top of page

విజయదశమి విశిష్టత

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #Vijayadasami Visishtatha, #విజయదశమివిశిష్టత

ree

Vijayadasami Visishtatha - New Telugu Article Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 02/10/2025 

విజయదశమి విశిష్టతతెలుగు వ్యాసం

రచన: సుధావిశ్వం ఆకొండి


 దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. 'దశ హర' అంటే పది తలలు ఉన్న రాక్షసరాజు రావణాసురుని తలలు త్రెంచి శ్రీరాముడు ధర్మసంస్థాపన చేసిన రోజుగా దశ హర అని క్రమంగా దసరాగా పిలువబడింది. 


విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు అజ్ఞాతవాసం కోసం వెళ్తూ, జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను భద్రపరిచి, అజ్ఞాతవాసం పూర్తి అయ్యక తిరిగి ఆయుధాలు తీసుకున్న రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. 


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలిపి ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రిగా జరుపుకుంటారు. 


శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. కొన్ని సంప్రదాయాల్లో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ! 

ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు అయిన విజయదశమి నాడు రాజరాజేశ్వరిదేవిగా అలంకరించి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొన్నిచోట్ల నవరాత్రులు నవదుర్గలుగా అమ్మను ఆరాధిస్తూ, దుర్గ పూజ చేస్తారు. 


ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు తొమ్మిది రాత్రులను నవరాత్రులుగా చెబుతారు. 


కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజావిధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరల తన ఐశ్వర్యమును పొందెనని ఐతిహాసిక కథ ఉంది. 


ఈ కథను బట్టి ప్రజలు దుర్గ, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని మూడేసి దినములు పూజింతురు. ఈ తొమ్మిది రాత్రులయందును పూజించుటకు వీలుకాకపోతే చివరి రోజన విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధి ప్రకారము పూజించడం ఒక పద్ధతి. జీవనం కోసం ఎవరు ఏ వస్తువులు ఉపయోగిస్తారో అవి అమ్మవారి అమ్మవారి ముందు ఉంచి పూజిస్తారు. ఆయుధపూజగా చెబుతారు. 


 నవరాత్రి ఉత్సవాలలో, ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు. ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. 


కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కంధమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా నవదుర్గలుగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు. 

***

జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. 


పురాణాలలో అమ్మవారి దుష్ట సంహారానికి సంబంధించిన వివరణ ఉంది. అసలు మహిషాసుర మర్ధిని ఎలా, ఎందుకు ఆవిర్భవించింది మొదలైన విశేషాలు తెలుసుకుందాం!


దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగికులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, .. 


"ఓ మహిషాసురా! ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో!" అని అడుగగానే

 

"పితామహా! నేను అమరుణ్ణి కావాలి! నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు!" అని అందరు రాక్షసులు అడిగినట్లే కోరిక కోరాడు మహిషాసురుడు. 


అప్పుడు బ్రహ్మదేవుడు..

"మహిషాసురా! పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు! కనుక మరొక వరం ఏదైనా కోరుకో! తీరుస్తాను!" అన్నాడు.


అప్పుడు మహిషాసురుడు.. 

"విధాతా! ఆడది నా దృష్టిలో అబల. ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు!" అని కోరాడు. 


బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి, ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. తేజోమయమైన మంగళమూర్తిగా అవతరించిన ఆ తల్లి పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది. 


ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. 


మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. 


దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించి, లోకాలను రక్షించిన రోజుగా దసరా పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం! 


*****


తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. 


ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. 


ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూళ్లు పుచ్చుకోవడం ఒక అనవాయితీ! ఈ సమయంలో వెదురు కర్రతో చేసిన రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. 

విద్యార్థులు.. 


"ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా.. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!.. " అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. 


గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. ఈ ఆచారం పూర్వం పల్లెల్లో ఉండేది. 


కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటి తలకు పోసి నూతనవస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అనవాయితీ. 


దసరా ఉత్సవాలను దేశమంతా వైవిధ్యం జరుపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడ.. ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు.ఖానాపూర్, ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. 


***

మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి, ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఆ సమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించ బడుతుంది. ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది. 



దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను మండపంలో పెట్టి, దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలమంది దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత. 


*** 


 ఒడిషా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవి ఆరాధించడం సంప్రదాయం. దీనిని వారు మాన బాన అంటారు. ఒడిషా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున పదిహేను అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మైదానంలో కాలుస్తారు. ఈ రావణ కాష్టం చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు. 


తెలంగాణా ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలుగా ఈ పండుగ జరుపుకుంటారు.. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ చేసుకుంటారు.


ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. 


అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిల్లపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు, తంగేడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబాలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు.


ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు.


ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు. 


విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది. విజయదశమి రోజున జమ్మిచెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటారు. ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్నీ రంగాల్లో విజయం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. 


***


విజయదశమి రోజున రామ్‌లీల ప్రదర్శనలు జరుగుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రామాయణంలోని ఘట్టాలను నాటకాలుగా ప్రదర్శించి, ఆనందిస్తారు. రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పండుగ చివర్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ బొమ్మలను దహనం చేస్తారు. 


విజయదశమి రోజున భక్తులు తాము రోజు వారి ఉపయోగించే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, ఆయుధాలను పూజిస్తారు. విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు, శుభకార్యాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. 


 ఈ విజయదశమి మన దేశానికి, మన రాష్ట్రాలకు మంచి జరిగి, మానవత్వపు విలువలు పెరిగి, ప్రజల్లో సామరస్య భావనలు పరిఢవిల్లాలని, ఆ జగన్మాత మహిషాసుర మర్ధినియై మహిషాసురులను, దుర్గయై దుష్టులను దునుమాడి సమాజాన్ని, మనుషుల మనసులను 

పట్టి పీడించే అన్ని రకాల దుష్టశక్తుల నుంచి మన అందరినీ రక్షించమని ఆ తల్లిని మనసారా వేడుకుంటూ.. 

అందరికీ దసరా శుభాకాంక్షలు 

������. 

 క్షేమాన్ని కలిగించే అన్ని విజయాలు అందరికీ లభించాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 

������

సుధావిశ్వం



ree

-సుధావిశ్వం





Comments


bottom of page