావు? పనికి రానివా?" అని అన్నాడు పక్క సీట్లో అబ్బాయి.


"అదేం కాదు సార్! ఇవి పని చేస్తాయి కానీ లేటెస్టు అయితే షాప్స్ లోనే ఉంటాయి. ఇవి పోయిన సంవత్సరం తెచ్చిన వాటిలో మిగిలిన స్టాకు! అంతే తప్ప వేరే కారణం ఏమీ లేదు. ఫస్ట్ క్లాస్ గా పనిచేస్తుంది. ఏదో పేదవాళ్ళం. ఇలా అమ్మి వచ్చిన పైసలు సేటుకు ఇస్తే, ఈరోజు పైసలు మాకు ఇస్తడు. వాటితోనే తినడానికి కొనాలి..." అని ఇలా దీనంగా ముఖం పెట్టి, నమ్మకం కలిగేలా మాట్లాడాడు.


అప్పుడు అక్కడున్న ఇద్దరు, ముగ్గురు తలా ఒకటి కొన్నారు. అది చూసి లీలారాణి కూడా కొన్నది. ఒక్కటి ఐదువందలు. 


"మంచి కంపెనీ పేరే ఉంది. బయట షాప్ లో వెయ్యి పైన రేటు ఉంటుంది. లాభమే మనకు" అని పక్క సీట్ వాళ్ళు కూడా అనేసరికి ధైర్యం చేసి, తీసుకుంది లీలారాణి.


 కనెక్ట్ చేసి చూసుకుంది. ఛార్జింగ్ అవుతున్నట్టుగా చూపించింది.


 'హమ్మయ్య!' అనుకుంది.


 ధైర్యంగా ఫేస్బుక్ ఓపెన్ చేసి, చూస్తూ కూర్చుంది. 

 *****


కాసేపటికి చూస్తే ఫోన్ ఛార్జింగ్ లేదని చూపిస్తోంది. ఏమైందని చూస్తే ఛార్జింగ్ అవ్వట్లేదు. లూజ్ గా పెట్టానేమోనని చెక్ చేసి చూసింది. బాగానే ఉంది. ఏమైందో అర్థం కాలేదు. 


మరికొంతసేపు గడిచేసరికి ఆ పిల్లవాడి దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఎవ్వరికీ పని చేయట్లేదని తెలిసింది. ఇంకో సీట్లో ఉన్న కుర్రాడు తను తెచ్చుకున్న పవర్ బ్యాంకు ఇచ్చి, కాసేపు ఛార్జ్ చేసుకుని ఇవ్వమన్నాడు. 


"కాసేపు ఛార్జ్ చేసుకుని ఇవ్వండి ఆంటీ! మీ ఫోన్ మొత్తానికి డెడ్ లోకి పోతోంది కదా! ఓ సారి ఆ పవర్ బ్యాంక్ ఇటు ఇవ్వండి! చెక్ చేస్తాను!" అని అన్నాడు.


"చాలా థాంక్స్ బాబూ! అర్జెంట్ అయితే ఫోన్ కాల్ చేయడం ఎలాగని బాధ పడుతున్నా! ఇదిగో పవర్ బ్యాంక్! నీకు తెలిస్తే చూడవయ్యా! ఇది బాగు అయితే రిలీఫ్ వస్తుంది!" అని అంటూ ఆ అబ్బాయికి ఇచ్చింది.


ఆ అబ్బాయి క్షణాల్లో అదంతా విప్పదీసాడు. ఓపెన్ చేసి చూస్తే, అందులో సరిగ్గా పనిచేయని చిన్న బ్యాటరీ పెట్టి, మిగతా అంతా చెత్త నింపేసి ఉంది! ఆ బ్యాటరీ ఎలా పెట్టారో కానీ కొన్ని నిముషాలు పని చేసి, ఆగిపోయినట్లుంది. అందరూ అది చూసి, మోసపోయామని మొత్తుకున్నారు. 


"నాకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గురించి తెలుసు. నేను టెక్నీషియన్ ని. అందుకే చెబుతున్నాను. ఇలా తక్కువ రేటుకు దొరుకుతాయని ఆశపడి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు చేయవద్దు. ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతాయి. తస్మాత్ జాగ్రత్త!" అన్నాడు ఆ అబ్బాయి.


 అందరూ నిజమేనని అనుకున్నారు.


 ట్రెయిన్ దిగాక అక్కడ సెల్ ఫోన్ షాప్ లో కొనాలని అనుకుంది లీలారాణి.


 ## సమాప్తం ##




-సుధావిశ్వం





Comentários


bottom of page