top of page
Original.png

రేపటి నవోదయ నిరీక్షణ


మనవడితో ఎడ్లబండి వద్ద నిల్చున్న తాతయ్య రమణారావు – గ్రామీణ జీవితం, తెలుగు భాషా సంస్కృతిని ప్రతిబింబించే దృశ్యం

Repati Navodaya Nireekshana - Telugu Family Story | Written By Kandarpa Murthy

రేపటి నవోదయ నిరీక్షణ - తెలుగు కుటుంబ కథ | రచన: కందర్ప మూర్తి

Published In manatelugukathalu.com On 23/11/2026


గ్రామీణ జీవన విలువలు, తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాలపై ప్రేమను తరతరాలకు అందించాలనే ఆశయాన్ని తెలిపే హృద్యమైన సామాజిక కథ “రేపటి నవోదయ నిరీక్షణ”. ఆధునిక నగర జీవితం మధ్య పల్లె మూలాలను మరువకూడదనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.


కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ పది సంవత్సరాల తర్వాత బదిలీపై కుటుంబంతో దిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చినందుకు ఆనందించి, అగ్రహారం గ్రామం నుంచి రమణారావుగారు భార్య పార్వతమ్మతో పిల్లల్ని చూడటానికి నగరం వచ్చారు.


రమణారావు గారు అగ్రహారం గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తూ, గ్రామాలే దేశ ప్రగతికి మూలస్తంభాలని మహాత్మాగాంధీ గారి సిద్ధాంతాలను అనుసరిస్తూ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. 


అందువల్ల ఆయనంటే గ్రామంలో ఎంతో గౌరవం, మర్యాద చూపెడతారు ఊరి ప్రజలు. ఆయన భార్య పార్వతమ్మ కూడా భర్తలాగే ఎప్పుడు ఎవరికి ఏ సహాయం అవసరమైనా ముందుంటుంది.


రమణారావు గారి ఏకైక కుమారుడు కిరణ్ పట్నంలో కాలేజీ చదివి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి సెలక్టై, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో హోదా ఉద్యోగం సంపాదించి దేశ రాజధాని దిల్లీలో ఉంటూ పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. 


వారికి ఎనిమిదేళ్ల నరేష్, ఆరేళ్ల సరిత పిల్లలు ఉన్నారు. పిల్లల కాన్పులకు, పర్వదినాలప్పుడు కిరణ్, భార్య సుమలతతో ఊరికి వచ్చేవాడు.


తండ్రిని, తల్లిని తమతో దిల్లీ వచ్చేయమంటే గ్రామంలో బాధ్యతలు, వ్యవసాయం చూసేవారు లేనందున, అదీగాక ఉత్తరాది వాతావరణం తమకు సరిపడదని చెప్పి అగ్రహారంలోనే కాలక్షేపం చేస్తున్నారు. 


అదీగాక రమణారావు తెలుగు సంప్రదాయం, ఆచారాలకు విలువిచ్చే మనిషి. కొడుకు కుటుంబంతో ఉత్తరాదిన ఉండటం ఆయనకు అసలు ఇష్టం లేదు. 


పిల్లలు మన భాష, సంస్కృతి మరిచిపోతారని ఆయన భయం. మన ప్రాంతానికి వచ్చేయమని కొడుక్కి ఎన్నిసార్లు చెప్పినా, తన హోదాకు తగ్గ ఉద్యోగం అక్కడ లేనందున అవకాశం వచ్చేవరకు ఎదురుచూడాలని తండ్రికి నచ్చజెప్పేవాడు కిరణ్.


ఇప్పుడు హైదరాబాదుకు ట్రాన్స్‌ఫర్ అయినందున కిరణ్ కుటుంబంతో సంపన్నుల ప్రాంతంలో పెద్ద ఫ్లాట్ అద్దెకు తీసుకుని షిఫ్ట్ అయ్యాడు.


రమణారావు భార్య పార్వతమ్మతో నగరానికి వచ్చి కొడుకు ఉండే సంపన్నుల ఇళ్లలో ఫ్లాటు చూసి, అక్కడి హంగులు, వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు. 


అంతస్తుల ఆకాశ భవనాలు, లిఫ్టులు, కాలు కదపకుండా అడుగడుగునా ఖరీదైన కార్లు, పచ్చదనం లేకుండా అన్నీ కుండీలు, డ్రమ్ముల్లో విదేశీ మొక్కలు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జిలు, వాషింగ్ మెషీన్లు, ఇంట్లోనే మరుగుదొడ్లు, స్నానపు గదులు, ఆధునాతన వంటగది, పైపుల గ్యాస్ స్టవ్, వేడిచేసుకునే ఓవెన్లు, మిక్సీలు, పాత్రలు శుభ్రం చేసే మెషీన్ పక్కనే దేవుడి మండపం... ఇలాంటి కృత్రిమ వాతావరణం చూసి ఆయన "ప్రకృతి పచ్చదనానికి ఆలవాలమైన పల్లెలెక్కడ, నిత్యం ఉరుకుల పరుగుల కృత్రిమ వాతావరణ నగరాలెక్కడ!" అని మనసులో అనుకున్నారు.


ఆయన అక్కడ ఉండగానే గణేష్ నవరాత్రులు జరగడం, వినాయకుడి పూజకన్నా మండపం అలంకరణ హంగులు, డీజే రణగొణ ధ్వనులకు విసిగిపోయారు. దేవుడి మీద భక్తి కన్నా ఆర్భాటాలకే ఎక్కువ విలువిస్తున్నారనుకున్నారు.


తాతయ్య, నానమ్మ ఊరి నుంచి తెచ్చిన పాలజున్ను, అటుకులు, చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగకాయలు, తియ్యదుంపలు పిల్లలు ఎంతో ఆప్యాయంగా తిన్నారు.


మనవడు, మనవరాలు తెలుగు మాట్లాడటమే తప్ప రాయడం, చదవడం రాదని తెలిసి, ఇలాగైతే భవిష్యత్తు తరాలు మన భాష, సంస్కృతి, సంప్రదాయం మరిచిపోతారని ఆవేదన చెందారు రమణారావు.


ఇప్పుడు గ్రామాలు సహితం ఇంగ్లీషు చదువుల కోసం ఎగబడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని సౌకర్యాలున్నా చిన్నచూపు చూస్తున్నారని, మార్పు మంచిదే కానీ మన మూలాలను మరిచిపోకూడదని ఆవేదన చెందుతారు ఆయన.


గ్రామంలో పనుల ఒత్తిడి, నగర వాతావరణంలో సర్దుకోలేక రమణారావు, పార్వతమ్మ కొద్దిరోజులు కొడుకు కుటుంబంతో గడిపి ఊరికి బయలుదేరారు.


మనవడు నరేష్, "తాతయ్యా, నేను సమ్మర్ హాలిడేస్‌లో అగ్రహారం విలేజ్‌కి వస్తాను, అక్కడ బుల్లక్ కార్ట్ (ఎడ్లబండి) ఎక్కుతాను, తెలుగు నేర్చుకుని చిల్డ్రన్ మ్యాగజైన్స్ చదువుతాను" అని ముచ్చటపడటం చూసి మనవడికి గ్రామీణ వాతావరణమంటే ఇష్టమని గ్రహించారు రమణారావు.


అలాగే సంక్రాంతి పండుగలకు చాలా రోజుల విరామం తర్వాత కొడుకు, కోడలు పిల్లల్ని తీసుకుని అగ్రహారం రావడంతో ఎప్పటికన్నా ఎక్కువ ఆనందమైంది రమణారావు దంపతులకు.


గ్రామమంతా రంగురంగుల ముగ్గుల అలంకారాలు, బంధువుల రాకలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, కర్రసాములు, కోడిపందేలు, గ్రామదేవతల సంబరాలు, తీర్థాలు, సంప్రదాయ వేడుకలు, రకరకాల వంటకాలతో మూడు రోజులు ఎంతో ఆనందంగా గడిపారు కిరణ్ కుటుంబం.


పార్వతమ్మ ప్రత్యేకంగా అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, నేతి సున్నుండలు, పెరుగు గారెలు, పాకం గారెలు చేసిపెట్టింది. జంక్ ఫుడ్ తిని విసిగిపోయిన పిల్లలు నానమ్మ చేసిన వంటకాలకు ఎంతో మురిసిపోయారు.


కిరణ్ చిన్ననాటి మిత్రులను కలుసుకుని చదువులు, ఉద్యోగాల అనుభవాలు ముచ్చట్లు పెట్టుకున్నారు. పిల్లలు ఇంకా కొద్దిరోజులు ఉందామన్నా స్కూలుకు సెలవులు లేనందున హైదరాబాదుకు బయలుదేరక తప్పలేదు.


తాతయ్య అలంకరించి తెచ్చిన ఎడ్లబండి మీద కూర్చుని మనవడు నరేష్ ఎంతో ఆనందపడి ముచ్చట తీర్చుకున్నాడు. 


ఈసారి వేసవి సెలవులలో వచ్చినప్పుడు తెలుగు చదవడం, రాయడం నేర్పుతానని, కొబ్బరిబోండాలు, తాటిముంజలు, తాటితేగలు తినిపించడమే కాదు ఊరి దేవుడి కోనేరులో ఈత నేర్పిస్తానని మాట ఇచ్చారు తాత రమణారావు.


సమాప్తం









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page