top of page
Original.png

హితము పలికిన తుమ్మెద!

#తుమ్మెదపదాలు, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #తెలుగుపుస్తకసమీక్ష, #BookReview

తుమ్మెద పదాలు మినీ కవితల కవితా సంపుటిపై సమీక్ష

Tummeda Padalu - Review By Kotthapalli Seenu

తుమ్మెద పదాలు - శ్రీ కొత్తపల్లె శీను గారి సమీక్ష

రచన: కాశీవరపు వెంకటసుబ్బయ్య 

లఘురూప కవితా కుసుమాలు తుమ్మెద పదాల పాటగాడు వెంకటసుబ్బయ్య అందరికీ సుపరిచితుడే. ప్రొద్దుటూరు సాహితీ సేద్యములో నిరంతర శ్రామికుడు. ఎన్నో కవితలను వ్రాసిన మంచి కవి. గత సంవత్సరమే 'ఎదమిటిన రాగాలు' అనే కవితా సంపుటితో మన అందరి హృదయాలకు కమ్మని కవిత్వాన్ని అందించిన కవి. ఆ రాగాలు ఇంకా మన మదిలో సవ్వడి చేస్తూనే వున్నాయి. 


కాశీవరపు వెంకటసుబ్బయ్య ఆరుద్ర గారి కూనలమ్మ పదాలను ఆదర్శంగా తీసుకున్నాడో, కోయిలమ్మ పదాలకు పరవశించాడో గానీ, ఆయన సాహితీ సేద్యం నుంచి పండించిన అపురూపమైన కవితల పంటే "తుమ్మెద పదాలు". 'తెలుసు కదా తుమ్మెద' అనే మకుటంతో సమాజంలోని చాలా విషయాలను అక్షరవిన్యాసం చేశాడు. 


కాశీవరపు వెంకటసుబ్బయ్య జీవిత నేపథ్యం చూసుకుంటే వృత్తిపరంగా వ్యవసాయం. బీడు వారిన నేలలో సైతం అద్భుతమైన పంటను పండించగల సమర్థుడు. ఆయన మనస్సు నుంచి కవిత్వం పుడితే ఆ సాహితీ సుగంధం విశ్వమంతా అల్లుకుంటుంది. ప్రస్తుతము కవి రాసిన ఈ సంపుటిలోని కవితలలో అక్షరాలు కనిపించవు, అన్నీ అనుభవాలే. ఈ కవితలు చదువుతూ ఉంటే మన జ్ఞాపకాలు మళ్లీమళ్లీ ఒక వేదిక మీదకు చేరి నృత్యం చేస్తూ మనకు దర్శనమిస్తుంటాయి. ఏ కవిత చదివినా ఏదో తెలియని జ్ఞాపకమే. ఎక్కడో చవిచూసిన అనుభవమే.


ఈ కవితా సంపుటి చదివాక లఘురూప కవిత అయినా ఇది రాయడానికి ముందు కవి కాశీవరపు వెంకటసుబ్బయ్య అనేక జీవితాలను, వివిధ దశల్లో సమాజ స్వరూపాలను, దైనందిన జీవితంలో నిత్యం తారసపడే మనస్తత్వాలను, మనిషి బలాలను, బలహీనతలను చాలా సమగ్రంగా ఆకలింపు చేసుకున్నారు అనడానికి తగిన సాక్ష్యాలు చాలా కవితల్లో కనిపిస్తాయి. కాశీవరపు వెంకటసుబ్బయ్య ఈ కవితలు రాయడానికి సాధారణ మాటలు చాలా స్వేచ్ఛగా, తన ఇష్టం వచ్చిన రీతిగా, తన మనసులో చలించిన భావాన్ని అక్షరాలుగా పేర్చాడు అనిపిస్తుంది. ఈ సంపుటిలో మొత్తం 136 కవితలు ఉన్నాయి. అందులో 15% కవితలు తెలుగు సామెతలతో నడిచాయి. మిగిలిన కవితల్లో 25% అయినా సమీక్షించాలని మీ ముందుకు వచ్చాను. తన మొదటి కవితలో -


 మాట వినదు మనసు


 ఆగమన్నా ఆగదు వయసు


 పద్యానికి చందస్సు సొగసు 


 తెలుసు కదా! తుమ్మెదా!


అంటాడు. కాల గమనం ఎంత సత్యమో, ఇది అంత సత్యం. మనసు మనిషి మాట వినదేమో కానీ, మనిషి మనసు మాట వింటే బాగుంటుంది. ఎందుకంటే మనిషి తప్పుగా ఆలోచించినా, మనసు మాత్రం మంచి చెడులు హెచ్చరిస్తూనే ఉంటుంది. మనసును అదుపులో ఉంచుకొని, ఆగని కాలంలో తరిగిపోయే వయస్సును గుర్తేరిగి, వయస్సు పెరిగే కొద్దీ మంచి పనులు చేయాలని, పద్యానికి ఛందస్సు ఎంత సొగసో, మంచి పనులు మనిషికి అంత సొగసును ఇస్తాయి అని కవి భావనలా తోస్తుంది. అసలు కవిత్వం అంటే మనిషిలోని మాలిన్యాన్ని తొలగించి మంచి మార్గాన్ని చూపించేదిగా, సాహిత్యం అంటే సమాజానికి హితం చేకూర్చేదిగా ఉండాలంటారు. ఆ బాధ్యత కవి మోయవలసిందే. కాశీవరపు వెంకటసుబ్బయ్య కూడా ఎలాంటి పదాడంబరాలు లేకుండా, అంత్యప్రాసలు పాటించాలనే నియమాన్ని పెట్టుకోకుండా, తన మనసులో పొంగిన భావాన్ని నేరుగా పాఠకులకు చేర్చాలని ఆలోచించాడు. 


 చెడు వైపు నడవకు 


 కాని పని చేయకు 


 మంచి ఎప్పుడూ కరుకు 


 తెలుసు కదా తుమ్మెదా!


అని రాస్తాడు. ఈ పదాలు ఎవరికి తెలియవు? ఈ మాటలు ఎవరు వినలేదు? కానీ కాశీవరపు వెంకటసుబ్బయ్య ఈ కవితలో చిన్నమాటలతో ఓ అద్భుత సందేశం ఇస్తున్నారు. మంచి చేయాలనుకున్నప్పుడు ఎవరూ సులభంగా ఆమోదించరు. కరుకుగా, కష్టంగానే ఉంటుంది. అయితే ఎంత కష్టమొచ్చినా మంచిని విడవద్దు, సమాజానికి, జనానికి నష్టం కలిగించే ఏ పని చేయవద్దు అని హిత బోధ చేస్తున్నారు. 


 కోపతాపాలు అనర్థదాయకం


 ప్రేమాభిమానాలు ఆనందదాయకం 


 మనిషి మనిషిలా బ్రతుకుటే స్ఫూర్తిదాయకం


 తెలుసు కదా తుమ్మెదా!. 


అనే ఈ కవితలో మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుపుతున్నాడు. మనిషి చిరునామా నేడు సమాజంలో వెతక వలసిన పరిస్థితి ఉంది. ఇతరులపై ఓర్వలేనితనంతో అనవసర కోపతాపాలు పెంచుకొని ఈర్ష్య, అసూయలతో రగులుతూ ఉన్నాడు. సాధించేది ఏమీ లేదు, అనర్థం తప్ప. మనిషి జన్మ మంచి చేయడానికే. పశువులకు లేని విచక్షణ జ్ఞానం మనిషికి ఉంది. కాబట్టి మనిషి, మనిషిగా బతకాలి అని కవి కాశీవరపు వెంకటసుబ్బయ్య గట్టిగానే చెబుతున్నాడు. ఇదే కోవలోనే


 మనిషితనం మానవత్వం 


 లేదు మానవత్వానికి మించిన మతం


 మానవత్వం లేని తత్వం అమానుషత్వం. 


 తెలుసు కదా తుమ్మెదా!


అనే పదం ద్వారా మానవత్వం లేకపోతే వాడు మనిషి అనిపించుకోడు కదా అని చెబుతూ.. మనిషి మానవత్వాన్ని పెంచుకొని, పశువుల్లా కాకుండా, మదినిండా ప్రేమ, కరుణ, జాలి నింపుకుంటే ఆ మనిషి దైవంతో సమానం అని అంటూ.. నేటి సమాజంలో అధికార ఆధిపత్యంతో, అధికార మదంతో 'మైట్ ఈజ్ రైట్' అన్న భావనతో ఇతరులను దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ఇతరుల గురించి ఏ మాత్రం ఆలోచించని వాడు మనిషి ఎలా అవుతాడు, రాక్షసుడు తప్ప? మనిషి తనకోసం తాను బతికితే మామూలు మనిషి అవుతాడు. పరుల కోసం బ్రతికితే దైవాంశ సంభూతుడవుతాడు.. అంటూ ప్రస్తుత సమాజ రీతినే ఈ కవిత ద్వారా ఎత్తిపొడుస్తున్నాడు. 


 పరుల ధనం దోచుకొను రాక్షసుడు. 


 తన సొమ్ముతోనే బతుకు మానవుడు 


 పరుల కోసమే జీవించు దైవాంసుడు 


 తెలుసు కదా తుమ్మెదా!


అంటాడు. అక్కడక్కడ ఈ కవి మహా కవులను సైతం గుర్తుకు తెచ్చాడు. 


అల్పుని మాట ఘనం 


ఉత్తముని మాట మృదువు 


గుర్తించుటే జ్ఞానం. 


తెలుసు కదా తుమ్మెదా!


అని అంటూనే ప్రజా కవి వేమన గారి.. 'అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. సజ్జనుండు పలుకు చల్లగాను. కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా! విశ్వదాభిరామ వినురవేమ. ' పద్యాన్ని గుర్తుకు తెస్తాడు. అదేవిధంగా.. 


వెనకా ముందు చూడక మీసం మేలేయకు. 


ఆపై బలం చాలక వెనుకడుగు వేయకు


అందరితో అవమానాల పాలవకు. 


తెలుసు కదా తుమ్మెదా!


అనడంలో 'అనువు గాని చోట అధికుల మనరాదు. కొంచెమై ఉండు టెల్ల కొదువగాదు. కొండ అద్దమందు కొంచమై ఉండదా! విశ్వదాభిరామ వినురవేమ' అంటూ వేమనను మన ముందు సాక్షాత్కరింప చేస్తాడు. సుమతీ శతకాన్ని కూడా వదల్లేదు. 'వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్' అన్న విధంగా -


అన్ని వైపుల నుంచి ఆలోచనలు రానీయండి


ఎవరు చెప్పినా విధిగా వినండి


ఆపైన నిజాన్ని నెగ్గు తేల్చండి


తెలుసు కదా తుమ్మెదా!


అంటాడు మరో పదంలో.. 


విజ్ఞతతో ఆలోచించటం


విచక్షణ కలిగి మసలటం


మనిషికి మాత్రమే అందిన వరం. 


తెలుసు కదా తుమ్మెదా!


విచక్షణ, విజ్ఞత అనేవి మనిషికి మాత్రమే అందిన వరం. ఈ వరాన్ని వ్యర్థంచేసుకోవద్దని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ కవి తను చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా, నిర్భయంగా చెప్తాడు. 


అసాధారణ పనులు చేయు సాహసికుడు


సాధారణ పనులు చేయు సామాన్యుడు


సామాన్య పనులు చేయనివాడు అర్భకుడు


తెలుసు కదా తుమ్మెదా!


అంటూ సోమరిని అర్భకుడు అని నిందిస్తాడు. శ్రీ శ్రీ చెప్పినట్లుగా 'కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేతకాక పొతే పాకుతూ పో.. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు' అనే కవిత గుర్తుకు రాక మానదు. 


కాలం ఎవరికోసం ఆగదు. 


కాలంతో పాటే సాగిపోవాలి


కాలం కలిసి రాలేదని ఆగిపోరాదు


తెలుసు కదా తుమ్మెదా!


అని చెప్పడంలో అనిల్ అంబానీ కైనా, రతన్ టాటా కైనా, రిక్షా కార్మికుడికైనా ఉన్నది రోజుకు 24 గంటలే. కాలం నీతో కలిసి రాలేదని ఊరకే కూర్చుంటే జీవితంలో ఎప్పటికీ ఎదగలేవు. కాలంతో నువ్వు కలవాలి. 'స్టాప్ నాట్ టిల్ యు రీచ్ ద గోల్' అనే వివేకానంద సూక్తిని గుర్తుకు తెస్తాడు ఇక్కడ. మరో కవితలో.. 


పద్యానికి, గద్యానికి


కథకి, కవితకి


కడప గడప మేటి


తెలుసు కదా తుమ్మెదా!


ప్రాంతీయ అభిమానాన్ని, పుట్టిన గడ్డపై ప్రేమను చూపించాడు కవి. 


పైకి ఎదిగితే చూడలేరు


కింద పడితే లేపలేరు


ఇదే సమాజం తీరు


తెలుసు కదా తుమ్మెదా!


అంటూ నేటి సమాజపు తీరును, మనుషులను, మనస్తత్వాలను, కలుషిత గుణాలను నిరసిస్తూ.. 


వివక్ష, ఉపేక్ష లేనిదే ఆపేక్షితం. 


అభిజాత్యత, అస్పృశ్యత ఉండనిదే కాంక్షితం


కావాలి సమసమాజం మన ఆకాంక్షితం. 


తెలుసు కదా తుమ్మెదా!


గాంధీజీ కలలను సాకారం చేయాలని సంకల్పిస్తాడు. ఇంకోచోట.. 


ఆనందం అంబరమైతే,


దుఃఖం పాతాళం. 


రెండూ మనకు దూరమే


తెలుసు కదా తుమ్మెదా!


అనే కవితలో 'ఆనందం అంబరమైతే' అనే మొదటి లైను చూడగానే మళ్లీ శ్రీశ్రీ గారు 'ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే, అనురాగపు టంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం.. ' అంటూ మనలను పలకరించినట్లుంటుంది. మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల కవికి ఎనలేని గౌరవం, భక్తి. నాగరికత మోజులో పడి మన సంస్కృతిని, సాంప్రదాయాలను విడిచి పెడుతున్న వైనం గురించి బాధతో


పంచె కట్టు, చీర కట్టు, నొసట బొట్టు


ఇంటి ముంగిట ముగ్గు


కనుమరుగవుతున్న తీరు అబ్బురం


తెలుసు కదా తుమ్మెదా!


అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. రాయలసీమ మంచికి మారుపేరు. కులమతాలకు అతీతం. కులం ఏదైనా, మతం ఏదైనా, సంస్కారవంతంగా అన్నా, వదిన, అక్క, బావ, మామ, పిన్ని, బాబాయ్ అంటూ వరసలతో బంధుత్వాన్ని కలుపుకుపోయే తత్వం. ఎందుకో క్షణికావేశం. అంతవరకు పెనవేసుకున్న బాంధవ్యం కూడా అనవసర పౌరుషముతో గొంతులు కోసుకునేంతగా మారిపోతుంది. మనుషుల మధ్య పౌరుషం అనే విలన్‌ను పారదోలాలని. 


సీమలో ఇరుపక్షాలలో ఎవరూ వైరులు కాదు


అయినా కుత్తుకలు తెగి నెత్తురు పారుతుంది


వీరికి పౌరుషమే విలన్ అని ఎప్పుడు తెలుస్తుంది?


తెలుసు కదా తుమ్మెదా!


పౌరుషమే విలన్ అని తెలుసుకోవాలని తుమ్మెద పలుకులు పలుకుతున్నాడు కవి. కవి తుమ్మెద పలుకులు అని ఎందుకు అంటున్నాడు అంటే, తుమ్మెద పుష్పాలలోని మకరందాన్ని గ్రోలినట్లే కవి కూడా మనుషులలోని మంచి భావనలనే చాటుతున్నాడు కావున. ఒక తల్లి బిడ్డను కనాలంటే నవమాసాలు మోసి, కష్టాలు ఓర్చుకొని, నొప్పులను భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది. ప్రతి జననం వెనుక ఎంతో కష్టం ఉంటుంది. రైతు నుండి ఒక పంట రావాలంటే ఆ రైతు అదును కోసం ఎంత ఎదురు చూస్తాడో, ఎండనక, వాననకా కష్టపడితేనే మంచి ఫల సాయం వస్తుంది. అలాగే ఒక కవి కూడా ఒక కవిత గాని, కథ గాని తన కలం నుండి పుట్టించాలంటే ఎంత పరితపిస్తాడు, ఎంత సమయం కేటాయిస్తాడు, తన ఆరోగ్యం, తన మేధస్సు ఎంత ఖర్చు చేస్తాడు. చిత్రకారుడు కూడా మంచి బొమ్మ గీయాలి అంటే అంతటి కష్టాన్ని నెత్తిన ఎత్తుకుంటాడని ఆలోచించి. 


రైతు సతమతమవుతాడు చాలు చక్కబడక


కవి గిలగిలా కొట్టుకుంటాడు వాక్యం సరిపడక


చిత్రకారుడు గజగజా తన్నుకుంటాడు చిత్రం రూప కట్టక


తెలుసు కదా! తుమ్మెదా!


అంటూ ప్రతి పనిలోనూ శ్రమను గుర్తించాలని భావిస్తాడు. మరో కవితలో.. 


ఒకడి ఆలి, ఒకడికి తల్లి. 


స్త్రీని గౌరవించడం నాగరికం. 


స్త్రీ రక్షణకు నిలబడే వాడిదే వీరత్వం. 


తెలుసు కదా! తుమ్మెదా!


అంటూ 'యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా' అన్న మనుస్మృతిని గుర్తుచేస్తూ స్త్రీల పట్ల తనకున్న పూజ్య భావాన్ని, అపారమైన గౌరవాన్ని తెలియజేస్తున్నాడు కవి. 


కాలు జారి కిందపడినా తిరిగి లేవచ్చు కానీ, మాట జారి ఎదుటివారి హృదయాన్ని గాయపరిస్తే తిరిగి కోలుకోవడం కష్టం. కాబట్టి మాట నియంత్రణలో ఉండాలని, సందేమిస్తూ.. 


తొందరపడి తులనాడుకు


తలనాడిన మాటేది తిరిగి రాదు


తూలిన మాట మచ్చగా మిగులుతుంది


తెలుసు కదా తుమ్మెదా!


అంటూ తుమ్మెద తీయని పలుకులను అందజేస్తున్నాడు కవి. ఈ తుమ్మెద పదాల కవితలన్నీ కవి యొక్క స్వీయ అనుభవాల ఖాతాల్లో నుంచి తొంగి చూసినవే అని చెప్పడానికి ఈ రచయితతో పరిచయం ఉన్న ప్రతి మిత్రుని మనసు సాక్షిగా నిలబడుతుంది. మనుషుల మనస్తత్వాలను, సమకాలీన సమాజాన్ని, సమాజంలో మారిన, మారుతున్న పరిస్థితులను ఒక పరిశోధకుడిలా పరిశీలించి, పరిశోధించి వాటికి తన కవితల్లో సముచిత స్థానం కల్పించిన కాశీవరపు వెంకటసుబ్బయ్య ప్రతిభను అభినందిస్తూ.. వారి సాహిత్య కలానికి విశ్రాంతినివ్వకుండా పాఠక లోకానికి మరిన్ని కవితలను, కథలను అందిస్తారని ఆశిస్తూ, ఒక చిన్న విన్నపాన్ని కూడా తెలియజేస్తున్నాను. భావి భారత పౌరులు నేటి పిల్లలే కాబట్టి ఆ పిల్లల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సూక్తులు అవసరమవుతాయి కాబట్టి ప్రతి పాఠశాల లైబ్రరీలో ఈ పుస్తకాలను ఉంచి, విద్యార్థులు ఇవి చదివే లాగున అన్ని పాఠశాలలకు ఈ పుస్తకాలను పంపిణీ చేయగలిగితే బాగుంటుంది అని కోరుకుంటూ.. శెలవు. 

 ---------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Podcast Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@HarikishanKurnool

•35 minutes ago

🎉🎉🎉నైస్

Like
bottom of page