వంశాంకురం
- Vemparala Durga Prasad

- 3 hours ago
- 7 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #Vamsamkuram, #వంశాంకురం, #TeluguCrimeStory

Vamsamkuram - New Telugu Story Written By Vemparala Durga Prasad
Published In manatelugukathalu.com On 23/01/2026
వంశాంకురం - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
అది హైదరాబాద్ లో ఒక చిన్న పిల్లల ఆసుపత్రి. పేరు విక్టరీ హాస్పిటల్. ఆధునిక సౌకర్యాలు బాగా ఉండడంతో ఎక్కువ మంది తల్లి దండ్రులు, తమ ఆడపిల్లల్ని పురుడు పోసుకోవడానికి తీసుకుని వస్తూ వుంటారు. అక్కడ నియోనాటాలజీ విభాగం చీఫ్ డాక్టర్ సురేందర్ MD.
నిన్న రాత్రి ప్రకాష్ ఆ హాస్పిటల్ లో తన భార్య సరితని, డెలివరీ కోసం జాయిన్ చేసేడు. ప్రకాష్, సరితల పెళ్లి అయ్యి, 5 సంవత్సరాలు అయింది. ఒకసారి ఆమె గర్భం దాల్చినా 3 నెలలు దాటేసరికి అబార్షన్ అయిపోయింది. దాంతో ఈసారి చాలా జాగ్రత్తగా ఆమెని చూసుకుని, రెగ్యులర్ గా ఈ హాస్పిటల్ లో చూపిస్తూ వస్తున్నాడు.
డెలివరీ సమయం దగ్గర పడిందని, ఒక రోజు ముందుగా తీసుకుని వచ్చి అడ్మిట్ చేసేడు.
అప్పుడు సమయం సాయంత్రం 4 అవుతోంది. ప్రకాష్ భార్య దగ్గర వున్నాడు. అత్తగారు సుగుణ ఇంట్లో వున్నారు. ప్రకాష్ కి మావగారు లేరు. తాను, అత్తగారే సరితని చూసుకోవాలి.
సడన్ గా సరితకు భరించలేని నొప్పులు ప్రారంభమయ్యేయి. నర్స్ ని పిలిచేడు. అత్తగారికి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా, ఆమె ఫోన్ తీయలేదు.
సరితని హుటాహుటిన లేబర్ వార్డ్ కి తీసుకుని వెళ్ళేరు. సరితకు ఆపరేషన్ తప్పదని, అన్ని ఏర్పాట్లు చేసారు. బయట ఆదుర్దాగా వెయిట్ చేస్తున్నాడు.
ఇంతలో నర్స్ హడావిడిగా వచ్చి, " డాక్టర్ గారు రమ్మన్నారు " అంది. కంగారుగా ఆమెని అనుసరించాడు.
సరిత బెడ్ మీద స్పృహ లేకుండా కనిపిస్తోంది. డాక్టర్ మాలిని మొహం ఆందోళనగా వుంది. “మీకు మగ పిల్లవాడు పుట్టేడు. అయితే పుడుతూనే కొన్నికాంప్లికేషన్స్ వచ్చేయి, ఇంక్యూబేటర్ లో పెట్టవలసి వచ్చింది."
" సరిత ఎలా వుంది?"
“ఆమె కి స్పృహ ఇంకా రాలేదు. మరో 3,4 గంటలు పట్టవచ్చు. ఆమె చాలా నీరసంగా వుంది. కొన్నికాంప్లికేషన్స్ వలన, ఆపరేషన్ లో ఇచ్చిన మత్తు దిగలేదు, కంగారు పడకండి”.
“బిడ్డని మీరు చూడవచ్చు” అని, పిల్లవాడున్న ఇంక్యూబేటర్ వైపు తీసుకుని వెళ్ళింది.
దూరం నుంచే పిల్లవాడిని చూపించారు. దేహం పరిమాణం చాలా చిన్నగా వున్న పిల్లవాడిని చూసిన ప్రకాష్ కి ఏమనాలో తోచలేదు. ఆందోళన గా అనిపించింది.
మళ్ళీ డాక్టర్ ఇలా అంది:
“ఇప్పుడు పిల్లవాడిని, కొంత పరిశీలన లో ఉంచాలి. తర్వాత, మా చీఫ్ సురేందర్ గారిని కలవండి “.
ప్రకాష్ కి పై ప్రాణం పైనే పోయినట్లు అయింది.
4 సంవత్సరాలుగా ఎదురు చూసిన సంతానం, వంశాంకురం పుట్టాడని సంతోషించాలా, పుట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడాలో అర్ధం కాలేదు.
అతని భావాల్ని చదివేసిన డాక్టర్, ” పిల్లవాడు కోలుకోవచ్చు, ముందు తల్లి ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. అది ముఖ్యం. " అంది.
"లేదు డాక్టర్, సరిత పిల్లవాడి మీద ఆశలు పెట్టుకుని బతుకుతోంది. ఇప్పుడు ఆమెకి స్పృహ వచ్చేక, ఈ విషయం తట్టుకోలేదు. లేక లేక పుట్టిన బిడ్డ. అదే నా బెంగ " అన్నాడు.
"తప్పదు, పరిస్థితులు అవి. ముందు మీరు ఈ పేపర్లు మీద సంతకం చేయండి అని , ఫార్మాలిటీస్ పూర్తి చేయించింది.
మరో గంటకి, అత్తగారు హాస్పిటల్ కి వచ్చింది. ఆవిడ కూడా పిల్లవాడిని చూడబోతే , “తల్లి, తండ్రి కి తప్ప, ఇప్పుడు పిల్లవాడు వున్న పరిస్థితి లో ఎవరినీ అనుమతి లేదనీ, చాలా జాగ్రత్తగా, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి, లేకపోతే ప్రమాదం” అన్నారు.
సరితకు ఈ విషయాలు ఎలా చెప్పాలో, ఆమె యెంత తల్లడిల్లి పోతుందో తలుచుకుంటూ ఇద్దరికీ పిచ్చెత్తినట్లు అయింది. రాత్రి కి సరితకు స్పృహ వచ్చింది.
ఆనందంగా దగ్గరకి వెళ్లిన ప్రకాష్ కి, మొదటి ప్రశ్న సంధించింది. " బిడ్డ ఏది?"
సందేహిస్తూ.. వివరాలు అన్నీ చెప్పేడు. ఆమె ఏడుస్తూ మళ్ళీ స్పృహ కోల్పోయింది.
వెంటనే డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసిన అరగంట కి కోలుకుంది.
పిల్ల వాడిని చూపించమంటుంది.
డాక్టర్ ఒప్పుకోలేదు. “ఇప్పుడు ఆమె వున్న పరిస్థితిలో..ఆమెని కదపలేము. పిల్లవాడిని కూడా కొద్దిగా తేరుకోనీయమని” చెప్పారు.
రాత్రి చీఫ్ డాక్టరు గారిని ఆయన ఛాంబర్ లో కలిసేడు. ఆయన కూడా పిల్లవాడి ఇంక్యూబేటర్ చార్జీలు, మిగిలిన వాటికోసం 2 లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడు. మళ్ళీ 2 రోజుల్లో మరో 2 లక్షలు కట్టాల్సి వస్తుంది అని చెప్పేడు.
ప్రకాష్ కి, డబ్బుకి లోటు లేదు. అదే మాట చెప్పాడు.
ప్రకాష్ కి ఆరాత్రి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు. సుగుణ గారు అతన్ని ఓదార్చింది.
***
తెల్లారింది. సరిత కి మందులు వేస్తున్నాడు. సరిత ఎప్పుడూ ఏడుస్తూనే వుంది. ఆమెకి అతనే ధైర్యం చెప్పాల్సి వస్తోంది. ఇంతలో నర్స్ చెప్పిందని, సురేందర్ గారి రూముకి వెళ్ళేడు.
" ప్రకాష్ గారు! పిల్లవాడి ఆరోగ్యం క్షీణిస్తోంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ రోజు వూళ్ళో వుండే పెద్ద స్పెషలిస్ట్ ని కూడా తెప్పిస్తున్నాము. ఆయన చూసేక ఒక నిర్ణయానికి రావచ్చు." అన్నాడు.
ప్రకాష్ కి బుర్ర తిరిగింది.
"ఏమైంది … ఇంత సడన్ గా? “ అన్నాడు.
“ఇంక్యూబేటర్ లో వున్న పిల్లలకి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. నిన్నటికి, ఇవాళ్టికి తేడా వచ్చింది. అయినా పర్వాలేదు. చూద్దాం" అన్నాడు చాలా సింపుల్ గా.
బయటకి వచ్చిన ప్రకాష్, మందులు తీసుకుని, హాస్పిటల్ ప్రాంగణంలో వున్న టీ స్టాల్ కి వెళ్ళేడు. అతనికి తల పగిలిపోతోంది.
అక్కడ కూర్చుని టీ తాగుతుంటే, ఒక పెద్దావిడ, మరొక వ్యక్తి అక్కడే టేబుల్ దగ్గర కూర్చుని వున్నారు.
ఆ పెద్దావిడ ఏడుస్తోంది. ఆ వ్యక్తి " ఏడవకమ్మా.. ఏం చేస్తాం ఆ బిడ్డ కి తల్లిని చూసే అదృష్టం లేదు" అంటున్నాడు.
ఆవిడని చూస్తే జాలి వేసింది ప్రకాష్ కి. అతన్ని, “విషయం ఏమిటి” అని అడిగేడు.
అతను ఇలా అన్నాడు: “ సార్! నా పేరు గోపి. అదిగో ఎదురుగా వుండే గవర్నమెంట్ హాస్పిటల్ లో మేల్ నర్స్ గా చేస్తున్నాను. ఈమె పేరు చంద్రమ్మ, మాకు దూరపు బంధువు. వీళ్ళ అమ్మాయికి మొన్న కొడుకు పుట్టాడు. తల్లి పురిట్లో చనిపోయింది. ఈమె అల్లుడు తాగుబోతు. ఎప్పుడు ఇంటికి వస్తాడో, తెలియదు. ఈ ముసలిది ఆ బిడ్డని సాకలేక ఏడుస్తోంది బాబు. ఏదో ఒక పెద్దింటి వాళ్లకి ఆ పసికందుని ఇచ్చి, భారం తగ్గించుకో అని చెపుతున్నాను " అన్నాడు.
“మరి తండ్రి ఊరుకుంటాడా? “ అన్నాడు ప్రకాష్ అమాయకంగా.
"ఆ తాగుబోతోడు, డబ్బులిస్తే, నోరుమూస్తాడు" అన్నాడు.
పేదరికాన్ని, వాళ్ళ బాధలని, దగ్గరగా చూడడం ప్రకాష్ కి మొదటి సారి. అతను ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని గమనించాడు. ఈ హాస్పిటల్ కాంటీన్ లో, ఇలాంటి లావాదేవీలు జరుగుతాయన్నమాట..” అనుకున్నాడు.
ప్రకాష్ కి సరిత ఆరోగ్యం మీద బెంగ గా వుంది. ఇప్పుడు తన కొడుకు దక్కక పొతే, తన భార్య బెంగతో ఆరోగ్యం పాడుచేసుకుని, తనకి దూరమయిపోతుందేమో అని భయం పట్టుకుంది. ఆ ఆలోచన ఎక్కువగా అతని మెదడు తొలిచేస్తోంది.
అప్పుడు మొదటి సారిగా అతని మదిలో ఒక ఆలోచన మెదిలింది. ఒక వేళ తనకి పుట్టిన బిడ్డ బ్రతకకపొతే, తన కొడుకు స్థానం లో ఆ తల్లి పోయిన పిల్లవాడిని తెచ్చుకోవచ్చు. తన బిడ్డ గా భార్యకి పరిచయం చేయచ్చు. ఒకవేళ తన కొడుకు బతికి బట్టకడితే, ఇద్దరు పిల్లలనుకోవచ్చు,
తప్పేముంది. ఒక పేద కుటుంబాన్ని ఉద్ధరించినట్లు కూడా అవుతుంది”.
ప్రకాష్ వెంటనే, అతనితో ఇలా అన్నాడు.. “పిల్లవాడిని ఒకసారి నాకు చూపించండి, నాకు నచ్చితే, నేను తీసుకుంటాను. "
అతని మొహం వెలిగిపోయింది…” చూసేవా, బాబుగారు నీ మనవడిని కావాలి అంటున్నారు. నీకేం బెంగ అక్కర్లేదు” అన్నాడు. ఆ పెద్దావిడ మొహం సంతోషం తో వెలిగి పోయింది.
వాళ్ళతో ఎదురుగా వున్న జనరల్ హాస్పిటల్కి వెళ్ళేడు ప్రకాష్. పేదల వార్డు కి అవతలగా ఒక చెట్టు కింద, ఒక అమ్మాయి ఎత్తుకున్న మొగ పిల్ల వాడిని తీసుకుని వచ్చింది చంద్రమ్మ.
" ఆ అమ్మాయి ఎవరు?” అన్నాడు ప్రకాష్. ”మా చుట్టాల పిల్ల బాబూ, సాయానికి తెచ్చుకున్నాము “ అన్నాడు గోపీ.
పిల్లవాడు చాలా అందంగా,ఆరోగ్యంగా వున్నాడు. పుట్టి రెండు రోజులయిందిట.
అప్పుడు డబ్బు విషయం అడిగేడు. ఇప్పుడు “పిల్లవాడిని ఇవ్వడానికి 4 లక్షలు అవుతుంది “ అని చెప్పాడు.
“అంతా?” ఆశ్చర్య పోయాడు.
“ లేదు బాబూ, ఆ పిల్లోడి తండ్రి కి 2 లక్షలు ఇవ్వాలి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటు గారికి లక్ష రూపాయలు ఇవ్వాలి. నాకు 50000 ,ఈ ముసిలిదానికి 50000 అన్నాడు. ప్రకాష్ కి ఆ సమయం లో హాస్పిటల్ వాళ్లకి ఎందుకు ఇవ్వాలి, అని తోచలేదు. అతని దృష్టి లో తన భార్య ని బతికించుకోవడం ముఖ్యం. డబ్బు గురించి ఆలోచించడం లేదు.
“సరే! ఏ విషయం, సాయంత్రం చెపుతాను” అన్నాడు.
గోపీ పక్కకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి వచ్చాడు.
ప్రకాష్ తిరిగి హాస్పిటల్ లోకి వచ్చేసాడు.
సాయంత్రం 4 గంటలకి, సురేందర్ నుండి మరల కబురు వచ్చింది.
“స్పెషలిస్ట్ డాక్టరు గారు మీ అబ్బాయిని చూసేరు. ఆయన కూడా పెద్ద ఆశాజనకంగా మాట్లాడలేదు. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం “ అన్నాడు.
అప్పటికి సరిత ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
“నేను బిడ్డని ఇప్పుడు చూడచ్చా?” అన్నాడు ప్రకాష్.
“ఇప్పుడు వీలుపడదు. రేపు పరిస్థితి బట్టి చెపుతాను " అన్నాడు సురేందర్.
ప్రకాష్ కి అగమ్య గోచరంగా వుంది. తన ఆలోచనలు సరిత తో పంచుకోలేడు. అతని దిగులు చూసి సుగుణగారు కంగారుగా అడిగింది. అప్పుడు చెప్పాడు..పేదింటి పిల్లవాడిని కొనుక్కోవడం గురించి. ఆవిడ ఒప్పుకుంది.
" అయితే, సరే అల్లుడూ.. వాళ్లకి చెప్పి, కొంత డబ్బు ఇచ్చి వుంచు. ఇక్కడ పరిస్థితి తలకిందులయితే, అమ్మాయికి తెలియకుండా, మేనేజ్ చేసి, సరితకు ఆ పిల్లవాడిని చూపిద్దాము.” అంది ఆవిడ.
ప్రకాష్, గోపీకి ఫోన్ చేసి,కాంటీన్ దగ్గరకి రమ్మన్నాడు. ముందు 2లక్షలు ఇవ్వడానికి, పిల్లవాడిని అప్పగించినప్పుడు, మిగిలిన 2లక్షలు ఇవ్వడానికి ఒప్పందం.
కాంటీన్ దగ్గరకి వచ్చేడు గోపీ. వాళ్లిద్దరూ దూరంగా ఒక చెట్టు దగ్గర గట్టు మీద కూర్చున్నారు.
గోపీ ఆశగా డబ్బుకోసం చూస్తున్నాడు. ప్రకాష్ బాగ్ లోంచి 2 లక్షలు తీసి లెక్క పెడుతున్నాడు. ఆ సమయంలో సడన్ గా వాళ్ళని పోలీసులు చుట్టుముట్టేరు. ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ తో వాళ్ళ దగ్గరికి వచ్చి, గోపీ ని కాలర్ పట్టుకున్నాడు. గోపీ సెల్ ఫోన్ లాగేసుకున్నాడు.
“మీరు కూడా మాతో స్టేషన్ కి రండి” అన్నాడు ఎస్సై.
నిర్ఘాంతపోయాడు ప్రకాష్. గోపీ మొహం లో కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు. అతన్ని కానిస్టేబుల్స్ గట్టిగా పట్టుకున్నారు.
అందరూ స్టేషన్ కి జీపులో చేరుకున్నారు. ఇన్స్పెక్టర్ రవీంద్ర దగ్గరకి తీసుకెళ్ళేరు. ఇన్స్పెక్టర్ ప్రకాష్ ని చూస్తూనే, "మీ పేరు? " అన్నాడు.
ప్రకాష్ తన వివరాలు చెప్పాడు. ఇన్స్పెక్టర్ కి ప్రకాష్ మాటల్లో నిజాయితీ, ఆందోళన అర్ధం అయింది.
ఇన్స్పెక్టర్ , సబ్ఇన్స్పెక్టర్ కేసి సైగ చేసేడు. గోపీ ని సెల్లో పెట్టేరు. అప్పుడు చూసేడు ప్రకాష్.. చంద్రమ్మ కూడా అప్పటికే స్టేషన్లో వుంది.
రవీంద్ర సైగతో, కానిస్టేబుల్స్ బయటకి వెళ్లిపోయారు.
ఇన్స్పెక్టర్ ఇప్పుడు ప్రకాష్ కేసి తిరిగి, ఇలా అన్నాడు:
“ మీరు పెద్ద రాకెట్ వలలో పడేవారు. ఆశలు ఏమి జరిగిందో మీ వైపు చెప్పండి”.
ప్రకాష్ అంత వరకు జరిగిన విషయాలు చెప్పేడు.
“ఇప్పుడు మీకు ఆశలు విషయాలు చెపుతాను వినండి ", అంటూ ఇలా చెప్పేడు ఇన్స్పెక్టర్:
“గత నెలలో విక్టరీ హాస్పిటల్ లో ఒక ఇంక్యూబేటర్ లో బిడ్డ చనిపోయాడు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక అనాధ బిడ్డ ని అమ్ముకున్నారు. మీలాగే పిల్లవాడు బతుకుతాడో లేదో అని కంగారు పడే తల్లి దండ్రులు వీళ్ళకి ఎర. అప్పుడే పుట్టిన శిశువులని అమ్ముకునే ముఠా ఇది. విక్టరీ హాస్పిటల్ లో నియో నాటాలజీ విభాగం లో రాజు అనే ఒక మేల్ నర్స్, వీళ్ళిద్దరూ, కలిసి ఒక ముఠా. రాజుని కూడా కస్టడీ లోకి తీసుకున్నాము. నిజాలు కక్కించాము మాకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన విషయాలు చెపుతాను వినండి”, అని మళ్ళీ ఇలా వివరించాడు:
“వీళ్ళు అప్పుడే పుట్టిన పిల్లల్ని దొంగిలించడమో, అవాంఛిత గర్భం ద్వారా పుట్టిన పిల్లల్ని సేకరించడంలో చేస్తూ వుంటారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లో అలాంటి దిక్కులేని పిల్లలు దొరికినప్పుడు, ఈ గోపీ మీ హాస్పిటల్ లో రాజు కి తెలుపుతాడు. తర్వాత ఈ ముసలావిడ తో రంగం లోకి దిగి, జాలి కథలు చెప్పించి, డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేస్తారు. సాధారణం గా ఇంక్యూబేటర్ లో వుండే పిల్లల తల్లిదండ్రులు చాలా ఎమోషనల్ గా, నిస్సహాయం గా వుంటారు. అలాంటి వాళ్ళని ఎన్నుకుని, కథ నడిపిస్తారు. మీలా లొంగిన వాళ్లకి అమ్మకం అవ్వగానే, ఇంక్యూబేటర్ లో వుండే బిడ్డ ఆరోగ్యం రోజు రోజుకీ ఇంకా క్షీణించేలా చేస్తారు. అక్కడ పని రాజు చూసుకుంటాడు. మీరు పూర్తిగా డబ్బు ఇచ్చిన తర్వాత మీ కొడుకు కి ఊపిరి ఆపేస్తాడు రాజు.
వీళ్ళు కటకటాలు లెక్కించేలా నేను చూసుకుంటాను. పక్కవీధి లోని నా ఫ్రెండ్, డాక్టర్ సుభాష్ గారిని ఇప్పుడు ఈ హాస్పిటల్ కి వచ్చి, మీ బిడ్డని స్పెషల్ గా చూసే ఏర్పాట్లు చేయిస్తాను. మా ఎస్పీ గారి సలహా మేరకు, తదుపరి కార్యాచరణ చూద్దాము” అన్నాడు రవీంద్ర.
ప్రకాష్ కి అదంతా ఒక విషవలయం అని అర్ధమయ్యేసరికి, వణికిపోయాడు.
వెంటనే బయలు దేరి విక్టరీ హాస్పిటల్ కి వెళ్లడం, డాక్టర్ సుభాష్ గారిని రప్పించడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం తో, డాక్టర్ సురేందర్ ఆయనని అనుమతించక తప్పలేదు.
సుభాష్ గారి సలహా మేరకు మందులు, ట్రీట్మెంట్ మార్చుతామని చెప్పారు. కానీ ప్రకాష్ పట్టు పట్టి బిడ్డని, సరితని డిశ్చార్జ్ చేయించుకుని, ఇంక్యూబేటర్ వున్న ప్రత్యేక అంబులెన్సు లో తరలించి, సుభాష్ గారి హాస్పిటల్ లో జాయిన్ చేసేసాడు.
అప్పటికే, విషయం మానేజ్మెంట్ వరకు వెళ్లడం తో రాజు ని సస్పెండ్ చేయడం జరిగింది. డాక్టర్ సురేందర్ కి హాస్పిటల్ లో అవకతవకలపై సరయిన పర్యవేక్షణ లేదని, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గోపీ ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు సస్పెండ్ చేశారు.
***
మరో 10 రోజులు గడిచేయి. హాస్పిటల్ నుండి తల్లీ బిడ్డ ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చారు. ప్రకాష్ ఆనందానికి అవధులు లేవు.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.




Comments