top of page

తరుణీశక్తి

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #తరుణీశక్తి, #శ్రమయేవ పూజ్యతే

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 41

Tharuneesakthi - Gayathri Gari Kavithalu Part 41 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 2010/2025

తరుణీశక్తి - గాయత్రి గారి కవితలు పార్ట్ 41 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


తరుణీశక్తి

(తేటగీతి మాలిక)

***********************

ఖలుడు నరకుడు ధర్మమున్ గాల్చివేయ 

భామ సత్యతో నేతెంచి ప్రాభవముగ

పద్మనాభుడా దుష్టుని బలముఁ ద్రుంచ

సంగరంబున చెలరేగె సాధ్వి సత్య.//


పాపి నరకుని మర్దించి ప్రగతికూర్చి 

దానవాంతకిగా సత్య శక్తి చూప

జనులు తోషము నొందుచు జయము పలికి

పర్వదినమును జరిపిరి వసుధ యందు.//


శౌర్యవంతులౌ తరుణుల శక్తి ముందు 

పురుషసింహము లేపాటి పుడమి యందు? 

కలికి ధిషణను గుర్తించి గౌరవించి 

మసలుకోవలయు జనులు మమత పంచి.//


విజయమున్ దలచి జనులు విభవముమెయి

వేల దివ్వెలన్ వెలిగించ వేడ్క మించ

దివ్య దీవాళి కాంతులు దిశల నిండ

సమత నిండిన పర్వమై శాంతి నిలిపె.//


************************************


ree

















శ్రమయేవ పూజ్యతే.

(తేటగీతి మాలిక)

************************************

స్వేదబిందువుల్ చిందింది జీవనమున

శ్రామికుల్ కూడి తెత్తురు సంపదలను.

భుజబలంబుతో వారలు భువినిమోయు

దిగ్గజంబుల చందము తిరుగు చుంద్రు 

 వారి భాతికి చేయుము వందనములు.


నేడు తరుణులు సైతము నిష్ఠ కలిగి

సకల విద్యల నేర్చుచు శక్తి కొలది

బహుళ సంస్థల యందున పనులు చేసి

చాటు చుండిరి కీర్తిని జగతి లోన.


ఇష్ట మైనట్టి కార్యము లెంచుకొనుచు

తగిన నైపుణ్యమున్ బొంది సమధికముగ

శ్రమను పూజించి సల్పిన శ్రామికులకు

 విజయలక్ష్మియె వరియించి వెనుక ముందు

నడచి వచ్చుచు చూపును నవ్య పథము.


బద్ధకంబును వీడుచు బలిమి చూపి

పనిని దైవమని మదిని భావనమెయి

శ్రమను నమ్మిన వారికి జయము కలుగు

శ్రీకరంబగు భాగ్యపు సిరులు పొలయు.


సాధు సజ్జనుల్ బోధింప జ్ఞానమెపుడు

సామరస్యత పెంపొందు జనుల లోన

శాంతిసౌఖ్యముల్ నిల్చును జాతియందు

ప్రగతి బాటలో దేశము పరుగు లిడును

వైభవంబుగ సాగును భావితరము.//



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page