వీగన్ వరుడు
- Dr. C S G Krishnamacharyulu

- Aug 20, 2025
- 6 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #వీగన్, #వరుడు, #VeganVarudu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Vegan Varudu - New Telugu Story Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 20/08/2025
వీగన్ వరుడు - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
రాత్రి తొమ్మిది గంటలైంది. ఆస్పత్రి నుంచి వచ్చిన డాక్టర్ ఉష, భోజనం చేసి విశ్రాంతిగా సోఫాలో కూర్చుంది. అదే అదనుగా, ఆమె తండ్రి శేఖర్ వచ్చి, ఆమె ప్రక్కన కూర్చుని ఇలా అన్నాడు.
“చిన్ని, చిన్నమ్మా! చదువుల తల్లమ్మా!
సర్జన్ అయినంతనే కన్నమ్మా!
పెళ్ళికి ఓకే అన్నావమ్మా! పెళ్ళికి ఒకే అన్నావమ్మా!”
ఉష తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుని యిలా బదులిచ్చింది.
"నీకు చెప్పినట్లుగా ఓ డాడీ! పెళ్ళికి నేను రెడీ!
కానీ నేను మెచ్చే నరుడేడీ? నా మొగుడయ్యే వరుడేడీ?
ఈ ధరాతలంలో, ఈ మానవలోకంలో,
ఏదో ఒక అవలక్షణం! ఏదో ఒక దుర్గుణం !
ఎలా నా మనసిచ్చేది? ఎవ్వరిని వరించేది? " అంది.
“నీకోసం నేను వరుని వెదకి తెస్తాను. అతడెలా వుండాలో చెప్పు బంగారు. " అన్నాడు శేఖర్.
ఉష తండ్రి ముందు నిలిచి అభినయంతో చెప్పింది.
"సర్వాంగ శోభిత సుందరుడు కాదు
సకల శాస్త్ర విద్యా పారంగతుడు కాదు
కానే కాదు సకలైశ్వర్య సంపన్నుడు.
అతడు ప్రకృతిని కాపాడు ప్రేమికుడు.
స్త్రీలను గారవించు బుధుడు - దుర్వ్యసనాలకు దూరుడు
ధరణి సకల ప్రాణి ప్రియుడు - వీగన్ ఆచార విధేయుడు
అహింసా ఖాద్యముల భుజించు వాడు
హింసా రహిత వస్తువులను కోరువాడు
అతడు నా మనోహరుడు, వరుడు.”
శేఖర్ గుండె ఝల్లు మంది.
‘జంతువుల మీద ప్రేమతో కూతురు వీగన్ అవుతానంటే ఆ నాడు ఆడ్డు చెప్పలేదు. ఆమె వీగన్ కాబట్టి, అదే పద్దతులను అనుసరించే భర్తని కోరువడంలో తప్పులేదు. కానీ, అటువంటి వరుడెక్కడ దొరుకుతాడు?’ అని తలపోస్తూ, కూతురితో ఇలా చెప్పాడు.
“నాలుగు దిక్కుల సంచరించి - పది మందిని విచారించి
ఇలాతలమంతా జల్లెడ పట్టి - తప్పక తెస్తానమ్మా! తెస్తాను.
నీవు మెచ్చే, నీకు నచ్చే - వీగన్ వరుడిని, సుగుణ ధీరుడిని.”
"ఐ లవ్ డాడ్" అని ఉష తండ్రి శిరస్సుని ముద్దాడి, తన గదిలోకి వెళ్ళిపోయింది.
@@@
వరుడి అన్వేషణ యెలా అన్న ఆలోచనలతో ఆ రోజు రాత్రి శేఖర్ నిద్రకుపక్రమించాడు. ఈ ప్రయత్నం బహుముఖంగా వుండాలి. వీగన్ మాట్రిమొనీ, డాక్టర్ మాట్రిమొనీ, ఇండియన్ డాక్టర్స్ మాట్రిమొనీ, ఒక ఆధారం.
మరొక్కటి స్నేహితులలో, బంధువులలో, పెళ్ళి సంబంధాలు చూసే వారిని గుర్తించి, వారి ద్వారా ప్రయత్నించాలి.
మరొక మార్గం జ్యోతిష్కులు. మంచి జ్యోతిష్కుడు, వరుని ఆచూకీ చెప్పగలుగుతాడు. అలాంటి వారెవరో వాకబు చేయాలి.
అన్నిటినీ మించినది దేవుని కృప. అందుకోసం యే యే దేవుళ్ళు కల్యాణాలు చేస్తారో, గూగుల్ లో చూసి ఆ దేవుళ్ళకి పూజలు చేయాలి. ఇలా పరి పరి విధాల తల పోస్తూ, శేఖర్ నిద్రపోయాడు.
మూడు గంటల గాఢ నిద్ర తర్వాత, అతను ఒక వింత కల గన్నాడు. ఆ కలలో అతను కీకారణ్యాలలో నడిచి, నడిచి, ఆనంద స్వామి ఆశ్రమం చేరి ఆయన కట్టెదుట నిలిచాడు. ధ్యానంలోవున్న ఆయన కనులు తెరవగానే, చేతులు జోడించి, ఇలా ప్రార్ధించాడు.
“చీమలు దూరని చిట్టడవి, కాకుల కానని కారడవి
నడిచీ, అలసీ, చేరానయ్యా, నిన్నే నమ్మానయ్యా
శోకాలను బాపే సామి- ఆనంద స్వామీ
వీగన్ వరుని జాడ తెలుపుమా! నా కూతురి కల్యాణం జరిపించుమా!”
స్వామి అతడిని ఆశీర్వదించి, "అరుదైన కోరిక కోరావు. నగరాలకు నగరాలే దాటి వెళ్ళాలి. నా గాడిద నిన్ను మొదటి నగరానికి చేరుస్తుంది. అక్కడ ఆరోగ్య స్వామిని కలిసి నీ కోరిక చెప్పు" అన్నాడు.
మీ దర్శన భాగ్యం కలిగినందుకు ఆనందంగా వుందని చెప్పి, శేఖర్ స్వామి దగ్గర సెలవు తీసుకున్నాడు.
గాడిద మంద గతిని ప్రయాణించి అతడిని ఆరోగ్య స్వామి దగ్గరకు చేర్చింది. అక్కడ ఎందరో స్త్రీ పురుషులు దగ్గుతూ, తుమ్ముతూ, నొప్పితో విలవిల లాడుతూ వున్నారు. స్వామి వారిని ఆశీర్వదించి మూలికలు, తాయెత్తులు యిస్తున్నాడు. శేఖర్ ఆయనకు నమస్కరించి ఇలా చెప్పాడు.
“అడవుల నడిచి - ఆనంద మునికి మ్రొక్కి
ఖరముపైన చేరానయ్యా - నిన్నే నమ్మానయ్యా
రోగాలను హరించే సామి - ఆరోగ్య స్వామీ
వీగన్ వరుని జాడ తెలుపుమా! నా కూతురి కల్యాణం జరిపించుమా!”
స్వామి శేఖర్ ని ఆశీర్వదించి ఇలా చెప్పాడు.
"ఇది వ్యసన నగరం, ఇక్కడ ప్రజలు దుర్వ్యసన పరులు. పొగ పీల్చేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు, గంజాయి సేవించే వాళ్ళు, ఇలా ఎందరో పాడై పోయారు. నువ్వు ఇక్కడ నుంచి నా అశ్వంపై భోగ నగరానికి వెళ్ళి, సుఖ స్వామిని కలు. ఆయన మార్గం చెప్తాడు" అని దీవించి పంపాడు.
శేఖర్, స్వామికి కృతజ్ణతలు తెలిపి అశ్వ రాజం పై ప్రయాణించి భోగ నగరం లోని సుఖ స్వామి ఆశ్రమానికి వెళ్ళాడు.
ఆశ్రమం రంగవల్లులతో, పూల మాలలతో అందంగా వుంది. అందమైన అతివలు కొందరు, నాట్యం చేస్తున్నారు. మరి కొందరు పన్నీరు జల్లుతూ, స్వాగతం పలుకు తున్నారు. పట్టుబట్టలు ధరించి, స్వామి ఒక రత్న ఖచిత సింహాసనం మీద కూర్చుని వున్నారు. ఇరు వైపులా సుందరాంగులు, విలాసంగా నిలచి, భక్తుల యెదలు ఝల్లుమనేలా హొయలొలికిస్తున్నారు. శేఖర్, స్వామి ముందు మ్రోకరిల్లి తన కోరిక వెలిబుచ్చాడు.
“అడవుల నడిచి, ఆనంద మునికి మ్రొక్కి
ఖరము నెక్కి, ఆరోగ్య స్వామిని కొలిచి
అశ్వంపై చేరానయ్యా - నిన్నే నమ్మానయ్యా
ఇలను స్వర్గం చేసే సామి -సుఖస్వామీ
వీగన్ వరుని జాడ తెలుపుమా! నా కూతురి కల్యాణం జరిపించుమా!”
స్వామి చిరునవ్వుతో ఇలా సెలవిచ్చారు.
“ఇక్కడ కామ మోహాలే కాని, ప్రేమ దయా అన్న వాటికి తావు లేదు. ఇక్కడ జనం, పట్టు బట్టలు కట్టి, మాంసం భక్షించి, మద్యం త్రాగి, కామ క్రీడలలో తేలిపోతారు. తక్షణమే, నువ్వు నా ఒంటె వాహనమెక్కి విజ్ణాన నగరానికి వెళ్ళు. అక్కడ జ్ణానానంద స్వామి సహాయమడుగు. ” అని స్వామి సెలవిచ్చి, తన భక్తుని తోడిచ్చి పంపాడు.
సేవకుడు తోడు రాగా శేఖర్, ఒంటె పై ప్రయాణించి జ్ఞాన నగర్ ఆశ్రమం లో దిగాడు. అది దత్తాశ్రమంలా వుంది. జంతువులు తమ సహజ వైరాన్ని మరిచి, సహ జీవనం చేస్తున్నాయి. స్త్రీ పురుషులు ధవళ వస్త్రాలు దాల్చి గ్రంధాలను పఠిస్తూ వున్నారు. జ్ణానేంద్ర స్వామికి ప్రణమిల్లి, శేఖర్ ఇలా అన్నాడు.
“నేల పై నడిచి - ఆనంద మునికి మ్రొక్కి
ఖరముపై నెక్కి- ఆరోగ్య స్వామికి ప్రణమిల్లి
హయమారోహించి -సుఖస్వామిని సేవించి
ఉష్ట్రారూఢునియై చేరానయ్యా - నిన్నే నమ్మానయ్యా
అజ్ణానం పారద్రోలే సామీ- జ్ఞానేంద్ర స్వామి
వీగన్ వరుని జాడ తెలుపుమా! నా కూతురి కల్యాణం జరిపించుమా!”
స్వామి, శేఖర్ ని దీవించి, " నీ కోరిక అంత సులభమైనది కాదు. ఇక్కడ జ్ణాన పిపాసతో యువతీ యువకులు వివాహం వద్దనుకుంటున్నారు. వీరంతా పాలను, పాల పదార్ధాలను తీసుకుంటారు. అలాగే పట్టు వస్త్రాలు, తోలు పాదరక్షలు ధరిస్తారు. అందువల్ల వీరిలో శాఖాహారులు వున్నా వారు వీగన్ కాదు గదా! అందువల్ల నా హంస నెక్కి భక్తి నగరం చేరుకో. అక్కడ కొందరైనా వీగన్ కాగల అవకాశాలున్నాయి" అని చెప్పి, తన శిష్యుని తోడిచ్చి పంపాడు.
శిష్యుని సాయంతో శేఖర్, హంస నెక్కి భక్తి నగరం చేరుకున్నాడు. ఆ నగరం దేవాలయాలతో, స్తోత్ర పఠనాలతో, భక్తుల భజనలతో, భక్తి గీతాలాపనలతో దివ్యంగా వుంది. శేఖర్ చిదానంద స్వామిని పూజించి యిలా మొరబెట్టుకున్నాడు.
“అడవుల నడిచి - ఆనంద మునికి మ్రొక్కి
ఖరము నెక్కి- ఆరోగ్య స్వామిని కొలిచి
అశ్వారూఢునియై- సుఖ స్వామిని సేవించి,
ఒంటె నారోహించి- జ్ణానేంద్రుని స్తుతించి
హంస నెక్కి చేరానయ్యా - నిన్నే నమ్మానయ్యా -
వీగన్ వరుని జాడ తెలుపుమా! నా కూతురి కల్యాణం జరిపించుమా!”
ఆయన దేవుని తీర్ధ ప్రసాదాలు శేఖర్ కి యిచ్చి, " ఆ పరమాత్ముని దయ వల్ల నీ కార్యం సిద్ధించు గాక" అని దీవించాడు. ఆ తర్వాత, " ఇక్కడ అభిషేకాలకోసం, ప్రసాదాలకోసం, విరివిగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి వాడతారు. చాలా మంది, దీక్షలో లేనప్పుడు, మాంసాహారం తీసుకుంటారు. అందువల్ల నువ్వు శాంతి నగర్ కి వెళ్ళు. అక్కడ అధిక జనాభా నీవు కోరే వీగన్ ఆహారులే. " అని చెప్పి, ఒక భక్త పరమాణువుని తోడిచ్చి పంపాడు.
అతడు తన యోగ బలంతో శేఖర్ ని శాంతి నగరం చేర్చాడు. అక్కడ అతను సాగర్ అనే ఒక యువకుడిని శేఖర్ కి పరిచయం చేసి వెళ్ళిపోయాడు.
సాగర్, శేఖర్ కి నగరంలోని ముఖ్య ప్రదేశాలు చూపించాడు. ఉద్యానవనాలతో, పూల పరిమళాలతో గుబాళిస్తున్న నగరం అది. రోడ్ల పక్కన పచ్చని చెట్లు, బారులు తీరి వున్నాయి. జంతువులు విశాలమైన పచ్చిక బయళ్ళలో మేత మేస్తూ విహరిస్తున్నాయి. అవి నివసించడానికి అన్ని సదుపాయాలతో అనేక ఆశ్రమాలు వున్నాయి. రహదారులపై జంతువుల కోసం ప్రత్యేక మార్గాలు వున్నాయి.
వాణిజ్య సముదాయాలలో ప్రతి రెస్టారెంట్ బోర్డుపై, 100% Plant-Based - No Animal Products Used" అని రాసి వుంది. వీధి దుకాణాల బోర్డులపైన, "వీగన్ బిర్యానీ", "ప్లాంట్ మిల్క్ కాఫీ", "టోఫూ టిఫిన్స్", "జాక్ ఫ్రూట్ కార్నర్" అని వివిధ వీగన్ ఆహార పదార్ధాల పేర్లు వ్రాసి వున్నాయి.
ఒక వీధి హోటల్ ముందు నిలబడ్డవారు టోఫు సూప్ , మొక్కజొన్న పకోడీలు, ఆలూ పానీ పూరీలు కొనుక్కుంటున్నారు. ఉడికించిన వేరుశెనగ, మినప్పప్పు, చిలకడదుంపలు ప్యాకెట్లలో తయారవుతున్నాయి. బేకరీలలో బాదం పాలు, ఓట్స్ పాలు, నారికేళ పాలు, అవి వాడి చేసిన కేకులు, బ్రెడ్‌లు అమ్ముతున్నారు. బటర్ బదులుగా అవోకాడో పేస్ట్. శనగ గింజలతో తయారైన క్రీమ్, చీజ్ లభిస్తున్నాయి. అక్కడ యెలాంటి మాంసాహార దుకాణాలూ లేవు. జంతు ఉత్పత్తుల వాడకమే లేదు.
ఆసక్తిగా చూస్తున్న శేఖర్ తో సాగర్ యిలా చెప్పాడు.
"ఇక్కడ జీవన విధానంలో హింసకు తావులేదు. పాఠశాలల్లో జంతు హక్కులపై విద్య బోధిస్తారు. ‘జంతువులన్నీ మనకి తోడు’ అనే సూత్రంతో పిల్లలు పెరుగుతారు. అలాగే వనాలు, వృక్షాలు. నరకడం, ధ్వంసం చేయడం, ఇక్కడ సాధ్యం కాదు. పిల్లలు పుట్టినప్పుడల్లా ఒక మొక్క ను నాటుతారు. ఈ మొక్క నీతో కలిసి పెరుగుతుంది, అంటూ ఆ బిడ్డ పేరు దానికి పెడతారు. ఇదొక అందమైన, ప్రశాంతమైన ప్రకృతి నగరం. ఈ నగరం ఆహింస, ఆరోగ్యం, సహజత్వం అనే గుణాలతో పరిపూర్ణంగా వుంటుంది. ”
"చాలా సంతోషం. నా కూతురు వీగన్. ఆమెకి వరుడ్ని వెతుక్కుంటూ పాండీ నగర్ నుంచి వచ్చాను. "
"నాకు ఆ విషయమే చిదానంద స్వామి చెప్పారు. నేను డాక్టరును. వీగన్ వధువు కోసం చూస్తున్నాను. "
ఆ మాటకు శేఖర్ సంతోషంతో వుక్కిరి బిక్కిరి అయ్యాడు.
"అయితే నువ్వు పాండీ వచ్చి నా కూతుర్ని .." ఆ మాట పూర్తి కాక ముందే, ఉద్వేగం వల్ల అతనికి మెలకువ వచ్చేసింది. కనులు తెరిచి చూసి, ఇది కలా అని నవ్వుకున్నాడు.
“ఏదైనా ఇది శుభ సూచకం” అని భావిస్తూ మళ్ళీ నిద్రకుపక్రమించాడు.
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).




Comments