'Kotha Keratam Episode 13' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 20/10/2023
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 13' తెలుగు ధారావాహిక
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి, బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.
డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.
రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు. భార్గవ బలహీనంగా ఉండటంతో పోషకాహారాలు తీసుకోవాలని చెబుతాడు రామయ్య.
రామయ్య ఇంటి దగ్గర పాతకాలం నాటి మర్రి చెట్టు ఉంది. రోడ్ వెడల్పు చెయ్యడం కోసం దాన్ని కొట్టబోతుంటే, ప్రభుత్వ అధికారులకు చెప్పి ఆపిస్తాడు భార్గవ.
తమ గ్రామంలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలో భార్గవను చేరుస్తాడు రామయ్య.
ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 13 చదవండి.
తాతగారి వైపు సాలోచనగా చూసి “ఓకే! చూస్తారుగా మీకంటే ముందుగానే లేచి తయారవుతాను”
“అదీ నా మనవడంటే” మెచ్చుకున్నారు.
“మరి అకాడమీలో ఎప్పుడు చేరాలి?”
“అదీ రేపే మొదలు పెడదాము” మనవడిని ఉత్సాహ పరిచారు.
ఆ మరుసటిరోజే అకాడమీలో చేరి తాను ఆడాలనుకుంటున్న ఆటలలో తర్ఫీదు తీసుకున్నాడు.
ప్రాక్టీస్ లో నెలరోజుల సమయం ఇట్టే గడిచిపోయింది. బాగా శిక్షణ పొంది పోటీలకి సిద్దమయ్యాడు భార్గవ.
ఆటల పోటీ రోజున నిర్థారించిన సమయానికి ముందే మైదానానికి చేరుకున్నారు తాతా మనవడూ.
విశాలమైన మైదానంలో ఒకవైపు రన్నింగ్ ట్రాక్, మరో వైపు కబడ్డి కోసం స్థలం, ఇంకో చోట ఖో ఖో ఆడటానికి ఏర్పాట్లు, ఇంకో చోట కుస్తీ పోటీలకి, లాంగ్ జంప్, హై జంప్…ఇలా పోటీలో పెట్టిన ఆటలన్నిటి కోసం ఏర్పాట్లు విస్తృతంగా జరిగాయి.
“అబ్బ! ఒలింపిక్స్ కంటే గొప్పగా ఏర్పాట్లు చేసారు. ఎంత బాగుందో మైదానం” సంభ్రమంగా అన్నాడు.
“మరేమనుకున్నావు మన అచ్యుతాపురమంటే. ఇదంతా ప్రజాపతి పూనుకున్నందువల్లనే సాధ్యమైంది. ఆర్మీలో రిటైరయ్యాక వచ్చిన డబ్బంతా పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు. చాలా చక్కటి ఆలోచన కదా” రామయ్య స్వరంలో గర్వం తొణికిసలాడింది.
“నిజంగా మంచి పని చేస్తున్నారు అంకుల్. మీకో విషయం తెలుసా మా ఊళ్ళో చాలా స్కూల్స్ లో అసలు ప్లే గ్రౌండ్ లేనే లేదు. మా ఫ్రెండ్ సన్నీ స్కూల్లో, ఆటల కోసం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కి చెందిన ఖాళీ స్థలానికి తీసుకెళ్ళి ఆడిస్తారట. వాడు ఒకటే గోల. సో సాడ్ కదా తాతయ్యా”
“అవునురా ఇప్పటి స్కూల్స్ లో ఆటలకి ప్రాముఖ్యత ఇవ్వడమే మానేసారు”
“నిజం తాతగారూ! మాకూ అంతే వారానికి ఒక గేమ్స్ పీరియడ్ ఉంటుందా అది కూడా సిలబస్ పూర్తి కాలేదంటూ ఆ పీరియడ్స్ లోనే స్పెషల్ క్లాసులు తీసుకుంటారు. నాకైతే భలే కోపం వస్తుందనుకో. మేమంతా టీచర్ కి కంప్లైంట్ కూడా చేసాము చాలాసార్లు. అయినా ఎవరూ పట్టించుకోలేదు” దిగులుగా అన్నాడు.
“పోనీలే ఏం చేస్తాం? అందుకనే ఇలా అవకాశం వచ్చినప్పుడు చక్కగా ఉపయోగించుకుంటే సరి”
“అవును నాకూ అదే అనిపిస్తోంది”
ఆ ఏడాది, ప్రజాపతి అకాడమీ నిర్వహించిన ఆటల పోటీలలో భార్గవ టీం ఖోఖో ఆటలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. దానితో పాటు స్వంతంగా మరికొన్ని ఆటలలో కూడా బహుమతులు గెలుచుకుని అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు. అవధులు దాటిన ఆనందంతో, సెలవలు ముగియగానే తాతగారికి వీడ్కోలు చెప్పి తాను గెలుచుకున్న బహుమతులు బ్యాగులోనూ, మరెన్నో మధురమైన అనుభూతులు మనసులోనూ నింపుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడు భార్గవ.
&&&
క్లాస్ టెస్ట్ లు, ప్రోజెక్ట్ లంటూ ఊపిరి సలపనంత వర్క్ తో నలుగు నెలలు ఎలా గడిచయో తెలియలేదు భార్గవకి. అంత బిజీలోనూ ప్రతీ ఆదివారం తాతయ్య తో మాట్లాడడం మాత్రం మానలేదు మనవడు.
ఎప్పటిలాగే ఓ ఆదివారం ఫోన్ చేసాడు.
చాలా సేపు రింగ్ అయ్యాక “హలో ” నీరసంగా పలికారు రామయ్య.
“తాతయ్యా నేను. అలా మాట్లాడుతున్నారేం?”
“ఏమిటోరా ఈ మధ్య కొన్ని రోజులనుంచీ చాలా నీరసంగా ఉంటోందిరా”
“మరి నాకెందుకు చెప్పలేదు? సరే మీరు రెస్ట్ తీసుకోండి” ఫోన్ పెట్టేసి “నాన్నా నేను ఇప్పుడే తాతగారిని చూడాలి” అన్నాడు తండ్రి వద్దకు వెళ్ళి.
“ఏమైందిరా?”
తాతగారికి ఫోన్ చేసిన విషయం చెప్పాడు.
“అవును నాకు చెప్పారు. నేను వస్తానంటే ఫరవాలేదు వద్దన్నారు”
“మరి నాకెందుకు చెప్పలేదు?”
“ఆయనే చెప్పొద్దన్నారు నువ్వు బెంగపెడతావని”
“నేను తాతగారిని ఒకసారి చూడాలి”
“ఇప్పుడా! ఎలాగరా మరి నీ స్కూలో?”
“ఫరవాలేదు నాన్నా. టర్మ్ సిలబస్ అయిపోయింది. రివిజన్ చేయిస్తున్నారు. నేను చదువుకోగలను. అదీగాక ఇంకో రెండురోజుల్లో 10 వ తరగతి టర్మ్ పరీక్షలు అందుకని మాకు క్లాసెస్ ఉండవు”
“నీ చదువు డిస్టర్బ్ అవుతుందిరా. నేనే వెళ్తాలే”
తానూ వస్తానని భార్గవ పట్టుబట్టడంతో “సర్లే పద. నాకు ఆఫీసులో ఆడిట్ ఉంది అందుచేత నిన్ను దింపి వచ్చేస్తాను. మళ్ళీ వచ్చి తీసుకొస్తాను” అప్పటికప్పుడే తండ్రీ కొడుకూ బయలుదేరి అచ్యుతాపురం వచ్చారు.
కొడుకునీ మనవడినీ చూడగానే సగం నీరసం తగ్గి శక్తి వచ్చింది రామయ్యకి.
తండ్రిని విశ్రాంతి తీసుకోమనీ, తాతగారిని జాగ్రత్తగా చూసుకోమనీ చెప్పి తిరిగి వెళ్ళిపోయిన రాజేంద్ర, ఆ మర్నాడు స్కూలుకి వెళ్ళి, కారణం చెప్పి క్లాస్ టీచర్ కి భార్గవ లీవ్ లెటర్ ఇచ్చాడు.
ఒక ప్రక్క తాతగారికి తాను చేయగలిగిన సపర్యలు చేస్తూనే మరో వైపు ఏరోజుకారోజు స్కూల్లో ఏ సబ్జెక్ట్ రివిజన్ చేయిస్తున్నారో స్నేహితులని అడిగి చదివేసుకుంటున్నాడు భార్గవ.
చక్కటి క్రమశిక్షణతో తన కళ్ళముందు ఎదుగుతున్న మనవడిని చూస్తుంటే రామయ్య మనసంతా సంతోషంతో నిండిపోయింది.
పరిసరాలూ పర్యావరణం...ఇలా అన్ని విషయాల పట్లా చక్కటి అవగాహన ఉంది భార్గవకి. చదువులో ఇక చెప్పక్కరలేదు...ఎప్పుడూ వాడే ఫస్ట్.
ఒకరోజు ఉదయం ఆరుబయట చెట్టు నీడలో కూర్చుని చదువుకుంటున్న భార్గవ గట్టి గట్టిగా మాటలు వినిపిస్తే తలెత్తి చూసాడు.
ఆడవాళ్ళూ పిల్లలూ ఖాళీ బిందెలు పట్టుకుని గుంపుగా నడిచి వెళుతున్నారు.
‘ఎక్కడికబ్బా వీళ్ళంతా ఇంత పొద్దున్నే వెళుతున్నారు! తాతగారికి తెలుసేమో అడుగుతాను’ గబగబా ఇంట్లోకి వచ్చి తాతగారు నిద్రపోతుండటం చూసి చప్పుడు చేయకుండా వెనుదిరిగి వచ్చేస్తుంటే “ఏమిటిరా మనవడా నాతో ఏదైనా పనుందా?” అన్నారు రామయ్య.
“అరే! మీరు నిద్ర పోవడం లేదా?”
“లేదులే కానీ ఏంటో చెప్పు?”
“మరీ పిల్లా పెద్దా అందరూ బిందెలు పట్టుకుని ఎక్కడికి వెళుతున్నారు?”
“ఓ అదా! మంచి నీళ్ళు తెచ్చుకోవడానికి”
“అదేమిటి వాళ్ళెవరికీ ఇంట్లో నీళ్ళు రావా?”
“లేవురా. మన ఊర్లో మంచి నీటి సౌకర్యం లేదు. ఇక్కడికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక బావి ఉంది. అందులోంచి నీళ్ళు తోడి తెచ్చుకుంటారు”
“మరి మనకి ఉన్నాయి కదా”
“మన ఇంట్లో బోరు బావి ఉంది. మోటారు వేసుకుంటే నీళ్ళు పైన ట్యాంక్ లోకి వెళతాయి. మనం అవే వాడుకుంటాము. మన బోరులో కూడా ఈమధ్యన నీరు సరిగ్గా అందట్లేదు. నేనూ ఇంకోటి వేయించాలనుకుంటున్నాను”
“ఊ...మరైతే మన గ్రామంలో అసలు చెరువులే లేవా?”
“ఒకే ఒక పెద్ద చెరువు ఉంది కానీ పూడిపోయింది. పూడిక తీయించడం చాలా ఖర్చుతో కూడిన పని. ప్రభుత్వం సహకరిస్తే తప్ప సాధ్యం కాదు”
“మీరు ప్రభుత్వానికి వ్రాయొచ్చుగా?”
“మంచి మాట అడిగావురా. నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఇంతలో ఈ అనారోగ్యం వచ్చిపడింది”
“ఫరవాలేదు తాతయ్యా. మీరు బాగయ్యాకే చేద్దురుగాని ఆ పని. కానీ వానలు పడినప్పుడు నీళ్ళు నిలవ చేసుకోవచ్చును కదా?”
“ఎక్కడ చేసుకుంటార్రా?”
“పోనీ వేరే మార్గాలు అమలు చేసి వాన నీరు వృథా కాకుండా చూసుకోవచ్చును కదా”
“వేరే మార్గాలు అంటే?”
“అంటే ఇంకుడు గుంటలలాంటివి”
“అవేవీ గ్రామస్తులకి తెలియవూ, చెప్పే వాళ్ళూ లేరు”
“అయితే వీళ్ళు ఎప్పటికీ ఇలా నీటికి ఇబ్బంది పడాల్సిందేనా?”
“అదేరా బాధ. నేనూ ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాను ఏం చేస్తే బాగుంటుందా అని?”
“గ్రామస్థులకి మనం తెలియజెప్తే సరి. నాకో ఆలోచన వచ్చింది. చెప్పనా?”
“తప్పకుండా చెప్పరా. మనం చేయగలిగినదైతే తప్పక చేద్దాము”
తన ఆలోచన తాతగారికి చెప్పి “ముందు మీరు పూర్తిగా కోలుకోండి ఆ తర్వాత ఎలా చేయాలో ఆలోచించండి. సరేనా. మీకు పళ్ళ రసం తెస్తాను” అని వెళ్ళాడు.
గ్రామంలో నీటి ఎద్దడి తగ్గడానికి మనవడు సూచించిన పథకం ఎలా మొదలు పెట్టాలాని ఆలోచనలోపడ్డారు రామయ్య.
మరో రెండ్రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న తాతగారిని చూసాక మనసు కుదుటపడింది భార్గవకి.
“ఇక రంగంలోకి దిగుదామా తాతయ్యా?”
“బాగానే ఉంది కానీ మరి ఇక్కడే ఉండిపోతే నీ స్కూలు పోతుంది కదరా?”
“ఫరవాలేదు తాతయ్యా. నేను కనుక్కుంటున్నానులే. మీరు దానిగురించి వర్రీ అవకండి. ఇవాళే నాన్నకి ఫోన్ చేసి ఈ ఆదివారం వచ్చి తీసుకెళ్ళమంటాను. ఇంకెంత రెండు రోజులేగా. ఈలోగా మనం అనుకున్న పని కానించేద్దాము. సరేనా?”
“సరే అయితే నేను రెడి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి మునసబుగారిని మరి కొంతమంది పెద్దలని కలిసి వస్తాను.”
“నేనూ వస్తాను” తాతగారిని అనుసరించాడు.
తాతా మనవడూ వెళ్ళేటప్పటికి మునసబు ఊరి పెద్దలతో ఏదో సమాలోచనలో ఉన్నాడు. రామయ్యని చూడగానే లేచి ఎదురెళ్ళి “అయ్యా ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుటపడిందా? కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా మీరెందుకు శ్రమ తీసుకున్నారు?” నమస్కరించి తోడ్కొని వచ్చాడు.
“నేను బాగానే ఉన్నాను. మీకు తెలుసుగా నా మనవడు భార్గవ” పరిచయం చేసాడు.
“అబ్బో బాగా పొడుగయ్యాడే. ఎప్పుడో పసివాడుగా ఉన్నప్పుడు చూసాను”
“నమస్తే” అందరికీ నమస్కరించి తాతగారి ప్రక్కనే కూర్చున్నాడు భార్గవ.
మునసబుగారిని చూడగానే తాతయ్య చెప్పిన తోడేలు కథ గుర్తొచ్చి, దగ్గరగా జరిగి చెవిలో గుసగుసగా “మీరు చెప్పింది ఈయన గురించేనా?” అన్నాడు.
“ఏమిటీ మీ మనవడి ధర్మసందేహం?” నవ్వుతూ అడిగారు మునసబు.
“అబ్బే మరేమీలేదండీ. మా నాన్నగారి గురించి చెప్తూ మీ విషయం కూడా ప్రస్తావించాను. ఎప్పుడైనా మిమ్మల్ని పరిచయం చేయమన్నాడు. అదే అడుగుతున్నాడు”
“ఓ అదా సంగతీ. ఆ తోడేలు పట్టుకున్నది నన్నేనా కాదా అనా నీ సందేహం?” మొహమాటంగా నవ్వాడు.
“కచ్చితంగా నన్నే. ఇదిగో చూడు అప్పుడు అది కొరికిన పళ్ళ గాట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి” జుబ్బా పైకి మడిచి చూపించారు.
“అయ్యో సారీ అండీ. మీకెంత నొప్పి కలిగిందో కదా?” జాలిగా చూసాడు భార్గవ.
“ఏమో తెలియదు బాగా చిన్నవాడ్ని కదా అప్పుడు. ఈ విధంగా చరిత్రకెక్కాను. నీలాంటి వారందరికీ పరిచయమవుతున్నాను. ఒక విధంగా తోడేలువల్ల మంచే జరిగిందిలే. లేకపోతే ఈ మారుమూల గ్రామంలో ఉండే నేనెవరికి తెలియాలీ! నన్నెవ్వరు పట్టించుకుంటారూ?” అంటూ పెద్దగా నవ్వేసాడు.
బాధని కూడా తనకి అనువుగా మార్చుకుని నవ్వేస్తున్న మునసబుగారు తెగ నచ్చేసారు భార్గవకి.
“ఇంతకీ మీరొచ్చిన విషయం సెలవిచ్చారు కాదు!” రామయ్యతో అన్నాడు మునసబు.
“మన గ్రామంలో నీటి సమస్య తీరడానికి నేనూ, నా మనవడూ కలిసి మీవద్దకి ఒక యోజన తీసుకుని వచ్చాము. అందులో ఒకటి మన చెరువు పూడిక తీయించడం. రెండోది గ్రామంలోని ప్రతి ఇంటి ముందూ ఇంకుడు గుంటలు త్రవ్వించడం”
“ఓ మహ చక్కటి ఆలోచన. నిజానికి ఇవన్నీ మనం ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్ళూ ప్రభుత్వ సహకారం కోసం వేచి చూసాము. అదెప్పుడొస్తుందో ఆ దైవానికే తెలుసు. ఇక మనమే పూనుకోవాలి”
========================================================================
ఇంకా వుంది..
========================================================================
దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link: https://spotifyanchor-web.app.link/e/FSL6pAHI2Db
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya
పేరు: దినవహి సత్యవతి
విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;
వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.
ప్రవృత్తి : రచనా వ్యాసంగం.
సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.
పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.
గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.
పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.
ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.
6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &
గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);
పంచామృతం!(సత్య! పంచపదులు)
స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in
Comentários