పది రూపాయిల కాయిన్
- Srinivasarao Jeedigunta

- Feb 8
- 4 min read
#TenRupeeCoin, #పదిరూపాయిలకాయిన్, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Ten Rupee Coin - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 08/02/2026
పది రూపాయిల కాయిన్ - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కేశవరావు, రంగనాయకి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కేశవరావు పుట్టి పెరిగింది మధ్యతరగతి కుటుంబంలో. తండ్రి చిన్న ఉద్యోగంతో గంపెడు పిల్లలని పెంచవలసి రావడం తో కేశవరావుకి ఆ ఇంట్లో ఏ సరదా తీరకుండానే పెరిగి, తన తెలివితేటలతో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు.
ఉద్యోగం చేస్తూ కొంత డబ్బు తండ్రికి పంపించేవాడు.
మిగిలిన కొడుకులు కూడా చిన్నచిన్న ఉద్యోగాలలో స్థిరపడటంతో కేశవరావుకి పెళ్లి చేశాడు అతని తండ్రి. దానితో కొత్త పెళ్ళాం తో సినిమాలు, షికారులు తిరుగుతూ ఉండటంతో జీతం నుంచి తండ్రికి డబ్బు పంపడం మానేశాడు.
కేశవరావు పిల్లలు ఇద్దరికీ వివాహం చేసి, మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకుని మొగుడు, పెళ్ళాం హాయిగా కాలం గడుపుతున్నారు.
మొదటినుండి డబ్బు లోటులో పెరగడంతో, తన సంపాదనలో ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వడం గాని, ఎవరి నుంచి తీసుకోవడం కానీ చేసేవాడు కాదు.
అయితే, కేశవరావు భార్య రంగనాయకి కేశవరావుకి వ్యతిరేకం.
ఈవిడకి అవసరం అయిన వారికి ఉన్నంతలో కొద్దిగా అయినా సహాయం చేస్తే, వచ్చే జన్మలో మంచి పుట్టుక ఉంటుంది అని అనుకుని భర్తకి కూడా అదే చెప్పేది.
"ముందు ఈ జన్మలో సుఖంగా ఉండాలి. ఉన్న డబ్బులు దానం చేస్తూ పోతుంటే, మనం కూడా చివరికి ఎవరి దగ్గరో చెయ్యి చాచాలి" అనేవాడు కేశవరావు. రంగనాయకి మాత్రం ఉదయమే లేచి, గుమ్మంలో ముగ్గు వేసి, త్వరగా స్నానం చేసి, ఒక గంట సేపు పూజా గదిలో కూర్చొని పూజ చేసుకుని, భర్త లేచేలోపు చేసిన ప్రసాదం దగ్గరలో ఉంటున్న గుడిసెల్లో వారికి పంచిపెట్టి గమ్మున ఇంటికి వచ్చేది.
ఆ రోజున త్వరగా మెలకువ రావడం, తరువాత నిద్రపట్టకపోవడంతో కేశవరావు మంచం దిగి, "పేపర్ వచ్చిందేమో" అనుకుంటూ వీధి తలుపు తీశాడు. "అరే! ఇదేమిటి? పది రూపాయల కాయిన్ ఇక్కడ పడి ఉంది! భార్యకి మరీ డబ్బు మీద జాగ్రత్త లేదు" అనుకుంటూ కాయిన్ తీసుకుని లోపలికి వచ్చి, "ఇదిగో, పది రూపాయల కాయిన్ బయట పడేశావు చూసుకోకుండా! కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని, డబ్బు జాగ్రత్తగా వాడు!" అని భార్యని కేకలేసి, కాయిన్ జేబులో వేసుకోబోతూ, "అదేమిటి? ఈ కాయిన్ మీద 2030 అని ఉంది! ఇప్పుడు ఇంకా 2026 లోనేగా ఉంది? ఏమిటో, ఏ పనిమీదా శ్రద్ధ లేదు గవర్నమెంట్ కి!" అనుకున్నాడు.
మర్నాడు ఉదయం, "ఏమండోయ్! నిన్న నన్ను తిట్టిపోశారు, మీరే మళ్ళీ పది రూపాయల కాయిన్ పడేసుకున్నారు!" అంటూ భర్త చేతికి పది రూపాయల కాయిన్ ఇచ్చింది.
"అదేమిటి! నిన్నటి పది రూపాయల కాయిన్ ఇదిగో నా దగ్గరే ఉంది! మళ్ళీ ఈ కాయిన్ ఎలా వచ్చింది గుమ్మంలోకి?" అని కాయిన్ తీసుకుని చూసి, "అరే! దీనిమీద కూడా 2030 ఉంది!" అన్నాడు కేశవరావు భార్యతో.
"ఒకసారి బజారుకెళ్లి ఈ కాయిన్ మార్చి చూడండి. దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారేమో, అందుకే 2030 కాయిన్ తయారు చేశారు అనుకుంటా" అంది రంగనాయకి.
"అసలు ఈ కాయిన్ మన గుమ్మం ముందు ఎవరు ఉంచుతున్నారు అనేది అర్థం కావడం లేదు. రేపు కూడా చూద్దాం" అన్నాడు.
"పోనీ, సీసీ కెమెరా పెట్టించకూడదా?" అంటున్న భార్యతో, "బాగానే ఉంది! పది రూపాయల కాయిన్ కోసం ఇప్పుడు రెండు వేలు పెట్టి సీసీ కెమెరా దండగ పని. ఎవరు పెడుతున్నారో పెట్టని, మనకే లాభం. లక్ష్మీ దేవి అలా వస్తున్నప్పుడు ఎందుకు కాదని అనడం?" అన్నాడు కేశవరావు.
ఇలా వారం దాటినా, రోజూ ఏదో ఒక టైంలో పది రూపాయల కాయిన్ గుమ్మం ముందు ఉండటం, దాని మీద 2030 ఉండటంతో అనుమానం వచ్చి, "ఎందుకైనా మంచిది" అని తన బ్యాంకు స్నేహితుడిని ఆడిగాడు, "ఈ 2030 కాయిన్ ఏమిటి?" అని.
"రిజర్వు బ్యాంకు ఇంకా 2024 ఇయర్ కాయిన్ రిలీజ్ చేయలేదు. ఈ 2030 కాయిన్ ఎలా వచ్చింది?" అన్నాడు. "బహుశా ఆ నంబర్ నీకు ఏదైనా చెబుతోందేమో. ఒకసారి మూడో వీధిలో ఉన్న శాస్త్రి గారిని అడిగి చూడు" అన్నాడు.
కాయిన్‌ను అన్నివిధాలా చూసిన శాస్త్రి గారు, "ఎందుకో మీ ఇంట్లో ఎవరో ఒకరు 2030 లో చనిపోతారు అని అర్థం" అన్నాడు.
"బాబోయ్! కొంపముంచారు సార్! అసలు ఈ కాయిన్ ఎలా మా గుమ్మం ముందుకి వస్తోంది?" అని అడిగాడు.
"శాస్త్రం ఇంతకంటే విపులంగా తెలియజేయదు. మనమే తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి" అన్నాడు శాస్త్రి గారు.
ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు.
"అదేమిటి?" అని, "పోనీలే, ఎవరో ఒకరు అంటే నాకంటే నాలుగు ఏళ్లు పెద్ద ఈయన, బహుశా ఆయనే" అనుకుంది మనసులో.
"చావు అనగానే, తాము బతికి ఉంటే చాలు అనుకునే రోజులు కదా?!"
యథాప్రకారం రోజూ ఒక కాయిన్ దొరుకుతోంది. కేశవరావు ఉండబట్టలేక, "కంచిలో ఎవరో గొప్ప పండితుడు జరగబోయేది చెబుతున్నాడు" అని విని, కంచి బయలుదేరి ఆ పండితుడికి విషయం చెప్పాడు.
"ముందు డేట్‌తో కాయిన్ దొరకడం, అది కూడా రోజూ మీకే దొరకడం ఏదో కీడు సూచిస్తోంది" అన్నాడు.
"స్వామి! నాకు 2050 వరకు బతకాలి అని ఉంది. ఈ కీడు నుంచి బయటపడే ఉపాయం చెప్పండి. చచ్చి మీ కడుపున పుడతాను" అన్నాడు కేశవరావు.
"ఇప్పుడే కదా నాయనా! ఇంకా బతకాలి అని ఉంది అన్నావు. ఇంతలోనే నీ నోటి నుంచి 'చచ్చి మళ్ళీ పుడతాను' అని అనడం కూడా ఆపద వస్తోంది అని అనిపిస్తోంది. అయినా నువ్వు అడిగావు కాబట్టి, శాస్త్రాలు పరిశీలన చేసి ఏదైనా ఉపాయం ఉందేమో రేపు చెప్తాను. ఒక పదివేలు అవుతుంది. నీకు ఓకే అంటే రేపు రా" అని పండితుడు లోపలికి వెళ్ళిపోయాడు.
సగం మునిగిన తరువాత, "ఇంకా ఆలోచన ఎందుకు?" అనుకుని పది వేలు తీసుకుని ఉదయమే పండితుడి ఇంటికి వెళ్ళాడు.
పది వేలు తీసుకుని, "ఆ ఒక్కటే ఉపాయం ఉంది నాయనా! నీకు దొరికే పది రూపాయల కాయిన్‌తో పాటు ఒక వెయ్యి నూట ఆరు రూపాయలు, అంటే మొత్తం వెయ్యి నూట పదహార్లు, రోజూ మీ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లి, అవసరం అయిన రోగులకు సహాయం చేయి" అన్నాడు.
"ఎన్నాళ్లు చేయాలి స్వామి? నా ఆస్తి అంతా అయ్యేదాకానా?" అన్నాడు.
"ఎప్పుడైతే కాయిన్ మీ గుమ్మం ముందు దొరకదో, అప్పటి వరకు దానం చేయక తప్పదు" అన్నాడు.
"ఇదిగో, తలుపు తీసి గుమ్మంలో పది రూపాయల కాయిన్ ఉందేమో చూడు" అని అంటున్న భర్తని చూసి, "లేవండి, తెల్లారింది! ఇంకా కలలు కంటున్నారు. పది రూపాయలు గుమ్మం ముందు ఎందుకు ఉంటుంది?" అంది ముగ్గు డబ్బా పట్టుకుని బయటకు వెళ్తూ.
"అయితే, ఇది అంతా కల అన్నమాట! అది కూడా తెల్లవారుజామున వచ్చింది అంటే, దేవుడు దానం చేసి నీ జన్మ ధన్యం చేసుకో అని చెప్పాడు" అనుకున్నాడు.
"ఇదిగో, ఈ రోజు గురువారం కదా! ఒక రెండు కేజీల పులిహోర చేయి, సాయిబాబా గుడిలో పంచిపెడదాం" అంటున్న భర్త వంక ఆశ్చర్యంగా చూసింది రంగనాయకి.
ఒక్కొక్కసారి మనం చేసే చిన్న సహాయం ఒక ప్రాణం నిలబడటానికి ఉపయోగపడవచ్చు. మీరు ఉన్నంతవరకు అనాథలని ఆదుకోండి. మానవ సేవే మాధవ సేవ.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






@saipraveenajeedigunta8361
•8 hours ago
Very creative
@t.s.sbhargavateja6196
•2 hours ago
Awesome story srinivas rao garu.