తిరుప్పావై - ధనుర్మాసం విశిష్టత
- Sudha Vishwam Akondi

- Dec 19, 2025
- 3 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDevotionalStories, #తెలుగుభక్తికథలు, #ThiruppavaiDhanurmasamVisishtatha, #తిరుప్పావైధనుర్మాసంవిశిష్టత

Thiruppavai Dhanurmasam Visishtatha - New Telugu Story Written By Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 19/12/2025
తిరుప్పావై - ధనుర్మాసం విశిష్టత - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతమని అర్థం. తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక.
ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన వేదాల సారమైన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.
ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. దీనినే తిరుప్పావై వ్రతం అని అంటారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది.
తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠినమైన వ్రతమాచరిస్తుంది.
పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం ఈ తిరుప్పావై. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి.
గోదాదేవి విష్ణుచిత్తుడనే పేరు కలిగిన పెరియాళ్వారుకి తను స్వయంగా పెంచుతున్న పూలతోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. తన కూతురుగా పెంచాడు ఆయన. పరమ భక్తుడైన తన తండ్రి పెరియాళ్వార్ చిన్నప్పటినుంచి శ్రీరంగనాథుని గురించి చెప్పగా విని ఆ స్వామిపై స్థిరమైన భక్తిని పెంచుకుంది గోదాదేవి.
ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకోవాలని స్థిరమైన నిర్ణయం తీసుకుంది.
పెరియాళ్వార్ తన తోటలోని పుష్పాలు మాలగా చేసి, ప్రతిరోజూ రంగనాథునికి సమర్పించేవారు. అయితే ఆ దండలు ముందుగా గోదాదేవి ధరించి, తనను అద్దంలో చూసుకుని, సంతోషించి పళ్ళెంలో తిరిగి పెట్టేసేది. ఒకరోజు అది గమనించిన తండ్రి, అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు. కానీ స్వామి కలలో కనిపించి ఆండాళ్లు ధరించిన తర్వాతనే ఆ మాలలు తనకు అలంకరించుకోవడం ఇష్టమని చెప్పగా, కూతురిని ఏమీ అనకుండా ఆమె అలంకరించి చూసుకున్న తరువాతనే రంగనాథునికి తీసుకుని వెళ్లేవాడు.
గోదాదేవి భక్తితో తిరుప్పావై వ్రతం పూర్తి చేసిన తర్వాత మెచ్చిన రంగనాథుడు, పెరియాళ్వార్ కి, ఆలయ అర్చకులకు స్వప్నంలో కనిపించి గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి తీసుకుని రమ్మని, తాను ఆమెను కళ్యాణం చేసుకుంటానని చెబుతాడు. గోదాదేవిని సాలంకృత కన్యగా కన్యాదానం చేసిన తర్వాత ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, రంగనాథ స్వామిని అర్చించి, అక్కడ అందరూ చూస్తుండగానే స్వామిలో లీనమైపోయింది. ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దుల మధ్య జరిగినట్లుగా పరిశోధకులు ఆధారాల ద్వారా అంచనా వేశారు.
మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే (పాశురాలే) ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు.
తెలుగులోనూ ఈ పాశురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఉన్నారు. గొప్ప వైష్ణవ సాహిత్యమనేగాక, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన.
మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది.
తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది.
తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి, ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు.
చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి.
చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తెననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.
ధనుర్మాస వేళలో ఒక్కసారి భూమాత అవతారమైన గోదాదేవిని, ఆమె రచించిన తిరుప్పావై గురించి కొద్దిగానైనా తెలుసుకుని స్మరించుకోవడం పుణ్యప్రదం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🙏🙏🙏🙏🙏
సుధావిశ్వం

-సుధావిశ్వం




Comments