ఎవరు ఎవరికి అనుబంధం ?

Yevaru Yevariki Anubandham? - Telugu Social Story Written By Kandarpa Murthy
ఎవరు ఎవరికి అనుబంధం ? - తెలుగు సామాజిక కథ రచన: కందర్ప మూర్తి
Published In manatelugukathalu.com On 01/10/2026
‘ఎవరు ఎవరికి అనుబంధం?’ కందర్ప మూర్తి రచించిన హృదయస్పర్శి తెలుగు సామాజిక కథ. అనుకోకుండా ఇంటికి దూరమైన బాలుడు శ్రీను జీవితం, అతడిని చేరదీసి పెంచిన తల్లిదండ్రుల వాత్సల్యం ఈ కథలో ప్రధానాంశాలు.
మురుగన్ లారీ ట్రాన్స్‌పోర్ట్ ట్రక్ డ్రైవర్ దేవరాజ్, పౌల్ట్రీ ఫీడింగ్ శేఠ్‌కి అప్పగించి తిరుగు ప్రయాణంలో ఏదైనా సరుకు లోడు దొరుకుతుందేమోనని ఎదురుచూస్తూ ఖాళీ ట్రక్కును నేషనల్ హైవేలో ఒక పెట్రోల్ బంకు వద్ద నీటిగుంట కనబడితే తన కో-డ్రైవర్ కార్తికేయతో కలిసి శుభ్రంగా నీటితో కడిగి రోడ్డు పక్కన ఆపి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్లాడు.
లారీ బాడీ గాలికి ఆరుతుందని లోపల ఉన్న టార్పాలిన్లు కింద పడేసి, వెనకవైపు డోర్ తలుపులు తెరిచి ఉంచాడు.
భోజన సమయమవడంతో దేవరాజ్, వెంట సహాయకుడిగా ఉన్న కార్తికేయతో సమీపంలో ఉన్న దాబా హోటల్ దగ్గరకు భోజనానికి వెళ్లారు.
బాగా అలసటగా ఉన్నందున ఇద్దరూ అక్కడ విశ్రాంతి గదిలో మంచాల మీద పడుకుని సాయంత్రం నాలుగయ్యేసరికి మెలకువ వచ్చి లేచి, గాబరాగా తమిళనాడు చెంగల్పట్టులో ఉన్న యజమాని శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి లోడింగ్‌కి ఏ సరుకూ లేదనగానే ఖాళీ బండి తీసుకుని వాపసు చెంగల్పట్టుకు వచ్చేయమని ఆర్డర్ వేశాడు.
డ్రైవర్ దేవరాజ్, అసిస్టెంట్ కార్తికేయతో కలిసి ట్రక్కు దగ్గరకు వచ్చి కింద ఉన్న టార్పాలిన్ల కట్టను లారీ బాడీ లోపలకు విసిరి డోర్లు వేసి గొలుసులు బిగించారు. తర్వాత లారీని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు సాగిపోయారు.
వాళ్లు లారీని అక్కడి నుంచి తీసుకెళ్లే లోపున ఒక సంఘటన జరిగింది. లారీ ఆపిన ప్రదేశానికి కొద్దిదూరంలో ఖాళీ మైదానంలో మట్టిపనులు చేసే కొందరు ఉప్పరి కుటుంబాలు గుడిసెలు వేసుకుని పిల్లలతో ఉంటున్నారు.
పెద్దవాళ్లు పనులకు పోతే వారి పిల్లలు అక్కడి చెట్ల కింద ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు.
చెట్లకు కట్టిన తాళ్లతో కొద్దిసేపు ఉయ్యాల, తర్వాత అక్కడ ఉన్న సమాధి దిమ్మ మీద ఆడుతూ సాయంకాలం వరకు ఉంటారు.
గుడిసెలో ఉండే శీనయ్య, దేవమ్మల ఐదేళ్ల కొడుకు శ్రీను కొద్దిదూరంలో ఆగి ఉన్న లారీ దగ్గరకు వచ్చి పెద్ద చక్రాలు చూస్తూ వెనకవైపు వచ్చాడు.
అక్కడ రంగుల మెత్తటి టార్పాలిన్లు చూసి ముచ్చటపడి వాటిపైన ఎక్కి కూర్చున్నాడు. తర్వాత లారీలో తినడానికి ఏమైనా ఉన్నాయేమోనని తలుపు గొలుసు సహాయంతో లోపల ప్రవేశించాడు.
నీళ్లతో కడిగినందున లారీ లోపల చల్లగా అనిపించింది. ‘భలేభలే’ అనుకుంటూ కింద పడుకున్న కాసేపటికి నిద్ర ముంచుకు రావడంతో అలాగే నిద్రపోయాడు.
ఈలోపున డ్రైవర్ దేవరాజ్ తన అసిస్టెంట్‌తో వచ్చి బండి స్టార్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుపోయాడు.
లారీ వేగంగా నేషనల్ హైవేపై దూసుకుపోతూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆంధ్రా సరిహద్దులు దాటి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించింది.
మధ్యలో నిద్రలేచిన శ్రీను లోపల చీకటిగా ఉండటంతో ఏడుపు మొదలెట్టి అరవడం చేస్తున్నాడు. బండి స్పీడుగా పోతుండటంతో క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్లకు వాడి ఏడుపు వినపడలేదు. దారిలో వాళ్లు హోటల్లో సాంబారు భోజనం చేశారు.
అర్ధరాత్రికి చెంగల్పట్టు చేరిన డ్రైవర్లు బండిని షెడ్డులో పెడదామని వచ్చి, ఏదో అవసరమై వెనక డిక్కీ తలుపులు తెరవగా లైటు వెలుగులో టార్పాలిన్లపై సొమ్మసిల్లిన ఐదేళ్ల శ్రీను కంటపడ్డాడు.
వాళ్లు నిశ్చేష్టులై ఈ బుడతడు ఎలా లారీలోకి వచ్చాడని తర్జనభర్జన పడుతున్నారు. అదే విషయం యజమానికి ఫోన్ చేసి చెప్పారు.
అక్కడ మట్టిపనుల నుంచి మిగతావారితో గుడిసెకు తిరిగి వచ్చిన ఆ కుర్రాడి అమ్మానాన్నలు శీనయ్య, దేవమ్మ కొడుకు బయట కనబడకపోయేసరికి పేరు పెట్టి పిలవసాగారు.
చుట్టుపక్కల వెతికారు. కొడుకు జాడ తెలియలేదు. వాడితో ఆడుకున్న మిగతా పిల్లల్ని అడిగితే మాకు తెలియదన్నారు.
తల్లి దేవమ్మ, కొడుకు ఎటుపోయాడోనని ఏడుస్తూ పిచ్చిదానిలా నాలుగువైపులా పరుగులు తీస్తోంది. మిగతా గుడిసెల మగవారు అన్ని ప్రాంతాల్లో వెతుకుతూ పెట్రోల్ బంక్, చర్చి, దగ్గరలోని దాబా హోటల్‌కి వెళ్లి పిల్లాడి వివరాలు చెప్పి అటు వచ్చాడేమోనని వాకబు చెయ్యగా ఎవరూ కూడా చూడలేదన్నారు.
చివరకు ఎవరైనా పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకుపోయారేమోనని అనుమానం లేవదీయగా, మర్నాడు ఉదయం వారిని పనికి తీసుకువచ్చిన కాంట్రాక్టర్ ద్వారా దగ్గరలోని పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు.
అక్కడి పోలీసులు తప్పిపోయిన పిల్లవాడి పేరు, వయసు, శరీర రంగు, జుట్టు, శరీరం మీద ఏవైనా గుర్తులు ఉంటే చెప్పమన్నారు.
ఆ పిల్లగాడి తల్లి దేవమ్మ ఏడుస్తూ, "సారూ, ఏడాది క్రితం ఊళ్లోకి పచ్చబొట్టు పొడిచేవాళ్లు వస్తే ఆడు ముచ్చటపడుతున్నాడని కుడిచేతి మీద 'శ్రీను' అని పేరు చెక్కించినా. అది అట్టాగే ఉంది. అదిగాక కుడికాలు మడమ దగ్గర నిప్పు కాలిన మచ్చ ఉంది" అని వివరాలు చెప్పింది.
హైవే పోలీసులు వివరాలు నోట్ చేసుకుని పిల్లగాడి ఫోటో లేనందున కంప్లైంట్ ఫైల్ చేసి, ఏ సమాచారం తెలిసినా మీకు తెలియజేస్తామని ఓదార్చి వెనక్కి పంపారు.
ఫోన్లో మాట్లాడిన మురుగన్ లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని శ్రీనివాసన్ వెంటనే స్కూటర్ మీద బయలుదేరి ఆఫీసుకు వచ్చి మగతగా ఉన్న పిల్లాడిని చూసి గాబరాపడి, చల్లటి మంచినీళ్లు తెప్పించి మొహం మీద జల్లి గుడ్డతో తుడిపించాడు.
కొద్దిసేపటికి పిల్లగాడు తేరుకుని కొత్త ప్రదేశంలో మనుషుల్ని చూసి భయపడుతూ తెలుగులో "అమ్మ, నాయనా" అంటూ ఏడుస్తున్నాడు. అక్కడున్న ఎవరికీ తెలుగు భాష అర్థం కాకపోయినా జవాబు చెప్పలేకపోతున్నారు.
అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి.
పిల్లగాడు ఆకలి మీదున్నాడని తెలుసుకుని అప్పటికప్పుడు ఇడ్లీలు తెప్పించి వాడిచేత బలవంతంగా తినిపించారు. వాడు ఏడుస్తూ "అమ్మ, అమ్మ" అంటున్నాడు.
"ఎన్నడా కార్తికేయా, ఏడనుంచి ఈ పిల్లకాయను ఎత్తుకువస్తివి? ఈడు ప్రాణాలతో బతికినాడు గనుక ఏమీ కాలేదు, లేకపోతే పోలీసు కేసు అయివుండేది" అని అసిస్టెంట్ డ్రైవర్‌ని నిలదీశాడు యజమాని తమిళంలో.
"నాకేమీ తెలవదు సామీ, ఈ పిల్లగాడు ఎప్పుడు బండిలోకి ఎక్కినాడో అర్థం కావడం లేదు" అని తమిళంలో ఓనర్‌కు సంజాయిషీ ఇస్తున్నాడు కార్తికేయ.
చివరకు ఆ పిల్లకాయను ఏదోలా ఓదార్చి పడుకోబెట్టి, ఉదయం పరిష్కారమార్గం చూద్దామని నిర్ణయానికొచ్చారు.
మురుగన్ లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని శ్రీనివాసన్, సుభాషిణి దంపతులకు మూడేళ్ల కొడుకు మురుగన్ ఉండేవాడు. ఇంట్లో ఆటపాటలతో సందడిగా అమ్మానాన్నలకూ కనువిందు చేసేవాడు.
వాడికి ఏది కావాలంటే అది కొని తెచ్చి ఇచ్చేవారు. అప్పుడు శ్రీనివాసన్ షణ్ముగం ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా పని చేసేవాడు. నిజాయితీ, నమ్మకంగా ఉంటూ ఓనర్‌కు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలిగించేవాడు.
ఓనర్ షణ్ముగం డ్రైవర్ శ్రీనివాసన్ పని తీరును మెచ్చుకుని ఏదైనా సహాయం చెయ్యాలని తలచి ఒక పాత ట్రక్కును ఉచితంగా ఇచ్చాడు. ఆయన మంచితనం, దయాగుణానికి తన కృతజ్ఞత తెలియజేసుకున్నాడు డ్రైవర్ శ్రీనివాసన్.
ఆ పాతబండిని రిపేర్లు చేయించి స్వంతంగా నడుపుతూ ఎటువంటి కేసులు, యాక్సిడెంట్లు కాకుండా దాని మీద వచ్చే ఆదాయంతో మరో కొత్త ట్రక్కును బ్యాంక్ లోన్‌లో కొని, ఇంటిదైవం తిరుపతి శ్రీనివాసుడి ముడుపు చెల్లించి కొడుకు పేరున 'మురుగన్ లారీ ట్రాన్స్‌పోర్ట్' ప్రారంభించాడు.
డ్రైవర్ శ్రీనివాసన్ మంచితనం, మాటతీరు వల్ల షణ్ముగంతో పాటు ఇతర లారీ కంపెనీలు సరుకు లోడులు ఇచ్చి సహకరించేవారు.
అన్నీ కలిసొచ్చి కొద్ది సమయంలోనే మరికొన్ని ట్రాన్స్‌పోర్ట్ ట్రక్కులు కొనగలిగాడు. కొడుకు మురుగన్ పుట్టినాకే తను ఇంత పెద్ద లారీ కంపెనీకి ఓనర్ అవగలిగానని మురిసిపోతుంటాడు శ్రీనివాసన్.
తన వద్ద పని చేసే డ్రైవర్లను తన కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తుంటాడు. అందువల్ల కంపెనీలో పని చేసే సిబ్బంది కూడా ఓనర్ అంటే గౌరవం, అభిమానం చూపెడుతుంటారు.
సాధ్యమైనంత వరకు డ్రైవర్లు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చూస్తుంటాడు.
ఇంతలో శ్రీనివాసన్ దంపతులకు తట్టుకోలేని ఆపద వచ్చిపడింది.
ఎనిమిదేళ్ల మురుగన్ బంతి ఆడుతుంటే అది ఇంటి వాకిట్లో ఉన్న నీటి సంపులో పడింది. మూత తెరిచి ఉన్నందున బంతిని తీద్దామని వంగిన బాలమురుగన్ బ్యాలెన్స్ కాసుకోలేక నీటి సంపులో పడిపోయాడు.
ఆ సమయంలో శ్రీనివాసన్ లారీ ఆఫీసులో ఉండగా, తల్లి సుభాషిణి పక్క ఇంట్లో పని ఉండి వెళ్లింది. ఇంటి వద్ద ఎవరూ లేరు.
గంట తర్వాత తిరిగి వచ్చిన సుభాషిణి ఇంట్లో కొడుకు కనబడకపోవడంతో పేరు పెట్టి పిలిచింది. ఇంట్లోని గదులు, పరిసరాలు చూసినా ఎక్కడా కనబడలేదు. పక్క ఇళ్లలో వాకబు చేసింది, ఎవరి ఇంట్లోనూ లేడు.
ఇంటికి తిరిగి వచ్చిన సుభాషిణి ప్రహరీ గేటు పక్కన మూత తెరిచి ఉంచిన నీటి సంపు వైపు వెళ్లి తొంగిచూసింది. గుండె గుభేల్ మంది. నీటిలో మురుగన్ పడివున్నాడు.
"మురుగా!" అంటూ ఏడుస్తూ అరవడం మొదలుపెట్టింది. చుట్టూ ఇళ్లవారు ఏమైందోనని పరుగున వచ్చి చూడగా నీటి సంపులో మురుగన్ కనబడటంతో మగవారు కొందరు లారీ ఆఫీసుకు ఫోన్ చేసి శ్రీనివాసన్‌కు విషయం చెప్పారు.
లారీ ఆఫీసు ఇంటికి దగ్గరలోనే ఉన్నందున శ్రీనివాసన్ మరికొందరు పనివాళ్లతో వెంటనే బయలుదేరి వచ్చాడు.
అప్పటికే జనం ఇంటి వద్ద గుమిగూడి ఉన్నారు. వెంటనే పనివాళ్ల సాయంతో మురుగన్ శరీరాన్ని బయటకు తీసి దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకుపోయారు.
సుభాషిణి ఒకటే ఏడుపు. శ్రీనివాసన్ కూడా మనసులో బాధ తట్టుకోలేక ఇష్టదైవం "తిరుపతి బాలాజీ వెంకటేశ్వరా! నా కొడుకు ప్రాణాలు కాపాడు సామీ, నా ఆస్తి నీకు కానుకగా సమర్పించుకుంటాను" అంటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ వారి మనోవేదనకు అందరూ కంటతడి పెట్టారు.
హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు డాక్టర్లు, నర్సులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారి మురుగన్ ప్రాణాలు కాపాడలేకపోయారు. అప్పటికే నీరు ఊపిరితిత్తులు, గుండెల్లో చేరి ఊపిరి ఆగిపోయింది.
పోలీసు కేసైనందున హాస్పిటల్ వారు పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి కేసు రాసుకుని బాడీని పోస్టుమార్టంకు పంపారు.
ఈ విషాదం నుంచి కోలుకోవడానికి శ్రీనివాసన్-సుభాషిణి దంపతులకు చాలా కాలం పట్టింది. కొడుకు మురుగన్ ఫోటోను పెద్దగా చేయించి వెంకటేశ్వరస్వామి పటం పక్కన లారీ ఆఫీసులో ఉంచారు. రోజూ స్టాఫ్ దీపం వెలిగించి పూలదండ మారుస్తారు.
బాబు మురుగన్ చనిపోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆ దంపతులు కొడుకు జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నారు.
ఉదయమైంది. శ్రీనివాసన్ స్కూటర్ మీద బయలుదేరి లారీ ఆఫీసుకు వచ్చాడు. అక్కడ సోఫాలో లారీలో తెచ్చిన పిల్లగాడు కాళ్లు ముడుచుకుని పడుకుని ఉన్నాడు. ఇంతలో మిగతా స్టాఫ్ కూడా జమయ్యారు.
మనుషుల మాటల సవ్వడికి పిల్లగాడు లేచి కూర్చున్నాడు. కొత్త ప్రదేశం, కొత్త మనుషుల్ని చూసి 'అమ్మేదీ' అంటూ ఏడవడం మొదలెట్టాడు. వాడి భాష రాకపోయినా తమిళంలోనే సముదాయిస్తూ బిస్కెట్లు, ఇడ్లీలు తెచ్చి తినిపించడానికి ప్రయత్నిస్తున్నారు స్టాఫ్.
వాడి తైలం లేని జుత్తు, వేసుకున్న నిక్కరు, కమీజును బట్టి లేబర్ క్లాసులా అనిపించింది.
"ఇప్పుడు వీడిని ఏం చేద్దాం? ఎక్కడో పొరపాటున ఆగివున్న మన లారీలో ఎక్కి చెంగల్పట్టు వచ్చిన తర్వాత తెలిసిందని పోలీసులకు చెప్పి అప్పగిస్తే బాగుంటుందేమో"నని కొందరు సలహా ఇచ్చారు.
రాత్రి జరిగిన సంఘటన భార్యకు చెప్పిన శ్రీనివాసన్, ముందు ఈ పిల్లాడిని ఇంటికి తోలుకుపోయి మంచిగా స్నానం చేయించి సాపాటు తినిపిస్తే తర్వాత సంగతి చూద్దామని నిర్ణయానికొచ్చి స్టాఫ్ సాయంతో తీసుకువచ్చాడు. ఎవరినో పంపి వాడి సైజు నిక్కరు, కమీజు రెడీమేడ్‌వి తెప్పించారు.
ఇంటికి వచ్చిన ఉంగరాల జుత్తు ఆ కుర్రాడిని చూడగానే సుభాషిణికి చనిపోయిన కొడుకు మురుగన్ మనసులో మెదిలాడు.
"మురుగా!" అంటూ వాడిని ఆప్యాయంగా ఒడిలోకి తీసుకుంది. కొడుకు జ్ఞాపకాలు వాడిలో కనబడ్డాయి ఆమెకు.
వాడికి స్నానం చేయించి సాపాటు తినిపించి పోలీసు స్టేషన్‌లో అప్పగించాలని చెప్పారు స్టాఫ్.
"వద్దు, వీడిని పంపవద్దు. నేను పెంచుకుంటాను. పెద్దోణ్ణి చేసి మురుగన్ చేస్తాను" అంది తమిళంలో ఏడుస్తూ.
ఆ పిల్లగాడికి ఏమీ అర్థం కావడం లేదు. కొత్త మనుషులు, కొత్త భాష, కొత్త ఇల్లు అయోమయంగా ఉంది. గుడిసె, అమ్మానాయన ఎవరూ కనబడటం లేదు. రోజూ ఆడుకునే పెద్ద చెట్లు, సమాధి దిమ్మ ఏవీ కనిపించక మౌనంగా ఉండిపోయాడు.
చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చి సంగతి తెలిసి, ఆ పిల్లగాడిని కొద్ది రోజులు ఉంచిన తర్వాత సుభాషిణి కోలుకోగానే పోలీసులకు అప్పగించమని సలహా ఇచ్చారు. ఆఫీసు సిబ్బంది కూడా అలాగే చెయ్యమన్నారు.
గత్యంతరం లేక శ్రీనివాసన్ పిల్లగాడిని పోలీసులకు అప్పగించాలన్న ఆలోచన వాయిదా వేశాడు.
సుభాషిణి ఆ పిల్లగాడిని తమిళంలో లాలిస్తూ మెల్లిగా చేరదీసి సాంబారు అన్నం తినిపించింది. ఆకలి మీదున్న వాడు కొద్దికొద్దిగా తిన్నాడు.
సుభాషిణిని పరామర్శించడానికి వచ్చిన తెలుగు తెలిసిన పెద్దావిడ పిల్లగాడి కుడిచేతి మీద ఉన్న పచ్చబొట్టు "శ్రీను" అక్షరాలు చదివి, "పిల్లగాడి పేరు శ్రీను అని ఉంది, తెలుగు పిల్లగాడిలా ఉన్నాడు" అని తెలుగులో "నీ పేరేంటి, ఎక్కడుంటావు, అమ్మ అయ్య పేర్లేంటి?" అని అడిగింది.
శ్రీను పిల్లగాడు 'అమ్మ' తప్ప మరో మాట మాట్లాడక ఏడుపు మొదలెడుతున్నాడు. వాడిని ఒంటరిగా ఉంచడమే నయమని తలచి ఊరుకున్నారు.
అప్పటివరకు ఆ పచ్చబొట్టు విషయం పట్టించుకోని వారు వీడి పేరు 'శ్రీను' అని నిర్ధారణకొచ్చారు. "ఐతే మన సారు శ్రీనివాసన్ పేరే అనుకున్నారు. సారు కొలిచే తిరుపతి శ్రీనివాసుడే ఈ మాదిరిగా వచ్చుండవచ్చు" అన్నారు.
కొద్ది రోజులు ముభావంగా ఉన్న శ్రీను మెల్లగా తేరుకుంటున్నాడు.
సుభాషిణి తన వాత్సల్యంతో వాడిలో మార్పు తేవడానికి తమిళంలో బుజ్జగిస్తోంది. రకరకాల తిండి చేసి పెడుతోంది. పక్కింటి పిల్లల్ని పిలిచి ఆడిపిస్తోంది.
శ్రీనివాసన్ కూడా వాడి అమాయక మొహం, గిరజాల జుత్తు చూస్తే చనిపోయిన కొడుకు మురుగన్ జ్ఞప్తికి వస్తున్నాడు. వీడి పేరు కూడా తన ఇష్టదైవం శ్రీనివాసుడే అని తెలిసి సంబరపడిపోయాడు. వాడి మీద ఆప్యాయత మరింత పెరిగింది.
నెలలు గడుస్తున్నాయి. అక్కడ ఉప్పరి కుటుంబాలు శ్రీను జాడ తెలియక కలవరపడుతున్నారు.
ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఉంటారనుకుంటున్నారు. పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోతోంది. ఆచూకీ తెలిస్తే మేమే తెలియజేస్తామని సర్దిచెప్పి పంపిస్తున్నారు.
తమిళనాట చెంగల్పట్టులో మురుగన్ లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని శ్రీనివాసన్ కుటుంబం శ్రీనుతో అనుబంధం పెరిగి వాడి గత జీవితం మరిచిపోయేలా చేస్తున్నారు.
సుభాషిణి అభ్యర్థన మేరకు పోలీసు స్టేషన్‌లో అప్పగించాలన్న ఆలోచన మానుకున్నారు.
"మనలాగే వీడి అమ్మ కూడా కన్నకొడుకు కనిపించకపోతే ఎంత వేదన పడుతోందో" అని శ్రీనివాసన్ అన్నా, పెంచిన ప్రేమతో సుభాషిణి ఏమనలేదు.
శ్రీను వచ్చి సంవత్సరం దాటిపోయింది. వాడు గత జ్ఞాపకాలను మరిచి సుభాషిణి లాలనలో 'అమ్మ', 'అప్పా' అంటూ ఇంట్లో మురుగన్ మాదిరి తిరుగుతున్నాడు. తమిళంలో మాట్లాడటం అలవాటు చేశారు.
బంధువులను, సన్నిహితులను సంప్రదించి ప్రాంతీయ శాసనసభ్యుడి సహకారం, పలుకుబడితో పోలీసుల సహాయంతో శ్రీను పేరును 'శ్రీనివాసన్'గా రాయించి, మురుగన్ పుట్టినరోజును జన్మతిథిగా డాక్యుమెంట్లు తయారు చేయించి ప్రైవేటు స్కూల్లో ప్రవేశం కలిగించారు.
సంవత్సరాలు గడుస్తున్నాయి. ముందు వచ్చిన శ్రీనుకు ఇప్పటి శ్రీనివాస్‌కు గుర్తుపట్టలేనంతగా ఎదిగిపోయాడు. పూర్తి తమిళ అబ్బాయిగా మారిపోయాడు.
మంచి భోజనం, ఆదరణ, స్మార్ట్‌గా ఫ్యాషన్ దుస్తులతో అందంగా కనబడుతున్నాడు. లారీ ఆఫీసు స్టాఫ్ కూడా బాలమురుగన్ అంటూ ఆప్యాయత చూపెడుతున్నారు.
మధ్యవయసు దాటిన దేవరాజన్ డ్రైవర్, తన లారీలో వచ్చిన శ్రీను పిల్లగాడు చిన్నబాబులా ఎంత ముద్దుగా సార్ దగ్గర పెరుగుతున్నాడని జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు.
వయసు పెరిగినందున రాష్ట్రం దాటి సర్వీసులకు వెళ్లకుండా చెంగల్పట్టుకు దగ్గరగా లోడ్ ట్రిప్పులు నడుపుతున్నాడు.
ఇప్పుడు శ్రీనివాస్ హైస్కూలు, కాలేజీ చదువులు పూర్తి చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంలో తండ్రికి సహాయపడుతున్నాడు. కంపెనీ విస్తరించి పలు కొత్త బ్రాంచీలు ప్రారంభించారు.
శ్రీనివాస్ పెరిగి హ్యాండ్‌సమ్, స్మార్ట్‌గా కానొస్తున్నాడు. కొత్త కారు కొని బ్రాంచి ఆఫీసుల్ని విజిట్ చేసి వస్తుంటాడు.
శ్రీనివాసన్-సుభాషిణి దంపతులు చనిపోయిన కొడుకు మురుగన్ జ్ఞాపకాల నుంచి దూరమవుతూ వచ్చారు.
శ్రీనివాస్ చిన్నగా ఉన్నప్పుడు తరచు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ తలనీలాలు, కానుకలు సమర్పించుకునేవారు. ఇదంతా ఆ స్వామి దయేనని మనసులో తలుచుకుంటుంటారు.
వారి నివాస ఇంటిని ఆధునిక వసతులతో కొత్తగా కట్టించారు. స్టాఫ్‌కి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండగకు బోనస్ రూపంలో ఆర్థిక సహాయం చేస్తున్నాడు.
ఒకసారి మాటల సందర్భంలో తను చిన్నగా ఉన్నప్పుడు డ్రైవర్ దేవరాజ్ లారీలో ఆంధ్రా నుంచి తప్పిపోయి చెంగల్పట్టు శ్రీనివాసన్ ఇంటికి వచ్చినట్టు, సుభాషిణి అమ్మ తనను చేరదీసి స్వంత కొడుకులా పెంచిందని తెలిసింది.
తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకురావడం లేదు. అసలు తన తండ్రి ఎవరు, అమ్మ ఎవరు, వాళ్లు ఆంధ్రాలో ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు అని అప్పుడప్పుడు తలపుకు వస్తుండేది.
ఒకసారి ఆంధ్రాలో తిరుపతి పరిసరాల్లో శ్రీనివాస్‌కి పని వచ్చి తన కారులో డ్రైవరు దేవరాజ్‌ను వెంటబెట్టుకుని వచ్చాడు. అప్పుడు తను ఏ ప్రాంతంలో లారీ ఎక్కిందో జ్ఞాపకం చేసుకోమని కోరాడు.
ఈ మధ్యలో ఆంధ్రా వైపు లారీ లోడు తీసుకురానందున, అదీగాక పాతిక సంవత్సరాల క్రితంటి సంఘటన గుర్తుంచుకోవడం కష్టమే కదా.
అప్పుడు పుంగనూరు అనే ఊరిలో పౌల్ట్రీ ఫీడ్ అన్‌లోడ్ చేసి తిరుగు ప్రయాణంలో లోడ్ కోసం ఎదురుచూస్తూ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న నీటిగుంటలో బండిని శుభ్రం చెయ్యడం, అక్కడ చర్చికి వెళ్లడం, దగ్గరగా దాబాలో మధ్యాహ్నం భోజనం చెయ్యడం, ఆ సమయంలో బండిని రోడ్డు పక్కన ఉంచడం గుర్తుకు వచ్చాయి.
ఆ ప్రాంతం పుంగనూరు అనే ఊరికి దగ్గరగా ఉండేదని వివరాలు చెప్పగలిగాడు.
వాకబు చేసి శ్రీనివాస్ కారును పుంగనూరు వైపు మళ్లించి దేవరాజ్ చెప్పిన చర్చి, పెట్రోల్ బంక్ కోసం వెతకసాగాడు. రోడ్ల వెడల్పుతో బాగా మారిపోయాయి, అనేక వ్యాపారాలు విస్తరించాయి.
చివరకు చర్చి, పెట్రోల్ బంక్‌ను గుర్తించగలిగాడు. చర్చి కూడా విస్తరించి ఆధునాతనంగా కనబడుతోంది. పెట్రోల్ బంక్ రోడ్డు వెడల్పుతో వెనక్కి వెళ్లింది. నీటిగుంట ప్రదేశంలో సర్వీసింగ్ గ్యారేజ్ తయారైంది.
చూచాయగా దేవరాజ్ తను లారీ ఆపిన స్థలాన్ని గుర్తించి చెప్పాడు. అక్కడికి దగ్గరగా సమాధికి చుట్టూ ప్రహరీగోడ కట్టి మధ్యలో ఎవరిదో నిలువెత్తు శిలావిగ్రహం ఏర్పాటు చేశారు.
కారు దిగిన శ్రీనివాస్‌కు ఆ పరిసరాలు, తను అప్పుడు అక్కడ ఉన్న చెట్ల కింద ఆటలు ఆడుకున్నట్టు, గుడిసెలు ఉండేవని లీలగా జ్ఞాపకం వచ్చాయి. ఇప్పుడు గుడిసెలు తీసేసి సమాధి చుట్టూ ప్రహరీగోడ ఉంది.
శ్రీనివాస్ ఓపికగా అన్ని విషయాలు వాకబు చేసుకుంటూ, పిల్లాడు తప్పిపోయిన విషయం ఏ పోలీసు స్టేషన్లోనైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటారేమోనని దగ్గరగా ఉన్న పోలీసు స్టేషన్‌కు కారును పోనిచ్చాడు.
డబ్బులు వెదజల్లుతుంటే డ్రైవరు దేవరాజ్ చెప్పిన సంవత్సరం, నెల, సమయం ఆధారంగా పోలీసు స్టేషన్‌లో పాత రికార్డులు వెతకగా మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన రికార్డు దొరికింది.
అందులో పుంగనూరు దగ్గర పల్లె గ్రామవాసులు ఉప్పరి శీనయ్య, దేవమ్మల ఐదేళ్ల కొడుకు శీను తప్పిపోయినట్టు... ఉంగరాల జుత్తు, చామనచాయ శరీర రంగు, చేతి మీద శ్రీను పచ్చబొట్టు, కాలి మడమ మీద కాలిన గాయం మచ్చ ఉన్నట్టుగా గుర్తులు రాసి ఉన్నాయి.
శ్రీనివాసన్ తన కుడిచేతి మీద తెలుగులో 'శ్రీను' పేరుతో పచ్చబొట్టు, కుడికాలి మడమ మీద కాలిన మచ్చ గుర్తుకు వచ్చాయి.
అక్కడి నుంచి కారులో పుంగనూరు రమణయ్యపల్లెకు చేరి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ను సంప్రదిస్తే, "ఉప్పరి శీనయ్య కుటుంబం మట్టి పనుల కోసం ఎవరు ఎక్కడికి తీసుకుపోతే అటు వెళ్తారని, స్థిరంగా ఊళ్లో నివాసం ఉండరని, పండగలప్పుడు వచ్చి కొద్ది రోజులు గడిపి మళ్లీ ఎటో ప్రయాణంలో ఉంటారని" చెప్పాడు.
వారుండే గుడిసెల ప్రాంతంలో కొంతమంది ముసలివాళ్లు, పిల్లలు కనబడ్డారు.
తను ఇంత శ్రమ తీసుకుని అసలు అమ్మ, నాన్నలను తెలుసుకుందామని ప్రయత్నిస్తే నిరాశే ఎదురైందని బాధపడ్డాడు.
భగవంతుడు తనను మట్టి కుటుంబంలో పుట్టించినా అదృష్టరేఖలు కలిసొచ్చి ధనవంతుల ఇంట్లో పడవేసి తన జీవిత గమనాన్నే మార్చేశాడని ఆనందపడుతుంటాడు.
తను పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు, లేకపోతే ఏ మట్టిపనులో చేసుకుంటూ కూలీగా జీవనం సాగేదని నెమరువేసుకుంటుంటాడు ఆటోమొబైల్ ఇంజనీర్ శ్రీనివాసన్.
సమాప్తం
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.







Comments