ఆ "వేద" న

Aa "vedha" na - Telugu Emotional Story | S. Srivani
ఆ "వేద" న - తెలుగు భావోద్వేగ కథ | ఎస్. శ్రీవాణి
Published in manatelugukathalu.com on 30/09/2026
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక ఉపాధ్యాయురాలు ఎంతగా తపించగలదో తెలిపే హృదయస్పర్శి కథ – ఆ “వేద”న. ఉపాధ్యాయురాలి మమకారం, విద్యార్థుల ప్రతిభ, విద్యా వ్యవస్థలోని కొన్ని విరుద్ధ పరిస్థితులను ప్రతిబింబించే సామాజిక కథ ఇది.
అది మార్చి నెల. వసంతకాల ఆగమనంతో పాటు విద్యార్థుల జీవితంలోని కఠినమైన పరీక్షల కాలం కూడా.
"వేద" తన బ్యాగు సర్దుకుని స్కూలుకి బయలుదేరుటకు సిద్ధమయింది. ఆమె స్కూల్లో హిందీ ఉపాధ్యాయురాలిగా చేరి దాదాపు 15 సంవత్సరాలు అయింది. ఏ పని చేసినా వేలెత్తి చూపే అవసరమే రానివ్వని విధంగా చేస్తుంది.
విద్యార్థుల్ని వారి సొంత అమ్మ కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తుంది, అదే విధంగా వారిని హద్దుల్లో కూడా పెడుతుంది. అందుకే విద్యార్థులు ప్రతినిత్యం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటారు.
స్కూల్ జీవితం తర్వాత కూడా ఆమె వెన్నంటే ఉంటారు. ఇది చాలామందికి కంటికింపుగా ఉండదు. అయినా ఆమె అవన్నీ లక్ష్యపెట్టదు. ఆమె లక్ష్యం విద్యార్థులను లక్ష్యానికి చేర్చడమే.
రెండు రోజుల్లో పదవ తరగతి బోర్డు పరీక్షలు మొదలవుతున్నాయి. దానికి తన విద్యార్థులను సిద్ధం చేసి ఉంచింది. ఇప్పుడు చివరి నిమిషంలో పరీక్ష ఎలా రాయాలి అనే దానికి తగిన సూచనలు ఇవ్వడానికి ఆమె కూడా సన్నద్ధంగా ఉంది.
ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా, ప్రతి సంవత్సరం ఆమెకి ఇదే నా మొదటి సంవత్సరం అన్నట్లుగానే ప్రవర్తిస్తుంది.
బోర్డు పరీక్షలు మొదలయ్యాయి. వేద తన విద్యార్థులకు చివరి నిమిషం వరకు పరీక్షలో మంచి ఫలితాలు సాధించడంలో మెళకువలు నేర్పే ప్రయత్నం చేస్తూనే ఉంది. పరీక్ష రోజు రానే వచ్చింది.
అందరి దేవుళ్లకు విద్యార్థుల తరపున ప్రార్థించి స్కూల్‌కి వచ్చింది. పిల్లలను పరీక్ష హాలుకి వెళ్లేవరకు చూసి తిరిగి వచ్చింది. ఆమె తిరిగి వచ్చిందనే మాటే కానీ, ఆమె భావాలు మాత్రం పిల్లల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
దానితో ఆమె కంటి నుండి నీరు రావడం జరిగింది. ఇది మిగిలిన టీచర్స్ కంట పడకుండా జాగ్రత్తపడింది. పరీక్ష ముగిసి పిల్లలు ఎలా రాశారో వారి నోటి ద్వారా విని ఆమె మనసు నెమ్మదించింది. వారు కథలు కథలుగా చెప్తూ ఉంటే, పసిపిల్ల మాదిరి సంతోషంగా వారినే చూస్తూ ఉండిపోయింది.
పిల్లలు వెళ్ళిపోవడంతో ఆమె మనసు భారంతో నిండిపోయింది. ప్రతి సంవత్సరం జరిగే తంతు అయినా సరే, ఆమెకి ప్రతిసారి బాధగానే ఉంటుంది.
స్కూల్ నుండి వచ్చిన వేద సాయంత్రం యథాలాపంగా ఫోన్ తీసిన ఆమెకి ప్రిన్సిపల్ నుండి వచ్చిన Spot valuation pdf చూసి ఆమె మనసు ఉసూరుమంది. మరో 4 రోజుల్లో 6 km దూరంలో ఉన్న స్కూల్‌కి మొత్తం 10 రోజుల పాటు వెళ్లవలసి ఉంది. ఆమె మనసు 4 సంవత్సరాల గతంలోకి మళ్ళింది.
సరిగ్గా ఇలానే పరీక్షలు ముగియగానే అప్పటి వరకు పడిన ఆందోళన తగ్గి ఊపిరి పీల్చుకుంది. అప్పుడే ప్రిన్సిపల్ నుండి రమ్మని పిలుపు వచ్చింది. విషయం ఏమిటో తెలుసుకుందామని వెళ్లగా... స్పాట్ valuationకి వెళ్లాలని ఆదేశం ఆమె చేతిలో పెట్టారు.
అది చూసి ఆమె స్థాణువులా నిలబడిపోయింది. ఇప్పటి వరకు హిందీకి గాను ఎప్పుడూ స్పాట్ valuation ఇవ్వడం జరగలేదు, ఇదే మొదటిసారి. అంతే కాకుండా 65 km దూరంలో ఉన్న కాకినాడకి వెళ్లాలి. అదే ఆమెలో అలజడికి కారణమయింది.
ఇప్పటి వరకు ఆమె అలా ఒంటరిగా ప్రయాణం చేసిందే లేదు. ఆ ఊరు కూడా ఎప్పుడూ వెళ్ళింది లేదు. కానీ తప్పే విషయం కాదు, ఎలాగో వెళ్లక తప్పదని మనసుకి సర్ది చెప్పుకుంది.
ప్రయాణ విషయంగా కావలసిన సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. లెటర్ లో ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా అక్కడి అధికారులతో మాట్లాడింది. తన ఊరు నుండి రాబోతున్న కొందరు టీచర్స్ నంబర్స్ తీసుకుని వారితో మాట్లాడింది.
బస్, ట్రైన్ వంటి సౌకర్యాలతో పాటు అవసరమైతే కాకినాడలో ఉండడానికి తగిన సదుపాయముల విషయాల గురించి సమాచారం సేకరించింది.
ఆ రోజు రానే వచ్చింది. ఆమెతో పాటు మరో ఇద్దరు టీచర్స్‌తో కలిసి బస్సులో ప్రయాణం చేసి కాకినాడ స్కూల్‌కి చేరుకుంది. మొదటి రోజు నెమ్మదిగా గడిచింది, సాయంత్రం ఐదున్నర దాటిపోయింది పని అంతా అయ్యేసరికి.
మెల్లగా బస్టాండ్ చేరుకుని బస్సు పట్టుకుని ఇంటికి వెళ్లేసరికి దాదాపు తొమ్మిది గంటలు అయింది. ఉదయం 5 గంటలకు లేవడం, పని చేసుకోవడం, లంచ్ బాక్స్ సిద్ధం చేసుకుని మళ్లీ రాత్రి ఇంటికి రావడం. అలాగే మరో రెండు రోజులు కూడా గడిచిపోయాయి.
తన పని అయితే సాయంత్రం మూడు గంటలకు పూర్తి చేసేసుకునేది. ఇంతలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి ఐదున్నర గంటలకు ఒక ట్రైన్ ఉంటుంది. సరిగ్గా ఆ ట్రైన్ ఎక్కి రాజమండ్రి చేరుకుంటే 7:00 కల్లా ఆమె ఇంటిని చేరుకోవచ్చు.
ఆ విధంగా పైఅధికారుల అనుమతి తీసుకుని వెళ్లడం మొదలుపెట్టింది. రోజుకి 20 నుంచి 25 వరకు పేపర్లు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో కొందరు చాలా ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారు.
80 మార్కులకు గాను 75కి పైగా మార్కులు వచ్చినవాళ్లు ఉన్నారు. చిన్న చిన్న తప్పిదాలు ఉన్నా కూడా చాలా అద్భుతంగా రాసి ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పైఅధికారులు ఎక్కువ మార్కులు వేయడానికి అనుమతించలేదు. అంత ఎక్కువ మార్కులు వచ్చినవాళ్లలో లోపాలు వెతికి మార్కులు తగ్గించవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు.
ఆమె మనసు చాలా బాధగా మూలిగింది. విద్యార్థులు తమది కాని భాషను చాలా కష్టపడి సంవత్సరాల తరబడి నేర్చుకున్న వాటిలో తప్పులు వెతికి మార్కులను తగ్గించడం సమంజసంగా అనిపించలేదు.
ఒకటిరెండుసార్లు పైఅధికారులతో కూడా చర్చించింది, తీవ్రంగా ఖండించింది. అయినా వారి పట్టుదల ముందు ఆమె తలవంచక తప్పలేదు. కరెక్షన్ వర్క్‌లో చివరి రెండవ రోజు ఇలాగే జరిగింది.
ఇద్దరు టీచర్లు కరెక్షన్ చేస్తున్న పేపర్‌లో 79 మార్కులు రావడం జరిగింది. ఎంతమంది అధికారులు చూసినా అందులో తప్పులు వెతకడం కష్టమైంది, దొరకనే లేదు. అయినా ఆ అధికారులు మాత్రం తమ పట్టుదల వదల్లేదు.
ఆ పేపర్‌ను స్కాన్ చేసి అందులో తప్పులను వెతికి పట్టుకున్నారు. తిరిగి మళ్లీ రెండు మార్కులను తగ్గించి 77గా చేశారు. ఈ విషయంగా ఆమెతో పాటు మొత్తం అక్కడ ఉన్న హిందీ టీచర్లు అందరూ కూడా అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కానీ అందరిదీ అరణ్యరోదనే అయింది.
ఆ రోజు జరిగిన విషయం ఎవరూ మర్చిపోలేకపోయారు. తమది కాని భాషను విద్యార్థులు చక్కగా నేర్చుకుని అంత ప్రతిభ చూపించినప్పుడు వారిని ప్రోత్సహించాలి తప్ప, అలా నిరుత్సాహపరచడం అనేది సమంజసం కాదని అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. కానీ జరిగేది ఏమీ లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేక మౌనం వహించారు.
ఈ గతమంతా ఆమెకి కళ్లకు కట్టినట్లు ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఏదో విధంగా ఇటువంటి అన్యాయం విద్యార్థుల పట్ల జరుగుతూనే ఉంది. మనసులో మౌనంగా మూలగడం తప్ప చేయగలిగినది ఏమీ లేక, నిరాశతో రోజులు మారాలని ఎదురుచూస్తూ ఉంటుంది ఆమె.
ఎప్పటికైనా ఈ నియమాలు, పద్ధతులు మారి పిల్లలు 80కి 80 మార్కులు తెచ్చుకుంటారని ఆశతో ఎదురుచూస్తూ ఉంది.
***
ఎస్. శ్రీవాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: ఎస్. శ్రీవాణి
స్వస్థలం అనకాపల్లి.
విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. ప్రస్తుతం రాజమండ్రిలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచే పుస్తకాలు, కథలు చదవడం పట్ల ఉన్న అమితమైన ఆసక్తే రచనా వ్యాసంగం వైపు నడిపించింది. నిత్య జీవితంలోని సున్నితమైన భావోద్వేగాలు, మానవీయ విలువల నేపథ్యంతో రచనలు చేస్తున్నాను.








Comments