'Vidhivanchitha' New Telugu Story
Written By Yasoda Pulugurtha
'విధివంచిత' తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
''ఏమిటి తపస్వీ, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఏదో చెప్పాలనుకుంటూ సంకోచిస్తున్నావు, ఏదైనా చెప్పాలా'' అంటూ చెల్లెలి వైపే ప్రేమగా చూస్తూ అడిగింది మానస.
''నీకు చెప్పకపోతే ఎవరికి చెప్పగలనక్కా''? అమ్మా నాన్నా ఏక్సిడెంట్ లో చనిపోతే, నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమతో పెంచావు. బావగారు కూడా నన్ను ఎంతో అభిమానంగా ఒక కూతురిలా చూస్తారు. తపస్వి గొంతుకు గద్గదమైందో క్షణం.
''ఇప్పుడైమైందే? జరిగినవి తలచుకుంటూ ఎన్నాళ్లు బాధపడగలం చెప్పు''?
" ఒకటా, రెండా, పన్నెండు సంవత్సరాల నాటి గతం". విధి వ్రాతను ఎవ్వరూ తప్పించలేరు తపస్వీ. కాల ప్రవాహంతో బాటూ మనమూ ముందుకు సాగక తప్పదు. చాలా రోజుల తరువాత బేంక్ కు శెలవు పెట్టి మరీ వచ్చావు. మూడీగా ఉండకుండా సరదాగా ఉండవే.
''నేను శ్రీకాంత్ అనే ఒక వ్యక్తిని ప్రేమించానక్కా, అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం".
" అతను మీ బేంక్ లోనే పనిచేస్తాడా"?
"లేదక్కా, తను హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు".
'మా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. పత్రికల్లోని నా కవితలు చదివి నన్ను అభిమానిస్తూ నాతో పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం ఒకరిమీద మరొకరికి ప్రేమ కలిగేలా చేసింది. కిందటి వారం నన్ను చూడాలని వైజాగ్ వచ్చాడు సర్ ప్రైజ్ చేస్తూ'.
" నాకు ఏక్సిడెంట్ అయిన విషయం చెపితే నీ బాహ్య సౌందర్యం కంటే అందమైన నీ మనసంటే ఇష్టమని చెప్పాడు". ఎంత మంచివాడో కదాక్కా శ్రీకాంత్ అనగానే మానస మనసులో అనుకుంది, ''వీరి ప్రేమ చాలా దూరం వెళ్లిందని''.
''పోనీలే తపస్వీ, నీ గురించే నేనూ బావా దిగులు పడుతూ ఉంటాం. పెళ్లికి ముందే ఇద్దరూ మనసులు విప్పుకుని ఒకరినొకరు మాట్లాడుకున్నారు. ఇంతకంటే కావల్సింది ఏముంది"?
"అవునక్కా ఈ అవిటిదాన్ని ఎవరు చేసుకుంటారు కనుక"? నాకు అసలు జీవితంలో పెళ్లియోగం ఉందా అనుకునేదాన్ని. లేనిదాని కోసం ఎందుకు ఆశపడాలన్న ఒక నిర్లిప్త ధోరణి అలవాటైపోయిన తరుణంలో మలయమారుతంలా శ్రీకాంత్ వచ్చి నా మనసుని స్ప్రుశించాడు.
'అన్నట్లు అక్కా శ్రీ కి కూడా తల్లీ తండ్రీ లేరు. వారిది చిత్తూరు దగ్గర ఒక గ్రామమంట. వ్యవసాయ కుటుంబమన్నాడు. తన తండ్రి తను చెన్నై లో ఇంజనీరింగ్ చదువుతున్నపుడు పొలాల్లో పని చేస్తున్నపుడు పాము కరచి చనిపోయారని ఆయన చనిపోయిన రెండు సంవత్సరాలకు తల్లి బెంగతో మంచం పట్టి చనిపోయిందని చెప్పాడు. ఉన్న ఒక అన్నయ్య ప్రేమ వివాహం చేసుకుని దుబాయ్ లో స్తిర పడ్డాడ్డని, ఎప్పుడోగాని ఇండియా రాడని తనను పట్టించుకోడని చెప్పాడు. ఉన్న పొలం తండ్రి చేసిన అప్పులకోసం అమ్మేయాల్సి వచ్చిందట'.
'మా ఇరువురి జీవితాలు ఒకే లా ఉన్నా నాకు మీరున్నారు. అమ్మా నాన్నా కంటే ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ 'శ్రీ ' కి ఎవరూ లేరుకదా అని బాధగా ఉంటుంది'.
"బాధ పడకు తపస్వీ, అతనికి ఇకనుండి మనం అందరం ఉన్నాం. బావ నాలుగు రోజుల్లో వస్తారు. పంట డబ్బులు వసూలు చేయడానికి కోరుమిల్లి వెళ్లారు. ఆయన కాలేజ్ కు ఏవో శెలవలు వచ్చాయని శెలవల్లో వెళ్లి పంట డబ్బులు వసూలు చేద్దామని. నీవు అంతవరకూ ఉండనన్నావు కదా. బావ వచ్చాక శ్రీకాంత్ ను పిలిపించి మాట్లాడుదాం, ఇంకేం ఆలోచించకంటూ చెల్లెలిని ఊరడించింది".
తపస్వి మరో రెండు రోజుల తరువాత వైజాగ్ వచ్చేసింది.
తపస్వి మానస కంటే పన్నెండేళ్ల చిన్నది. తల్లీ తండ్రీ తపస్వి పన్నెండో ఏటనే రోడ్ ఏక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటకి మానస పెళ్లి అయిపోయింది. తల్లీతండ్రీ ఆస్తి ఇద్దరికీ వచ్చిన మూలాన డబ్బుకి సమస్యలేదు. తపస్విని తమ దగ్గరే పెట్టుకుని చూసుకునేవారు.
చదువులో చురుగ్గా ఉండే తపస్వి ఇంజనీరింగ్ పాసై, బేంకింగ్ పరీక్షలు వ్రాసి సెలక్ట్ అయింది. వికలాంగుల కోటా కూడా ఉండడంతో వైజాగ్ స్టేట్ బేంక్ లో ఉద్యోగం వచ్చింది.
మానస, సందీప్ తమ ఇద్దరి కొడుకులతో కాకినాడలో ఉంటారు. సందీప్ డిగ్రీ కాలేజ్ లో మేధ్స్ లెక్చరర్. ఎంతో మంచివాడు, సహ్రుదుయుడు. తపస్విని కూతురులాగే చూసుకుంటాడు. తపస్వికి చెందిన ఆస్తి వ్యవహారలన్నీ అతనే చూసుకుంటూ కన్నకూతురిలాంటి మరదలి పట్ల ఎంతో న్యాయబధ్దంగా ఉంటాడు.
తపస్వి వైజాగ్ తిరిగి వచ్చిన తరువాత శ్రీకాంత్ కు ఫోన్ చేసింది.
"హాయ్ శ్రీ, మన విషయం అక్కకు చెప్పేసాను. టెన్షన్ పోయింది. బావ ఊరినుండి వచ్చాక నీకు ఫోన్ చేయిస్తానంది. బహుశా తొందరలో నీవు కాకినాడ రావలసి వస్తుంది".
"వావ్ ఎంతటి శుభవార్త తపస్వీ. అసలు నేనే మీ బావని కలసి మాట్లాడాలనుకున్నాను మన విషయం".
"ఇంతకీ తపస్వి అనే అమ్మాయి ని సొంతం చేసుకోడానికి శ్రీకాంత్ అనే అబ్బాయి ఎన్నిరోజులు ఎదురుచూడాలట"?
"నాకు తెలీయదండి మహాశయా అని చిలిపిగా అనేసరికి శ్రీకాంత్ నవ్వేసాడు".
ఆరునెలల క్రితం శ్రీకాంత్ తో తన పరిచయం గుర్తొచ్చేసరికి ఆమె అందమైన పెదవులపై దరహాసరేఖలు విచ్చుకున్నాయి.
'ఒకరోజు తన మొబైల్ కి ఎవరో ఫోన్ చేసి మీరు తపస్వి కదూ అని అడిగేసరికి ఔనని మీరెవరంటూ ప్రశ్నించింది'?
'మీరు వ్రాసిన కవిత వారపత్రికలో చదివాను అభినందనలు చెప్పడానికే ఫోన్ చేసాను'.
ఇలా రెండు మూడు సార్లు పత్రికలో పడ్డ ఆమె కవితలను చదవడం, ఫోన్ చేయడం, ఒకరి పేరు మరొకరు అడగి తెలుసుకోవడం తో వారిరువురి పరిచయం బలపడింది . తపస్వి తన రాయబోయే కవితలు గురించి శ్రీకాంత్ తో చర్చించే స్తితికి రావడం తో వారిమధ్య స్నేహ బంధం మాలతీలత లా పెనవేసుకు పోయింది.
ఒక రోజున సర్ ప్రైజ్ చేస్తూ తపస్విని చూడడానికి వైజాగ్ వచ్చేసాడు. తపస్వి తెల్లబోయింది. ఎన్నో విషయాలు ఫోన్ లో మాట్లాడింది గానీ తనకు ఏక్సిడెంట్ అయిందని, కుత్రిమ కాలుని అమర్చుకున్నానన్న విషయం అతనికి చెప్పడానికి ఎందుకో సంశయించింది. తను అవిటిది. ఈ విషయం చెపితే ఎలా రియాక్ట్ అవుతాడోనని.
"ఏమిటి తపస్వీ, నన్ను చూడగానే నీ కళ్లల్లో మెరుపులను చూడాలని వస్తే, ఎందుకంత మౌనంగా ఉన్నావంటూ” పదే పదే ప్రశ్నించేసరికి తట్టుకోలేకపోయింది.
"చెపుతాను శ్రీ",
'ఈ జీవితం ప్రేమ, పెళ్లి లాంటి ఏ అనుభూతులకు నోచుకోలేదని తెలిసినా నీతో పరిచయం, ప్రేమ నా ప్రమేయం లేకుండా ఒకటి తరువాత మరొకటి వేగవేగంగా జరిగిపోయాయి. మా అమ్మా నాన్నగారు నా పన్నెండో ఏటనే రోడ్ ఏక్సిడెంట్ లో పోయారని చెప్పాను కదా. మా అక్క, బావ నన్ను చేరదీసి వాళ్ల దగ్గరుంచుకుని నాకు కేర్ టేకర్ గా ఉంటున్నారు'.
'నేను పదవ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకరోజు స్కూల్ నుండి ఆటోలో ఇంటికి వస్తున్నపుడు ఎదురుగా స్పీడ్ గా వస్తున్న ఒకలారీ నేను ఉన్న ఆటోను గుద్దేయడంతో ఆటో తిరగబడిపోయింది. నా ఎడమ కాలు ఆటో చక్రం కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయింది. డ్రైవర్ కి బలమైన గాయాలై అక్కడకక్కడే చనిపోయాడు. నా ఎడమ కాలు సర్జరీ చేసి తీసేసారు. తరువాత కొన్నాళ్లకు జైపూర్ వెళ్లి కుత్రిమ కాలు పెట్టించారు'.
"నేను అవిటిదాన్ని శ్రీ. ఈ విషయం చెప్పలేక ఎంత మధన పడేదాన్నో తెలుసా ? నీకీ విషయం చెప్పే అవకాశంకోసం ఎదురుచూస్తున్నాను".
"నీ ఎదురుగా నిలిచే ధైర్యం లేదు నాకంటూ దుఖంతో వివశురాలౌతున్నతనను “నీ అవిటితనం నాకు ముఖ్యంకాదు తపస్వీ, అందమైన నీ మనస్సుని చూసే ప్రేమించాను. ఎప్పుడూ అవిటిదాన్నంటూ బాధపడకు. నేను నీకూ లేనూ అంటూ ప్రేమగా తనను దగ్గరకు తీసుకున్నాడు".
గతం తాలుకా మధురానుభూతుల్లో తేలిపోతున్న తపస్వి వాస్తవానికి తిరిగి వచ్చింది.
తపస్వి అక్కా బావలకు శ్రీకాంత్ బాగా నచ్చేసాడు. ఇరువైపుల పెద్దలుగా తామే వ్యవహరిస్తూ ఇరువురి పెళ్లి చాలా ఘనంగా జరిపించారు.
తపస్వికి హైద్రాబాద్ బ్రాంచ్ కు ట్రాన్స్ ఫర్ అవడానికి ఆరునెలల సమయం పట్టింది.
వైజాగ్ లోని తన ఫ్లాట్ అద్దెకిచ్చేసి హైద్రాబాద్ వెళ్లిపోయింది.
హైద్రాబాద్లో శ్రీకాంత్ తో తన జీవితం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగిపోతోంది..
ఒకరోజున తపస్వి బావ ఫోన్ చేసి '' నీవూ శ్రీకాంత్ వీలు చూసుకుని ఒకసారి వస్తే ఆస్తితాలుకా పంపకాలు నీ పేరు మీద రిజిజ్టర్ చేయిస్తానమ్మా అని చెప్పాడు".
తపస్వి కి రావలసిన పది ఎకరాల పొలం తపస్వి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. మంచి వ్యవసాయ భూమి. తండ్రి తాలూకా ఇల్లు అమ్మిన డబ్బులో సగం తపస్వి బేంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తానంటే వచ్చిన అరవై లక్షలూ నా పేరుమీదే ఎందుకు బావా, టాక్స్ కు సంబంధించిన ఏవైనా సమస్యలు రావచ్చేమో, ముఫై లక్షలు శ్రీకాంత్ అకౌంట్ లో డిపాజిట్ చేయమంది.
ఒక రోజు శ్రీకాంత్ ఆఫీస్ నుండి వస్తూనే '' ప్రాజక్ట్స్ సరిగా లేని కారణంగా కంపెనీ వర్క్ ఫోర్స్ తగ్గించిందని, తనకు జాబ్ పోయిందని చెప్పేసరికి శ్రీకాంత్ కి ధైర్యం చెప్పింది, వేరే చోట ప్రయత్నించంటూ'.
శ్రీకాంత్ బధ్దకస్తుడు. జాబ్ విషయంలో నిర్క్ష్యంగా ఉంటాడు. అటువంటివాళ్లనే కంపెనీ తొలగించింది.
మరో జాబ్ చూసుకునే ఆసక్తి లేనట్లుగా కాలక్షేపం చేసేస్తున్నాడు. అతను లేచేసరికి తపస్వి బేంక్ కు వెళ్లిపోతుంది. ఇంట్లో కూర్చుని టీ.వీ , వీడియోలతో కాలక్షేపం చేసేస్తున్నాడు. అతని ప్రవర్తనలో ఒకలాంటి నిర్లక్యం కనపడుతోంది.
తపస్వి ఎన్నో సార్లు చెప్పి చూసింది. ఎమ్.టెక్ గానీ ఎమ్.బి.ఏ గానీ చేయమని. చూద్దాం అంటాడేగానీ ఉత్సాహం చూపడు.
తపస్వికి మూడోనెలంటూ డాక్టర్ కన్ ఫర్మ్ చేసింది. ఆ ఆనందంలో శ్రీకాంత్ జాబ్ విషయం కొన్నాళ్లు మరచిపోయారు.
తపస్వికి నెలలు నిండుతున్నాయి. భారంగా బేంక్ కు వెళ్లి వస్తోంది. కారు డ్రైవర్ ను పెట్టుకుని బేంక్ కు వెళ్లి వస్తోంది. కనీసం డ్రాప్ చేయడం, తీసుకురావడం కూడా చేయడు. ఒకసారి బేంక్ నుండి అలసిపోయి వస్తూ "కాస్త కాఫీ కలిపి ఇస్తావా శ్రీ " అనేసరికి వెంటనే రియాక్ట్ అయిపోయాడు.
"పనీపాటా లేకుండా ఉన్నానని నీకు కాఫీ చేసి ఇవ్వాలా అంటూ"?
ఇలాగే ఒకసారి సరదాగా అడిగింది, "నీకు వంట చేయడం బాగా వచ్చని మన పెళ్లికి ముందు చెప్పేవాడివి కదా, ఈ పూట వంట నీవు చేయవూ"? అనేసరికి కూడా అంతెత్తున ఎగిరిపడ్డాడు.
"ఏం నీకు వంటవాడిలా కనిపిస్తున్నానా అంటూ".
తపస్వి ముఖం చిన్నబోయింది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడేమోననుకుంటూ సరిపెట్టుకుంది.
తొమ్మిదవ నెల రాగానే మెటర్నిటీ లీవ్ తీసుకుంది. అక్కా బావ వచ్చి తపస్విని పురిటికి తీసుకువెళ్లారు.
తపస్వి ఇంట్లో లేకపోయేసరికి శ్రీకాంత్ ఫ్రీబర్డ్ అయిపోయాడు. స్నేహితులతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. విందులూ, వినోదాలతో. అప్పుడప్పుడు ఇంట్లో డ్రింక్ పార్టీలు కూడా. చేతినిండా డబ్బు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు.
తపస్వి ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతుంది. ''జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయని". ఇంటర్వ్యూలు అవుతున్నాయని చెపుతున్నాడు.
తపస్వి పండంటి పాపాయికి తల్లి అయింది. సందీప్ శ్రీకాంత్ కు ఫోన్ చేసి చెప్పాడు. ఇరవై ఒకటవ రోజున బారసాల కి రమ్మనమని.
బారసాల నాలుగురోజులుందనగా వెళ్లాడు కాకినాడ. పాపాయికి 'మహిమ' అని పేరు పెట్టుకున్నారు.
మెటర్నటీ లీవ్ ఆరునెలలు పూర్తవుతుందనగా పాపను చూసుకోడానికి ఒక పని అమ్మాయిని వెంట తెచ్చుకుంది. తను బేంక్ కి వెళ్లిపోతే మహిమను చూసుకుంటుందని.
ఇంటి వాతారణంలో ఏదో మార్పు గోచరిస్తోంది. ఇల్లంతా చిందర వందరగా ఏదో దుర్వాసన వస్తోంది. శ్రీకాంత్ అలాగే ఉన్నాడు. ఉద్యోగం పోయి సంవత్సరం దాటినా అతనిలో ఏ బాధా, టెన్షన్ కనపడడం లేదు.
తనే అడిగిందోసారి. " ఏమిటి శ్రీ, ఇంత కాలమైనా నీకు ఉద్యోగం రాకపోవడమేమిటని", అసలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నావా అనేసరికి అంతెత్తున ఎగిరాడు.
"నేను ఉద్యోగం చేస్తానో చేయనో అది నా ఇష్టం, నీకు భారంగా ఉన్నానంటే చెప్పు వెళ్లిపోతాననేసరికి తెల్లబోయింది".
తమ పెళ్లైన రెండు సంవత్సరాల లోనే ఎంత మార్పనుకుంటూ బాధపడసాగింది.
శ్రీకాంత్ ఇంట్లో ఉన్నా కూడా మహిమ ను ఎత్తుకుందామని గానీ ఆడించాలని అనుకోకపోవడం తపస్వికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
సాయంత్రం కారు తీసుకుని వెళ్లిపోయి ఎప్పుడో రాత్రి పది తరువాత ఇంటికివస్తాడు.
ఒకరోజు శ్రీకాంత్ తో "మనం ఇలా రెంటడ్ ఎపార్ట్ మెంట్ లో ఇరవైవేలు అద్దెకట్టుకుంటూ ఉండేకన్నా ఒక మంచి ఏరియాలో ఫ్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది కదా శ్రీ. మనిద్దరి అకౌంట్ లో నున్న అరవైలక్షలు కాక మరో నలభైలక్షలకు బేంక్ లోన్ అప్లై చేస్తాను, ఏంమంటావంటూ"?
"నా అకౌంట్ లో ఇరవై లక్షలే ఉన్నాయి. నాకు ఉద్యోగమిప్పిస్తానంటే ఒక కన్సలెటెంట్ కి పది లక్షలు చెల్లించాను".
"లంచమా? దానిబదులు ఏవైనా కొత్త కోర్సులు నేర్చుకోపోయావా శ్రీ"?
"ఉద్యోగం ఉద్యోగం అంటూ సతాయిస్తావు. ఏదైనా మంచి పని చేస్తే సవాలక్ష సంజాయిషీలిచ్చుకోవాలి. ఛ, వెధవకొంప" అనుకుంటూ కోపంగా వెళ్లిపోయాడు.
రోజూ బాగా డ్రింక్ చేసి వస్తున్నాడు. పనిమనిషి కూడా ఒకసారి అంది తనతో. అమ్మా మీరింట్లో లేనప్పుడు అయ్యగారి స్నేహితులు బోల్డు మంది వచ్చేవారని, తాగేసిన డ్రింక్ బాటిల్స్ అన్నీ తనకు డబ్బులిచ్చి బయట పడేయమనేవారని చెప్పేసరికి నివ్వెరపోయింది.
శ్రీకాంత్ అసలు స్వభావేమిటో మెల్లిగా అర్ధమవసాగింది. ఒక మూల దుఖం తన్నుకొస్తోంది. ఇంటికి తాగి రావడం, ఏదైనా అడిగితే గట్టిగా అరవడం మొదలు పెట్టాడు.
మరో నాలుగు నెలలు గడచిపోయాయి. శ్రీకాంత్ జాబ్ కోసం కన్సలెటెంట్ కి డబ్బులిచ్చాడన్నది అబధ్దమని అతని అకౌంట్ చెక్ చేసి తెలుసుకుంది. బేంక్ లో ఉన్న డబ్బుని తాగుడికి, పార్టీలకు ఖర్చుపెడ్తున్నాడని అర్ధమైంది.
ఒకరోజు ఉండబట్టలేక అంది , "ఉద్యోగం లేకపోయినా ఫరవాలేదు, డ్రింక్ చేయకు శ్రీ అంటే, చెప్పొచ్చావులే కుంటిదానివైనా నేను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. లేకపోతే నిన్ను పెళ్లాడేదెవరూ, నోరుమూసుకుని ఒకమూల పడుండనేసరికి " తట్టుకోలేకపోయింది.
"నన్ను ప్రేమించానని వెంటపడ్డావు, నా అవిటితనం ముఖ్యం కాదన్నావ్? ఇదంతా నటనా శ్రీకాంత్"?
"అవును, నటనే, నీవెనుకనున్న ఆస్తిని చూసాను, లేకపోతే కుంటిదాన్ని ఎందుకు చేసుకుంటాను"?
"నీకు ఇంతటి సుఖ భోగాలిచ్చినందుకు నాకేమి లాభం"? నీ ఆస్తిలో సగం నా పేరుమీద వ్రాసివ్వు. ఉద్యోగం వచ్చేటట్లు లేదు, ఏదైనా వ్యాపారం చేస్తాను.
"ఏ వ్యాపరం చేయద్దు శ్రీ, చక్కగా జాబ్ చేసుకో. ఈ వ్యాపారాలూ, టెన్షన్ లు ఎందుకు చెప్పు"? "మనకున్నది చాలు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం".
"ఇందాకటి నుండి చూస్తున్నాను తమరి సలహాల కోసం ఎవరూ ఎదురుచూడడం లేదు. నేను జాబ్ చేయదలచుకోలేదు".
"మరి నీ జాబ్ కోసం ఆ కన్సలెటెంట్ కిచ్చిన పదిలక్షలు"?
"ఏమిటే పైసా పైసా లెక్కలడుగుతున్నావు, నీ ముందు చేతులు కట్టుకుంటూ సంజాయిషీలివ్వాలా"? మాట ముద్దగా వస్తోంది. తాగినట్టున్నాడు.
"తరువాత లెక్కలు చెపుతాగానీ, ముందు ఓ ఏభైలక్షలివ్వు, ఒక కనస్ట్రక్షన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి". బేంక్ లో మిగిలున్న ఇరవై లక్షలు తీసి అడ్వాన్స్ గా ఇచ్చేసాను.
అయిపోయింది. ఆ ఇరవైలక్షలూ కర్పూరంలా హరించుకు పోయాయన్నమాట.
శ్రీకాంత్ నిజాయితీగా కష్టపడే వాడైతే తన ఆస్తినంతటనూ అతనికిచ్చేసేది. కానీ అతను చెప్పే అబధ్దాలు, వ్యసనాలు, అతని నిర్లక్ష్యపు ధోరణి కళ్లెదుట ప్రత్యక్షంగా కనపడుతుంటే అతన్ని ఎలా నమ్ముతుంది?
ఒక్క పైసా అతనికి ఇచ్చేది లేదనుకుంటూ " నా దగ్గర లేదు శ్రీకాంత్, నేను ఫ్లాట్ కొనడానికి కమిట్ అయిపోయాను. నా అకౌంట్ లో ఉన్న ముఫైలక్షలూ బిల్జర్ కి అడ్వాన్స్ గా పే చేసేసాను".
"ఫరవాలేదు మహారాణీగారు ఆస్తిపరులు కదా"!
"ఒక ఎకరం పొలం అమ్మేద్దాం. లేకపోతే వైజాగ్ లో ఫ్లాట్ అమ్మేద్దాం. ఏభై లక్షలు మ్యూచువల్ ఫండ్ లో పెట్టానన్నావు కదా? అవన్నీ ఉంచుకుని నాకు డబ్బు ఇవ్వడానికి లేదంటావేమిటి"?
"నేను చచ్చినా వాటిని అమ్మను. మా బావకు తెలిస్తే ఊరుకోడు".
"ఏమిటే మా బావా మా బావా అంటూ"? అది మన ఆస్తి. అతనికేమి సంబంధం? అయినా చూస్తున్నాను, ఎప్పుడూ వాడ్ని నెత్తిమీద పెట్టుకుని పూజిస్తావు. నీ భుజాలమీద చేతులేస్తూ, నీ తల మీద రాస్తూ అతగాడి ఆ అతి చనువేమిటి? ఆరోజు బారసాలనాడు నీవు మీ బావ ఒళ్లో తల పెట్టుకుని ఏడ్వడం అతగాడు నిన్ను బుజ్జగిస్తూ ఊరడించడం నేను చూడలేదనుకున్నావా? 'స్టేండ్ బై గా నిన్ను వాడుకుంటున్నాడా'?
తోక తొక్కిన త్రాచే అయింది భర్త మాటలకు. కళ్లల్లో నిప్పులు కురుపిస్తూ ''మరోసారి మా బావనంటే చంపేస్తానురా ఇడియట్''.
'తల్లినయ్యానన్న ఆనందంలో, అమ్మా నాన్నా గుర్తొచ్చి తండ్రి లాంటి బావ ఒడిలో తల పెట్టుకుని ఏడ్చాను. నేను గర్భవతినైనానని ఆ ఆనందాన్ని మొట్టమొదటి సారి నీతో పంచుకోవాలని తహ తహ లాడాను. ఎంతో అపురూపమైన విషయాన్ని వినీకూడా నీలో ఏ స్పందనా లేదు. నోటికి హితవు లేక ఒక్కపూట వంట చేసి పెట్టమంటే నీ స్తానంలో ఎవరున్నా ఆప్యాయంగా నోట్లో తినిపిస్తారు. నీవు నన్ను దగ్గరకు తీసుకుంటూ ప్రేమగా నీ గుండెలకు హత్తుకుంటావని ఎదురుచూసాను'.
''నీకేమి తెలుసురా మా బావ గురించి''? 'నాకు ఏక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్తితిలో ఉన్నపుడు తల్లడిల్లిపోయాడు. నా ఎడమకాలు తీసేసినపుడు నా వెన్నంటే ఉండి నాలో మానసిక స్తైర్యాన్ని నింపుతూ ఒక కూతురిలా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అటువంటి దేవుడిని పట్టుకుని ఇలాంటి అప్రాచ్యపు మాటలు అనడానికి నీది నోరా పెంట కుప్పా'?
''ఏమన్నావే కుంటి ముం......'
దెబ్బతిన్న పిట్టలా విలవిల్లాండింది అతని మాటలకు.
'ఫోరా రాస్కేల్, నా ఆస్తిలో ఒక చిల్లుగవ్వ నీకిచ్చేది లేదు. బిజినెస్ చేస్తానంటూ లక్షలు గుంజుకోడానికి చూస్తున్నావు. ఆస్తికోసం నన్ను మోసం చేసి పెళ్లిచేసుకున్నావని, నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నావని కేసు పెడ్తాను. నిజంగానే నన్ను హింస పెడ్తున్నావు. జైల్లో ఊచలు లెక్క పెడ్దువు గాని. హాయిగా కష్టపడకుండా చిప్పకూడు తినచ్చు. ఈ కుంటిదానితో కలసి ఉండనవసరం లేదు. డైవర్స్ పేపర్లు అరేంజ్ చేస్తాను. నోరు మూసుకుని సంతకం చేయి. నేనిచ్చిన ముఫైలక్షలూ నాలుగురోజుల్లో నా అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేయి. లేకపోతే తీవ్ర పరిణామాన్ని ఎదుర్కోవలసి వస్తుందంటూ తన గదిలోకి వెళ్లిపోయి తలుపులేసుకుంది'.
తపస్వి అలా ఎదురు తిరుగుతుందని ఊహించలేదు శ్రీకాంత్. కుంటిది, పెళ్లి చేసుకుంటాననేసరికి మహాభాగ్యం అనుకుంటూ తనకు లొంగి ఉంటుందనుకున్నాడు. ఆమె ఆస్తినంతటినీ తనపేరు మీద రాయించుకోవాలను కున్నాడు. పెళ్లికి ముందు పరిచయంలోనే ఆమె స్తితిగతులను తెలుసుకున్నాడు. కానీ తన ప్రయత్నం నెరవేరేటట్లు కనపడడం లేదు.
తపస్వి శారీరకంగా బలహీనురాలైనా మానసికంగా చాలా ధైర్యం కలది. ఎప్పుడైతే శ్రీకాంత్ తాగడం మొదలుపెట్టి అబధ్దాలాడడం గమనించిందో అప్పటినుండే తను అతని విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో గట్టిగా నిర్ణయించుకుంది. అతని ప్రేమలో నిజాయితీ లేదని తెలుసుకుంది. తను ప్రేమకు విలువనిస్తుంది. డబ్బుకి కాదు. కానీ ఆ ప్రేమ బూటకం అని తెలిసి తను మోసపోయానని తెలిసినప్పుడు తన ఆస్తిని గుడ్డిగా అతని చేతిలో పెట్టదలచుకోలేదు.
ఆరునెలల తరువాత కోర్టునుండి విడాకులు పొందింది తపస్వి. అక్క తనను దగ్గరకు తీసుకుని ఏడుస్తుంటే 'ఎందుకక్కా ఏడుస్తావు? ఇదంతా చేతులారా నేను చేసుకున్నది కాదా'? ముక్కూ ముఖం తెలియని ఒక వ్యక్తిని గుడ్డిగా ప్రేమించాను. అతను నా వెనుకనున్న ఆస్తిని మాత్రమే ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించుకోలేకపోయాను. అతను పెళ్లి చేసుకుంటాననేసరికి ఈ అవిటిదానికి అంతటి అదృష్టమా అనుకుంటూ ఎగిరెగిరి పడ్డాను. నాది అత్యాసే కదూ?
''కుంటిదానివంటూ మాటి మాటికి గుర్తుచేస్తూ నన్ను కుళ్లబొడిచే వాడక్కా'' అంటూ అక్కను చుట్టేసుకుని హృదయవిదారకంగా ఏడుస్తోంది. తపస్విని ఏనాడూ ఒక చిన్న మాటకూడా అనకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నారు తాము.
సందీప్ బాధను తట్టుకోలేక కన్నీళ్లను తుడుచుకుంటున్నాడు. 'భగవంతుడు నీకే ఇన్ని కష్టాలు ఇవ్వాలా తపస్వీ, విధివంచితరాలివమ్మా' అనుకుంటూ విలవిల్లాడిపోతున్నాడు.
'నీవిక్కడ ఒంటరిగా ఉండద్దు తపస్వీ, మాకు దగ్గరలో ట్రాన్స్ ఫర్ కు పెట్టుకుని వచ్చేయమంది మానస'.
''ఒంటరినెందుకు అవుతానక్కా, మహిమ లేదూ''? ''నా జీవితానికి అర్ధం అదే కదా'' అంటున్న చెల్లెలి వైపు చూస్తూ బాధగా నిట్టూర్చింది మానస.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments