ఉపాధ్యాయ దినోత్సవం
- Sudha Vishwam Akondi
- Sep 5
- 2 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguInspirationalStories, #TeachersDay, #ఉపాధ్యాయదినోత్సవం

ఉపాధ్యాయ దినోత్సవం 05/09/2025
Teachers Day - New Telugu Story Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 05/09/2025
ఉపాధ్యాయ దినోత్సవం - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మన జీవితానికి దిశానిర్దేశం చేసి, అజ్ఞానం నుండి విజ్ఞానానికి నడిపించేవారు ఉపాధ్యాయులు. వారు బోధించే పాఠాలు, నేర్పిన విలువలు మన జీవితాంతం తోడ్పడతాయి. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అయిదు నాడు భారతదేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంది. కానీ ఎందుకు ప్రత్యేకంగా ఈ తేదీనే టీచర్స్ డేగా ఎంచుకున్నారు? ఆ వివరాలు తెలుసుకుందాం!
సెప్టెంబర్ అయిదు మనదేశ తొలి ఉపరాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు! ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఒక గొప్ప కారణం ఉంది.
ఆయన కేవలం భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి మాత్రమే కాదు, ఒక గొప్ప పండితుడు, తత్వవేత్త, అంకితభావం కలిగిన ఉపాధ్యాయుడు కూడా!
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని బోధనకే అంకితం చేశారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో తత్వశాస్త్రాన్ని బోధించారు. విద్యార్థులకు ఆయన పట్ల ఎంతో ప్రేమ, గౌరవం ఉండేవి. ఆయన తరగతి గదిలో బోధనను ఒక జ్ఞాన యజ్ఞంగా భావించేవారు. జ్ఞానాన్ని పంచడమే తన జీవిత లక్ష్యంగా నమ్మారు. ఉపాధ్యాయులను ఆయన సమాజానికి వెన్నెముకగా భావించేవారు.
1962లో, ఆయన భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత, సెప్టెంబర్ అయిదునాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక వేడుకను నిర్వహించాలని ఆయన స్నేహితులు, విద్యార్థులు కోరారు.
"నా పుట్టినరోజును జరుపుకోవడం కంటే, ఆ రోజును ఉపాధ్యాయదినోత్సవంగా జరుపుకుంటే నేను మరింత గర్వపడతాను" అని అన్నారు.
ఆయన ఈ మాటల ద్వారా, వ్యక్తిగత వేడుకల కంటే, దేశ అభివృద్ధి కోసం ఉత్తమ పౌరులను తయారు చేయడం కోసం నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులను గౌరవించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు.
ఆయన ఇచ్చిన ఈ సందేశానికి గుర్తుగా, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది. ఈ రోజున, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతను చాటుకోవడానికి గురుపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువులను గౌరవించి, యధాశక్తి సత్కరించుకుంటారు.
గురువుల త్యాగాలు, కఠోర శ్రమ, మరియు సమాజ నిర్మాణంలో వారి పాత్రను మనం గుర్తుచేసుకునే రోజు ఈరోజు. గురువు పట్ల వినయవిధేయతలతో ఉన్నప్పుడే నేర్చుకున్న విద్య ద్వారా ప్రయోజనం సిద్ధిస్తుంది.
గురువులుగా ఉన్నవారు కూడా తమ స్థానానికి తగిన పని చేయాలి. శిష్యులను అందరినీ సమానంగా ఆదరించి, వారిలో విద్యపై ఆసక్తిని పెంచాలి! మంచి, చెడులను చెప్పి, మంచి మనుషులుగా తయారు అయ్యేలా కృషి చేయాలి. అప్పుడే సమాజానికి ఉత్తమ పౌరులు అందింపబడతారు.
మంచి విలువలతో కూడిన విద్యను అందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు గౌరవనీయుడే! అంతటి గొప్ప గురువులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

-సుధావిశ్వం
Comments