top of page

తరాలు - అంతరాలు


'Tharalu Antharalu' New Telugu Story


Written By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

టైంపీస్ ఆరున్నర చూపించింది మహాలక్ష్మికి.. ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది.. కళ్లు నిద్రమత్తుతో ఇంకా పూర్తిగా విచ్చుకోలేకపోతున్నా అత్తగారు గుర్తొచ్చేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా ఎక్కడికో ఎగిరిపోయింది.. అయ్యబాబోయ్ ఆవిడగారు ఏం దండకం చదువుతుందోననుకుంటూ లేచి గదినుండి బయటకు వచ్చింది..


వంటింట్లోనుండి అత్తగారి స్తోత్ర పారాయణాలు వినిపిస్తూనే ఉన్నాయి.. అవి దేవుడికి అనుకుంటే పొరపాటే..


' ఏం నిద్రలో తల్లీ మాయదారి నిద్రలు'.. బారెడు పొద్దెక్కేదాకా గది తలుపులు బిగించుకుని పడుకోవడం మా ఇంటావంటాలేదు.. మేమూ చేసాం సంసారాలు.. ఇలానా? హవ్వ ! పేరుమాత్రం మహాలక్ష్మి, అన్నీ దరిద్రపు పనులే.. మా కాలంలో ఇలాగే ఉన్నామా? అత్తగారంటే హడలి చచ్చేవాళ్లం.. ఏ ఝాము రాత్రికో నిద్రలేచి ఇల్లూ వాకిలీ ఊడ్చీ, అలికి కళ్లాపుజల్లి ముగ్గులు పెట్టాకే తెల్లవారేది.. ఇదిగో చూస్తున్నాను కదా, పొద్దెక్కేవరకు గది తలుపులు బిడాయించి పడుకోడం సంసారుల కొంపేనా ఇది.. ఇలా సాగిపోతూనే ఉంది శేషమాంబ వాక్ప్రవాహం.


తను రోజూ అత్తగారు లేవకుండానే తెల్లవారు ఝామున నాలుగు గంటలకే నిద్రలేచి ఇంటిపనులు చేసుకుంటుంది.. అసలు తను ఆలస్యంగా నిద్రలేవడానికి నిన్న రాత్రి ఈవిడేకదా కారణం.. రాత్రి రామాలయంలో ఏదో పురాణ కాలక్షేపం ఉందని వెళ్లి పదకొండుగంటలకు తిరిగి వచ్చింది.. ఆవిడ వచ్చేదాకా మెలుకువగా ఉండాలి.. ఒకసారి ఇలాగే నిద్రపట్టేసి మెలుకువ రాలేదు.. అత్తగారు దబ దబా తలుపుకొడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి హడావుడిగా తలుపుతీసేసరికి ఆవిడ తనవైపే గుడ్లురిమి చూస్తూ ' అప్పుడే మొగుడు పక్కలోకి చేరిపోయావా, పిలవగానే రాలేదంటూ తనను నిలదీసేసరికి సిగ్గుతో చితికిపోయింది..


నిన్న రాత్రీ అంతే.. అత్తగారు గుడినుండి వచ్చాకా ఆవిడకు ఫలహారం అందించి ఆవిడ తినేవరకు వేచివుండి, అన్నీ సర్దుకుని నిద్రపోయేసరికి పన్నెండు అయిపోయింది.. పొద్దుటే మెలుకువ రాలేదు.. ఒక్కరోజు ఆలస్యంగా నిద్రలేచినందుకు ఇంత రాధ్దాంతమా, ఏం ఘోరం చేసానని ఆవిడ అంత నీచంగా మాట్లాడుతోంది.


శేషమాంబకి నోటిదురుసుతనం ఎక్కువ.. దానికితోడు కొడుకు పుట్టగానే భర్త చనిపోవడం, భర్త సోదరులు ఆస్తిపంపకాలు చేయడంతో ఆవిడకు బాగానే ఆస్తి రావడంతో ఒకరకమైన అహంకారం దాష్ణీకం బాగా అలవడ్డాయి..


మహాలక్ష్మి చాలా పెద్దకుటుంబంలో పుట్టింది.. శేషమాంబకి ఒక్కడే కొడుకని కుర్రాడు బుధ్దిగా వ్యవసాయం చేసుకుంటున్నాడని విని మహాలక్ష్మికి అంతకంటే మంచి సంబంధం తేలేమని రాజారావుకిచ్చి వివాహం చేసారు.. మహాలక్ష్మి చామనచాయలో ఉన్నా మంచి కళగల ముఖం..పైగా పనీపాటా చాలా చక్కగా చేస్తుంది.. పదిమందికి వంట చాలా సునాయాసంగా చేసేస్తుంది.. ఎంతో ఓర్పుగా వినయంగా ఉంటుంది.. అంత చక్కని కోడలు వచ్చినందుకు సంతోషించడంపోయి రాచీరంపాన్న పెట్టడం ఆవిడ పైశాచిక ప్రవర్తనకు నిదర్శనం..


ఆరోజు ఉదయంనుండి జ్వరంగా ఉందని మూలుగుతూ దుప్పటి కప్పుకుని పడుకుంది శేషమాంబ.. అప్పుడప్పుడు ముక్కుతూ మూలుగుతూ మూడంకెలు వేస్తేనే ఇంట్లోవాళ్లు తనపట్ల శ్రధ్ద చూపిస్తారని దొంగ నాటకాలు ఆడడం ఆవిడ నైజం.. కాస్తంత ఒళ్లువెచ్చబడితే చాలు ఆవిడ చేసే రాధ్దాంతానికి అడ్డూ అదుపూ ఉండవు.. కోడలు చేత కాళ్లు పట్టించుకుంటుంది.. నుదుటికి అమృతాంజనం మసాజ్ చేయమంటుంది.. రాజారావు డాక్టర్ దగ్గరకు వెళ్లి మందుతెచ్చి తల్లికిచ్చాడు.. మధ్యాహ్నం అయ్యేసరికి ఉన్న కాస్త జ్వరం తగ్గిపోయింది..అయినా నీరసం నటిస్తూ పడుకునే ఉంది.. తినను తిననంటూనే మహాలక్ష్మి చేత కమ్మగా పొట్లకాయకూర, వేడి వేడి మిరియాల చారు చేయించుకుని నోటికి పుల్లగా హితవుగా ఉండాలని మాగాయి తొక్కు జాడీలోనుండి తీయించి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ధాటిగా వేయించి పచ్చడి చేయించుకుని ఒక పట్టు వేడి వేడి అన్నం లాగించేసింది..


అమ్మకు జ్వరం తగ్గింది కదా, సినిమాకు వెడదాం అంటూ రాజారావు బలనంతం చేసేసరికి ' అత్తయ్యకు బాగాలేదు కదా, ఇప్పుడా సినిమాకి' నేనురాను బాబోయ్ అనేసింది మహాలక్ష్మి. ఏం ఫరవాలేదంటూ భర్త బలవంతం చేసేసరికి తనకీ ఏమూలో భర్తతో కలసి సినిమా చూడాలనిపించి, తయారయి అత్తగారికి చెప్పేసరికి ఆవిడ ముఖం గంటుపెట్టుకుంది..


సినిమాచూసి నవ్వుకుంటూ ఇంటికొచ్చేసరికి శేషమాంబ మళ్లీ ముసుగుతన్నేసి మూలుగుతూ పడుకుంది.. 'ఏంటమ్మా బాగాలేదా ' అని కొడుకు అడిగేసరికి నేనేమైపోతే మీ కెందుకురా? నా మీద అంత ప్రేమే ఉంటే నీ భార్యను ఉంచేసి నీవొక్కడివే వెళ్లకపోయావా? అయినా ' అడ్డాలనాడు బిడ్డలు గానీ ' అని ఊరికే అన్నారా అంటూ సాగతీసింది..


అక్కడే ఉన్న మహాలక్ష్మికి భర్తతో సరదాగా సినిమా చూసానన్న ఆనందం ఎగిరిపోయింది.. ఆవిడెదురుగా భర్తతో నవ్వుతూ మాట్లాడితే ఏమిటా సాని వేషాలంటుంది.. పగలు పొరపాటున కూడా భర్త ఉన్న గదిలోకి వెళ్లకూడదు..


నాకు కోడలు వస్తే నేను ఇలా బాధ బాధపెట్టను. కన్నకూతురిలా ప్రేమగా చూసుకుంటాను.. నేను అనుభవిస్తున్న బాధలు నా కోడలు అనుభవించకూడదనుకుంటూ మనసులో గట్టిగా నిర్ణయించేసుకుంది మహాలక్ష్మి..


కొన్ని సంవత్సరాలు కాల గర్భంలో కలసిపోయాయి.


పొద్దుటే లేచి ఫిల్టర్ లో కాఫీ డికాషన్ తీసి కొడుకూ కోడలూ నిద్ర లేచి ముఖాలు కడుక్కుని బయటకు వచ్చేసరికి చిక్కగా వేడీగా కాపీ కలిపి వాళ్లకు అందించింది మహాలక్ష్మి.. కొడుకూ కోడలూ ఇద్దరూ ఉద్యోగస్తులే.. తొమ్మిదింటికల్లా టిఫిన్, వంట చేసేయాలి.. లంచ్ బాక్సులు సర్ది వాళ్లకు అందివ్వాలనుకుంటూ హడావుడి పడుతోంది.


టిఫిన్ తిన్నతరువాత ఆఫీసుకి వెళ్లేముందు మరొకసారి కాఫీ తాగుతారు ఇద్దరూ.. ఇద్దరికీ కాఫీ కలిపి కప్పుల్లో పోసి వాళ్లకు ఇవ్వాలని వాళ్ల గది దగ్గరకు వెళ్లేసరికి కొడుకు కోడలితో ' ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావు శిరీ', నిన్ను ముద్దాడాలన్న కోరిక కలుగుతోందనేసరికి, ఫొండి వేణూ మీవన్నీ చిలిపి చేష్టలే అంటూ కిల కిల నవ్వులు వినిపించేసరికి గుమ్మం ముందే నిలబడి ' అమ్మా శిరీషా, కాఫీ తీసుకోమ్మా' అంటు పిలిచింది.. ముఖం అప్రసన్నంగా పెట్టుకుని బయటకు వచ్చి కాఫీ కప్పులందుకుని లోపలకు వెళ్లింది శిరీష..గదిలో వాళ్లు అలా నవ్వుకుంటుంటే ఎంతో ముచ్చటపడి పోయింది.


మహాలక్ష్మి భర్త రాజారావు చనిపోయిన సంవత్సరానికి కొడుక్కి హైద్రాబాద్ లో ఉద్యోగం వచ్చింది.. అంతకు చాలా ఏళ్ల క్రితమే అత్త చనిపోయింది.. కూతురు భ్రమర పెళ్లి భర్త రాజారావు ఉండగానే జరిగిపోయింది.. కొడుక్కి ఉద్యోగం వచ్చాకా ఊళ్లో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఇక్కడే ఇల్లుకట్టుకుని స్తిర పడ్డారు.. వేణు నేను శిరీష అనే అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి నే పెళ్లి చేసుకుంటానంటే, కొడుకు ఇష్టపడ్డాడని సంతోషంగా వారిద్దరికీ పెళ్లిచేసింది.. ఇద్దరూ ఆఫీసులుకి వెళ్లిపోతారు కనుక ఇంటిపనంతా ఉదయాన్నే లేచి చేసుకుంటుంది.. కొడుకు కోడలూ అన్యోన్యంగా ఉంటే చూసి సంతోషపడుతుందే తప్ప కోడలిని పరుషంగా ఒక్కమాట అనదు.. నేను నా కోడలిని ఇంకా బాగాచూసుకోవాలన్న తపనే ఆవిడలో దౌత్యమవుతూ ఉంటుంది.. తనని కోడలు మెచ్చుకోవాలనీ ఆరాట పడదుకానీ, తను శిరీషకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా శిరీష అంటీముట్టనట్టు తనతో ప్రవర్తించడం, చనువుగా అభిమానంగా మాట్లాడితే అప్రసన్నంగా ముఖం పెట్టుకోవడం, తను ప్రేమగా ఏదైనా సలహా ఇచ్చినా దానికి బదులివ్వకపోవడం లాంటి చిన్న చిన్న విషయాలు మహాలక్ష్మి మనస్సుకి అప్పుడప్పుడు ములుకుల్లాగ గుచ్చుకుంటూ బాధపెడ్తాయి..


ఆరోజు ఆదివారం.. శిరీష పుట్టినరోజు.. మహాలక్ష్మి నాలుగురోజులు ముందే షాపుకెళ్లి మంచి జార్జట్ చీర కొని శిరీష ఆది జాకెట్టు ఒకటి తీసి టైలర్ చేత జాకెట్టూ, ఫాల్ కుట్టించి శిరీష స్నానం అదీ పూర్తిచేసుకున్నాక ఆచీర కోడలిచేతికందిస్తూ ఈ చీర బాగుందా తల్లీ, నీ పుట్టినరోజని కొన్నాను, కట్టుకోమంటూ ఇచ్చింది.. శిరీష ముఖం అప్రసన్నంగా చేసుకుంటూ నేను వేరే చీర కొనుక్కున్నానండీ, సాయంత్రం నా స్నేహితులకు పార్టీ ఇస్తున్నప్పుడు ఇటువంటి చీరలు కట్టుకుంటే బాగుండవు.


పార్టీకి నీవు కొనుక్కున్నది కట్టుకో తల్లీ, ఇప్పుడిది కట్టుకో అంటూ ప్రేమగా బ్రతిమాలుతున్న అత్తగారితో ' తరువాతెప్పుడో కట్టుకుంటానంటూ' నిర్లక్ష్యంగా బీరువాలోకి తోసేసింది.. మహాలక్ష్మి మనస్సు చివుక్కుమంది..


శిరీష పుట్టినరోజని బొబ్బట్లూ, పులిహోర, గుత్తివంకాయ కూర మామిడికాయపప్పు చేసి భోజనానిని రమ్మనమని పిలిచింది.. గదిలోనుండి శిరీష విస విసా బయటకు వస్తూ, ' మేము వడ్డించుకుని తింటాంలెండి కాసేపయ్యాకా' అంటూ వెళ్లిపోయింది తిరిగి బెడ్ రూమ్ లోకి..


మహాలక్ష్మి ఒక్కర్తీ భోజనం చేసి కాసేపు నడుంవాల్చింది.. కొడుకు గదిలోనుండి సన్నగా మాటలు వినపడుతున్నాయి.. ఆ మాటలు మహాలక్ష్మి చెవిని సోకుతున్నాయి. శిరీష మాటలవి. మీ అమ్మగారు ప్రతీ విషయంలో జోక్యం చేసుకోవడం నాకు నచ్చడంలేదు.. అన్నీ ఆవిడిష్టప్రకారమే ఆవిడ కాలంలో జరిగినట్లే ఇప్పుడూ జరగాలని అనుకుంటుంది.. తన చేతుల్తోనే వడ్డించాలనుకుంటుంది.. నాకు అది నచ్చదు.. నాకు పుట్టినరోజు కి ఆవిడకొన్న చీర ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? అయినా నన్ను అడక్కుండా గొప్పగా ఏదో చీర కొనేసి నన్ను కట్టేసుకోమంటే ఎలా కట్టుకుంటాను. ఇలాంటి సమస్యలొస్తాయనే వేరు కాపురం పెట్టి వెళ్లిపోదామంటే మీరు వినరు.. ఈ ఇంట్లో నాకు ప్రైవసీ లేదు..


' అబ్బా, నెమ్మదిగా మాట్లాడు శిరీ'.. నేను వేరు కాపురం పెట్టపోవడానికి కారణాలు బోలెడు ఉన్నాయి.. ఇప్పుడు మనిద్దరం ఆఫీసుకి వెడుతుంటుంటే అమ్మ ఇంటిపని, వంటపనిచేస్తూ మనకి అన్నీ అమర్చిపెడ్తోంది కదా.. నిజం చెపితే హాయిగా లేదూ? రేపు మనకి పిల్లలు పుడితే అమ్మే చూసుకుంటుంది కదా.. మనం వేరు వెళ్లిపోతే ఇవన్నీ నీకు చేసుకోవడం ఎంత కష్టం.. వింటున్నారా రాణీగారు నా ఆలోచనల వెనకాలున్న నా తెలివితేటలు..


వింటూన్న మహాలక్ష్మి గుండె వెయ్యిముక్కలైంది.. తను అత్తగారి ద్వారా అనుభవించిన కష్టాలు తన కోడలు పడకూడదని కోడలిని ఎంతో అపురూపంగా చూసుకుంటోంది.. తను పాతకాలపు అత్తగారినని శిరీష తనను గడ్డిపరక కంటే హీనంగా చేసి మాట్లాడుతుంది.. నేను ఆదర్శవంతురాలినైన అత్తనని నేను అనుకున్నా శిరీష నన్ను అలా అనుకోవడంలేదు.. ఇప్పుడు కాదు, ఎప్పటికీ నేను శిరీషకు నచ్చను.. నేను ఒక తరందాటి ముందుకెళ్లి ఆలోచించగలిగే స్తాయికి వెళ్లగలిగితేనే బహుశా శిరీషకు నచ్చుతానేమో.. కానీ అది ఈ జన్మలో జరిగేపనికాదనుకుంటూ భారంగా నిట్టూర్చింది..


మరో కొన్ని సంవత్సరాల తరువాత


వేణూ శిరీషా ఇద్దరూ సర్వీసు నుండి రిటైర్ అయిపోయారు.. మహాలక్ష్మి మనవడినీ మనవరాలిని చాలా కాలం సాకి వాళ్ల ముడ్డులూ, మూతులూ శుభ్రపరుస్తూ గొడ్డు చాకిరీ చేసి చేసి శరీరం ఇంక సహకరించలేక మంచాన పడి చేసేవాళ్లు లేక ఒక పదిసంవత్సరాల క్రితం శాశ్వతంగా ఈలోకంనుండి నిష్క్రమించింది..


వేణు కొడుక్కి ఒక రెండునెలల క్రితమే వివాహమయ్యింది.. ప్రేమ వివాహం.. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే.. తన కొలిగ్ నీతాను ఇష్టపడ్డానని ఆమెనే చేసుకుంటానంటే మనసులు కలిసి ఒకరికొకరు ఇష్టపడిన తరువాత మా అభ్యంతరం ఏముంటుందిరా గౌతమ్ అంటూ వేణూ శిరీషా ఆనందంగా వాళ్లిరువురుపెళ్లికీ అంగీకరించారు.. పెద్దది ఆడపిల్ల అవడంతో ఆ అమ్మాయి కూడా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ముంబైలో ఉంటోంది..


ఒకసారి వేణు ఏదో పనిమీద తను పుట్టిపెరిగిన ఊరుకి వెళ్లవలసి వచ్చింది.. పని పూర్తయి ఇంటికి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.. ఆరోజు ఆదివారం. ఈలోగా శిరీష వస్తూ ' చూసారా నావన్నీ పాత పధ్దతులట, నావంట బాగోదట, నా పనులు బాగోవట.. నీతా అంటోంది..


నాలుగు రోజుల క్రితం నీతా పుట్టిన రోజని, లేటెస్ట్ డిజైనర్ వేర్ లెహంగాకి ఆర్డరిచ్చి మరీ తయారు చేయించానా, తనకి నచ్చలేదంటూ, ట్రెండీగా లేదంటూ విసిరి నా ముఖాన కొట్టింది.. జీన్స్ షార్ట్ చిన్న టాప్ వేసుకుని తిరిగింది.. నేను చెప్పాను కూడా, చూడు నీతా ఇంట్లో పెద్దవాళ్లముందు ఇటువంటి డ్రెస్ లు వేసుకోవడం సబబు కాదంటే పెద్ద రాధ్దాంతమే చేసింది.. నేను ఎంతో ఇష్టంగా పలావు, పాలక్ పన్నీరు, మంచూరియా ప్రత్యేకంగా చేస్తే స్విగ్గీనుండి ఏవేవో చెత్త ఫుడ్ చాలా ఆర్డరిచ్చి తెప్పించుకుని మరీ తిన్నారిద్దరూ.. అదేమిటి నీతా, చేసినవన్నీ వృధా అయిపోతాయి కదా అంటే వాటికయిన ఖర్చు చెప్పండి ఇచ్చేస్తానంటుందా? అయినా నన్ను అడక్కుండా ఎందుకుచేసారంటూ తిరిగి నా మీదే దండయాత్ర చేసింది.. దానికి వత్తాసు గౌతమ్ కూడా నామీద విరుచుకు పడ్డాడు. ప్రతీ విషయంలోనూ తలదూరుస్తావేమిటమ్మా అంటూ నీతా ముందరే నన్ను అవమానపరిచాడు. నేను నోరుమూసుకుంటూ ఒకమూల పడి ఉండాలట.. ఇక్కడ ఉండలేమంటూ వాళ్ల ఆఫీసుకి దగ్గరగా ఫ్లాట్ తీసుకుని వెళ్లిపోయారంటూ చెప్పింది..


ఏవో చిన్న చిన్న గొడవలొచ్చినా సర్దుకు పోతాయిలే అనుకున్నాడేగానీ ఇలా ఈ పరిస్తితి వస్తుందని ఊహించనేలేదు.. పోనీలే శిరీషా, ఒకేయింట్లోవుండి అవగాహనలేక అపార్ధాలతో తగవులాడుకునే బదులు వాళ్లకు నచ్చినట్లుగా దూరంగా వెళ్లిపోవడమే మంచిది. ఎక్కడున్నా వాళ్లు సంతోషంగా ఉంటే చాలనుకుందాం అంటూ భార్యకు నచ్చచెప్పాడు.


ఎందుకో శిరీషకు అత్తగారు గుర్తొచ్చారు అప్రయత్నంగా.


అత్తగారు తనని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ తాను ఆవిడకు వీసమెత్తు గౌరవం కూడా ఇవ్వకుండా హీనంగా చూసింది. పిల్లలకు తమకు జీవితమంతా వెట్టి చాకిరీ చేసి అరిగిపోయింది. ఎంతో ప్రేమగా పుట్టిన రోజని కొత్త చీర కొని తన చేతిలో పెడితే తను కట్టుకోకుండా పనిమనిషికి ఇచ్చేసింది. ఇలా ఒకటా, రెండా, ఆఖరిరోజుల్లో కూడా ఆవిడను నిరసిస్తూనే ఉంది. ఇప్పుడు నీతా ప్రవర్తన ఒకనాటి తన ప్రవర్తనను గుర్తుచేస్తుంటే తప్పుచేసానన్న బాధ తన మనసుని దొలిచివేస్తోంది. ఇంకా చెప్పాలంటే నీతా ప్రవర్తన ముందు అప్పటి తన ప్రవర్తనే అత్తగారిపట్ల చాలా అమానుషంగా ఉంది.


భగవంతుడు మనం పెద్దవారిపట్ల దయగా ఉంటేనే మనకి సుఖ సంతోషాలను ఇస్తాడన్నది అక్షరాలా నిజం. అత్తగారు గుర్తొచ్చేసరికి శిరీష కళ్లు అశ్రుపూరితులైనాయి. క్షమించండి అత్యయ్యా అని మనసులో పదే పదే అనుకుంది.


ఒకరోజు అనుకోకుండా ఒక రెస్టారెంట్లో గౌతమ్ ఫ్రెండ్ ఆనంద్ వేణుని చూస్తూ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారంటూ అడుగుతూ, మీకు గౌతం విషయం తెలిసే ఉంటుందనేసరికి వేణు ఆశ్చర్యపోతూ ' ఏ విషయం ఆనంద్ ' అంటూ ఆత్రంగా అడిగాడు..


ఈ మధ్య మీ గౌతమ్ నీతా మధ్య ఏదో పిల్లలని కనే విషయంలో అభిప్రాయబేధాలు వచ్చాయట.. అది పెద్ద గొడవగా పరిణమిస్తే నీవు లేకపోయినా బ్రతకగలనంటూ నీతా విడిగా వెళ్లిపోయి ఉంటోదిట.. మనవాడు చాలా డీలా పడిపోయాడు.. మీరు నీతాని కన్విన్స్ చేసి ఇద్దరూ కలిసేలా చేయండి అంకుల్ అనేసరికి వేణు స్టన్ అయ్యాడు.


ఒకే ఊరులో ఉంటున్నా తనకీ విషయాలేమీ తెలియవు.. విడిగా వెళ్లిపోయినంతమాత్రాన తల్లితండ్రులతో ఇంక బంధం తెగిపోయినట్లేనా? గౌతమ్ వచ్చి నాన్నా ఇలా జరిగిందంటూ తనకి చెప్పకపోవడమేమిటి? ఎంతో బాధపడుతూ మర్నాడు గౌతమ్ ను కలిసేందుకు ఆఫీస్ కు వెడితే ఏదో ఊరు వెళ్లాలంటూ లీవ్ పెట్టాడని రిసెప్షనిస్టు చెపితే దుఖం ఆగలేదు.. ఏదో సమస్య వచ్చిందని లీవ్ పెట్టి ఎక్కడకో వెళ్లడం ఏమిటి, మేము చచ్చిపోయామనుకున్నాడా అంటూ బాధపడ్డాడు. నీతాను పిలిపించమని రిక్వెస్ట్ చేసాడు. అయిదు నిమషాలకు వచ్చింది..''ఏమిటమ్మా ఇది, నేను విన్నది నిజమేనా''?......నా మాట పూర్తికాకుండానే "అదేమిటో మీ అబ్బాయినే అడగండంటూ "రిసెప్షనిస్టువైపు చూస్తూ "ప్రతీ అడ్డమైన వాళ్లు వచ్చి పిలవమంటే పిలవడమేనా? పేరు కనుక్కోవద్దా? టైమ్ వేస్ట్ "అంటూ రుస రుస లాడుతూ అక్కడనుండి వెళ్లిపోయింది..


"అడ్డమైన వాళ్లా "? గుండెలని పిండేసిందామాట..


కావలసిన వాళ్లు వస్తే టైమ్ వేస్టా? తెగిపోయిన బంధాలకు ప్రతీకలా ఆ మాటలు?


మానవ జీవన సంబంధాల ఆంతర్యం ఇదేనా? తరాలు మారుతున్నాయి.. తర తరాలలో ఆంతర్యం చోటుచేసుకుంటోంది..


ఎందుకో తన తల్లిగుర్తొచ్చింది వేణుకి.. గౌతమ్ నీతా ప్రవర్తనలకు తానింతగా కదలిపోతున్నాడే, మరి అమ్మ?


ఒక చిన్న పరుషమైన మాటకూడా మాట్లాడకుండా ఎంతో ఓపికగా చివరవరకూ తన జీవితాన్ని తమ కోసం ధారపోసింది.. పనిమనిషిలా ఇంట్లో బండ చాకిరీ చేయించుకున్నారు. ఏనాడూ ' అమ్మా ఎలా ఉన్నావంటూ తను అడగనేలేదు'.. ఎంత స్వార్ధపరుడు? శిరీష అమ్మ మీద చాడీలు చెపుతుంటే కోప్పడడం పోయి తానూ వాటిని ప్రోత్సహిస్తూ శిరీషను వెనకేసుకు వస్తూ అమ్మను ఈసడించాడు. అమ్మను చివరకాలంలోనైనా తాను సుఖపెట్టలేదు.. అనారోగ్యంతో మంచానపడితే విసుక్కునేవారిద్దరూ చేయలేకపోతున్నామంటూ.. ఆఖరిరోజుల్లో అమ్మ మంచంలో లేవలేని స్తితిలో పడుండినప్పుడు తనతో ఏదో చెప్పాలని ఆ గాజు కళ్లల్లోని ఆరాటం అర్ధమైనా కూడా తాను నిర్లక్ష్యం చేసాడు.


మన పెద్దవారిపట్ల మనం ప్రవర్తించిన తీరుని మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. తన తల్లి పట్ల తాను ప్రవర్తించిన నిర్లక్ష్యానికి శిక్ష భగవంతుడు ఈ జన్మలోనే తమకు విధిస్తున్నాడు.


ఇప్పుడు గౌతమ్ నీతా ప్రవర్తనకు తాము తల్లడిల్లిపోతున్నట్లే అమ్మకూడా ఎంత బాధ పడి ఉంటుందో కదా!


తల్లిని తలచుకోగానే కళ్లు చెమర్చాయి.. ' అమ్మా నిన్ను కష్టపెట్టినందుకు భగవంతుడు నాకు తగిన శిక్షవిధించాడు', నన్ను క్షమించవూ అంటూ విలపించాడు మౌనంగా..

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link
Twitter Linkమనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


87 views0 comments

留言


bottom of page