top of page
Original.png

వృక్షమిత్ర

#KrishnaMohanPulletikurthi, #పుల్లేటికుర్తికృష్ణమోహన్, #వృక్షమిత్ర, #Vrukshamithra, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Vrukshamithra - New Telugu Story Written By - Krishna Mohan Pulletikurthi

Published In manatelugukathalu.com On 07/09/2025

వృక్షమిత్ర - తెలుగు కథ

రచన: కృష్ణమోహన్ పుల్లేటికుర్తి


అతని మనసు ఆందోళనగా ఉంది. కూతుర్ని చూడడానికి మరో రెండు రోజుల్లో పెళ్ళి వారు వస్తున్నారని తెలిసినప్పటి నుండీ ఏమీ తోచడం లేదు, అమ్మాయికి ఇదే మొదటి పెళ్లి చూపులు. అందం, చదువు, ఉద్యోగం ఉన్న అమ్మాయి గనుక వారు కాదనే అవకాశమేలేదు. కానీ అన్నీ ఉన్నా కట్నం విషయంలో మాత్రం, ఆంతా మామూలే కదా!


 అబ్బాయి తండ్రి అమ్మాయిని ఎక్కడో చూశారట, మధ్యవర్తి చే కబురు పంపారు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంట! అమ్మాయిని నచ్చి కబురు పంపారు కాబట్టి వారు కట్నం ఏమీ ఆడగక పోయినా, తన స్థోమతకు తగ్గట్టు ఎంతో కొంత ఇవ్వకపోతే బాగోదని అతని భయం. 


ప్రైవేటు కాలేజ్ లో బాటనీ లెక్చరర్ గా చేసి రిటైర్ అయిన తరువాత ఇంకా ఎక్కడా ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఎంతమంది పిలిచినా వెళ్లలేదు. 


అందువలన ఎన్నో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అన్నింటికీ తట్టుకుని నిల్చున్నాడు. ఉన్నంతలో ఒక్కగానొక్క అమ్మాయిని చక్కగా చదివించాడు. ఆమె హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. 


“ఏమండీ రాఘవరావు గారు” భార్య పిలుపుతో ఆలోచనలనుండి బయటకు వచ్చాడు ఆమె అప్పుడప్పుడూ అలా ప్రేమతో పిలుస్తుంటుంది. 

చేతిలో కాఫీ చేతికి అందిస్తూ “ఏమిటి ఆలోచిస్తున్నారు” అడిగింది.

 

“మనమ్మాయి పెళ్లి ఖర్చుల గురించి” అతని మొహంలో ఎటువంటి భావాలు కనిపించడం లేదు. 


“పెళ్లిఖర్చుల గురించి ఎందుకంత ఆలోచన? అమ్మాయి పేరుమీద దాచిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయిగా” అంది. 


“కానీ అబ్బాయి వాళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వాళ్ళు. వాళ్ళ స్థాయి కి తగ్గట్టు చేయయాలంటే ఈ డబ్బు సరిపోదు.” మొబైలు చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. 


“చూడండి.. బీచ్ రోడ్లో ఉన్న రిసార్ట్ మా కాలేజ్ మేట్ ది. అతనితో మాట్లాడితే ఎంతో కొంత కన్సెషన్ ఇస్తాడు. అంతే కాకుండా సాధ్యమైనంత వరకూ బంధువులను తగ్గించుదాం” గల గల చెప్పుకు పోతోంది. 


ఆమె మాటను కట్చేస్తూ “బంధువులను తగ్గించాలన్నపుడు అంత పెద్ద రిసార్ట్ అవసరమే లేదు. సమస్య అది కాదు. మొన్న మధ్యవర్తి వచ్చినప్పుడు కట్నం గురించి ఒక్క మాటెత్తలేదు ” 


ఏమి చెప్తాడో అని అనుమానంగా చూస్తూందామె. 


“వాళ్ళు ఇష్టపడి వచ్చారు కాబట్టి కట్నం పెద్దగా డిమాండ్ చేయకపోవచ్చు. అలా అని మనం ఇవ్వడం మానేయంగా, మంచి సంబంధం అయితే వదల్లేము కూడా ” 


కృత నిశ్చయానికి వచ్చినవాడిలా “ఏదేమైనా మన ఆర్ధిక పరిస్థితి మొత్తం వాళ్ళకు చెప్పేద్దాం ”


“ఇంతకీ అబ్బాయి మంచి చెడ్డలు వాకబు చేశారా? ”


ఆల్రెడీ అమ్మాయికి తెలిసే ఉంటుంది! మనం కూడా ఎంక్వయిరీ చేద్దాం. దానికి ఒకడు ఉన్నాడు.” 


ఆమె కూడా ఆలోచనలో పడింది. 


*

భూమిక హైదరాబాద్లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరి మూడు సంవత్సరాలైంది, మంచి పేకేజ్ తో పాటూ మంచి పేరు కూడా ఉంది. ఒక సారి చూస్తే కళ్ళు తిప్పకోలేనంత అందం ఆమెది. 


జీవన్ అదే కంపెనీలో ఆమెకు జూనియర్ గా చేరాడు, అతనికి అక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు కానీ అతని ఉద్దేశం వేరు, వీళ్లిద్దరి పరిచయం విశాఖ పట్నంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగింది. ఇద్దరూ ఒకే సారి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు. 


ఆమెకు మొక్కలంటే ప్రాణం. కాలేజ్ ప్రాంగణలో ఉన్న మొక్కలను సంరక్షించే భాద్యత కూడా ఆమె తీసుకుంది. స్నేహితుల పుట్టిన రోజుకు ఆమె ఏదో ఒక మొక్కను బహుమతి గా ఇవ్వడం ఆమెకు అలవాటు. కాలేజ్ లో జరిగిన ఒక డిబేట్ లో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఆమె మాట్లాడిన విధానం చూసి చాలామంది ఆమెకు అభిమానులుగా మారారు.


యాంకర్ గా వచ్చిన టివి నటి వెళ్తూ వెళ్తూ ఆమె ను ముద్దు పెట్టుకు మరీ వెళ్ళింది. సభకు ముఖ్య అతిధి గా వచ్చిన కలెక్టర్ గారు సైతం ఆమె ను మెచ్చుకున్నారు. అక్కడ మొదలైంది జీవన్ కు ఆమె మీద ఆరాధన. ఆమె ఎక్కడకు వెళ్ళినా బాడీగార్డ్ లా ఉండేవాడు. ఆమె ఏనాడూ అనవసరంగా ఒక్క మాటకూడా ఎవరితోనూ మాట్లాడిందిలేదు. 


ఆమె గురించి తెలిసిన కామన్ ఫ్రెండ్ రూప అతనితో సరదాగా అనేది “నువ్వు ఆమె మనసు గెలిచే కంటే ఒక దేశానికి ప్రధాని కావడం ఈజీ.”

*** 

“కాలేజ్ లైఫ్ సంతోషంగా గడపాలన్నా, ఆ రోజులు ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోవాలన్నా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని ఎటువంటి వ్యామోహాలకు లోనూకాకూడదు”..

 

తండ్రి చెప్పిన మాటలు ఆమె ను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి. కాలేజ్ చదువు పూర్తయిన తరువాత వెంటనే ఆమెకు సాఫ్ట్ వేర్ లో జాబ్ వచ్చింది అతను మాత్రం బ్రిడ్జ్ కోర్స్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు, అయితే ఏనాడూ తనని ఇబ్బంది పెట్టే పని చేయలేదు కాబట్టి అతనంటే సాఫ్ట్ కార్నర్ ఉండడంతోపాటూ అతన్ని కాదనడానికి ఒక్క కారణం కూడా తనదగ్గర లేదు. 


అతను కూడా ఇంట్లో ఒక్కడే కొడుకు అవ్వడం, తన ఇష్టానికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. పరిచయం అయ్యి ఆరేడు సంవత్సరాలయినా ఆమె తో మాట్లాడింది చాలా తక్కువ సార్లు. ఆమెకోసమే ఇక్కడ చేరాడు అది ఆమెకు తెలుసు. 


“ఇక్కడకీ వచ్చావన్నమాట ” గతం నుండి బయటకు వచ్చాడు జీవన్ ఎదురుగా రూప నవ్వుతూ కన్పించింది. అతనెందుకు ఇక్కడ చేరాడో ఆమెకు తెలుసు. 


బేలగా ఆమె వైపు చూశాడు. “మరేం చేయమంటావ్.. ఇన్నాళ్ళకు మళ్ళీ బాడీగార్డ్ జాబ్ వచ్చింది, దేశప్రధానిని ఎలాగూ కాలేను” నామోషీగా అన్నాడు.

 

“నీ లాంటి బాడీ గార్డ్ ని దేశ ప్రధాని కాకుండా నా ప్రయత్నం నేను చేస్తా” అభయమిచ్చిందామె. 




రాఘవరావు ఇల్లు, సింహాచలం దగ్గర ప్రహ్లాదపురం ఏరియాలో ఉంది సుమారు ఎనిమిది సెంట్ల స్థలం లో విశాలమైన వాకిలి, అందులో పూల మొక్కలతో పాటూ కొన్ని ఔషధ మొక్కలు, వాటితో పాటుగా అరటి, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. చర్మవ్యాధులు తగ్గించే అలోవెరా కోసం ఒక కుటీర పరిశ్రమ వాళ్ళు ఇతని దగ్గరే తీసుకుంటారు. 


ఇక మధుమేహాన్ని తగ్గించే చెంగలవకోస్తు కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. తండ్రి ద్వారా వచ్చిన ఈ ఇల్లు ఎమ్మెల్యే గారు ఇచ్చిన “వృక్షమిత్ర” బిరుదు తప్ప ఇంక ఏ ఆస్తీ తన దగ్గర లేదు. 


బయట అలికిడికి ఆలోచనలనుండి బయటకు వచ్చారు. ఎదురుగా ఆంజనేయులు. అతని వయసు ఒక యాబై ఉంటుంది. ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ, కాళీ సమయాల్లో కలెక్టర్ గారు తనకు అప్పజెప్పిన ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో సాయంగా ఉంటాడు. 


“రండి సార్!” సాదరంగా ఆహ్వానించాడు. “మీకు వీలైతే ఈరోజు సింహాచలంలో దేవగన్నేరు మొక్కలు ఇచ్చి రావాలి. మీరు తోడుగా వస్తారా?” 


“అలాగే సార్” అన్నాడు గానీ అతనికి భయమే.. 


రాఘవరావు గారు బ్యాటరీ వాహనాన్ని మాత్రమే వాడతారు. ఈ బ్యాటరీ స్కూటర్ తో ఎప్పటి వెళ్ళేది ఎప్పటికి వచ్చేది. 


“ మరేం ఫరవాలేదు లెండి. కొండమీదకు వెళ్లక్కరలేదు. కిందకు వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసు కుంటారు” అభయమిచ్చాడు. 


“కాఫీ తీసుకోండి అన్నయ్య ” జానకి ఆంజనేయులు చేతికి అందించింది. తనకి కూడా ఇస్తుందేమోనని చూశారు. ఆయనవైపు చూస్తూ “మూడు కాఫీలు అయ్యాయి ఇక చాలు ” నవ్వు కనిపించకుండా అంది. సాయంత్రము లోగా ఇంకో రెండు కాఫీ లు తాగుతారని ఆమెకు తెలుసు. ఆయనకు ఉండే ప్రేమ మొక్కలు, కాఫీ, భూమిక.. 


“జానకీ” అన్న పిలుపుతో ఉలిక్కి పడింది. 


 అవును. జానకి కూడా..

 

“సింహాచలం దేవస్థానం వాళ్ళు కొన్ని మొక్కలు అడిగారు ఇచ్చి వస్తాం” 


చెప్పి చక చకా ఇద్దరు ఒక బాస్కెట్ లో మొక్కలు పెట్టి దాన్ని స్కూటర్ ముందుకు పెట్టి బయలుదేరారు. శ్రీనివాస నగర్ దాటిన తరువాత తన ఆందోళన గురించి అంజనేయులకి చెప్పారు. 


అతను మౌనంగా ఉన్నాడు. తనకు కేవలం సమాచారం ఇచ్చారు కానీ చిన్న సహాయం కూడా ఎవరి దగ్గరా పొందరని అతనికి తెలుసు. 

***


వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏదో గుర్తుకు వచ్చినదానిలా లోపలి గదిలోకి వెళ్ళి లేప్టాప్ తీసి ఏంజెల్ బ్రోకింగ్ స్టాక్ మార్కెట్ యాప్ లోకి లాగిన్ అయ్యింది. కరోనా పుణ్యమాని భూమిక వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ గురించి కొంత అవగాహన కల్పించింది. అప్పటి నుండి వీలైనప్పుడల్లా టాటా మోటర్ లో ఎంతో కొంత పెడుతూనే ఉంది. ఈ రోజు సుమారు రెండు లక్షల వరకూ దాంట్లో ఉంది. లాభాలలో ఉంది కాబట్టి పెళ్లి ఖర్చులకు మొత్తం తీసేసి ఎంతో కొంత ఆయనకు సాయంగా ఉండాలి. ఇప్పుడు ఆమెకు కొంత ఊరట గా ఉంది. 

 



అబ్బాయి తల్లిదండ్రులు రానే వచ్చారు. పెళ్లి కొడుకుతో పాటూ మొత్తం ఎనిమిది మంది వచ్చారు. కట్నం గురించి మాట్లాడే అవకాశం ఉంది అనుకున్నారు రాఘవరావు.

 

“నమస్కారం, రండి ” సాదరంగా ఆహ్వానించారు. 


ముందే కబురు పెట్టడం వలన భూమిక కూడా సెలవు పెట్టి వచ్చింది. 


కుర్చీలో కూర్చున్న జీవన్ వాళ్ళ నాన్నగారు ఇంటినంతటినీ పరిశీలగా చూస్తున్నారు, మామూలు వ్యక్తిలా లేడు. అతను విశాఖపట్నంలో ఒక ఇండస్ట్రీ నడుపు తున్నాడంటే మామూలు విషయం కాదు. 


“బావగారూ.. అమ్మాయి అందరికీ నచ్చింది. ఇక.. “

ఆయన మాట పూర్తవ్యక ముందే అందుకున్నారు. 

“అయ్యా క్షమించాలి. నేను ఒక సామాన్య మైన వ్యక్తిని, మీ స్థాయికి తగినవాడిని కాదు. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చినా మీకు సరి తూగను” 


అతని గొంతులో ఆర్తి అక్కడున్న అందరికీ అర్ధమయింది. 




ఆయన చిన్నగా నవ్వుతూ “చూడండి బావగారూ.. మీరే అన్నీ ఊహించుకుంటే ఎలా, ముందు నేను చెప్పేది వినండి. ఈ రోజు శాంతా ఆగ్రో ఇండస్ట్రీస్ కి ఎం. డి కావచ్చు కానీ ఒకప్పుడు నేను సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మేము ఇద్దరు అన్నదమ్ములం. 


పెద్దవాడు వరప్రసాద్ హైదరాబాద్ లో ఒక ఫార్మసీ కంపెనీ పెట్టి కొన్ని వేల మంది కి ఉపాధి కల్పిస్తున్నాడు. మా తండ్రి గారు నా పదవ ఏట మరణించారు. మా తల్లి శాంతమ్మ గారు ఏమీ చదువుకోలేదు కానీ ఆమెకు చదువు విలువ, మనిషి విలువ తెలుసు. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. పేదరికం మా చదువులకు ఏనాడూ అడ్డు రాలేదు. 


పరీక్ష ఫీజు కోసం అమ్మ గాజులు ఒక్కొక్కటీ అమ్మడం నాకు తెలుసు. తన గురించి ఎప్పుడూ ఆలోచించేది కాదు, మంచి కుటుంబం ఏర్పడితే మంచి సమాజం ఏర్పడు తుందనేది. 


కొన్ని సంవత్సరాల క్రితం ఓ కాలేజ్ లో జరిగిన కార్యక్రమానికి నన్ను గెస్ట్ గా పిలిచారు అప్పుడు మీ అమ్మాయి సభా వేదికపై మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి 


“మంచి కుటుంబం ఏర్పడితే మంచి సమాజం ఏర్పడు తుంది ” 


“మళ్ళీ ఆమె నోట మా అమ్మ మాట.”


 ఆయన కళ్ళలో కన్నీటి చెలమ. 


“సంబంధం కలుపుకోవడంలో డబ్బు పాత్ర అసలు లేదని నా నమ్మకం. నాకు కావలసింది డబ్బు కాదు సమాజానికి హితవు చేసేవాళ్ళతో ప్రయాణం చేయడం.”


 ముగించాడు.. 


***

అత్తింటిలో అడుగు పెట్టింది భూమిక, కొత్తకోడలికి వంట అప్పగించారు అత్తగారు. మామగారి ఆరోగ్యానికి మంచిదని వస్తూ వస్తూ తనతో పాటూ తెచ్చిన చెంగలకోస్ట్ ఆకులతో నెయ్యి తాళింపు వేసి పచ్చడి చేసి పెట్టింది. అత్తగారి ఆనందానికి అవధులు లేవు, తనతో పాటుగా ఆయన ఆరోగ్యం పై శ్రద్ధ చూపే ఇంకో మనిషి ప్రవేశించిందని. 


మామగారు ఆలోచనలో ఉన్నారు. త్వరలో విశాఖపట్నం ఐటి హబ్ గా మారబోతుంది. కొడుకు కోడలు సాఫ్ట్ వేర్ గనుక తానే ఒక ఐటి కంపెనీ అమ్మ పేరు మీద పెట్టవచ్చుగా.. మరింత మందికి ఉపాధి కల్పించవచ్చుగా.. 



మామిడి చెట్టు నీడలో కూర్చున్న రాఘవరావు గారు బీపీ మోనిటర్ తో చెక్ చేసుకున్నారు. అమ్మాయి పెళ్లి కి ముందు ఇరవై పాయింట్లు ఎక్కువ ఉన్న బీపీ ఇప్పుడు నార్మల్ గా ఉంది. ఆయన మనసు ఉల్లాసంగా ఉంది. తాను ఎంతో పెద్ద సమస్యగా భావించింది ఇంత ఈజీగా పరిష్కారం అవుతుందని అనుకోలేదు. 


“జానకీ” పిలుపు అర్ధం చేసుకొని రెండు కాఫీలు తెచ్చిందామె. 


ఒక చేత్తో బట్టతల నిమురుకుంటూ ఇంకోచేత్తో కాఫీ గ్లాస్ పట్టుకొని పసిపిల్లల్లా అపురూపంగా పెంచిన మొక్కలవైపు లాలనగా చూస్తూ “ప్రకృతే దేవుడు" సన్నగా గొణుక్కున్నాడు 


కాలేజ్ లో జీవన్, భూమిక కలసి తీసుకున్న ఫోటోస్, టీసీయస్ లో ఫోటోస్, కలిసి తీసుకున్న ఫోటోస్ జీవన్ వాళ్ళ నాన్నగారికి మెయిల్ లో పంపి ఫోన్ లో ఏం చెప్పిందో ఆంజనేయులు గారి కూతురు రూప.. ఎవరికీ తెలియదు. 


 ******

కృష్ణమోహన్ పుల్లేటికుర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పుల్లేటికుర్తి కృష్ణ మోహన్,M.A.PGDCA., జర్నలిస్ట్ మరియు రచయిత, శ్రీకాకుళం

Comments


bottom of page