వస్తున్నా.. వస్తున్నా.. నీకోసమే.. వస్తున్నా
- Dr. Brinda M. N.
- 6 days ago
- 3 min read
#నోమోఫోబియా, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguSpecialArticle

Vasthunna Vasthunna Nee Kosame Vasthunna - Telugu Special Article | Dr. Brinda M N
వస్తున్నా.. వస్తున్నా.. నీకోసమే.. వస్తున్నా - మితి మీరిన మొబైల్ వినియోగం - ప్రత్యేక వ్యాసం | డాక్టర్ బృంద ఎం. ఎన్.
Published In manatelugukathalu.com On 16/03/2026
ఎచట నుండి వీచెనో ఈ చల్లని గాలి! ఆ... హా... హా! ఎంత మృదు మధురంగా, వీనులవిందుగా, కంటికి కమ్మగా, ప్రకృతిలో పులకరించి, మనసు మురిపించి, వయసు ద్రవిస్తూ ఉంటే, శారీరక, మానసిక ఆనందంతో గాఢ నిద్రలోకి జారుకుంటుంది జగం. సుప్రభాత వేళ కోవెలలో అడుగిడిన పాదానికి "ఓం నమో వెంకటేశాయ", "ఓం నమశ్శివాయ" అనే దుందుభి కర్ణభేరికి తాకగా, ఆధ్యాత్మికత వెల్లివిరియకుండా ఉండగలదా?
హైందవ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమై మెరిసినది భారతదేశం. నేడు వాణీ మరచిన చరవాణి సందేశాలతో చమక్కు చమక్కు మంటుంది. ఆ చమక్కుల చీడ పురుగు యువతలో చెదలు పుట్టి, చెమటలు పట్టి, చావు కేకకు ఆహ్వానం పలుకుతూ ఉంది.
మన దేశంలో ఏ ఇంట్లోనైనా పసిపాపలకు పాత పద్ధతిలో అన్నం పెడుతున్నారా? అంటే మచ్చుకైనా కానరారే. "చందమామ రావే జాబిల్లి రావే" క్రొత్త బాణీని సంతరించుకుంది: "చరవాణి రావే చక్కగా కూర్చోవే."
ఒకప్పుడు ట్రింగ్ ట్రింగ్ అని ఎవరి ఇంట అన్నా ఫోన్ మ్రోగిందంటే, కచ్చితంగా శుభవార్త లేక దుర్వార్త అయ్యుంటుందని ఓ లెక్క ఉండేది. మరి నేడు నిమిషానికి కోట్ల ఫోన్లు గావుకేక పెడుతున్నాయి. శరీరంలో ఏ అవయవం ఎటు పోతుందో తెలుసుకోలేకపోతున్నారు నేటి యువత. 75% ఛార్జింగ్ ఉన్నా, 100% కోసం బ్యాటరీ ఫుల్ చేస్తున్నారు. ఈ సెల్ పై ఉన్న ధ్యాస కాయంలో కణాలపై కనబడలేదా? తల్లిదండ్రులకి సెల్ వాడుకలో మినహాయింపులు లేని ఈ రోజుల్లో పిల్లలకు మార్గదర్శకత్వాన్ని ఎలా చూపుతారు?
వాట్సాప్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్... ఇన్ని ఉండేలోగా ఏది వాడాలో తెలియక అన్ని వాడేస్తూ ఉన్నారు. ఉన్న నల్ల రంగు రింగుల జుట్టుని తెల్లని పీకల జుట్టులా చేసుకుంటున్నారు. మరి దీని పర్యావసానమే "వస్తున్నా... వస్తున్నా... నీకోసమే... వస్తున్నా... నిన్నే వెతుక్కుంటూ... వస్తున్న" అన్న అతిపెద్ద మానసిక వ్యాధి 'నోమో ఫోబియా'. నోము నోచుకోవడానికి భయం కాబోలు అనుకునేరు సుమీ! చరవాణిలో నెట్‌వర్క్ లేకపోయినా, స్పందన లేకపోయినా, తన వద్ద లేకపోయినా, తనతో ముచ్చటించకపోయినా కలిగే ఆందోళన, భయం, చింతనే 'నోమోఫోబియా' అంటారు. కట్ చేస్తే... నో మొబైల్ ఫోన్ ఫోబియా అన్నమాట. కాదు... కాదు ఉన్న మాటేనండోయ్!
యువతలో 13 నుండి 17 సంవత్సరాల వారిలో ఒంటరితనం, హార్మోన్ల ప్రభావం, ర్యాంకుల గొడవ, పెద్దల చివాట్లు, స్నేహితుల దుష్ప్రభావాలు, ఎదుటివారితో పోల్చుట కారణాలైతే, 18 నుండి 25 సంవత్సరాల వారిలో కూడా ఈ పోలికలతో పాటుగా ఉద్యోగ వేట, ఉద్యోగ భద్రత, ప్రేమ, పెళ్లి వైఫల్యాలు, ఏదో సాధించాలనే తపన, సాధించలేకపోతున్నామనే వేదన, కుటుంబ పోషణ, సౌందర్య లోపాలు, ఆకస్మిక ప్రమాదాలు... ఇన్ని కారణాల వలన యువత చరవాణితోనే కాపురం చేస్తున్నారు.
భారతదేశంలో 59.56% యువత ఇందులో మగ్గిపోతున్నారు. మగవారిలో చూస్తే 54.7%, ఆడవారిలో 45.6% శాతం ఉన్నారు. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఉండడం వలన అర్ధరాత్రి అవుతున్నా అడిగేవారు లేక చరవాణిలో పడి చతికిల పడుతున్నారు. స్క్రీన్ నుండి వెలువడిన నీలి కాంతి కళ్ళపై పడడం వలన నిద్రలేమి, కళ్ళ మంటలు, చూపు తగ్గడం, కళ్ళు ఎర్రబారడం, పొడి వారడం, కళ్ళ క్రింద నల్లటి వలయాలు... ఒకటేమిటి! చిన్నచిన్నగా మెల్లగా శరీరం అంతటా ప్రవహిస్తుంది తరంగాల రూపంలో. మన శరీరంలో జరగాల్సిన వివిధ జీవ వ్యవస్థల ప్రక్రియలన్నీ గతి తప్పుతున్నాయి. జీవ గడియారం గంట కొట్టడం కూడా మానేస్తోంది.
ఇంకొక విషయం చెప్పకపోతే అయ్యబాబోయ్! నేడు అన్ని హాస్టళ్ళలో అర్ధరాత్రిల్లో భయంకర చీకటి గదుల్లో దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయండీ! జర జాగ్రత్తమ్మా! ఇక ముసలి వారు తమ మనవళ్లు, మనవరాళ్ళు ఫోన్లో ముచ్చటిస్తున్నారని ఒకటే మురిసిపోతుంటారు కానీ, వారు మృత్యువుకి అతి చిన్న వయసు నుండే బాగా దగ్గరగా అతుక్కుపోతున్నారని గ్రహించలేకపోతున్నారు.
ఇంకొక భావ దారిద్రం ఏంటంటే, రాత్రిళ్ళు చరవాణి దిండు ప్రక్కన దిష్టిబొమ్మలా ఉంటే తప్ప నిద్రే రాదు పాపం! చరవాణి వాడుక ద్వారా తనకు నెట్‌వర్క్ బాగా పెరిగిందని జబ్బలు చరుచుకోవడం కాదు, నీ మెదడులో నెట్‌వర్క్ పుటుక్కు పుటుక్కుమని తెగిపోతుందని తెలుసుకో భవిత! "ఇ" కొరకు ఈతిబాధలు తప్పదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. సాంకేతికత శాస్త్రీయబద్ధంగా, క్రొత్తకోణంలో ముందడుగు అవసరమే కానీ, ప్రతి సృష్టికి, వృష్టికి అదుపు ఉంటుంది కదా! అదే చందాన మనకు అవసరమైనంత మేరకు వినియోగించుకుందాం.
ఒక గ్రామంలో ఏడవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల్లో 90 శాతం నిత్యము తలనొప్పితో బాధపడుతున్నారు. కారణం: ఇంటి లోపల పెద్దలు టీవీకి అతుక్కుపోతే బయట పిల్లలు ఫోన్లో లోపలికి వెళ్లి బక్క చిక్కి చిక్కుకుపోతున్నారు. దీనివలన వారిలో బుద్ధిమాంద్యం కూడా మొదలైంది. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది తార్కాణాలను విశదీకరించవచ్చు.
ప్రపంచ దేశాల్లోకెల్లా మన దేశం మాత్రమే అత్యధిక యువతతో కూడుకున్నది కానీ, మన యువత గమ్యం తెలియక గతులు తప్పుతోంది. వారి గమనాన్ని మార్చి, లక్ష్యాన్ని ఛేదించే విధంగా భావితరాన్ని తీర్చిదిద్దాలనే... ఓ... చిరు తపనే ఈ చిన్ని ప్రయత్నం.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.




Comments