top of page
Original_edited.jpg

వీలునామా


ree

'Vilunama' - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 20/10/2023

'వీలునామా' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"వసంతా! ఇలా రా!" భార్యని పిలిచాడు అప్పుడే ఇంటికి వచ్చిన వామనరావు.


"ఏమిటండీ!" తడి చేతులు పమిట కొంగుతో తుడుచుకుంటూ వంటింట్లోంచి ముందు గదిలోకి వచ్చింది వసంత.


"మా వేలు విడిచిన అత్తయ్య వర్ధనమ్మ లేదూ, ఆవిడ ఈ ఆదివారం మనింటికి వస్తుందట." అన్నాడు వామనరావు కుర్చీలో కూర్చుంటూ.


"ఆవిడా...ఇప్పుడెందుకు మనింటికి రావటం? ఆవిడకి పిల్లాజెల్లా ఎవరూ లేరు గానీ, మీలా వేలు విడిచిన చుట్టాలు బోలెడంత మంది ఉన్నారు కదా! ఇది కావాలి, అది కావాలి అని బోలెడంత నస పెడ్తుంది బాబూ...నే వేగలేను ఆవిడతో! పైగా బోలెడంత పిసినారి కూడానూ. ఆవిడ గురించి మీరే చాలా సార్లు చెప్పారు. మనింటికి వచ్చిందంటే ఓ పట్టాన కదలదు. అందుకే, ఎందుకులెద్దరూ ఆవిడ్ని ఇక్కడికి రానివ్వడం, నేను పుట్టింటికి వెళ్ళానని చెప్పి తప్పించుకోండి." సలహా ఇచ్చింది వసంత.


"ఇప్పుడు మరెలా చెప్పనే! రమ్మని చెప్పేసాను కూడా!" అన్నాడు వామనరావు.


"మీరెప్పుడూ ఇంతే! నన్నడగకుండా అందరికీ మాటిచ్చేస్తారు. మధ్యన గొడ్డు చాకిరీ చెయ్యలేక నేను చావాలి." అంది విసుగ్గా మొహం పెట్టి.


"అలా అనకే! మన బంధువుల్లో ఆవిడకొక్కర్తికే కోట్ల కొద్దీ ఆస్తి ఉంది. వారసులెవ్వరూ లేరు. మనం ఆవిడ ఇక్కడ ఉన్నన్ని రోజులూ బాగా చూసుకుంటే మనపేర ఏంతో కొంతైనా ఆస్తి రాయొచ్చు. ఓ పదో ఇరవై లక్షలో మనపేర రాసినా చాలు." అన్నాడు వామనరావు ఆశగా.


"ఏమో బాబూ, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టీ, ఈ ఒక్కసారికీ ఒప్పుకుంటున్నాను." అంది వాసంతి తనకు తప్పదన్నట్లు. చెప్పినట్లుగానే, ఆదివారం ఉదయమే వర్ధనమ్మ వామనరావు ఇంట్లో అడుగు పెట్టింది.


"అమ్మాయి వసంతా!" అంటూ పిలిచి, “రాత్రనగా రైలు బండీ ఎక్కి అలిసిపోయాను. కాస్త కాఫీ చుక్క ఇయ్యమ్మా! ఆ చేత్తోనే స్నానానికి వేడినీళ్ళు కూడా పెట్టు." అంది కుర్చీలో కూలబడి.


"అలాగే పిన్నిగారూ! ఎలా ఉన్నారు, ఒంట్లో బాగుందా!" అంటూ రాని నవ్వు మొహాన పులుముకుంటూ పలకరించింది వసంత.


"వంట్లో బాగానే ఉంది కానీ, పెద్ద వయసు కదా, ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. అందుకే, అందర్నీ ఓ మారు పలకరించి పోదామని అన్ని ఊళ్ళూ తిరుగుతున్నాను." అంది.


"మంచిది అత్తయ్యా! రాకరాక వచ్చావు, మా ఇంట్లో ఓ పది రోజులైనా ఉండు!" అంటున్న వామనరావువైపు కొరకొరా చూసింది వాసంతి.


"పది రోజులంటావేంటిరా భడవా! కనీసం నెలరోజులైనా ఉండే వెళ్తాను." అంది వర్ధనమ్మ.


'అయ్యిందా!' అన్నట్లు వామనరావు వైపు ఓ చూపు విసిరి, విసురుగా వంటింట్లోకి అడుగుపెట్టింది వసంత.


అక్కడున్నన్ని రోజులూ తనకి కావలసినవి వాసంతి చేత చేయించుకు తింటూ, వామనరావు సహకారంతో ఊరంతా చుట్టేసి వచ్చింది వర్ధనమ్మ ఈ నెలరోజుల్లోనూ.


విసుక్కుంటూనే అన్నీ అమర్చిపెట్టింది వాసంతి. చివరగా వర్ధనమ్మ తిరుగుప్రయాణం రోజు గానీ ఊపిరి పీల్చుకోలేక పోయిందామె. అది కూడా తమకి ఎంతో కొంతైనా ఆస్తి రాయకపోతుందా అన్న ఆశతోనే చేసింది.


ఆమె వెళ్ళిపోయిన తర్వాత, "మా అత్తయ్య నిన్ను బాగా పొగిడిందే! నీ సేవలవల్ల మనకేమైనా ఆస్తి కొంతైనా రాస్తుందేమో?" అన్నాడు వామనరావు.


"ఏమో లెండి, మీ పోరు పడలేక నానా సేవ చేసాను. అంతే!" అందామె.


************


సరిగ్గా ఓ సంవత్సరం తర్వాత, వర్ధనమ్మ గుండెనొప్పితో పరమపదించిందన్న వార్త తెలిసిన వామనరావు హుటాహుటిన వాసంతిని తీసుకొని ఆమె ఊరికి వెళ్ళాడు. వామనరావులాగే, చాలా మంది బంధువులు ఆవిడ ఆఖరి చూపుల కోసం ఆ ఊరు వచ్చి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆవిడ ఆఖరి చూపుల కోసం అనే కంటే ఆమె ఆస్తి కోసం అంటే బాగుంటుంది.


"ఎలాగూ ఈ ఊరు వచ్చాం! వీలునామా బయట పడేంతవరకూ ఉందాం!" అంది వాసంతి.


"అలాగేలేవే! నాకు ఆ మాత్రం తెలియదా!" అన్నాడు వామనరావు. ఆ వచ్చిన చుట్టాల్లో చాలామంది అదే ఉద్దేశంతో వచ్చినవారే! పన్నెండో రోజు కార్యక్రమం పూర్తికాగానే, వర్ధనమ్మగారి వకీలు విశ్వనాథం వచ్చిన అతిథుల్నందర్నీ సమావేశపరిచాడు. అందుకోసమే ఆతృతగా ఎదురు చూస్తున్న బంధుగణమంతా ఆ గదిలో సమావేశమయ్యారు. అందరి మనసుల్లోనూ ఒక్కటే ఆరాటం, ఆస్తంతా తమ పేర్నే ఆవిడ రాసిందేమోనన్న ఆశ కనిపిస్తోంది అందరిలోనూ.


అందరూ వచ్చారని రూఢి చేసుకున్న తర్వాత, మొదలుపెట్టాడు విశ్వనాథం. "ముందు మీరందరూ వర్ధనమ్మగారి అంత్యక్రియలకి హాజరై నిర్విఘ్నంగా ఈ కార్యం పూర్తి చేసినందుకు మీకందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వర్ధనమ్మగారు ఆస్తి అంతా కలిపి ఆరుకోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఆవిడ తన బంధువుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఆధారంగా ఈ వీలునామా రాయించారు. ఈ ఆస్తి మొత్తం చాలా మంది పేర్న రాసారు." అని ఆగాడు.


'పోనీ మొత్తం ఆస్తి దక్కకపోయినా కొంతైనా వస్తుంది కదా!' అన్న ఆశతో ఉన్న అందరూ తదుపరి వివరాల కోసం కాచుకున్నారు.


"తన తదనంతరం ఈ ఆస్తి మొత్తం ఈ ఊళ్ళోనే ఉన్న 'శ్రీ అన్నపూర్ణ అనాథాశ్రమం' లో పెరుగుతున్న వందమంది అనాథల పేర్న రాసారు. అయితే, ఆవిడ తన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సేవలను గుర్తించి ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు."


అందరి మొహాలు ముందు మాడిపోయినా, ఆ మాటలతో మళ్ళీ ఆశ చిగురించింది. ఏమిటా ముఖ్యమైన నిర్ణయం అనుకుంటూ అతని వైపు చూసారందరూ.


"తన ఆస్తి ఆ ఆశ్రమంలో సద్వినియోగం అయ్యేట్లు చూడాల్సిందిగా ఓ ట్రస్ట్ ఏర్పాటు చెయ్యమని, అందులో యోగ్యులైన తన బంధువులను సభ్యులుగా ఉండవలసిందిగా కోరారు ఆమె. ఆ బంధువుల పేర్లు...వామనరావు, లక్ష్మణరావు, కొండలరావు..."


ఇలా సాగాయి విశ్వనాథం మాటలు. వామనరావు, వాసంతి మొహమొహాలు చూసుకున్నారు.


…………………..

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page