వెంటాడే నీడ ఎపిసోడ్ 1
- Seetharam Kumar Mallavarapu
- Aug 18, 2021
- 2 min read
Updated: Aug 23, 2021

'Ventade Nida' written by Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
ఫ్రెండ్స్ తో కలిసి వూరి చివర ఉన్న మామిడి తోటలో పార్టీ చేసుకున్నాడు సుమంత్.
సాయంత్రం నాలుగయింది.
"ఇక బయలుదేరుదాం" అన్నాడు విశాల్ పైకి లేస్తూ.
అతడు సుమంత్ కి బెస్ట్ ఫ్రెండ్.
మిగతా స్నేహితులు కూడా బయలుదేరడానికి పైకి లేచారు.
సుమంత్ కూడా పైకి లేచి వెంటనే తూలి పడబోయాడు.
విశాల్ అతన్ని పడకుండా పట్టుకుని, "ఈ పరిస్థితుల్లో బైక్ డ్రైవ్ చెయ్యలేవు. నా బైక్ లో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నీ బైక్ ఎలాగోలా రేపు మీ ఇంటికి చేరుస్తాను." అన్నాడు.
“మా వూరు ముప్పై కిలోమీటర్లు ఉంది. అంత దూరం వచ్చి నన్ను డ్రాప్ చేసి , తిరిగి మీ ఇంటికి వెళ్లేసరికి చాలా ఆలస్యం అవుతుంది. పైగా ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా అంత ప్రయాణం చెయ్యడం మంచిది కాదు.నేను ఓ గంట ఇక్కడే పడుకొని, తరువాత బయలుదేరుతాను. పార్టీ విషయం ఇంట్లో తెలిసిందే అయినా మరీ తూలుతూ ఉంటే బాగుండదు కదా !" అన్నాడు సుమంత్.
"అలా అయితే నేను కూడా నువ్వు బయలుదేరే వరకు ఇక్కడే వుంటాను. ఒక్కడివే ఉండడం ఎందుకు?" అంటూ సుమంత్ పక్కనే కూర్చున్నాడు విశాల్.
వీళ్లిద్దరికీ బై చెప్పి మిగిలిన స్నేహితులు వెళ్లిపోయారు.
విశాల్ వంక అభిమానంతో చూస్తూ " నిజమైన స్నేహితుడివి నువ్వేరా! నన్ను ఎప్పడూ వదిలి పెట్టావుగా " మత్తులో కళ్ళు మూతలు పడుతుండగా అన్నాడు సుమంత్.
స్నేహితుడి సమాధానం వినేలోగా అతని కళ్ళు మూతలు పడ్డాయి.
***
మరి కాసేపటికి
గుండెల మీద ఎవరో బలంగా నొక్కుతున్నట్లు అనిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సుమంత్.
చుట్టూ కటిక చీకటి.
అతని గుండెలమీద ఒక బలమైన ఆకారం కూర్చొని ఉంది.
చీకట్లో ఆ ఆకారం కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి.
ఆ ఆకారాన్ని పక్కకు తోసి పైకి లేవాలని ప్రయత్నించాడు సుమంత్.
కానీ సాధ్యం కాలేదు.
ఆ ఆకారం చాలా ధృడంగా ఉంది. దాన్ని కాస్త కూడా కదల్చలేక పోయాడు.
"విశాల్ ! నన్ను కాపాడు"అంటూ గట్టిగా అరిచాడు.
కానీ అక్కడ ఎవరూ లేరు.
ఏమయ్యాడతను?
తనకు తోడుగా ఉంటానని చెప్పాడే!
ఈ ఆకారాన్ని చూసి పారిపోయాడా?
ప్రాణం పోయినా విశాల్ అలా చెయ్యడు.
"ఎవరైనా కాపాడండి" అంటూ మరోమారు బిగ్గరగా అరిచాడు.
కానీ అక్కడ ఎవరూ లేరు.
ఇంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది.
ఆ మెరుపు వెలుతురులో ఆ ఆకారాన్ని చూసిన సుమంత్ గుండె ఆగినంత పని అయ్యింది.
జడలు కట్టిన జుట్టు, పైకి పొడుచుకు వచ్చిన దంతాలు, వికృతమైన ముఖం....
అతను ఆ ఆకారాన్ని చూసింది క్షణకాలమైనా జీవితాంతం గుర్తుంది పోయే వికృత రూపం అది.
తన చేతిలో ఉన్న తాడుతో అతనికి ఉరి వెయ్యాలని ప్రయతిస్తోంది ఆ ఆకారం.
అడ్డగిస్తున్న సుమంత్ చేతుల్ని బలంగా వెనక్కి నెట్టేసింది . వికృతంగా అరుస్తూ అతని
గొంతుకు ఉరి వెయ్యాలని ప్రయత్నిస్తోంది ఆ ఆకారం.
అప్పుడే అతని చేతికి తగిలింది ఒక పదునైన రాయి.
దాన్ని చేతిలోకి తీసుకొని, తన బలాన్నంతా ఉపయోగించి ఆ ఆకారం తలమీద ఆ రాయితో బలంగా మోదాడు. పెద్దగా అరుస్తూ సుమంత్ పైనుండి లేచింది ఆ ఆకారం.
అప్పడు గమనించాడు సుమంత్ ఆ ఆకారం పొడవు దాదాపు ఏడు అడుగులని.
తన చేతిలో ఉన్న రాయితో మరో మారు ఆ ఆకారం తల పైన గట్టిగా కొట్టాలని ప్రయతించాడు సుమంత్.
కానీ ఆ ఆకారం పొడవుగా ఉండటంవల్ల సాధ్యం కాలేదు.
అతని చేతిని పట్టుకుని గట్టిగా మెలితిప్పిందా ఆకారం.
అతని చేతిలోని రాయి కింద పడిపోయింది.
అతన్ని దూరంగా నెట్టేసింది ఆ ఆకారం.
ఆ విసురుకు దూరంగా పడిపోయాడు సుమంత్.
(సశేషం. రెండో ఎపిసోడ్ కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడనవసరం లేదు.)
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).