'Thirina Korika' - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 23/10/2023
'తీరిన కోరిక' తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అప్పుడే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు మాధ్స్ టీచ్ చేసి మాధ్స్ అవర్ అయిపోవడంతో టీచర్స్ రూమ్ వైపు వెడుతున్న నీలిమ మొబైల్ రింగైంది. హేండ్ బేగ్ లో నుండి మొబైల్ తీసింది. శరత్ ఫోన్ చేస్తున్నాడు.
“హాయ్ నీలూ, ఈ వారం నేను అక్కడకు రావడం కుదరడం లేదు. ఎందుకంటే శనివారం ఆఫీస్ లో ఆడిటింగ్ జరుగుతోంది. నేను ఉండాలి. శనివారం శెలవు ఇమ్మంటే ఇప్పుడెలా శరత్ అన్నాడు మా మేనేజర్. అందుకనే సోమవారం నీకు ఏదో శెలవు కలసి వచ్చిందన్నావు కదా, నీవే వచ్చేయి ఇక్కడకు”.
“అయ్యో అవునా శరత్, ‘యూ డిస్ ఎపాంయింటెడ్ మి ఏ లాట్’. మా న్యూక్లియర్ పవర్ ప్లేంట్ ని చూపిద్దామని పర్మిషన్ కూడా తీసుకున్నాను. అలాగే టెంపుల్స్, వాటర్ ఫాల్స్ కూడా”.
“సరేలే నీలూ, ఏం చేయమంటావ్? రాణీ గారు అక్కడే ఉంటారు కదా, ఎప్పుడేనా చూడవచ్చు కదా! ఆడిటింగ్ అయిపోయాకా వచ్చేవారం రెండు రోజులు శెలవు పెట్టి మరీ వస్తాను సరేనా? పోనీ ఈ వారం నీవే ఇక్కడకు రాకూడదా నీలూ?”
“ఏమో మా హెచ్. ఎమ్ ఏమంటారో? లాస్ట్ వీక్ శనివారం హాఫ్ డే పర్మిషన్ అడిగితే పిల్లలకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. సిలబస్ కంప్లీట్ చేసారా? రివిజన్ మొదలైందా లాంటి బోల్డన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. స్ట్రిక్ట్ గా నిజాయతీ గా ఉన్నవారినే ఇలాగ పదే పదే అడిగి వేధిస్తాడు ఆయన. ఇంకా సిలబస్ పూర్తి చేయని వాళ్లను, ఆయన ఎదురుగా కూర్చుని అడ్డమైన కబుర్లూ చెప్పే కాకారాయుళ్లను మాత్రం ఏమీ అనడు.
అస్తమానూ పర్మిషన్ అంటే ఎలాగ నీలిమగారూ? మిమ్మల్ని చూసి మరొకరు అడుగుతారు. పైగా ఆ నీలిమా మేడమ్ కి ఇచ్చారు కదా అని నన్ను బ్లేమ్ చేస్తారంటాడు”
“అబ్బ నీలూ, ఇటువంటి మాటలు ఏ సంస్థలోనైనా ఉంటాయి. ప్రొఫెషన్ కు తగ్గట్లుగా. మరి నా విషయంలో మా మేనేజర్ అనలేదా?”
“ పర్మిషన్ కోసం ప్రయత్నిస్తాను శరత్. ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నారు. నేను రాలేక పోతే చెక్క భజన చేసుకో మరి. ఓకే బై, క్లాస్ కు టైమ్ అవుతోం”దంటూ ఫోన్ ఆఫ్ చేసింది.
నీలిమ ఒక కేపబుల్ టీచర్. సిలబస్ ను సకాలంలో పూర్తిచేయడం, క్లాస్ విద్యార్ధుల చేత రివిజన్ చేయించే విషయంలో ఎప్పుడూ ముందరే ఉంటుంది. సబ్జెక్ట్ లో ఎవరైనా వీక్ గా ఉంటే వాళ్లకు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటుంది. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నీలిమ అంటే తోటి టీచర్స్ అసూయపడ్తూ ఉంటారు. శరత్, నీలిమల పెళ్లై అయిదు సంవత్సరాలు పూర్తి అయింది.
పెళ్లికి ముందు నీలిమ హైద్రాబాద్ ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో మేధ్స్ టీచర్ గా పనిచేస్తూ ఉండేది. బి. ఎస్సీ మేధ్స్ చేసిన తరువాత బి. ఎడ్ ఉస్మానియా యూనివర్సీటీలో చేసింది. మెరిట్ స్టూడెంట్ అయిన మూలాన పేపర్ ఏడ్ లో సెంట్రల్ ఆటమిక్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ స్కూల్స్ లో సబ్జెక్ట్స్ వారీగా టీచర్స్ వేకెంన్సీస్ ఉన్నాయని, అర్హత కలిగిన అభ్యర్ధులను దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరితే అప్పటికే ఒక సంవత్సరం నుండి ఒక ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్న నీలిమ నాకు ఏమి వస్తుందిలే, అయినా చూద్దామనుకుని ఒక రాయి వేసి చూసింది.
వ్రాత పరీక్ష కు ఇంటర్వ్యూకి హెడ్ ఆఫీస్ న్యూక్లియర్ సారాభాయి భవన్, ముంబై కి రమ్మనమని అన్ని ఖర్చులు స్కూల్ యాజమాన్యం భరిస్తుందని కాల్ లెటర్ వస్తే హుర్రే అంటూ చిన్నపిల్లలా గంతులేసింది. ఉద్యోగం వచ్చినా రాకపోయినా ముంబై వెళ్లొచ్చనుకుంది. ఒక అనుభవం అనుకుంటూ బయలదేరింది. వ్రాత పరీక్షలో క్లాలిఫైడ్ అయింది. వచ్చిన నలభై ఎనిమిది అభ్యర్ధులలో ఇరవై రెండు మందిని షార్ట్ లిష్ట్ చేసారు. మరునాడు పదిగంటలకు ఇంటర్వ్యూకి రమ్మనమన్నారు. హమ్మయ్యా వ్రాత పరీక్షలో సెలక్ట్ అయ్యానుకుంది.
మరునాడు జరిగిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు వేసారు నీలిమను.
ప్రశ్న 1. మీరు టీచింగ్ ప్రొఫెషన్ నే ఎందుకు ఎన్నుకున్నారు? ఇంకా చాలా వృత్తులూ ప్రవృత్తులూ ఉన్నాయి కదా?
“హైస్కూల్ లో చదువుతున్నప్పుడు నేను మేధ్స్ లో వీక్ గా ఉండేదాన్ని. నాకు ఆల్జీబ్రా టీచ్ చేసిన మేడమ్ నాకు ఇప్పటికే స్పూర్తే. ఆవిడ నాలో ఉన్న వీక్ పాయింట్ ఏమిటో కనిపెట్టి దాని మీదే ఫోకస్ చేస్తూ ఎంతో ఆసక్తి కలిగేలా చిన్న చిన్న ఉదాహరణలతో వివరిస్తూ ఆ సబ్జెక్ట్ మీద ఎంతో అసక్తిని, అభిరుచిని కలిగించారు. సహజసిధ్దంగా మొదటి నుండీ మేధ్స్ అంటే కొంచెం భయపడే నేను ఆ టీచర్ మూలాన నాకు ఆ సబజక్ట్ అంటే ఎంతో ఇష్టత కలిగింది. అన్ని వృత్తుల కంటే నేను విద్యాబోధన వృత్తినే ఇష్టపడతాను. ఉపాధ్యాయ కొలువు అంటే నోబుల్‌ప్రొఫెషన్. ఈ పోస్టులో పొందినంత సంతృప్తి మరే వృత్తిలో లభించదని నా అభిప్రాయం. విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, నాయకుడిగా, బిజినెస్‌మ్యాన్‌గా తయారుచేసి సమాజానికి అందించే అరుదైన అవకాశం కలిగిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి”.
ప్రశ్న 2. ఒక టీచర్ గా మీలో ఏ లక్షణాలను మీ విద్యార్ధులు కోరుకుంటారు?
“సర్, ప్రతీ విద్యార్ధీ తమ టీచర్ వాళ్లకు అందుబాటులో ఐ మీన్ టు సే తమతో సన్నిహితంగా ప్రవర్తించాలని కోరు కుంటాడు. తనకు వచ్చే సందేహాలను టీచర్ ను నిర్భయంగా అడిగి తెలుసుకోవాలని చూస్తాడు. టీచర్ కఠినంగా ప్రవర్తిస్తే వాళ్లకు టీచర్ మీద సదభిప్రాయం ఉండదు. పిల్లలని భయంతో కంటే స్నేహంతో ఆకట్టుకోవాలని వాళ్లు ఆశిస్తారు. అంతేకాదు, ప్రతీ విద్యార్ధినీ సమదృష్టితో చూడాలనుకుంటారు. అందుకే నేను ఓపెన్ డోర్ పాలసీ ని ప్రతీ స్టూడెంట్ కీ అందుబాటులో ఉంచుతూ, ప్రతీ స్టూడెంట్ తోనూ రేపోర్టు పెంచుకునే మార్గంవైపు ప్రయాణిస్తాను”.
ప్రశ్న 3. మా ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ వివిధ రాష్ట్రాలలో అంటే న్యూక్లియర్ పవర్ ప్లేంట్స్ ఉన్న ప్రతీ చోట ఉన్నాయి. భవిష్యత్ లో ఏ స్కూల్ కి ట్రాన్స్ ఫర్ చేసినా వెళ్లగలరా?
వెళ్లగలనని చెప్పింది నీలిమ. కొద్ది రోజులకు నీలిమకు హైద్రాబాద్ ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ లో మేధ్స్ టీచర్ గా పోస్టింగ్ ఇచ్చారు. జాబ్ వచ్చిన రెండు సంవత్సరాలకు జె. కె. పేపర్ మిల్స్, సూరత్ లో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శరత్ చంద్ర తో వివాహమైంది. సూరత్ కు వంద కిలోమీటర్ల దూరంలో కాక్రపార్ ఆటమిక్ పవర్ స్టేషన్ సెంట్రల్ స్కూల్ కి ట్రాన్స్ ఫర్ పెట్టుకుంది.
అక్కడ వేకెన్సీ లేక ట్రాన్స్ ఫర్ కాలేదు. ఈ లోగా బాబు పుట్టాడు. వాడికి రెండేళ్లు నిండేసరికి నీలిమకు కాక్రపార్ లో ఉన్న స్కూల్ కి ట్రాన్స్ ఫర్ చేసారు. బాబుని తల్లి దగ్గర ఉంచి అక్కడ స్కూల్ లో జాయిన్ అయింది. సూరత్ సిటీ కి, నీలిమ ఉన్న స్కూల్ ప్రాంతానికి దగ్గరగా వంద కిలో మీటర్ల దూరం ఉన్న మూలాన నీలిమ స్కూల్ యాజమాన్యం ఎలాట్ చేసిన క్వార్టర్స్ లో ఉంటోంది.
శరత్ సూరత్ లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటూ వారం వారం ఇద్దరూ అటూ ఇటూ తిరుగుతున్నారు. శరత్ కూడా ఆటమిక్ ఎనర్జీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగానికి అప్లై చేసాడు. నీలిమ, వాళ్ల సంస్థ స్కూల్ లోనే పనిచేస్తున్న మూలాన శరత్ కి ఆ ప్లేంట్ లో జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. శరత్ కి నీలిమ ఉన్న చోటే ఉద్యోగం వస్తే బాబుని తెచ్చుకుని తమ దగ్గరే ఉంచుకుందామని వాళ్ల ఆలోచన. హెచ్ ఎమ్ పర్మిషన్ కి నిరాకరించాడు. నీలిమ మనస్సు గాయపడింది.
“సర్ మా వారు ఇక్కడ లేకపోయినా మా బాబు ఎక్కడో అమ్మగారింట్లో ఉంటున్నా ఏ నాడైనా నేను శెలవు తీసుకున్నానా? సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయిస్తూ ఎడ్వాన్స్డ్ గా పాఠాలు కూడా మొదలు పెట్టాను. మీరు అన్నీ గమనిస్తూ కూడా నేనేదో కేవలం టైమ్ పాస్ చేస్తూ సిలబస్ లో వెనకపడ్డానన్నట్లు మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది సర్. ప్రతీ విద్యార్ధినీ సమ దృష్టితో చూడడం టీచర్ బాధ్యత లాగే ప్రతీ టీచర్ నూ సమదృష్టితో చూడడం స్కూల్ హెడ్ గా మీ బాధ్యత. సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. ఒక్క రెండు గంటల ముందు వెళ్లిపోతానంటే పర్మిషన్ ను నిరాకరిస్తున్నారు. ఓకే సర్, నాకు పర్మిషన్ ఏమీ వద్దులెండి” అంటున్న నీలిమను ఆపి సారీ చెపుతూ పర్మిషన్ గ్రాంట్ చేసాడు.
నైన్త్ క్లాస్ మేధ్స్ అవర్ పూర్తి అవగానే తన క్వార్టర్ కి వచ్చి బేగ్ సర్దుకుని బయల్దేరడమే. క్లాస్ లో ఉండగా ఫోన్ వస్తే ఆన్సర్ చేయలేదు. క్లాస్ అయిపోయాక హడావుడిగా ఇంటికి బయలదేరింది. అప్పుడూ ఫోన్ సంగతి గుర్తు లేదు. బస్ కు టైమ్ లేదన్న హడావుడిలో క్వార్టర్ కి చేరుకుంది. బస్ ఎక్కాకా శరత్ కి బయలదేరాను అని చెప్పాలనుకుంది. హడావుడిగా నాలుగు గంటలకు బస్ స్టాండ్ చేరింది. సూరత్ సిటీకి బస్ రెడీ గా ఉంటే గబ గబా ఎక్కేసి సీట్ లో కూర్చొంది. ఒక గంటన్నర లో సూరత్ చేరుకుంటుంది.
ఈలోగా నీలిమ మొబైల్ రింగైంది. శరత్ నుండి కాల్. “ఏమిటి నీలూ, నాలుగు సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదెందుకని”?
“ఓ మై గాడ్ నాలుగు సార్లు చేసావా శరత్”?
“ఆ అవును కదా, ఇప్పుడే చూస్తున్నాను నీ మిస్డ్ కాల్స్”.
“సారీ శరత్, మొత్తానికి మా హెచ్ ఎమ్ పర్మిషన్ ఇచ్చారు. సూరత్ సిటీ బస్ ఎక్కాను, మరో పది నిమిషాలలో బయలదేరుతుందిట. నీకు సర్ ప్రైజ్ ఇద్దామని ఇంతవరకూ ఫోన్ చేసి చెప్పలేదు. మరో గంటన్నర లో నీ సన్నిధిలో ఉంటాను.
“ఓసి పిచ్చి నీలూ, తొందరగా బస్ కదలకముందే దిగిపో. నేను టాక్సీ లో బయలదేరి అరగంట అయింది. ఈ విషయం నీకు చెపుదామని ఫోన్ చేస్తే నీవు ఎత్తలేదు”.
“ఇంతకీ ఎందుకు బయలదేరి వస్తున్నానో అడగవే”?
“బాబూ కాస్త ఊపిరి పీల్చుకోనీయ్. ఏముందీ, మీ మేనేజర్ ని ఎలాగో కన్విన్స్ చేసి ఉంటావు”.
“కాదు మై డియర్, నాకు మీ పవర్ ప్లాంట్ లో సోమవారం ఇంటర్వ్యూ ఉందని రమ్మనమని మెయిల్ ఇచ్చారు. ఆడిటింగ్ ఉందని చెప్పానుగా. నా కొలీగ్ ధీరజ్ ను హెల్పె చేయమన్నాను. చేస్తానన్నాడు. మా మేనేజర్ ను ఎట్ లాస్ట్ కన్విన్స్ చేసి వెంటనే బయలదేరాను”.
“గుడ్ న్యూస్ శరత్. నీకు ఇక్కడే జాబ్ వచ్చేస్తే మనకీ కష్టాలు ఉండవు. పైగా మన బాబుని మన దగ్గరకు తెచ్చేసుకోవచ్చు కదూ”!
“నిజం నీలూ ఉద్యోగం వస్తుందనే ఆశ పడ్తున్నాను. ఐదేళ్లుగా మనం అటూ ఇటూ తిరుగుతూ కష్టపడుతున్నాం. మధ్యతరగతి జీవితాలు. నీది గవర్న్ మెంట్ జాబ్. ఉద్యోగం మానేయమని అనలేని అసహాయత. నిన్ను చాలా కష్టపెడుతున్నాను”.
“మహాశయా ఇంక ఆపుతారా అటువంటి మాటలు. మీరు ఉద్యోగం మానమన్నా నేను మానను. మన పెళ్లికి ముందు ఒప్పందం అదే కదా. నేను నా వృత్తిని ప్రేమించినంతంగా చివరకు మిమ్మల్ని కూడా ప్రేమించను”.
“మేడమ్ నీలిమా గారూ పొరపాటున అన్నాను. క్షంతవ్యుడిని. నేను మరో పదిహేను నిమిషాలలో మీ ఇంటి గుమ్మం ముందు ఉంటాను. మిగతా విషయాలన్నీ మీ సమక్షంలో.. బై అంటూ ఫోన్ పెట్టేసాడు”.
భర్త చిలిపి మాటలకు ముసి ముసిగా నవ్వుకుంది. శరత్ వస్తున్నాడన్న కబురు నీలిమ హృదయంలో ఆనందతరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Kommentare