top of page

విఘ్నాధిపతి

Updated: 2 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #విఘ్నాధిపతి, #దక్షిణామూర్తి

గాయత్రి గారి కవితలు పార్ట్ 32

Vighnadhipathi - Gayathri Gari Kavithalu Part 32 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 05/07/2025

విఘ్నాధిపతి - గాయత్రి గారి కవితలు పార్ట్ 32 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


విఘ్నాధిపతి.

(ఆటవెలదులు )

**********************************

మదము తోడ చేర మత్సరంబను దుష్ట

రోగ పీడితులకు లోకమందు 

జీవదుండ వగుచు శ్రేయంబు చేకూర్చు

నాదివేల్పువీవె!యభయ మొసగు!//


దేహపంజరమున దిగులుతో జీవుండు 

చిక్కు కొనగ నీవు చెలిమి తోడ 

ముక్తి పథము గాంచు పున్నెంబునిడుచుండు

దోషహారి!మాకు తోడు వీవె!//


జన్మ కర్మ లనెడి చక్ర మందు పొరలి

మోయలేని భారములను తల్చి

కుములు చున్న మమ్ము కూర్మితో రక్షించి

సుగతి నొసగి కాచు శూర్పకర్ణ.//


జ్ఞానబిక్ష నొసగు శంకరప్రియ పుత్ర

తలుచు కొందు మయ్య తనివి తీర

సద్వివేకమనెడి సంస్కారమిడుచుండి

సాకు కొనుము మమ్ము సంతువోలె.//


భళిగ మూషికంబు వాహనంబుగ జేర 

భక్త జనుల బ్రోవ పఱుగు పెట్టి 

విశ్వమంత తిరుగు విఘ్నాధిపతి నిన్ను

కోటికోటి నతుల కొలుతుమయ్య!//


************************************














దక్షిణామూర్తి

(ఇష్టపది)


************************************


ఆ భవుని యవతార వైభ వంబుల నెఱుగ

జలజసంభవునికే సాధ్యంబు కాదులే.


మౌనముద్రను దాల్చి మాయలను ఛేదించు 

విద్యలను నేర్పగా పృథ్విపై వెలిశాడు.


దక్షిణామూర్తిగా తాపముల శమియించి 

మోక్షగాములకు తాన్ ముక్తి నందిస్తాడు.


జ్ఞానమే పరమాత్మ సాధనా మార్గమని 

వైరాగ్యభావనకు పరిపూర్ణ రూపమై 


ఆ స్వామి వెలుగొంద నార్తి తొలగించుకొని 

భక్తాళి వినతితో ప్రణతులను సల్పెదరు.


పరమాత్మ శ్రీపాద పద్మములు సేవింప

మదిని పీడించు మదమాత్సర్యములు తొల్గు


సదసద్వివేకంబు సంయమన తత్త్వంబు 

జనులలో పెంపొంద శాంతి వర్థిలుతుంది.


సాధుమార్గము చూపు సజ్జనాత్ములు నేటి

సంఘమును నడిపించ జాతికే మేలగును.//


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page