top of page

తెలివైన గాడిద 

#ThelivainaGadida, #తెలివైనగాడిద, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 9

Thelivaina Gadida - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 27/06/2025

తెలివైన  గాడిద - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


గోపాలపట్నం ఊళ్లో బట్టలు ఉతికే చాకలి పాపన్న దగ్గర ఒక ముసలి గాడిద ఉంది. ఊళ్లోంచి తెచ్చిన మాసిన బట్టలు మూటలు కట్టి గాడిద వీపు మీద రెండు వైపుల సర్ది పెంపుడు కోళ్లు, చిన్న పిల్లాడిని కూర్చోబెట్టి ఊరి బయట చెరువు దగ్గరి చాకిరేవుకి తోలుకెళతాడు. 


చాకిరేవు వద్ద గాడిద వీపు మీదున్న మురికి బట్టల మూటల్ని, కోళ్లని దించి గాడిదను తిండి కోసం ఊరి మీదకు వదిలేస్తాడు పాపన్న. 


దారిలో దొరికేది, బ్రాహ్మణ పెరళ్లలో అంట్లాకులు తిని కడుపు నింపుకుని సాయంత్రం చాకిరేవుకి తిరిగి వస్తే ఉతికిన బట్టల మూటలు, కోళ్లు చంటోణ్ణి కూర్చోబెట్టి చాకలిపేటకు తీసుకువస్తాడు. 


పగటి సమయంలో దారిలో తిండి కోసం తిరుగేటప్పుడు జట్కా స్టాండు వద్ద జట్కాతోలే ఫకీర్ సాయిబు గుర్రం శరీరాన్ని చేత్తో రుద్దడం చూసేది. గోనె సంచిలోని పచ్చగడ్డి మేపడం కనబడేది. ఒక్కొక్కరోజు ఆప్యాయంగా గుగ్గిళ్లు తినిపిస్తాడు. నగిషీల టాప్ జట్కాబండి నడిపేటప్పుడు గుర్రానికి మెడలో మువ్వలు, కళ్లకి గంతలు కట్టి నెత్తిమీద రంగురంగుల ఈకల తురాయితో అందంగా అలకరిస్తాడు. 


ఇదంతా చూసిన ముసలి గాడిద ఆలోచనలో పడింది. ఇంత కాలం నుంచి రోజంతా ఈ చాకలి పాపన్న దగ్గర బండచాకిరీ చేసినా ఒక్క నాడైనా ప్రేమగా పట్టెడు పచ్చగడ్డి బరికలు వేసింది లేదు. 


రాత్రిళ్లు కూడా బ్రాహ్మణవీధి ఇళ్లనుంచి తెచ్చిన పాచి అన్నం, కుడితి నా ముఖాన పోస్తాడు. అలసిన నా ఒంటిని ఒక్కనాడైనా రుద్దింది లేదు. దురదేస్తే నేనే నేలమీద పడి దొర్లుతాను. 


ఈ చాకలి పాపన్న పరమ పిసినారి. ఊరి జనాల బట్టలుతికి పండగలప్పుడు పెళ్లిళ్లప్పుడు మస్తుగా డబ్బులు సంపాదిస్తున్నా నన్ను అర్దాకలితో పస్తులు పెడుతున్నాడు. ఎలాగైనా యజమాని పాపన్నకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది మనసులో. 


సంక్రాంతి పండగ రోజులు దగ్గరైనందున ఉతికే బట్టల వత్తిడి ఎక్కువైంది పాపన్నకు. 


ఒకరోజు మురికి బట్టల మూటలతో చాకిరేవుకి వెళ్తున్న గాడిద దారిలో ఒక్కసారిగా కిందపడి కళ్లు తేలేసింది. 


వెనక నడుస్తున్న పాపన్న గాబరాపడి గాడిద నడుం మీదున్న బట్టలమూటలు పక్కన పెట్టి ముంతలోని గంజి దాని నోట్లో పోసాడు. గాడిద కళ్లు తెరిచింది కాని లేచి నిలబడలేదు. 


పాపన్న గాడిదకి ఏమైందోనని భయపడ్డాడు. మురికి బట్టల మూటల్ని తను, పెళ్లాం లచ్చి నెత్తి మీద పెట్టుకుని చాకిరేవు దగ్గర ఉంచి పరుగున కింద పడున్న గాడిద దగ్గరకు వచ్చారు. 


గాడిద అలాగే పడుంది. పాపన్న, పెళ్లాం సాయంతో మెల్లగా లేపి నిలబెట్టి నడిపించుకుని ఊళ్లోని పశువుల వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పాడు. 


పశువైద్యుడు గాడిద కళ్లు, నోట్లో పళ్లు, చెవులు, కడుపు పరిక్షించి దానికి వార్దక్యం వల్ల వంట్లో రక్తం తగ్గి నీరసించిందనీ, బలమైన తిండి పెట్టకపోతే బరువులు మోయలేక చచ్చిపోతుందనీ చెప్పాడు. 


పశువుల డాక్టరు మాటలు విన్న చాకలి పాపన్న గుండె గుభేల్ మంది. గాడిద లేకపోతే తనకి చాలా ఇబ్బందౌతుంది. దాన్ని ఎలాగైనా బతికించుకోవా లనుకున్నాడు. 


వెంటనే సంతకెళ్లి పచ్చగడ్డి మోపు కొని తెచ్చి గాడిద నోటికి అందించాడు. రాత్రప్పుడు పెళ్లాం లచ్చి చేత బియ్యం నూకల జావ వండించి గోలెంలో పోయిస్తున్నాడు. గాడిద బాగా కోలుకునే వరకూ వీపు మీద బరువులు తగ్గించి చాకిరేవుకి తోలుకెల్తున్నాడు. దార్లో అవీ ఇవీ తింటే దాని ఆరోగ్యం పాడౌతుందని చెట్టు నీడన ఉంచి ప్రత్యేకంగా అన్నం గంజి వెంట తెచ్చి పోస్తున్నాడు పాపన్న. 


తన పాచిక పారి పిసినారి పాపన్న తన బాగోగులు జాగ్రత్తగా చూస్తున్నందుకు సంతోషించింది ముసలి గాడిద. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page