top of page

సప్తతత్వాలు - పార్ట్ 1'Sapthathatvalu - Part 1/2' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 29/12/2023

'సప్తతత్వాలు - పార్ట్ 1/2' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ1. సప్త అనగా ఏడు. సంగీతంలో స్వరాలు ఏడు :- 

స.. రి.. గ.. మ.. ప.. ద.. ని(స) మధురాతి మధుర సంగీతానికి మూలం ఈ సప్తస్వరాలు. 


2. ప్రస్తుత 20వ శతాబ్దం ప్రకారం సప్త సముద్రాలు ఏడు :- 

1. ఆర్కిటిక్, 2. నార్త్ అట్లాంటిక్, 3. సౌత్ అట్లాంటిక్, 4. సౌత్ పసిఫిక్, 5. నార్త్ పసిఫిక్, 6. ఇండియన్, 7. సదరన్.


3. మన పురాణ ఇతిహాసాల ప్రకారం కూడా సముద్రములు ఏడు. 

వాటి పేర్లు : 1. లవణ (ఉప్పు) సముద్రము 2. ఇక్షు (చెరకు) సముద్రము 3. సురా (మద్యం/కల్లు) సముద్రము 4. సర్పి (ఘృత/నెయ్యి) సముద్రము 5. క్షీర (పాలు) సముద్రము 6. దధి (పెరుగు) సముద్రము 7. నీరు (టి) (మంచినీరు) సముద్రము. 


4. హైందవ శాస్త్రాల ప్రకారం ద్వీపములు ఏడు (ద్వీపము అనగా నాలుగువైపులా నీరు వుండునది)

సప్త ద్వీపములు :- 

1. జంబూ ద్వీపం 2. ప్లక్ష ద్వీపం 3. శాల్మలీ ద్వీపం 4. కుశ ద్వీపం 5. క్రౌంచ ద్వీపం 6. శాక ద్వీపం 7. పుష్కర ద్వీపం. 


5. సప్త ఋషులు :- 

1. వశిష్టుడు 2. అత్రి 3. గౌతముడు 4. కశ్యపుడు 5. భరద్వాజుడు 6. జమదగ్ని 7. విశ్వామిత్రుడు

6. సప్త వర్ణములు (ఏడు రంగులు) :- 

1. ఇంద్రధనుస్సు 2. సీతాకోకచిలుక వన్నె ఎరుపు 3. నలుపు 4. పసుపు 5. ఆకుపచ్చ 6. గోధుమ 7. తెలుప


7. సప్త గిరులు (ఏడుకొండలు) :- తిరుమల కలియుగ వరదులు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నిలయం. యావత్ ప్రపంచ రక్షకులు శ్రీ మన్నారాయణులు. ఆ ఏడుగిరుల (కొండలు) పేర్లు.. 


1. శేషాద్రి (శ్రీహరుని శయన తల్పము ఆది శేషుల పేరిట వెలసినది)


2. నీలాద్రి (తొట్టతొలుత భక్తురాలు నీలాంబరి తలనీలాలను సమర్పించిన కారణంగా నీలాద్రి వెలసింది)


3. గరుడాద్రి (దాయాదులైన కద్రువ పుత్రులను (నాగులు) సంహరించిన రుత్మండుడు పాపపరిహారార్థం శ్రీమహావిష్ణుమూర్తిని మనమున జపిస్తూ తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షం కాగానే, తనకు తిరిగి వైకుంఠం చేరే వరాన్ని ప్రసాదించమని కోరాడు గరుత్మంతుడు. దానికి స్వామివారు తాను ఏడుకొండల మీద వెలయనున్నానని, ఆ వైనతేయుడిని కూడా శైల (పర్వత) రూపంలో అక్కడ వుండవలసినదిగా ఆదేశించారట). 


4. అంజనాద్రి :- వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకొన్న అంజనాదేవికి చాలాకాలం వరకు సంతానం కలుగలేదు. ఆకాశగంగ అంచున ఉన్న కొండమీద కూర్చుని ఏళ్ళ తరబడి తపస్సు చేయగా, వాయువు (గాలిదేవుడు) ఆమెకు ఒక పండును ప్రసాదించి, ఆరగించమని చెప్పాడట. ఫలితంగా ఆ దంపతులకు శ్రీ ఆంజనేయస్వామి (హనుమంతుడు) జన్మించాడట. అంజనాదేవి తపమాచరించి పుత్రసంతానాన్ని పొందిన కారణంగా ఆ పర్వతానికి అంజనాద్రి అనే నామం వచ్చినది. 


5. వృషభాద్రి :- కృతయుగంలో తిరుమలలోని తుంబుర తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు (అసురుడు) ప్రతిరోజూ తన తలను నరికి పరమశివులకు నైవేద్యం పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి శిరస్సు పుట్టుకొచ్చేది. అతని అపారభక్తికి మెచ్చిన శివుడు, ఒకనాడు వృషభునకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నారు. ఆ మూఢ భక్తుడు శివునితో ద్వంద యుద్ధం చేయాలని వుందని చెప్పాడు. ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణం విడిచేముందు అక్కడ తనకు ముక్తి లభించినందున గుర్తుగా ఆ పర్వతాన్ని తన పేరునే పిలవాలని కోరుకొన్నాడట. శివుడు అతని కోర్కెను మన్నించాడు. అదే వృషభాద్రి 

6. నారాయణాద్రి (మహావిష్ణుమూర్తి ధర్మాశార్థం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి. తపమాచరించి ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణులను, తాను తపమాచరించిన ఆ పర్వతాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలవాలని కోరాడట. విష్ణుమూర్తి అందుకు అంగీకరించారట. ఆకారణంగా ఏర్పడిన పేరు నారాయణాద్రి. 


7. వెంకటాద్రి (కలియుగ దైవం వెలసిన గిరికొండ) వైకుంఠం నుండి ఇలకు గరుడుడు (భూమికి) తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని పురాణ వివరణ. ’వేం అంటే పాపాలు అని, ’కట అంటే వారించడం అని అర్థం. అంటే స్వామి వారి సమక్షంలో సర్వ పాపములు నశిస్తాయని, అందుకే ఆ గిరికి వెంకటాద్రి అని ప్రతీతి (పేరు). 


పై తత్త్వానికి పురాణరీత్యా ఒక కథ మహనీయులైన శ్రీకాళహస్తిలో నివశించే పురంధర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు మాధవుడు. ఆ మగబిడ్డను కన్నతల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. వయస్సు వచ్చిన మాధవుడు చెడు సావాసాలు ఎన్నో పాపాలు చేశాడు. ఒకరోజున అనుకోకుండా అతడు కొంతమంది యాత్రికులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళతాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నిలుచున్న మాధవునికి ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలైంది. ఉపశమనం కోసం వారి నామాన్ని కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకొని వున్న అన్నీ పాపాలూ నశించియట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితం అయినాడు. అతడే మరుజన్మలో ’తొండమాన్ చక్రవర్తి’గా పుట్టాడని స్వామివారికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని స్థల పురాణం గాధ. 


సప్తతత్వాలు :-


1. బలితత్వం 2. శ్రీరామ తత్వం 3. రావణతత్వం 4. శ్రీకృష్ణతత్వం 5. దురోధనతత్వం 6. కర్ణతత్వం 7. హరిశ్చంద్రతత్వం దాతృత్వం


1. బలితత్వం :- (దాతృత్వము, త్యాగము.. )


బలిచక్రవర్తి ప్రహ్లాదునికి కొడుకైన విరోచనుని కొడుకు మహాశూరుడు. ముల్లోకములను జయించి దేవేంద్రాదుల ఐశ్వర్యములను అపహరించి చక్రవర్తి అయ్యాడు. మహాదాత. 

దశావతారాలలో శ్రీమహావిష్ణుమూర్తి ఐదవ అవతారం వామనావతారం. బలిచక్రవర్తి దాననిరతిని పరీక్షించదలచి శ్రీహరి వామన రూపాన్ని ధరించి అతని చెంతకు చేరి మూడు అడుగుల స్థలాన్ని యాచించారు. 


వారి కులగురువు శుక్రాచార్యులు ఆ వచ్చినది శ్రీమహావిష్ణువని ఎరిగిన శుక్రాచార్యులు బలిచక్రవర్తితో ’దానమిచ్చుటకు అంగీకరించవలదు’ అన్నాడు. 


కానీ, దానగుణ ప్రధానుడైన మహాత్యాగి (బలిచక్రవర్తి) శ్రీమహావిష్ణుమూర్తి కోరిన రీతిగా మూడు అడుగు దానమిచ్చుటకు సమ్మతించాడు. 


శ్రీహరి.. ఒక అడుగును భూమిపైన మరో అడుగును ఆకాశముపైన (స్వర్ణము) పై వుంచి పూర్తిగా ఆక్రమించి, మూడవది అయిన మరియొక అడుగునకు చోటును చూపమని అడుగుతాడు. బలిచక్రవర్తి పరమానందంగా నేలకూర్చుని తన తలను మహా విష్ణువుకు చూపుతాడు. 

శ్రీమహావిష్ణువు బలిని బంధించాడు. అతని భార్య వింధ్యావతి పతిభిక్ష పెట్టమని వేడగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పాతాళలోకమున సకుటుంబముగా వాసము చేయునట్లు అనుగ్రహించాడు. బలిచక్రవర్తి దానము ఇచ్చునప్పుడు జలకలశము (కమండలం) నందు శుక్రాచార్యులు దాని ద్వారమునకు అడ్డముగ తన కన్ను నిలిపి (వుంచి) వుండగా, అది ఎరిగిన వామనుడు వైకుంఠవాసుడు మహావిష్ణువు దర్భకఱ్ఱతో (పుల్ల) ఆ కన్నును పొడిచి ద్వారము తెరిచి నీరు కమండలము నుండి బయటికి వచ్చునట్లు చేసెను. అది మొదలు శుక్రాచార్యుడు ఏకనేత్రి అయ్యెను. 

దాతృత్వానికి బలిచక్రవర్తి అందరికీ ఆదర్శమూర్తి. 


2. శ్రీరామతత్వం: 


పితృవాక్య పరిపాలన (మాతాపితలయందు భక్తి గౌరవములు) :- 

దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో దశరథమహారాజు కైకేయితో (మూడవభార్య) దేవేంద్రునికి సహాయం చేయ వెళ్ళినాడు. యుద్ధసమయంలో దానవరాజు సంభాసురుడి కారణంగా గాయపడిన దశరధమహారాజు రధమును దూరంగా తరలించి తన భర్త ప్రాణాలను కైకేయి కాపాడినది. ఆ కారణం యుద్ధానంతరం దశరధ మహారాజు కైకేయికి రెండు వరాలను ప్రసాదించాడు. ఏంకావాలో కోరుకోమన్నాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతానని కైకేయి జవాబు ఇచ్చింది. 


దశరధమహారాజు తన పెద్ద కుమారుడైన (కౌసల్య సుతుడు) శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించిన తరుణంలో, దాసి ముందర మాటల కారణంగా, తన కుమారుడు భరతునకు పట్టాభిషేకము జరగవలే, శ్రీరాముడూ పద్నాలుగు సంవత్సరములు వనవాసం వెళ్ళవలే అని కైకేయి తన రెండు వరములను దశరధ మహారాజును కోరింది. దశరధ మహారాజుకు శ్రీరాముడు అంటే పంచప్రాణాలు. ’వేరే ఏదైనా కోరుకో’ అన్నాడు దశరధుడు. కైకేయి అందుకు అంగీకరించలేదు. తన రెండు కోర్కెలు నెరవేర్చాలని దశరధుని నిలదీసింది. ఆవేదనతో దశరధ మహారాజు నేలకొరిగాడు. 


విషయాన్ని విన్న శ్రీరాముడు సీతా లక్ష్మణ / భార్య, తమ్ముడు సమేతంగా వనవాసానికి వెళ్ళిపోయాడు. దశరధుడు మరణించాడు. 


మాతాపితలు ఆజ్ఞపాలన విషయానికి శ్రీరామచంద్రమూర్తి అందరికీ ఆదర్శం. 


3. రావణతత్వం : 


(పరస్త్రీ వ్యామోహం / ఉన్మాదం :-) 

రావణుని తండ్రి పులస్త్యుని కొడుకు విశ్వవసుబ్రహ్మ తల్లి కైకసి భార్య మండోదరి, మహాశిల్పి మయుని కూతురు. 


సోదరులు, కుబేరుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఖరుడు, దూషణుడు, అహిరావణుడు (ఆరుగురు), సోదరీమణులు కుంభిని, శూర్పణఖ (ఇరువురు) రావణుకుమారులు ఇంద్రజిత్, ప్రహాస్థుడు, అతికాయుడు, అక్షయకుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు త్రిశిరుడు . రావణుల తల్లివైపు తాత మల్యపుడు, మేనమామ మారీచుడు, అమ్మమ్మ తాటకి.

 విహారానికి వెళ్ళిన శూర్పణక అరణ్యవాసంలో వున్న శ్రీరామచంద్రమూర్తిని చూచి మోహించి వివాహరీత్యా రాముని సాహచర్యాన్ని కోరింది. నేను వివాహితుడను, ఏకపత్నివ్రతుడను. నా సోదరుడు లక్ష్మణుడు అడుగో. సంప్రదింపుము అన్నాడు శ్రీరాముడు. శూర్పణక లక్ష్మణునికి తన భావనను తెలియజేయగా ఆవేశంతో శూర్పణక ముక్కూ చెవులను కోసి తరిమేశాడు లక్ష్మణుడు. 


శూర్పణక లంకకుచేరి, తనకు జరిగిన పరాభావాన్ని రావణునకు చూపి ఏడ్చి రామలక్ష్మణులను సీతామాతను గురించి తెలియజేసింది. రావణాసురుడు సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారం చేయదలిచాడు. మారీచుడితో శ్రీరాముని పర్ణశాలకు దూరంగా వెళ్లునట్లు చేయమని చెబుతాడు. మారీచుడు బంగారు లేడీగా మారి శ్రీరాముడు ఉన్న పర్ణశాల ప్రాంతాన సంచరించగా, ఆ బంగారు లేడిని చూచిన సీతామాత ఆ లేడి తనకు కావలయునని శ్రీరాముని కోరుతుంది. జానకి కోర్కె తీర్చుటకు రాముడు ఆ మాయలేడిని పట్టుకొనుటకు దాన్ని వెంబడిస్తారు. అది రామునికి అందకుండా ఆశ్రమం నుండి చాలాదూరం పరుగిడుతుంది. ఎంతసేపటికీ తిరిగి రాని శ్రీరాముని తలచుకొంటూ సీతామాతా విచారపడుతుంది. లక్ష్మణుడు వెళ్ళి అన్నగారితో తిరిగి రావలెనని ఆజ్ఞాపిస్తుంది. మారీచుడు అరచిన ’సీతా.. లక్ష్మణ’ అనే దీన ఆర్తనాదం సీతామాతకు ఎంతో కలవరాన్ని ఆవేదనను కలిగించింది. లక్ష్మణుని వెంటనే బయలుదేరమని శాసించింది. 

లక్ష్మణుడు ’అది రాక్షసమాయ తల్లీ! అన్నయ్య తిరిగి వస్తాడు. మీరు విచారపడకండి’ అని చెప్పినా అతని మాటలను సీతామాత విశ్వసించలేదు. లక్ష్మణుని పరుష బాషణతో వేధించినది. వెళ్ళక తప్పదని నిర్ణయించుకొన్న లక్ష్మణుడు పర్ణశాల ముంగిట ’లక్ష్మణరేఖను గీచి నేను మా అన్నతో తిరిగి వచ్చువరకు మీరు ఈ గీతను దాటి ముందుకు రాకూడదని చెప్పి లక్ష్మణరేఖను చూపి అన్న రాముని కోసం లక్ష్మణుడు ఆశ్రమ ప్రాంతాన్ని విడిచి వెళతాడు. 


రావణుడు ఆ తరుణంలో పర్ణశాల ముందు జంగందేవర వేషంలో నిలిచి ’భవతి భిక్షాం దేహీ!’ అని అర్థిస్తాడు. అతనిని చూచి అతని మాటలను విన్న సీతామాత మహిమాన్వితమైన దేవరకు బిక్ష ఇచ్చేందుకు లక్ష్మణరేఖను దాటక తప్పలేదు. లక్ష్మణరేఖకు ఆవలివైపున సీతామాత వున్నంతవరకూ ఏమీ చేయలేని రావణుడు, మాత గీత దాటగానే తన మాయతో మాతను చెరపట్టి ఆకాశమార్గమున తన పుష్పక విమానంలో లంకకు తీసుకొని వెళ్ళాడు. అశోక వనంలో రాక్షసకాంతల మధ్యన ఉంచాడు. 


అశ్రమమునకు తిరిగి వచ్చిన రామలక్ష్మణులు సీతామాతను కానక.. అరణ్యమంతా వెదికి శ్రీ ఆంజనేయస్వామిని కలిసి సుగ్రీవ మైత్రితో.. శ్రీ అంజనాసుతుని మూలంలా సీతామాత లంఖలో వున్న విషయాన్ని తెలిసికొని, వానర సైన్యంతో సాగరంపై శ్రీరామనామ వ్రాసిన శిలలను విసిరి, వారధి నిర్మించి, లంకకు చేరి యుద్ధంలో రావణుని అతను దుష్టపరివారాన్నంతా అంతం చేసి శ్రీరాముడు తన చెంతకు వచ్చి శరణువేడిన రావణుని సోదరుడు మంచివాడైన విభీషణున్ని లంకా రాజుగా చేసి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్య నగరానికి తిరిగి వచ్చి పట్టభిషక్తులైనారు. 


పరస్త్రీ వ్యామోహితుడు రావణుడు పతనమైపోయాడు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

39 views0 comments

Comments


bottom of page