top of page
Writer's picturePenumaka Vasantha

వార ఫలాల వింత గోల


'Vara Falala Vintha Gola' New Telugu Story

Written By Penumaka Vasantha

'వార ఫలాల వింత గోల' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఏమండీ, కాఫీ ఇటు దక్షిణపు దిక్కులో పెట్టాను, తీసుకోండి" అంది సుజాత.

"ఎందుకే ఈమూల పెట్టమని రాశారా.. ఈవారం నీ వార రాశి ఫలంలో?" అన్నాడు సుబ్బారావు చిరాగ్గా.

"అవునండీ, ఈ వారం ఉత్తరపు దిక్కున వస్తువులు పెట్టటం కాని నన్ను ఆవైపు తిరగటం కాని చేయవద్దన్నారు నా మేష రాశిలో."

"నీ మొహం మండా, నాకు నా సింహ రాశిలో దక్షిణ దిక్కున పెట్టిన కాఫీ తాగవద్దన్నారని ఉందే! ఉత్తరపు దిక్కున పెట్టు" అన్నాడు సుబ్బారావు.

"కానీ నేను ఆ పని చేయలేను" అని సుజాత, "చేయాల్సిందే" అని సుబ్బారావు.. వాదనలలో ఉండగా గేమ్ ఆడుకుంటూ ఉన్న వాళ్ల అబ్బాయి సాయి వచ్చి "మళ్ళీ మొదలెట్టారేమి? ఖర్మరా బాబు" అనుకొంటూ వచ్చి కాఫీ కప్ ను ఉత్తరదిక్కులో పెట్టి వెళ్ళాడు, తన గేమ్ కు వీళ్ళు అంతరాయం కలిగిస్తున్నారని.

"ఏమండీ! మార్కెట్ కు వెళ్తున్నారా? వెళ్తే ఓన్లీ పసుపుపచ్చ పూలు, పసుపుపచ్చ కూరగాయలు తెండి" అంది సుజాత. "నాకు ఈ వారం ఎటూ తిరగ వద్దన్నారే! అందుకని ఈ వారం ఎక్కడకీ వెళ్లక ఇంట్లోనే ఉంటా." అన్నాడు సుబ్బారావు.

"అయ్యో! కూరలు ఎలాగండీ" అంది సుజాత.

"నీ పుత్ర రత్నం ఉన్నాడుగా.. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ నీ కొంగు పట్టుకు తిరుగుతాడుగా వాడ్ని పంపు" అన్నాడు సుబ్బారావు విసుగ్గా.

'అబ్బా! మళ్ళీ వాదనలు మొదలెట్టారు ఈ మమ్మీ, డాడి.. ఎప్పుడూ ఈ రాశి, ఆ రాశి అని ఒకటే గోల! చస్తున్నా వీళ్ళతో..' అనుకుంటూ సాయి బయటికి వచ్చి "ఏది డాడి, స్కూటర్ కీస్ ఇవ్వు.. కూరలు తెస్తాను" అన్నాడు.

"అక్కడ ఉంది తీసుకో, కాని నన్ను ఆకుపచ్చ కూరలు తినమన్నారు. నాకు అవి తీసుకురా" అన్నాడు సుబ్బారావు.

"నన్ను పసుపు పచ్చ కూరలు తినమన్నారురా.. అవి తీసుకురా నాకు" అంది సుజాత.

"పసుపురంగులో ఎండుగడ్డి ఉంటుంది, అది తీసుకురా మీ అమ్మకు, బలం కూడా..." అన్నాడు వెటకారంగా సుబ్బారావు.

"ఆకుపచ్చ రంగులో ఉండే పచ్చగడ్డి తీసుకురా మీ నాన్నకు" అంది కోపంగా సుజాత.

"అట్లాగే తెస్తాలే కానీ మీరు మళ్ళీ వాద, ప్రతివాదనలకు దిగకండి" అని తిట్టుకుంటూ మార్కెటుకు వెళ్ళాడు సాయి.

ఆరోజు అన్నం కూడా పసుపురంగులో ఉండటం చూసి "ఇదేంటి అన్నము పసుపుపచ్చగా ఉంది?" అన్నాడు సుబ్బారావు.

"అదేనండీ... అన్నీ పసుపుగా ఉన్నవి తినాలని రాశి ఫలాల్లో ఉంది. ఆరోగ్యం కూడా అని బియ్యంలో కొద్దిగా పసుపు వేశా" అని సుజాత అంటూ ఉండగానే "నాకొద్దు ఈ అన్నం! కాస్తా ఎనామిల్ ఎల్లో కలర్ పెయింట్ కూడా వేయవే, ఎప్పటికీ రంగు పోదు" అని విసుక్కుంటూ అన్నం తినకుండా వెళ్ళిపోయాడు సుబ్బారావు.

"అమ్మా, నీకు ఈ వారఫలాల పిచ్చి ఏంటమ్మా? మరీ ఎక్కువైంది." అని సాయి విసుక్కున్నాడు. "పులిహోర అన్నా చేస్తే తినేవాళ్ళం... ఈ పచ్చ అన్నం ఎలా తింటాము నీ చాదస్తం కానీ." అన్నాడు.

"నీ వృషభ రాశిలో కూడా పసుపు రంగు పదార్థాలు తినాలని ఉందిరా" అన్న సుజాతతో "నీకు నీ రాశులకు ఒక దణ్ణం. నాకు వద్దు ఈ అన్నం" అంటూ వెళ్ళాడు సాయి.

ఇదంతా వింటున్న సుబ్బారావు "ప్రాస బాగా కుదిరిందిరా, అన్నం... దణ్ణం. నాకు, నీకు హోటల్ నుండి భోజనం తీసుకురా ఈ పూటకి" అని నవ్వుతూ అన్నాడు.

ఆ నవ్వుతో జత కలిపాడు సాయి.

తండ్రీకొడుకుల నవ్వును చూస్తూ సుజాత కోపంతో రగిలిపోతూ, 'అందరూ బాగుండాలని ఇదంతా చేస్తున్నా కూడా... అర్థం చేసుకొనే వాళ్ళు లేకపోవటం నా జాతకం, నా తలరాత' అనుకొంటూ తల బాదుకుంది.

సుజాత ఆరోజు పొద్దున లేస్తూనే దేవుడ్ని చూడక, యూట్యూబ్ లో తన రాశి ఫలాలు చూస్తే, "ఈ వారం మీకు అనుకూలంగా లేదు. మీ మాట తీరే మీకు శత్రవుగా మారుతుంది. అందువల్ల అందరితో మితంగా మాట్లాడండి. మీకు కుటుంబంలో సహకారం తక్కువ. దానికి క్రుంగి పోకుండా ఈవేళ కాస్త పగటి పూట నిమ్మకాయ బద్ద చప్పరించండి..." అని ఉంది.

'అమ్మో! ఇవాళ ఈయన, విసుక్కున్నా సైలెంట్ గా ఉండాలి' అనుకుంది. అనుకొని ఆయనకు ఆకుపచ్చ కూరలు, తనకు పసుపుపచ్చ కూరలు, పిల్లాడికి ఎరుపు రంగుతో ఉన్న కూరలు చేసింది.

సుబ్బారావు బయట కుర్చీలో కూర్చుని తన రాశి ఫలాలు చూసుకున్నాడు. "ఈ వారం పనులు ఏవన్నా ఉన్నా వాయిదా వేసుకుంటే మంచిది. మీకు కాలం కలిసిరావటం లేదు. అందువల్ల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. వీలైతే ఉప్పు ఉసిరికాయను, నోట్లో వేసుకొని మింగండి" అని ఉంది అందులో.

'అమ్మో! ఈవారం ఎటువంటి లావాదేవీలు చేయను. లాభమున్నా సరే ఏ ఇల్లు కొనను, అమ్మను’ అనుకున్నాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే సుబ్బారావు.

ఇంతలో సుజాత వచ్చి అటుతిరిగి నిలుచుని,

"మీకు ఇష్టమైన ఆకుపచ్చ కూరలు వండాను. అన్నానికి రండి" అంది.

"ఇటు తిరిగి మాట్లాడకుండా అటుతిరిగి మాట్లాడుతున్నావు. మొగుడి మొహంలోకి చూడవద్దన్నారా నీ రాశిఫలంలో? బొత్తిగా నేనంటే లెక్కలేకుండా పోయింది" అన్నాడు సుబ్బారావు వెటకారంగా.

"అదేం కాదండీ. ఎదురుగా చూసి మాట్లాడకండి అన్నారు. అదీకాక ఈ వారం మన ఇద్దరి వారఫలాల్లో ఆచితూచి మాట్లాడుకోవాలని ఉంటే అందుకే ఇటు తిరిగా, గొడవలు అవ్వకుండా..." అంది సుజాత.

"ఓసీ! పిచ్చి మొహమా, నా ఎదురుగా మాట్లాడవచ్చు కానీ నా మాటకు ఎదురు చెప్పకూడదు అని దాని అర్థం. అయినా నీకే అంత ఉంటే, నేనేమీ తక్కువ కాను. నేను మగవాడిని" అంటూ ఇటు తిరిగి కూర్చున్నాడు సుబ్బారావు.

అపుడే బయట నుండి వచ్చిన సాయి, "ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎట్లా? కాస్తా అటూ ఇటూ కూడా చూడండి. పిల్లి లోపలకి పోయి పాలు తాగుతోంది మీ జాతకాల పిచ్చి తగలెయ్య! అమ్మా, నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు" అన్నాడు సాయి.

"మా నాన్నే ఆకలేస్తుందా? పద అన్నానికి రండి మీరు కూడా. తిని తిడుదురు గానీ" అంటూ లోపలకి వెళ్ళింది సుజాత.

ఒకరోజు సిటీ లో పని ఉందని, సుబ్బారావు బాబాయ్ అప్పారావు, వీళ్ళింటికి వచ్చాడు. ఆయనకు కాస్త జ్యోతిష్యంలో ప్రవేశం ఉంది. మాటల్లో జ్యోతిష్యం గురించి చెపుతూ సుబ్బారావు సుజాతల, సందేహాలు తీర్చాడు.

"జ్యోతిష్యాన్ని నమ్మవచ్చు కానీ, మరీ మీ ఇద్దరిలాగా గుడ్డిగా కాదు. మీ జాతకంలో ఏవన్నా దోషాలుంటే... ఏవో పూజలు, అవీ చేసి జరగబోయే ప్రమాదాలను తప్పించుకోవచ్చు. మీరు చదివే రాశిఫలాల్లో మీరు ఒక్కరే కాదుగా, మీలాగే ఎంతో మంది సింహ, మేష రాశి వాళ్ళు కోట్లల్లో ఉంటారు. అయినా మీరు పుట్టిన జన్మ లగ్నం బట్టి కూడా చూసుకోవాలి మీ రాశిఫలాలను.

ఏదీ, మీ ఇద్దరి పుట్టిన తేదీలు ఇవ్వండి. ఆ... ఇద్దరికీ బావుంది. సుబ్బారావు, ఇపుడు నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ బావుంటుందిరా. ఏవీ వాయిదా వేయకుండా బిజినెస్ చేయి" అన్నాడు అప్పారావు.

"ఎక్కడా, ఈవారం బాగా లేదని ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నా బుర్ర తింటున్నారు మామయ్య గారూ" అంది సుజాత భలే ఛాన్స్ దొరికిందని సంబరపడుతూ.

"అసలు దీని వల్లే నాకు ఈ శని పట్టింది. ఆకుపచ్చ కూరలు చేయవే అంటే చేయదు. అందుకే ఇలా తగలడింది నా బ్రతుకు బాబాయ్" అన్నాడు సుబ్బారావు.

"చూసారా మామయ్యా! పెళ్ళి అయిన దగ్గరనుండీ అన్నీ చేసి పెడుతున్నా కదా... ఒక్క పూటేగా చేయనిది? అదీ, ఆ వారఫలంలో ఆ పూట అవి తినకూడదు అని రాశారు కాబట్టి" అంటూ కళ్ల నీళ్ళను కొంగుతో తుడుచుకొంది సుజాత.

"అమ్మాయి.. ఏడవకు! అసలు ఈ పసుపు, ఆకుపచ్చ రంగులు కాదు, ఎంతో కష్టపడి వంట వండుతుందిరా సుజాత! వాడు ఆకుపచ్చ కూరలు వండమంటే వంటికి మంచిదని అనుకోమ్మా. అపుడు ఇద్దరికీ గొడవలు రావు" అని ఇద్దర్ని మందలించాడు అప్పారావు.

"పెళ్లి మంత్రాలలో ఉన్న అర్థం తెలుసుకొని, ఒకరి మీద ఒకరు నమ్మకం, ప్రేమ, భరోసాతో ఉంటే అపుడు లేవగానే ఇద్దరు జా తకఫలాలు చూసుకొనే బాధ ఉండదు. ఏదో తిథి, వారం, వర్జ్యం అంటారా... అది పంచాంగం చూసి తెల్సుకోండి. అంతేకానీ, వారఫలాలు చదువుకుని ఆ వారమంతా ఏమౌతుందోననే భయంతో బతకకూడదు.

బిల్గేట్స్, అంబానీలు జాతకాలు చూసుకునే ఇంత వాళ్ళు అయ్యారా? వాళ్ళు కృషిని, శ్రమని, నమ్ముకున్నారు, పైకి వచ్చారు. వాళ్ళు మీలా ఎరుపు, పులుపు, వారఫలం, అనుకుంటే మనలాగే ఉండేవారు. జ్యోతిష్యం మూఢనమ్మకం కాకూడదు. ముందు మిమ్ములను మీరు నమ్ముకోండి. ఈ వారం బాగాలేదని పనులు మానేయకండి." అని గీతోపదేశం చేశాడు అప్పారావు.

"బాగా చెప్పావు తాతయ్యా! వీళ్ల ఇద్దరి జాతకాల పిచ్చితో చంపుతున్నారు. ఆయన దగ్గరకి వెళ్తే సింహరాశి వారు అని యూట్యూబ్ లో అందరూ జ్యోతిష్యులు చెప్పేవి చూస్తూ ఉంటాడు. ఇటు అమ్మ కూడా అదే మాదిరిగా మేషరాశివి చూస్తూ ఉంటుంది" అన్నాడు సాయి.

"పోనీ లేరా, యూట్యూబ్ వాళ్ళు బాగుపడుతున్నారు ఇలాంటి వాళ్ల వల్ల. నేను చెప్పడం చెప్పాను. మీ అమ్మ, నాన్న ఇకనైనా మారితే బాగుపడతారు. మారకపోతే వాళ్ల ఖర్మ అనుకోవటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. నువ్వు ఈ వీడియో గేమ్స్ మాని శ్రద్ధగా చదువుకో. నువ్వు ఈ జాతకాలను నమ్ముకోక నీ కృషిని నమ్ముకో" అంటూ సాయి భుజం తట్టి ఊరికి బయలుదేరాడు అప్పారావు.

"అలాగే తాతయ్యా!" అని తల ఊపాడు సాయి.

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు





38 views0 comments

Comments


bottom of page