top of page

విశ్వాసం


'Viswasam' New Telugu Story


Written By Kolla Pushpa


రచన: కొల్లా పుష్ప



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"అయ్యా కూసింత ఈ ఫోను పని చేయడం లేదు చూడయ్యా" అన్నాడు రాజయ్య... షాపు వాడిని ప్రాధేయపడుతూ.

"ఉండు తాత ఈ సార్ ఫోను అయిపోయాక చూస్తాను. అంతవరకు ఆ పక్కన అలా నీడలో కూర్చో" అన్నాడు షాప్ వాడు తన పని చేసుకుంటూ.

@@@

"ఏంటి రాజయ్య పని మానేసి పొలం గట్టున కూకున్నావు" అన్నాడు జాలయ్య భుజం మీద చెయ్యేసి. "ఏం లేదురా బావ.. పిలగాడి చదువు గురించే బెంగ" అన్నాడు రాజయ్య.

"బాగానే చదువుతున్నాడు అంటివి కదా! మరి ఇకనేటీ..” అన్నాడు జాలయ్య తను కూర్చుంటూ.

"బాగా చదువుకున్నాడనే బెంగ! ఇంకా పట్నం వెళ్లి చదువుకోవాలంట. అడుగుతున్నాడు బిడ్డడు, పట్నం అంటే మాటలా.. రూపాయలతో పని. మనము ఎక్కడ తేగలం?” అన్నాడు రాజయ్య విచారంగా.

"చదువుకుంటున్నాడు గంద.. చదివిస్తే బతుకు బాగుంటది. మనలాగా మట్టి లో, చాలీచాలని రాబడితో బతుకులు ఈడుతున్నామా? ఆడికి చదివిస్తే మంచి సర్కారు ఉద్యోగం వస్తే మనల్ని చూడడా ఏంది? ఏదో విధంగా చూద్దాంలే పద పద పొలంలోకి" అన్నాడు జాలయ్య లేచి రాజయ్యకు చెయ్యి అందిస్తూ.

@@@

సాయంత్రం ఇంటికి రాగానే "అయ్యా, అయ్యా నేను పట్నం వెళ్లి చదువుకుంటానయ్యా" అన్నాడు రాజయ్య కొడుకు ఈశ్వర్.

ఇంట్లోంచి వస్తున్న మణమ్మ "అలాగే రా బిడ్డ కానీ అయ్యా అలిసిపోయి వచ్చిండు కదా! కాసేపు పానం కుదుటపడని" అంది పెనిమిటికీ తాగడానికి నీళ్లు అందిస్తూ.

"నువ్వు ఆడుకోవడానికి పోరా" అన్నది కొడుకుతో... మణమ్మ.

"ఏందయ్యా అలా ఉన్నావు" అన్నది మణెమ్మ. "పిల్లగాడిని పట్నం పంపాలంటే అది దానికి మార్గం ఓపడలేదే" అన్నాడు రాజయ్య.

"పోనీ నీతో పాటే పొలానికి తీసుకుపోరాదా? అన్నది మణమ్మ రాజయ్య పక్కన కూర్చుంటూ.

"వద్దే అమ్మి మనలా వాడు కష్టపడకూడదు ఎలాగైనా వాడికి మంచి చదువు చెప్పించాలా" అన్నాడు నడుము వాలుస్తూ రాజయ్య.

@@@

"మేమందరం ఒక మాట మీద కొచ్చాం రాజయ్య.. తలో ఇంత ఏసుకుని పిలగాన్ని చదివిద్దాం. రేపు ఆడు బాగా డబ్బులు సంపాదించి ఆడే మాకు తిరిగి ఇచ్చేస్తాడు" అన్నాడు జాలయ్య.

"అవును" అన్నారు తక్కిన రైతులు.

అందరూ తలో చెయ్యి వేశారు. ఈశ్వర్ చక్కగా చదువుకొని ఇంజనీర్ అయ్యాడు.

@@@

"నేను అమెరికా పోతా అయ్యా" అన్నాడు ఈశ్వర్.

"ఇక్కడే ఏదో నౌకరీ చూసుకో రాదా బాబు.. ఈ వయసైన కాలంలో దూరం పోతాను అంటావు అయినా, అమెరికా పోవాలంటే కూడా బోలెడు డబ్బు ఉండాలి కదా?" అన్నాడు రాజయ్య కొడుక్కి నచ్చ చెబుతూ.

"లేదులే అయ్యా.. ఇక నీ డబ్బు అడగను. నా క్లాస్మేట్ రాణి వాళ్ళ నాన్న బాగా డబ్బు ఉన్నోళ్లు. వాళ్లే పంపిస్తాను అన్నారు. అక్కడికి వెళ్లి బాగా డబ్బు సంపాదించి నీకు డబ్బు పంపుతాలే" అన్నాడు ఈశ్వర్.

మూగబోయాడు రాజయ్య. ఈశ్వర్ విమానం ఎక్కాడు. ముందు రోజు సెల్ ఫోన్ కొనిచ్చాడు "నేను ఫోను చేస్తుంటాను మాట్లాడుదువు" గాని అని.

వెళ్లిన కొత్తలో నాలుగు రోజులుకోసారి ఫోన్ చేసేవాడు.

తర్వాత నెల రోజులకు ఒకసారి.

రైతులు తమకు డబ్బు ఇబ్బందిగా ఉందని ఎలాగైనా సర్దమని అడుగుతున్నారు రాజయ్యను. వాళ్లకు సమాధానం చెప్పలేక కుమిలిపోతున్నాడు రాజయ్య. ఎలాగైనా ఈరోజు కొడుకుతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఫోన్ పని చేయడం లేదు అందుకని షాప్ కి తీసుకొచ్చాడు.

@@@

"తాత ఫోన్ ఏది" అన్న కుర్రాడి పిలుపుకి గత నుంచి బయటకు వచ్చి ఫోన్ అందించాడు రాజయ్య.

ఐదు నిమిషాలు పోయాక "ఫోన్ బాగానే పనిచేస్తుంది తాత" అన్నాడు షాప్ వాడు.

'మరి ఏమిటో నా కొడుకు దగ్గర్నుంచి ఫోన్ రావటం లేదు.... నేను చేస్తే సమాధానం లేదు' అని గొణుక్కుంటూ ముందుకు సాగాడు రాజయ్య కన్నీళ్ళతో.

@@@

రాజయ్యకు తెలియని విషయం ఏమిటంటే కొడుకు అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాడని.. ఇక రాడని.. తనలాంటి వాళ్ళ బతుకులు ఇంతేనని..

కుక్క కైనా రోజూ ఇంత ఎంగిలి ముద్ద పడేస్తే తోక ఊపుకుంటూ మనం వెనకాతలే తిరుగుతుంది విశ్వాసంగా.

కానీ ఈ నాటి యువతకు కనీస బాధ్యత కూడా లేదు ఎందుకని..?.

***

కొల్లా పుష్ప గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: కొల్లా పుష్ప








56 views0 comments

Comments


bottom of page