top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 11


'Kotha Keratam Episode 11' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 10/10/2023

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 11' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి.


డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.


డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు.

అంగీకరిస్తాడు రాజేంద్ర.


రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు. జంతువులను అనవసరంగా బాధించకూడదని చెబుతాడు.

భార్గవ బలహీనంగా ఉండటంతో పోషకాహారాలు తీసుకోవాలని చెబుతాడు రామయ్య.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 11 చదవండి.


“అవును చాలా రకాల ప్రొటీన్స్ ఉన్నాయి. అన్నిటి గురించీ చదివి తెలుసుకో”


“ష్యూర్. మరీ ఇందాక అమ్మని ఉలవ చారు పెట్టమన్నారే అది ఎలా చేస్తారు?”


“మీ అమ్మని అడుగు చెప్తుంది”


“చెప్పమ్మా!”


“చెప్పడమెందుకూ.. ఒకసారి వెళ్ళి నీ ట్యాబ్ తీసుకునిరా చూపిస్తాను. నువ్వే చదివి మాకు కూడా వినిపిద్దువుగాని”


“ఓ! ఇప్పుడే తెస్తాను” ట్యాబ్ తెచ్చి తల్లి చెప్పినట్లు ఇంటర్నెట్ లో ఉలవచారు తయారీ విధానం పేజ్ తెరిచాడు.


“ఇదిగోమ్మా”


“ఊ...గుడ్. చదువు ఏమి వ్రాసుందో?”


“ఉలవ చారు ఒంటికి మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం కూడా. ఇక దాన్ని తయారుచేసే విధానం...”


భార్గవ చదువుతుంటే తెలియని పదాలు విడమర్చి చెప్పి “చూసావా.. ఉలవచారు నీలా పెరిగే పిల్లలకు ఎంత మంచిదో! ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు” అంది కళ్యాణి.


“అయితే చేయమ్మా నాకోసం”


“నువ్వు చెప్పడానికి ముందే ఉలవలు నీళ్ళల్లో నానబెట్టేసాను. రేపే చేస్తాను”


కొన్ని రోజులుండి, మనవడికి ఆరోగ్యం చేకూరగానే, గ్రామం వెళ్ళిపోయారు రామయ్య.

అప్పటినుంచీ రోజూ ఉదయాన పాలూ గ్రుడ్లూ, సమయానికి పోషకాహార విలువలున్న భోజనం, నియమం తప్పని వ్యాయమంతో భార్గవ చక్కగా ఆరోగ్యకరంగా తయారయ్యాడు.

ప్రతిరోజూ తాతయ్యతో ఫోన్ లో కబుర్లు చెప్పడం దినచర్యలో ఒక భాగం చేసుకున్నాడు.

“తాతయ్య ఫోన్ చేసారురా” అప్పుడే స్కూలునుంచి వచ్చిన భార్గవతో చెప్పాడు రాజేంద్ర.


“హలో తాతయ్యా ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి. మళ్ళీ మీరు వచ్చినప్పుడే ఉలవ చారు చేస్తానంటోంది అమ్మ. కాబట్టి త్వరగా వచ్చేయండి”


“ఈసారి నేను రాను”


“ఎందుకని తాతయ్యా?” కంగారుగా అడిగాడు.


“ఎప్పుడూ నేనే వస్తున్నాను. ఈసారి పరీక్షలవగానే నువ్వే రావాలి ఇక్కడికి”


“ఓస్ అంతేనా! అలాగే వస్తాను తాతయ్యా”


&&&


తండ్రి ఆఫీసు పనిమీద ఊరు వెళ్ళి ఉండటంతో, ఏడవ తరగతి పరీక్షలై సెలవలకి, తాతగారి కోరికపై అచ్యుతాపురం బయలుదేరాడు తల్లితో కలిసి.

హైదరాబాదునుంచి విశాఖపట్నం వెళుతున్న రైలులో కూర్చుని ఉత్సాహంగా కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు.


‘తాతగారంటే నాకెంతో ఎంతో ఇష్టం. కలిసినప్పుడల్లా ఎన్నోమంచి విషయాలు కథలూ కబుర్లూ చెప్తుంటారు. ఊరంతా తిప్పి చూపిస్తారు. పొలానికి తీసుకుని వెళతారు. తాతగారి ఊరు అప్పుడు నాన్నమ్మ చనిపోయినప్పుడూ, ఆ తర్వాత రెండు మూడుసార్లు మాత్రమే వెళ్ళాను. నాకు స్కూలువల్ల వెళ్ళడం కుదరనప్పుడు తాతగారే వస్తున్నారు. నాన్నమ్మ చనిపోయేనాటికి నేను బాగా చిన్నవాణ్ణి. ఎప్పుడు కలిసినా ఎత్తుకుని ఆడించేది, రుచికరమైన పిండివంటలు చేసి దగ్గర కూర్చుని ఆప్యాయంగా తినిపించేది’ నాన్నమ్మ గుర్తొచ్చి భార్గవ మనసు దిగులు పడింది.


“భార్గవ్! మన ఊరొచ్చింది” తల్లి పిలుపుకి ఆలోచనలలోంచి తేరుకుని బ్యాగు తీసుకున్నాడు.

తమని తీసుకెళ్ళడానికి అప్పటికే వచ్చి ఉన్న తాతగారిని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి కౌగలించుకున్నాడు.


“ఎలా ఉన్నావురా ? పరీక్షలు బాగా వ్రాసావా?” మనుమడిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు.

ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడేమో ఇంటికి చేరగానే అన్నం తినేసి, తాతగారు తన కోసం ప్రత్యేకంగా కట్టించిన పై అంతస్తు గదిలో నిద్రపోయాడు భార్గవ.


మర్నాడు ఉదయమే లేచి బయట వరండాలో తిరుగుతూ గేటు బయటనే ఉన్న పెద్ద మర్రి చెట్టు పైన వలయాకారంలో చిన్న మార్కు చేసి ఉండటం గమనించాడు.

“తాతగారూ తాతగారూ” కంగారుగా పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు.


“ఏమైందిరా! ఎందుకా అరుపులూ?” అడిగారు అప్పుడే స్నానం పూజ ముగించుకుని వచ్చిన రామయ్య, మనుమడి కేకలు విని.


“బయట మన మర్రి చెట్టు పైన మార్కు వేసారెందుకనీ?”


“ఓ అదా! మన రోడ్డు వెడల్పు చేస్తున్నారట్రా. అందుకు ఆ చెట్టు అడ్డం వస్తోందని కొట్టేస్తారట. అలా కొట్టేయాల్సిన చెట్లన్నిటికీ మార్కు వేసారు”


“అయ్యో! ఆ చెట్టు మీ చిన్నప్పుడు ముత్తాతగారు నాటారని చెప్పారుగా. కొట్టేస్తానంటే మీరు వద్దనలేదా మరీ?”


“ప్రభుత్వం వారికి ఏమి చెప్తామురా? చెప్పినా వాళ్ళు వింటారా ఏమిటీ?”


తాతగారి మాటలకి ఆలోచనలోపడ్డాడు.

నాలుగు రోజుల గడిచాయి. ఉదయం సుమారు తొమ్మిది కావొస్తోంది. తాతగారు తోటలో మొక్కలకి నీళ్ళు పెడుతుంటే తానూ సాయం చేస్తున్నాడు.

“ఎవరండీ ఇంట్లో?” అనే పిలుపు విని చేతులు కడుక్కుని వరండాలోకి వచ్చారు రామయ్య.


వెనుకనే భార్గవ కూడా వచ్చాడు.

“ఇంట్లో ఎవరెవరుంటారూ?” అడిగాడు వచ్చిన ఇద్దరిలో ఒకాయన.


“ఎందుకండీ? అసలు మీరెవరూ?”


“మా ఆఫీసుకి, మీ ఇంటినుంచి, ఒక ఫిర్యాదు వచ్చింది. దాని గురించి విచారణ చేద్దామని వచ్చాము”


“ఫిర్యాదా? ఎవరు చేసారూ?”


“ఎవరో భార్గవట. పిలుస్తారా కొంచం?”


“ఇదిగో వీడే, భార్గవ, నా మనవడు. వాడు ఫిర్యాదు చేయడమేమిటి? మీరు పొరబడ్డట్లున్నారు”


“లేదండీ మా వద్ద కచ్చితమైన సమాచారం ఉంది భార్గవే ఫోన్ చేసినట్లు. ఇదిగో చూడండి ఫోన్ కాల్ రికార్డు”


నిశితంగా ఆ కాగితం పరిశీలించిన రామయ్యకి అందులో తమ ఇంటి ల్యాండ్ లైన్ నంబరు కనిపించింది. అయోమయంగా తలెత్తి చూసారు.

“చూసారుగా మా ఆఫీసర్ గారే మాట్లాడారు అబ్బాయితో”


“ఏరా నువ్వేమైనా ఫిర్యాదు చేసావా? దేని గురించీ?” మనవడిని గదమయించారు.


“అదీ తాతయ్యా మరి నేనూ...”


“నేను చెప్తానండీ. మీ మనవడు ఫోన్ చేసి తమ ఇంటి ముందున్న ఏళ్ళ నాటి మర్రి వృక్షాన్ని రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కొట్టివేయబోతున్నారనీ, అలా చేయవద్దనీ, వీలైతే మరిన్ని చెట్లు నాటాలే కానీ ఇలా ఉన్న వాటిని నరికి వేయకూడదనీ, ఆ ప్రయత్నం విరమించుకోమనీ అభ్యర్థించాడు”


“ఏరా ఆయన చెప్పేది నిజమేనా, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినవు కద! ఇప్పుడు చూడు తాతగారికి ఎంత ఇబ్బంది కలిగించావో?” విషయం తెలిసిన కళ్యాణి కొడుకుని మందలించింది.


“అయ్యో! అబ్బాయినేమీ అనవవద్దమ్మా! బాబు చేసింది నిజంగా చాలా మంచిపని. మావల్లనే పొరపాటు జరిగింది. బాబు చెప్పినట్లు, ఒకవైపు మరిన్ని చెట్లు నాటండంటూ ప్రచారం చేస్తూ చల్లటి నీడనిస్తున్న ఏళ్ళనాటి మహావృక్షాలను నరికివేయటం సబబు కాదని తెలిపి మా కళ్ళు తెరిపించాడు. మావల్ల ఘోర తప్పిదం జరగకుండా అడ్డుకున్నాడు. నిజానికి మేము భార్గవని అభినందించాలని వచ్చాము కోప్పడడానికి కాదు”


“ఓ అలాగా! చాలా తియ్యటి వార్త చెప్పి నా మనసులో భయాన్ని దూరం చేసారు. వాడి గురించి అడిగితే ఏం చేసాడోనని క్షణంపాటు బెంబేలెత్తానంటే నమ్మండి” అన్నారు రామయ్య.


“అయ్యో ఎందుకండీ! నిజానికి మేము మీ మనవడికి ప్రశంసా పత్రం అందించడానికి వచ్చాము”


“ప్రశంసా పత్రమా?”


“అవును. బాబూ భార్గవ ఇదిగో మా పై ఆఫీసరునుంచి నీకు అభినందన పత్రం. మీ ఇంటిముందున్న చెట్టు ఎవరూ కొట్టేయరు. నువ్వు నిశ్చింతగా ఉండు. అంతే కాదు ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఏవైతే చెట్లు కొట్టేయాలని నిర్ణయించారో వాటిని పునః పరిశీలించి, మరీ అత్యవసరమైతే తప్ప కొట్టివేయరాదని, నిర్ణయించడం జరిగింది”


“వావ్! నిజంగానా” ప్రశంసాపత్రాన్ని అందుకుని ధన్యవాదాలు తెలిపాడు.


“అయ్యా ఇక మాకు సెలవిప్పించండి” ఇద్దరు వ్యక్తులూ వెళ్ళిపోయారు.


“కంగ్రాట్స్” తల్లి మెచ్చుకోలుకి సిగ్గుతో మెలికలు తిరిగాడు.


“ఓరి భడవా! ఇదంతా నీకెలా తెలుసూ? అసలు ఆ ఫోన్ ఎప్పుడు చేసావురా?” తాతా మనవడు మాటల్లోకి దిగడం చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది కళ్యాణి.


“మా స్కూల్లో ఒకసారి చెట్ల సంరక్షణ గురించి సెమినార్ నిర్వహించారు తాతయ్యా. అప్పుడు వాళ్ళు ఒక ఫోన్ నంబరు ఇచ్చి, చెట్లకి సంబంధించి ఏమైనా సలహాలు కావాలన్నా, సమస్యలు ఎదురైనా వెంటనే సంప్రదించమన్నారు. ఆ నంబరు జాగ్రత్తగా దాచుకున్నాను. మన మర్రి చెట్టు కొట్టేస్తారని మీరు చెప్పగానే, నా దగ్గర ఉన్న నంబరుకి ఫోన్ చేసి విషయం చెట్టును ఎలాగైనా కాపాడమని రిక్వెస్ట్ చేసాను”


“భేష్ చాలా మంచిపని చేసావు. మన చెట్టుతో పాటు గ్రామంలోని ఎన్నో చెట్లను కాపాడావురా”


“వృక్షో రక్షతి రక్షితః అని, మన మర్రి చెట్టు కథ చెప్పినప్పుడు మీరే చెప్పారుగా తాతయ్యా”


“నేర్పింది నేనైనా అమలు చేసింది నువ్వేరా” మనవడిని అభినందించారు.


అత్యవసరమైన పని ఉందని కోడలు ముందే వెళ్ళిపోవడంతో, మనవడి సెలవలు ముగిసాక తిరిగి వాడిని హైదరాబాదులో దిగబెట్టడానికి బయలుదేరారు.

మరి కాసేపట్లో విజయవాడ చేరుకుంటామనగా, సిగ్నల్ ఇవ్వలేదేమో, రైలు సరిగ్గా కృష్ణానది బ్రిడ్జి మీద ఆగిపోయింది.

కిటికీలోంచి బయటకి చూస్తున్న మనవడితో “ఈ కాయిన్ నీళ్ళల్లో పడేలా వేసి దణ్ణం పెట్టుకో” ఐదు రూపాయల బిళ్ళ ఇచ్చి చెప్పారు.


తాతగారు చెప్పినట్లే చేసి “ఎందుకు నీళ్ళల్లో డబ్బులు వెయ్యాలి తాతయ్యా?” ఆసక్తిగా అడిగాడు.


“నీ సందేహం తీర్చేముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు మనం జీవించడానికి అత్యవసరమైనవి ఏమిటి?”


“ఊ...గాలీ, నీరూ ఆహారం”


“అవునా వాటిలో నీరు మనకి ముఖ్యంగా ఈ నదులనుంచే వస్తుంది కదా. అందుచేత అలా డబ్బులు వేసి, ఎప్పుడూ మనకి నీటి కరువు రాకుండా చేయమని, ఆ నదీమ తల్లిని ప్రార్థిస్తామన్న మాట”


“ఓహో అలాగా. ఈ నదిలోనేనా ఏ నదిలోనైనా వెయ్యొచ్చా?”


“ఏ నదిలోనైనా. కొద్ది సేపటిక్రితం రైలు గోదావరి బ్రిడ్జ్ మీదనుంచి దాటుతున్నప్పుడు నేను గోదావరి నదిలో వేసాను. మన రాష్ట్రాలకి కృష్ణా గోదావరి నదులనుంచి త్రాగునీరు దొరుకుతుంది కనుక ఇక్కడ చాలామంది అలా వేస్తారు”


“కృష్ణానది గురించి తెలుసుకోవాలని ఉంది”


“అయితే నీకు కృష్ణానది చరిత్ర చెప్తాను విను...” అంటూ కృష్ణానది పుట్టుక, ఏ యే రాష్ట్రాలగుండా ప్రవహిస్తుందీ, ఎక్కడ సముద్రంలో కలుస్తుందీ...వగైరా చరిత్రంతా చెప్పి ఈ నదిని కృష్ణవేణి అని కూడా పిలుస్తారు” అన్నారు.


“ఎందుకని?”


“వేణి అంటే జడ, అంటే అమ్మ వేసుకుంటుంది రోజూ జుట్టుని మూడు భాగాలుగా చేసి ఒకదానికొకటి మెలిక పెట్టీ, అలా జడలోని పాయలలాగా ఉపనదులన్నిటినీ తనలో కలుపుకుని ప్రవహిస్తుందని ఆ పేరు వచ్చింది”


“భలే! ఇదో కొత్త విషయం. మా ఫ్రెండ్స్ కి చెప్పాలి”


ఇంతలో దూరంనుంచి గుడిగంట వినిపించింది. చేతులు తలపై ఉంచుకుని నమస్కారం చేసారు రామయ్య.


“ఎవరికి దణ్ణం పెట్టారు?” సందేహం వెలిబుచ్చాడు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


84 views2 comments

2件のコメント


Praveena Monangi
Praveena Monangi
2023年10月10日

కొత్త కెరటం చాలా బాగుంది. విజ్ఞానం తో కూడిన ధారావాహికను అందిస్తున్న రచయిత్రికి అభినందనలు👏👏👏

いいね!
dsatya_p13
dsatya_p13
2023年10月10日
返信先

Thank U Praveena.

いいね!
bottom of page