top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 12


'Kotha Keratam Episode 12' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 15/10/2023

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 12' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.


డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.


రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు. జంతువులను అనవసరంగా బాధించకూడదని చెబుతాడు.


భార్గవ బలహీనంగా ఉండటంతో పోషకాహారాలు తీసుకోవాలని చెబుతాడు రామయ్య.

రామయ్య ఇంటి దగ్గర పాతకాలం నాటి మర్రి చెట్టు ఉంది. రోడ్ వెడల్పు చెయ్యడం కోసం దాన్ని కొట్టబోతుంటే, ప్రభుత్వ అధికారులకు చెప్పి ఆపిస్తాడు భార్గవ.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 12 చదవండి.


“అదిగో దూరాన కనిపిస్తోందే ఆ కొండ దానిని ఇంద్రకీలాద్రి అంటారు. ఆ కొండపై వెలసిన దేవత కనకదుర్గమ్మకి. కృష్ణానదీ తీరాన ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు వెలిసాయి అందులో ఇది ఒకటి” అని తాతయ్య చెప్పగానే తానూ చేతులెత్తి నమస్కారం చేసాడు భార్గవ.


“నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అన్నారు కదా మరీ అంత నీరూ వృధా అయిపోవట్లేదూ?”

“అలా నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా నిలవుంచుకుని అవసరాలకి వాడుకోవడం కోసం కృష్ణానది ప్రవహించే రాష్ట్రాలలో నది పైన ఎన్నో ఆనకట్టలు కట్టారు. అందులో ఒకటి అదిగో దూరంగా కనిపిస్తోందే అదే ప్రకాశం బ్యారేజీ.”


“ఆనకట్టలన్నారే వాటివల్ల ఏమేం ఉపయోగాలు ఉన్నాయి?”


“అబ్బో చాలా ఉన్నాయిరా. నీ ట్యాబ్ తెచ్చుకుంటున్నావా?”


“ఆ...”


“అయితే అందులో చూడు నీకే తెలుస్తుంది”


“ఇక్కడ ఇంటర్నెట్ రాదు తాతయ్యా ఇంటికి వెళ్ళగానే చూస్తాను. మీరు చెప్పండి”


“మర్చిపోకుండా చదువు. నదులు మనందరికీ జీవనాధారం. ఆనకట్టలు కట్టడం ద్వారా నీటిని నిలువ చేయగలం. నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటే మీరూ తర్వాత మీ పిల్లలూ, సంతోషంగా సుభిక్షంగా వర్థిల్లుతారు” రామయ్య పలుకులు సత్యం అన్నట్లుగా రైలు కూత పెట్టి గమ్యం వైపు కదిలింది.


చెప్పకుండానే చేతులెత్తి కృష్ణానదికి మరోసారి నమస్కారం చేస్తున్న మనవడిని మురిపెంగా చూసారు.


“మీకు ఎంచక్కా ఎన్ని విషయాలు తెలుసో! మీకూ ట్యాబ్ ఉండేదా తాతయ్యా?”


“అప్పట్లో అవేమీ లేవురా. సమయం దొరికినప్పుడల్లా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివేవాడిని. ఎందులో చదివినా చదవడం ముఖ్యం. జ్ఞానం పెంచుకోవడం ముఖ్యం. అంతేకానీ అనవసరమైన విషయాలు చూడకూడదు” మనవడికేసి చూసి నవ్వారు.


“నేను బుక్స్ కూడా చదువుతున్నానుగా. ట్యాబ్ లోనూ అవసరమైనవే చూస్తాను తాతయ్యా. నేను వాడనప్పుడు నాన్న దీన్ని తనవద్ద ఉంచుకుంటారు. మాకు హాలిడే హోమ్ వర్క్ ఇస్తారు అందుకని ఇప్పుడు నాతో తెచ్చుకున్నాను.”


“గుడ్. ఈసారి ఏమిచ్చారు వర్క్?”


“మాకు ఇష్టమైన టాపిక్ పైన ప్రోజెక్ట్ చేయమన్నారు.”


“నువ్వు ఏం చేద్దామని?”


“ఇదిగో ఇప్పుడు మీరు చెప్పగా తెలుసుకున్నానుగా. దాని గురించే, నదులూ- ఆనకట్టలూ- ఉపయోగాలూ అనే టాపిక్ పైన, చార్ట్ తయారు చేస్తాను” ఉత్సాహంగా చెప్పాడు.


“అలాగే గోదావరి నది గురించి కూడా చదివి తెలుసుకో”


“ఓ అలాగే తాతయ్యా కృష్ణ గోదావరి నదుల పైన ప్రాజెక్ట్ చేస్తాను ఈసారి”


“భేష్” మెచ్చుకోలుగా చూసారు.


&&&


హైదరాబాదు అచ్యుతాపురం మధ్య రాకపోకలు పెరిగి, తాతామనవల అనుబంధం, ఏళ్ళు గడిచే కొద్దీ మరింత బలపడింది. ఇద్దరికీ వంక దొరికితే చాలు ఒక చోట చేరి సమయం గడపాలని చూస్తుంటారు.


ఎనిమిదో తరగతి పూర్తయ్యాక సెలవలకి భార్గవని తాతగారి వద్ద దింపి వెళ్ళాడు రాజేంద్ర.

“ఇలా తిరగడం ఎందుకు తాతయ్యా మీరూ ఎంచక్కా మాతో ఇక్కడే ఉండొచ్చుగా”


“అలాగే లేరా దానికి ఇంకా సమయం ఉంది”


“ఎప్పుడు అడిగినా అలాగే అంటారు” బుంగమూతి పెట్టిన మనవడిని చూసి హాయిగా నవ్వేసారు.

ఆ మర్నాడు బారెడు పొద్దెక్కినా నిద్ర లేవలేదు భార్గవ.


‘ఆ మధ్య కొంత కాలం క్రమశిక్షణతో మెలిగినా మళ్ళీ పాతదారిలోనే నడుస్తున్నాడు. వీడిని ఇలానే వదిలేస్తే లాభం లేదు దారిలోకి తేవాల్సిందే. వీడి కోసం ప్రత్యేకమైన సౌకర్యాలతో గది ఏర్పాటు చేసి పొరపాటు చేసానా’ అనుకోగానే దిగులు ఆవరించింది రామయ్యని.


ఒకరోజు మర్రి చెట్టుక్రింద సిమెంటు దిమ్మె మీద కూర్చుని తాతామనవడూ కబుర్లు చెప్పుకుంటూంటే పెద్దగా మైకులో ఏదో ప్రకటన చేస్తూ రిక్షా బండి వచ్చింది.

“హేయ్ భలే ఇక్కడ ఇంకా ఈ త్రీ వీలర్స్ ఉన్నాయా?” ఆశ్చర్యంగా అడిగాడు.


“అవునురా ఇప్పుడిప్పుడే ఇక్కడికి ఆటోలు వస్తున్నా ఇంకా ఎవరూ పెద్దగా ఉపయోగించట్లేదు. అన్నీ చిన్న చిన్న దూరాలే కనుక నడవగలిగే ఓపిక ఉన్నవాళ్ళు నడిచి వెళితే, నడవలేని వాళ్ళూ ముసలి వాళ్ళూ మాత్రం వీటిని వాడుతున్నారు”


“ఓహో అలాగా. ఇంతకీ మైకులో ఏం చెప్తున్నారు తాతయ్యా అస్సలు అర్థం కాలేదు”


“మన గ్రామంతోపాటుగా ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో నీ వయసున్న పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారట. ఎవరైనా పాల్గొనవచ్చుట. ఆసక్తి ఉన్నవాళ్ళు మూడు రోజుల్లోగా తమ పేర్లు నమోదు చేసుకోమని చెప్తున్నారు”


“ఏమేం ఆటలుంటాయో?”


ఇదే మంచి అవకాశం భార్గవని దారిలోకి తేవడానికి అనిపించి “నీకు తెలిసిన ఆటల గురించి చెప్పు ముందు” అన్నారు.


“మా స్కూల్లో థ్రో బాల్, క్రికెట్ ఆడిస్తారు. అప్పుడప్పుడూ సరదాకి పాల్గొంటాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు”


“థ్రో బాలైనా కాస్త శరీరానికి వ్యాయామం ఉంటుంది కానీ ఆ క్రికెట్ ఆటలో ఏముందిరా నన్నడిగితే అది బద్దకస్తుల ఆట అంటాను”


తాతగారి మాటలకి ఛర్రున కోపం వచ్చి “మన దేశంలో నైంటీ పర్సంట్ పీపుల్ క్రికెట్ ఎంతో ఇష్టపడతారు. మీరేంటీ మరీ అలా తీసిపారేసారూ” ఉక్రోషంగా అన్నాడు.

“అబ్బో! అబ్బాయికి కోపం వచ్చినట్లుందే. పోనీలేరా ఏదో నా అభిప్రాయం చెప్పానంతే. అద్సరేగానీ మన గ్రామంలో ఆటల అకాడమీ ఉంది. గ్రామంలో చాలామంది పిల్లలు అందులో చేరారు. చూస్తావా?”


“ఇక్కడా...అకాడమీ! నిజంగానా! నమ్మలేకపోతున్నాను. ఇదివరకెప్పుడూ చెప్పలేదు?”


“ఈ మధ్యనే ఆరంభించారు రా”


చూస్తే పోయేదేముందిలే అనిపించిందేమో సరేనన్నాడు.

అదే భాగ్యమనుకుని, ఆ మర్నాడే, కొన్ని నెలల క్రితం, రాజేంద్రకి కాలేజీలో సీనియర్, విశ్రాంత ఆర్మీ ఆఫీసర్ ప్రజాపతి, స్థాపించిన ఆటల అకాడమీకి తీసుకెళ్ళారు.

అంత చిన్న ఊర్లో అంత చక్కటి ఆటల వ్యవస్థ ఉంటుందని ఊహించని భార్గవ ఆశ్చర్యపోయాడు.


అక్కడ చాలామంది పిల్లలు ఆడుతూ కనిపించారు.

అయితే అందరూ పేద పిల్లలలాగానే అనిపించి “మీరు కోప్పడనంటే ఒక మాట అడగనా?” అన్నాడు.


“అడగరా మనవడా”


“మరీ అకాడమీలో ఆడాలంటే బోల్డు ఫీజు కట్టాల్సి ఉంటుంది కదా”


“ఇది ఉచితంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఫీజు లేదు. అదిగో ఆయనే, ప్రజాపతి, ఈ సంస్థ ఆయనదే. పద కలుద్దాము”


ప్రజాపతిని కలిసి కుశల ప్రశ్నలయ్యాక “నా మనవడు భార్గవ. పట్నంలో చదువుతున్నాడు. సెలవలకి వచ్చాడు” పరిచయం చేసారు.


“హలో భార్గవా ఆటలంటే ఆసక్తి ఉంటే నువ్వూ చేరొచ్చు ఇందులో” అన్నారు ప్రజాపతి.


కొంతసేపు మాట్లాడి ఇవతలికి వచ్చాక “తాతయ్యా అసలు వీళ్ళు ఆడుతున్న ఆటలేమిటీ? నేనెప్పుడూ చూడనే లేదు” అన్నాడు.


“వీళ్ళు ఆడుతున్న ఆటలన్నీ శరీరానికీ ఆరోగ్యం మెదడుకి ఉల్లాసం కలిగించే ఆటలు. అదిగో అక్కడ బోర్డులో వ్రాసున్నాయి. చూద్దాం పద. కొన్ని నువ్వు వినే ఉంటావు.”


అకాడమీ హాలులో వ్రేలాడేసిన బోర్డులో వరుసగా కబడ్డి, ఖోఖో, ఫుట్ బాల్, వాలీ బాల్, హాకీ ఇంకా కొన్ని ఇండోర్ గేమ్స్ వ్రాసున్నాయి.


“వీటిలో నాకు ఫుట్ బాల్, హాకీ తెలుసు టి.వి లో చూస్తుంటాను అప్పుడప్పుడూ”


“కబడ్డి ఖోఖో ఆటల గురించి నేను వివరిస్తాను కానీ ఒక కండిషన్ ఇక్కడున్నన్నాళ్ళూ నువ్వు ఇందులో చేరి ఆటలు ఆడాలి. అదిగో ఆ నోటీస్ బోర్డు చూడు. ఇందాక మైకులో చెప్పిన ఆటల పోటీలు గురించి అన్ని వివరాలూ వ్రాసున్నాయి. కొన్నిటిలోనైనా నువ్వు పాల్గొనాలి. అందుకు ఒప్పుకుంటేనే చెప్తాను”


“ఓకే తాతగారూ”


తాతగారు చెప్పారని కాకపోయినా అక్కడ ఆడుతున్న పిల్లలని చూసి ఆడాలని ఉత్సాహం కలిగిందేమో వెంటనే “అన్నీ చెప్పండి. నాకు ఇష్టమైన కొన్నిటిని సెలెక్ట్ చేసుకుని, ప్రాక్టీస్ చేసి పోటీలలో పాల్గొంటాను” అన్నాడు.


“అదీ మా భార్గవ అంటే. గుడ్ బాయ్” మెచ్చుకుని “పద అక్కడ ఖో ఖో ఆడుతున్నారు చూద్దాము. నేను చెప్పడం కంటే ఆడుతున్నప్పుడు చూస్తే బాగా అవగాహన వస్తుంది” ఆవైపు అడుగులు వేసారు.


తాతా మనవడూ కొంతసేపు అక్కడ గడిపి ఇంటికి వచ్చేసారు.


ఆ మర్నాడు కబుర్లలో “నిన్న కబడ్డీ ఖోఖో ఎలా ఆడారో చూసావు కదా, ఇప్పుడు ఆ ఆటల గురించి నీకు గ్రహింపుకు వచ్చిన అంశాలు చెప్పగలవా?” మనవడి జ్ఞాపక శక్తి పరీక్షిద్దామని అడిగారు.


“ముందు ఖో ఖో గురించి చెప్పనా?”


“మహ చక్కగా”


“ఖో ఖో ఆటలో రెండు టీమ్స్ ఉంటాయి. ఒకో టీం లో ట్వెల్వ్ మంది ప్లేయర్స్ ఉంటారు కానీ ఒక సమయంలో నైన్ ప్లేయర్స్ మాత్రమే ఫీల్డ్ లో ఉంటారు. ఆట మొదలు పెట్టడానికి ముందర రెండు టీముల మధ్యనా టాస్ వేయబడుతుంది...” అంటూ మొదలు పెట్టి ఖో ఖో ఆట గురించి కళ్ళకు కట్టినట్లుగా వర్ణించిన మనవడి జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపడి “భేష్ భేష్! ఎంత బాగా గుర్తుంచుకున్నావురా బాబూ ఏకసంథాగ్రాహి అనిపించుకున్నావు” అభినందించారు.


“ఏకసంథాగ్రాహి అంటే?”


“అంటే ఒక్కసారి విన్నా చూసినా జ్ఞప్తికి ఉంచుకునే వాళ్ళన్నమాట”


“ఓ థాంక్యూ తాతగారూ మీ కాంప్లిమెంట్ కి.”


కబడ్డీ గురించి చెప్పమంటే అంతే నైపుణ్యంతో వివరించిన భార్గవని మెచ్చుకుని “ఇంతకీ నీకు ఏ ఆట ఎక్కువగా నచ్చింది?” అని అడిగారు.


“ఖోఖో. నేను అదే ఆడతాను”


“శభాష్. రేపటినుంచే నీ శిక్షణ మొదలు. ఆటలు ఆడాలంటే బలం ఉండాలి. అందుకు రోజూ క్రమం తప్పకుండా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి”


“అబ్బా ప్రొద్దున్నే లేవాలా?” విసుగ్గా అన్నాడు.


“అవును మరి. వ్యాయమం కండరాలను, రక్తప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. గేమ్స్ లో మంచి ప్రావీణ్యత సాధించాలంటే వ్యాయామం చెయ్యడం తప్పనిసరి”


“అబ్బా తెలుసులే తాతయ్యా”


“అయితే నీకు తెలియని ఇంకో విషయం చెప్తా విను. శారీరక అందం పెంపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మానసిక ఒత్తిడులనుంచి దూరం చేయడానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసా, నీ వయసు వాళ్ళు వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే, వాళ్ల పరీక్ష ఫలితాల్లో అంత ఎక్కువ ప్రభావం ఉంటోందని పరిశోధనలో తేలింది”

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


79 views0 comments
bottom of page