top of page

ఆడవాళ్లు మీకు జోహార్లు



'Adavallu Miku Joharlu' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 28/12/2023

'ఆడవాళ్లు మీకు జోహార్లు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ



గోపి ఒక ప్రైవేటు కంపెనీ లో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. మంచివాడే.. కానీ కొంచం కోపం, ఆవేశం ఎక్కువ. తన కొడుకు కోసం ఓర్పు, సహనం ఉండే అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని తల్లి జయమ్మ ఎప్పుడు అనుకుంటూ వుండేది. 


అలాంటి సంబంధం కోసం.. చాలానే చూసింది. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు.. ఒక వంటా వార్పూ రాదు.. ఒక పని చేతకాదు. ప్రతిదానికి.. ఆన్లైన్ ఆర్డర్స్.. పనివాళ్ళ తోనే పనులన్నీ చేయించుకునే వారే అంతా!.. జయమ్మ కు ఇదంతా నచ్చేది కాదు. అమ్మాయంటే.. ఓర్పు, నేర్పు ఉండి.. ఇంటి పని, వంట పని.. అన్నీ వచ్చి ఉండాలి అని అందరితో అంటూ ఉండేది. 


అలా చూడగా, ఎక్కడో రాజమండ్రి లో దూరపు బంధువుల అమ్మాయి ఉందని తెలిసింది జయమ్మకు. తాను కోరుకున్న అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయేనని ఎవరి ద్వారానో తెలిసింది. 


"ఒరేయ్ గోపి! అమ్మాయి ఫోటో చూసావు కదా.. ఎలా ఉంది.. నచ్చిందా?" అడిగింది జయమ్మ. 


"అమ్మాయి బాగుంది అమ్మా! నాకు ఇలాంటి అమ్మాయే కావాలి.. " అన్నాడు గోపి. 


ఇంక ఆలస్యం చెయ్యకుండా.. కొడుకు గోపి ని పెళ్ళిచూపులకి ఆదివారం వెళ్ళాలని చెప్పింది. ఆదివారం పెళ్ళిచూపుల హడావిడి మొదలు. జయమ్మకు అమ్మాయి పెట్టిన కాఫీ దగ్గరనుంచి.. చేసిన జీడిపప్పు ఉప్మా వరకు, అన్నింటికీ  ఫుల్ మార్కులు వేసేసింది. ఇంక గోపి అయితే.. అమ్మాయి అందం చూసి వెంటనే ఓకే చెప్పేసాడు. 


పెళ్ళైన కొత్తలో సంసారం చాలా ఆనందంగా సాగింది. జయమ్మ ఇక ఈ లోకానికి సెలవని చెప్పి వెళ్లిపోయింది. 'గోపి వెడ్స్ పద్మ' అని అచ్చు వేసిన శుభలేఖ కు ఇప్పుడు రెండు సంవత్సరాల వయసు. 


"ఒసేయ్.. పద్మా!.. ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఎక్కడో ఉంటావు.. ఎంత పిలిచినా పలకవు.. " అన్నాడు గోపి. 


"వస్తున్నాను.. చెప్పండి.. " అంది పద్మ. 


"కొంచం కాఫీ ఇస్తావా?.. " అడిగాడు. 


"ఉదయమే ఇచ్చాను కదా.. మళ్ళీ కావాలా?.. " అంది. 


"అవును.. ఇవ్వనంటావా?.. "


"ఇస్తాను లెండి.. వేరే పనిలో ఉన్నాను, కొంచం ఆగండి.. " అంది పద్మ. 


"ఎందుకు ఆగాలి.. సంపాదించి తెస్తున్నాను.. అడిగింది చెయ్యడమే నీ పని.. టైం కి ఇవ్వకపోతే ఎలా?.. బయటకు వెళ్లి సంపాదించడం ఎంత కష్టమో తెలుసా?.. " అన్నాడు గోపి. 


"నాకూ పనులుంటాయి కదా!.. ఇంట్లో అన్నీ నేనే చేసుకోవాలి.. అప్పుడప్పుడు.. బయటకి కుడా వెళ్ళాల్సి వస్తుంది.. "  అంది పద్మ. 



"పనంటే.. నాది.. ఉదయం వెళ్తాను.. సాయంత్రం వస్తాను.. నెల తిరిగేసరికి జీతం తో బ్యాంక్ బ్యాలెన్స్ .. నువ్వు చేసే పని ఏమిటంట అంత గొప్పా?.. " అన్నాడు గోపి. 



"అలా అనకండి.. ఆడవాళ్ళు ఇంట్లో చేసే పని, జీతం లేని చాకిరీ అండి.. నాకు కోపం తెప్పించకండి ప్లీజ్!.. " అంది పద్మ. 


"ఎందుకు రాదు.. అన్నీ వస్తాయి.. మాకు రాదు మరి.. !"


"అలాగైతే, నేను ఒక నెల రోజులు పని చెయ్యను.. మా పుట్టింటికి వెళ్ళిపోతాను.. కొంచం రిలాక్స్ అయి వస్తాను.. ఈ నెల మీరు ఇల్లు మేనేజ్ చేసుకోండి.. నా పని అంత గొప్పది కాదు కదా.. మీ బ్యాంకు బ్యాలెన్స్ తో పనులు చేసుకోండి.. ఓకే.. బై. మళ్ళీ ఒకటో తారీఖు కలుస్తాను.. " అంది పద్మ. 



"నేను మాములుగా అన్నానే.. అంత సీరియస్ గా తీసుకుంటే, ఎలా?.. "


"ఈ మాట ఎప్పుడూ అంటూనే వుంటారు.. కిందటి వారం.. ఉప్మా చేస్తే, ఎప్పుడూ ఉప్మా ఏమిటి అని తిట్టారు. సులువుగా ఉంటుందని.. పోపులో పడేస్తారని అన్నారు. ఇంట్లోనే ఉంటాను కదా.. ఏ ఇడ్లీ పిండో, దోస పిండో కలపచ్చుగా అని కసురుకున్నారు. ఈసారి.. డిసైడ్ చేసెయ్యాలి.. అంతే.. " అంది పద్మ. 



"నీకే అంత పట్టుదల ఉంటే, నాకు ఉండదా పద్మా. సరే.. చూస్తూవుండు.. ఎంత హ్యాపీ గా ఉంటానో,ఈ నెల రోజులు.. "  అన్నాడు గోపి. 



"ఓకే.. హ్యాపీ మంత్ ఆఫ్ గోపి.. "


"నన్ను డ్రాప్ చెయ్యమంటావా పద్మా?.. "


"వద్దు లెండి.. ఈ నెల రోజుల్లో మీకు ఎప్పుడైనా కష్టమనిపిస్తే, వచ్చి నన్ను తీసుకురండి. నాకు అక్కడ.. మా అమ్మ అన్నీ చేసి పెడుతుంది’. అంది పద్మ. 


పద్మ వెళ్ళిపోయినా తర్వాత.. ఇంట్లో సందడి లేదు.. వంటింట్లో ఎప్పుడు ఉండే ఆ అలికిడి లేదు. గోపి తలుపులు వేసి పడుకున్నాడు. మర్నాడు నిద్ర లేచేసరికి.. లేట్ అయిపోయింది.. ప్రేమతో కాఫీ పెట్టే భార్య ఇంట్లో లేదు. కాఫీ కోసం.. బయటకు వెళ్ళే అంత టైం లేదు.. ఆఫీస్ లో తాగేస్తానని వెంటనే రెడీ అయ్యి.. హడావిడిగా వెళ్ళిపోయాడు.. "


ఒక ఇరవై రోజుల తర్వాత.. గోపి ఒక ఆదివారం అత్తారింటికి బయల్దేరాడు.. 


"పద్మా! పద్మా!” అని ప్రేమతో తలుపు కొట్టాడు. 


"అల్లుడుగారా?” అంటూ లోపల నుంచి అత్తగారు వచ్చి, కుశల ప్రశ్నలు వేసి, కూర్చోమని చెప్పి.. లోపలికి వెళ్ళింది. 


లోపల నుండి పద్మ వచ్చి.. “అప్పుడే వచ్చేసారే? ఇంకా పది రోజులు ఉంది అనుకుంటాను.. "


"ఎందుకు పద్మ.. ఇంకా నన్ను ఆట పట్టిస్తావు?.. "


"అయ్యో!.. నేను గమనించనే లేదే.. చిక్కినట్టు ఉన్నారే.. ? శ్రీవారు.. పాపం"


నా కష్టాలు ఏం చెప్పమంటావు పద్మా.. నువ్వు వెళ్ళినప్పటినుంచి.. ఇంట్లో అలికిడి లేదు.. వంటింటికి కళ లేదు.. ప్రేమతో కాఫీ ఇచ్చే నువ్వు లేవు. పోనీ, బయట తాగుదామా అంటే, అది నీ చేతి కాఫీ లాగా ఉంటుందా.. ? నాకా.. వంట రాదు.. కనీసం గ్యాస్ ఎలా వెలిగించాలో తెలియదు. బయట ఫుడ్ తెచ్చుకుంటే, ఏదో కవర్ లో తెచ్చి పడేస్తాడు.. అవన్నీ ఇప్పుకుని.. తినడానికే సరిపోతుంది టైం అంతా.. పైగా.. బాగా కాస్ట్‌లీ.. ! ఇంట్లో మిగిలిన పనులన్నీ అలానే ఉన్నాయి. 


పోనిలే అనుకుని, రోజూ బయట తింటే, నా జీతం మొత్తం స్వాహా అయిపోతుందని అర్ధమైంది. పైగా, కడుపులో కుడా బాగుండట్లేదు పద్మ.. మళ్ళీ అదో ప్రాబ్లం.. డాక్టర్ బయట ఫుడ్ వద్దన్నాడు. పోనీ, వంట మనీషి ట్రై చేద్దామని అడిగాను.. అది నా వల్ల అయ్యే పని కాదు. వాళ్ళకు అన్నీ సిద్ధం చేస్తే, అలా వంట చేసి వెళ్ళిపోతారు.. దానికీ పెద్ద కట్నమే చదివించుకోవాలి. 


ఇంకా.. చెప్పాలంటే, ప్రేమగా మాట్లాడేవారు లేరు.. ఇలా ఉన్నాయి నా కష్టాలు. నన్ను క్షమించు పద్మ. మీ ఆడవాళ్ళకు జోహార్లు.. ఇంట్లో మీరు చేసే పనికి లెక్క వేస్తే, మా జీతం కన్నా ఎక్కువే ఇవ్వాలి. అయినా.. శ్రీమతి చూపించే ప్రేమ కు వెల కట్టగలమా చెప్పు పద్మా!” బాధతో అన్నాడు గోపి. 


“పదండి.. కాళ్ళు కడుక్కోండి.. భోజనం రెడీ గానే ఉంది.. నా చేత్తో వడ్డిస్తాను.. తినేసి ఇంటికి బయల్దేరదాము.. ఇంక మిమల్ని ఇబ్బంది పెట్టను.. మీరు ఇబ్బంది పడుతుంటే, మేము చూడగలమా చెప్పండి!” అంది పద్మ అనునయంగా.. 

*******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ







75 views0 comments
bottom of page