top of page

విద్య విశిష్టత



'Vidya Visishtatha' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 29/12/2023

'విద్య విశిష్టత' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


1.శ్రీ వల్లభు తనయు సతిని నా యుల్ల మందు నిల్ప

సారంబగు చదువులెల్ల  సాకారము జేయ గోరితి

ఆ తల్లి ప్రేమ పాత్రు డే తీరునైన నేర్చుచును

రాపాడుచు  చదువులన్ని రాత్రింబవలున్.


2.సంతకము జేయ సాకులు జెప్పుచు

వేలి ముద్ర లేయ వేగిర పడువాడు

సొంత బుద్ధి లేని సోకుల మొనగాడు

వింత పశువుకన్న  నవివేకుడన్న.


3.ప్రమిదలోన వత్తులు పదిలంగ వేసి

చమురు బోసిన పిదప చయ్యన వెలిగించ

దీపమొక్కటి వెలుగు దేదీప్యమానమై

చదువు నేర్చిన నింక సంస్కార మట్టులే చట్టు నంటు


4.అక్షరాలు రాని ఆసామి నెంచ 

బిక్షగానికన్న బీద యనగ నట్లె

పెక్కు భాషలొచ్చి పేరైన రాయని

నక్క జిత్తుల వాడు నాగరికుడు గాడు.


5.బెరుకు నెంచి చదువు బేరాల నాడక

తనువు వంచి జదువ తగిన బేరమదియె

గరకు రాళ్ళకైన  గాలి వాన సోక

నునుపు దేలి మెరుచు నూనె రాసిన యట్లు.


6.ఒజ్జలు జెప్పిన జదువుయు గజ్జెలు గట్టిన నాట్యము

బొజ్జలు నిండని వారికి గుజ్జనగూళ్ళ వంట 

మరుగుజ్జు కొజ్జ లందు అవహేళన జూపు

బెజ్జము లేని గారెలు పజ్జ నవ్వు విజ్జోడు నెంత్రు వివరింపంగన్.


7.కోడి కూర దెచ్చి కోరినట్టులొండి 

పాడి గేదెపాలు పాయసంబు జేసి

గారె బూరెలెన్నొ గారాబు దినిపించి

చదువు నేర్చు కొమ్మన్న చదువ గలడి చండిగాక.


8.బడికి బోవ మన్న బద్దకంబుగ నుండు

గుడికి బోవమన్న గున గున ఉరుకు

జడుపు యాస రెండు జగమెరిగి యున్నను

బడికి బట్టెడి బాటె బడియనెడి గుడికి రన్న.


9.విద్య లేని నాడు వియచ్చరము లేదు  

విద్య గలిగి నేడు విశ్వ గమనము సాధించె

మానవుండు మిగుల మహదాశయము తోడ

చదువు వల్ల గల్గు చమత్కార మదియె.


10.బద్దకంబు వీడి బడికి బోయి

శ్రద్ధ యుంచి జదువు బుద్ధి తోడుత నేర్వ

పెద్ద రాతిని మలచిన ముద్దు శిల్పము రీతి

మొద్దు బారిన బుద్ధికి మోక్షమొసగు గురువు.


11.పలక బలపము బట్టి పలుమార్లు వల్లించి 

ఓనమాలు నేర్వ నోపిక యున్న

అక్షరాలు వ్రాయు లక్షణ మెరుగుచు

మానవుండు మహిలోన మాన్యుడగును.


12.లచ్చి ధనమిచ్చు నచ్యుతుండభయ మిచ్చు 

శివుడు శుభ మిచ్చు శివ సతియు వరము లిచ్చు

ఇచ్చు విరించి సతియింక విద్యలెల్ల యనగ

మ్రుచ్చు దోచని ధనమిచ్చు  ముదము మీర.


-సుదర్శన రావు పోచంపల్లి


37 views0 comments

Comments


bottom of page