తల్లీ భార్యల్లో ఎవరి స్థానం ఎక్కడ?
- LV Jaya

- 15 minutes ago
- 4 min read

Thalli Baryallo Evari Sthanam Ekkada - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 23/11/2025
తల్లీ భార్యల్లో ఎవరి స్థానం ఎక్కడ - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 17)
రచన: L. V. జయ
'తల్లి, భార్యల్లో ఎవరి స్థానం ఎక్కడ?' అని చాలా మంది మొగవాళ్ళకి వచ్చే ప్రశ్న సమర్థ్ కి కూడా ఎదురయ్యింది. MBA చదువుకున్న సమర్థ్, ఇంజనీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కానీ, సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ, సమర్థ్ కోరుకున్నలాంటి కోడలు వస్తే, తన స్థానాన్ని ఆక్రమిస్తుందని, తన విలువ తగ్గిపోతుందని భయపడింది. డిగ్రీ చేసి, ఇంటిపట్టున ఉండి, ఇంటిపనులు చేసుకునే అమ్మాయి కోడలిగా వస్తే చాలనుకుంది.
జాగృతిని పెళ్ళిచూపుల్లో చూసిన సమర్థ్, నెమ్మదిగా, హుందాగా ఉన్న జాగృతి చాలా నచ్చి, తనని తప్ప ఇంకెవ్వరినీ చేసుకోకూడని నిర్ణయించుకున్నాడు. కానీ జాగృతి ఉద్యోగం మానేస్తేనే ఈ పెళ్ళికి ఒప్పుకుంటానని రాధ చెప్పింది. ఇంజనీరింగ్ చదివి, మంచి ఉద్యోగం చేస్తున్న జాగృతిని ఉద్యోగం మానెయ్యమని అడగడలేకపోయాడు సమర్థ్. జాగృతి ఉద్యోగం మానేస్తానందని రాధకి అబద్దం చెప్పి, రాధని ఒప్పించి, రాధ చేత జాగృతి తరపు వాళ్ళని కూడా పెళ్ళికి ఒప్పించి, జాగృతిని ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు సమర్థ్. రాధకి తన మీదున్న ప్రేమవల్ల, పెళ్ళి తరువాత జాగృతి ఉద్యోగం చేయడాన్ని రాధ ఒప్పుకుంటుందని అనుకున్నాడు సమర్థ్.
కానీ రాధ, పెళ్ళి తరువాత కూడా జాగృతి ఉద్యోగం చెయ్యడం నచ్చక, కొత్త కాపురం ఎలా ఉందో చూస్తానంటూ వచ్చింది. అప్పటివరకు ఉన్న పనిమనిషిని ఇంక రావక్కరలేదని చెప్పి, జాగృతి చేతే అన్ని పనులు చేయించింది. జాగృతి మీద సమర్థ్ చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేక, సమర్థ్ ఇంట్లోలేని సమయంలో, జాగృతికి సంబంధించిన ప్రతి విషయాన్నీ కించపరుస్తూ, నీచంగా చూస్తూ, చేసే ప్రతిపనికి వంకలు పెడుతూ, జాగృతిని బాధపెడుతూ, తను ఆనందిస్తూ, తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది. జాగృతికి అక్రమసంబంధాలు అంటగట్టి, బలవంతంగా ఉద్యోగాన్ని మాన్పించి, ఇంటిపనులకు మాత్రమే జాగృతి జీవితాన్ని పరిమితం చేసింది.
రాధ పెట్టే బాధలని, అనే మాటలని భరించలేకపోయింది జాగృతి. తనకి ఇష్టంలేకపోయినా, ఉద్యోగం మానేసానన్న విషయం సమర్థ్ కి చెప్పాలనుకుంది. కానీ జాగృతి సమర్థ్ తో మాట్లాడదామనుకున్న ప్రతీసారి రాధ అడ్డు వచ్చేది.
రాధ వచ్చినప్పటినుండి, జాగృతి మోహంలో సంతోషం చూడలేదు సమర్థ్. తల్లికి, జాగృతి అంటే పడటంలేదన్న విషయం సమర్థ్ కి అర్ధమయినా, రాధకి ఎలా నచ్చచెప్పాలో, తను చెప్పిన అబద్దాన్ని ఎలా సరిద్దుకోవాలో తెలియక, ఇష్టపడి చేసుకున్న జాగృతి బాధను చూడలేక సమర్థ్ కూడా చాలా సతమతమయ్యాడు.
**************************************************
ఒకరోజు, టీవీ లో వస్తున్న శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాని చూస్తోంది రాధ.
ద్వాపర యుగంలో, శ్రీకృష్ణుడి తల్లైన యశోద యొక్క పునర్జన్మే వకుళమాత అని తెలియటం, కృష్ణుడి వివాహాన్ని చూసే భాగ్యం అప్పుడు యశోదకు కలగకపోవడంవల్ల, కలియుగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా అవతరించినప్పుడు, స్వామివారి కల్యాణాన్ని తన చేతులమీదుగా జరగాలని వకుళమాత కోరుకోవడం, వెంకటేశ్వరస్వామి, పద్మావతి దేవిని వివాహమాడతాననడం, వకుళమాత తానే స్వయంగా ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి, అతనిని ఒప్పించి, దగ్గరుండి, శ్రీనివాసునికి, పద్మావతిదేవికి వివాహాన్ని జరిపించే సన్నివేశాలు వచ్చాయి.
ఎప్పడూ టీవీలో వచ్చే సీరియల్స్ చూస్తూ, అందులోని కోడళ్ళతో జాగృతితో పోలుస్తూ, తను అత్తగారిగా ఎన్ని కష్టాలు పడుతోందో చెప్తూ, జాగృతిని తిడుతూ, ఆనందించే రాధ, ఈ రోజు భక్తి సినిమా చూస్తోందేమిటని ఆశ్చర్యపోయింది జాగృతి. 'పోనిలే కనీసం ఈ రోజన్నా ఈవిడ తిట్టే తిట్లు తప్పుతాయి' అని మనసులో అనుకుంది.
కానీ జాగృతిని తిట్టడానికి వచ్చే ఒక్క అవకాశాన్ని వదులుకోని రాధ, "పద్మావతిదేవి అంటే లక్ష్మీదేవి. అలాంటి ఆవిడకిచ్చి కొడుకు పెళ్ళిచేయించటానికి వకుళమాత కష్టపడిందంటే అర్థముంది. కానీ, నా ఖర్మ కాకపొతే, దీనిలాంటిదాన్ని కోడలిగా తెచ్చుకోవటం కోసం, నేనూ అంతే కష్టపడాల్సివచ్చింది. అందరినీ ఒప్పించాల్సి వచ్చింది. నా కొడుకు వల్ల జరిగిందిదంతా. దీనిలో ఏం చూసాడా ఏమో? దీన్ని తప్ప ఇంకెవ్వరినీ చేసుకోనన్నాడు." అంది తలకొట్టుకుంటూ.
'భక్తి సినిమా చూస్తూ కూడా ఈవిడ నన్ను తిట్టకుండా ఉండలేదా? నన్ను ఇంకెంత దిగజారిస్తే ఈవిడ మనసు శాంతిస్తుంది!!' అనుకుంది జాగృతి అంట్లు తోముతున్న చేతితో కళ్ళు తుడుచుకుంటూ.
సమర్థ్ ఇంట్లోనే ఉన్నాడన్న విషయం మర్చిపోయి, రాధ అన్న మాటలన్నీ విన్న సమర్థ్ బాధపడ్డాడు. జాగృతిని తక్కువచెయ్యడానికి, తన స్థానం పెంచుకోవడానికి దేవుడిని కూడా రాధ వాడుకుంటోందన్న విషయం సమర్థ్ కి అర్ధమయ్యింది.
"మంచి అమ్మాయే వచ్చింది కదమ్మా. నీకు ఇష్టంలేదని, చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మానేసి, నీకు నచ్చినట్టుగా ఇంట్లోనే ఉంటూ, ఇంటిపనులకే పరిమితం అయిపొయింది కదా పాపం. ఇంకేం కావాలి నీకు?" అన్నాడు సమర్థ్.
తన మనసులోని మాటలని, మొదటిసారి సమర్థ్ నోటినుండి వింటున్నందుకు ఆనందించింది జాగృతి.
"నీకు పెళ్ళాం బెల్లం అయిపొయిందిరా. దీన్ని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతావ్. ప్రేమ ఒలకబోసేస్తున్నావ్. నన్ను మాత్రం పూర్తిగా పట్టించుకోవడం మానేశావ్." అంది రాధ కోపంగా.
"జాగృతిని నేను ఎక్కడ పట్టించుకుంటున్నానమ్మా. నువ్వు వచ్చినప్పటినుండి నీతోనే కదా ఉంటున్నాను. తనతో మాట్లాడడానికి కూడా నాకు అవకాశం దొరకడంలేదు. అంతా నీ ఇష్టప్రకారమే కదా జరుగుతోంది. ఇంకెందుకు కోపం?" అన్నాడు సమర్థ్, రాధ ఒళ్ళో తలపెట్టుకుంటూ.
సమర్థ్ ఏమైనా చెప్తాడేమోనన్న జాగృతి ఆశ నీరుకారిపోయింది.
సమర్థ్ మాటలకి, రాధ శాంతించి, మిగిలిన సినిమా చూసింది.
వెంకటేశ్వరస్వామివారు తనకు తల్లిపైనున్న ప్రేమకు, ఆమె తనకు చేసిన సేవలకు గుర్తుగా, తన మూలవిరాట్టుకు అలంకరించే భారీ దండలలో ఒకదాన్ని వకుళమాత పేరు మీదుగా 'వకుళమాల' అని పిలవాలని, అది ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ధరిస్తానని చెప్తున్న సన్నివేశం వచ్చింది. వకుళమాత, వకుళమాలగా మారి మూలవిరాట్టు మేడలో చేరింది.
"చూసావా? ఇదీ తల్లీ - కొడుకుల మధ్య బంధం అంటే. తల్లిని తన హృదయానికి దగ్గరగా ఎప్పుడూ ఉంచుకుంటానని వేంకటేశ్వరస్వామి చెప్పాడు. నన్ను కూడా నువ్వు అలానే ఉంచుకోవాలి." అంది రాధ, సమర్థ్ తల నిమురుతూ.
'తరువాత సన్నివేశమేమిటో అమ్మ మర్చిపోయినట్టుంది.' అనుకుంటూ సమర్థ్ రాధని నవ్వుతూ చూసాడు.
తరువాత సన్నివేశంలో, స్వామివారు శ్రీదేవి, భూదేవిలిద్దరికీ తన హృదయంలో స్థానాన్ని కల్పిస్తునాన్ని చెప్పి, ఇద్దరినీ దగ్గరగా తీసుకున్నారు. దానికి గుర్తుగా శ్రీదేవి, భూదేవులిద్దరూ మూలవిరాట్టు ఛాతీమీద ఇరువైపులా వెలిశారు.
'ఇదే సమయం. ఏ ముల్లుని ఆ ముల్లుతోనే తీయాలి' అనుకున్న సమర్థ్, "అమ్మా నేను కూడా స్వామివారిలాగే నిన్ను గుండెలమీదే ఉంచుకుంటానమ్మా." అన్నాడు రాధతో.
రాధ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 'చూడు నేనే గెలిచాను' అన్నట్టు జాగృతిని చూసింది.
"అలాగే శ్రీదేవి, భూదేవులను స్వామివారు గుండెల్లో పెట్టుకున్నట్టు, నేను కూడా జాగృతిని గుండెల్లో పెట్టుకుంటాను. ఈ సినిమా ద్వారా నాకు నువ్వు ఏమి నేర్పాలనుకున్నావో పూర్తిగా అర్ధమయ్యింది. థాంక్స్ అమ్మా." అన్నాడు సమర్థ్ రాధ చేతులుపట్టుకుంటూ. నిర్ఘాంతపోయింది రాధ. తను వేసిన బుట్టలో తానే పడినట్టు అయ్యింది రాధకి.
తన గురించి సమర్థ్ మనసులో ఏమనుకుంటున్నాడో తెలిసి జాగృతి సంతోషించింది. 'ఎలా అయితేనేం? అత్తగారు నన్ను ఏ రకంగా బాధలు పెడుతోంది అని నేను చెప్పలేకపోయినా, సమర్థ్ తెలుసుకున్నారు. తల్లీ, భార్యల్లో ఎవరి స్థానం ఎక్కడో చెప్పారు.' అనుకుంది.
శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా శుభం కార్డు పడింది. శ్రీ వెంకటేశ్వర మహత్యంవల్ల జాగృతి జీవితంలో శుభం మొదలయ్యింది.
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు



Comments