top of page
Original.png

పసుపు కుంకుమలు

1 hour ago
9 min read

పసుపు కుంకుమలు కథలో మనవరాలు తన తాతను ప్రేమగా వెంట తీసుకెళ్తున్న భావోద్వేగ దృశ్యం

Pasupu Kumkuma - Telugu Moral Story | Madhupatra Sailaja Uppaluri

పసుపు కుంకుమలు - తెలుగు నీతి కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 24/11/2026


‘పసుపు కుంకుమలు’ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేసే పిల్లల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, ఆస్తి కంటే అనుబంధాలు ఎంత విలువైనవో గుర్తుచేసే హృదయస్పర్శి కుటుంబ కథ. ప్రేమ, బాధ్యత, త్యాగం, మానవత్వం కలిసిన ఈ కథ మనసును కదిలిస్తుంది.


“ఏమండీ! తొందరగా ఇటు రండి,” అంటూ కంగారుగా భర్తను పిలుస్తున్న రమ సెల్‌ఫోన్ పట్టుకున్న చెయ్యి అప్రయత్నంగా వణుకుతోంది.


“ఏమయ్యిందే? అలా వణికిపోతున్నావు,” అంటూ ఆదుర్దాగా వచ్చాడు నాగేంద్ర.

“మీ అమ్మగారు...” అంటూ తన చేతిలోని సెల్ అతనికిచ్చింది.


“హలో! చెప్పండి,” అన్నాడు నాగేంద్ర.


“సార్! నాగేంద్రగారూ! నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. మీ అమ్మగారు ఐదు నిమిషాల క్రితం ‘శివైక్యం’ చెందారు. 


మీ నాన్నగారు షాక్‌కు గురై మాటపలుకు లేకుండా ఆమె మంచం దగ్గరే కూర్చుండిపోయారు. మీరు ఆశ్రమానికి వచ్చి మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. 


ఎక్కువసేపు పార్థివశరీరాన్ని ఇలా వృద్ధాశ్రమంలో ఉంచితే మిగిలిన పెద్దలు భయానికి గురవుతారు. 


వారిపై అది ప్రభావం చూపిస్తుంది,” అంటూ వృద్ధాశ్రమం మేనేజర్ చక్రధర్ చెప్పాడు.


“ఓ పావుగంటలో ఫోన్ చేస్తాను,” అని చెప్పి కాల్ కట్ చేశాడు నాగేంద్ర.


పెద్దకొడుకుగా తానిప్పుడు తల్లికి కర్మకాండలు చేయాలి. తన కర్మ కాకపోతే ఈ సమయంలో ఇలాంటి వార్త రావటమేమిటి? పిల్ల పెళ్లి ఇంకా రెండు రోజులు కూడా లేదు. 


ఇప్పుడిలా మైలరోజులు రావటంతో పెళ్లి చేయకూడదు. అటుచూస్తే పెళ్లి పిలుపులు, పనులు అన్నీ దాదాపుగా పూర్తయిపోయాయి. 


రేపు సాయంత్రానికి మగపెళ్లివారు కూడా వచ్చేస్తున్నారు. పోనీ మగపెళ్లివారికి నచ్చజెప్పి పెళ్లి వాయిదా వేద్దామన్నా, చేసిన ఏర్పాట్లకు ఇచ్చిన అడ్వాన్స్‌ల రూపంలోనే లక్షల్లో నష్టపోవాలి. 


ఏం చేయాలో పాలుపోక తమ్ముడు ఫణీంద్రకు ఫోన్ చేసి పిలిచి, మాట్లాడాడు.


“తల్లి మరణవార్త ఎవరికీ తెలియనీయకుండా జాగ్రత్త పడదాం. ఆశ్రమం వారికి నచ్చజెప్పి తల్లి శవాన్ని ఐస్‌బాక్స్‌లో భద్రపరిచి వారికి దగ్గర్లో ఉన్న మార్చురీ రూంలో ఉంచమని చెబుదాం,” అనుకున్న అన్నదమ్ములిరువురూ తమ భార్యలతో కూడా చర్చించాక ఆశ్రమం మేనేజర్‌కి ఫోన్ చేశాడు నాగేంద్ర.


“సార్ చక్రధర్‌గారు! ‘రేపు లేదు ఎల్లుండే’ మా అమ్మాయి పెళ్లి ఉంది. ఈరోజు, రేపు బంధువులొస్తున్నారు. 


ఎంతో ఖర్చుపెట్టి పిల్ల పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకున్నాను. మగపెళ్లివారు కూడా తరలివచ్చే సమయమయ్యింది. ఇటువంటి పరిస్థితులలో నేను పిల్ల పెళ్లి ఆపలేను. 


నా తల్లి కర్మకాండలను నిర్వహించలేను. మాలాంటి వారికోసమే ఐస్‌బాక్స్‌లు, మార్చురీలు ఉన్నాయిగా! వాటిలో నా తల్లి శవాన్ని ఉంచండి. 


అందుకు అవసరమయ్యే ఖర్చుల కోసం అయ్యే డబ్బు నేను మీకు ‘ఫోన్‌పే’ చేస్తాను. పిల్లకు ఆ మూడుముళ్లు పడ్డాక నేను వచ్చి నా తల్లి అంత్యక్రియలు చేస్తాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించండి,” అంటూ ఫోన్ పెట్టేశాడు నాగేంద్ర.


అంతా విన్న చక్రధర్, “ఈ లోకం ఎటుపోతోంది? ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారా? తల్లి ప్రాణం పోయిందంటే గుండెలు బాదుకుంటూ రాకపోయినా ఫర్వాలేదు కానీ, కనీసం వచ్చి తండ్రికి ధైర్యం చెప్పి, ఈ విపత్కర పరిస్థితిలో ‘అలా చేద్దామా? ఇలా చేద్దామా?’ అంటూ ఓ సలహా అడిగే ప్రయత్నం కూడా చేయటం లేదు. 


కన్నబిడ్డల హృదయాలు ఎంత కఠిన పాషాణాలవుతున్నాయి? నా చాదస్తం కాకపోతే వాళ్లకు పాపచింతనే ఉంటే ఇలా కన్నవాళ్లను వృద్ధాశ్రమాల పాలు చేస్తారా?” అనుకున్నాడు. శివరావు పక్కనే కూర్చున్నాడు చక్రధర్. ఆశ్రమంలోని కొందరు స్నేహితులు వారి వెంటే ఉండి ధైర్యవచనాలు చెబుతున్నారు.


శివరావుకి చెప్పలేక చెప్పలేక నాగేంద్ర విషయాన్ని చెప్పి, “మీ అమ్మాయి లావణ్యకి కూడా అమ్మగారి మరణవార్తను తెలియజేస్తాను,” అంటూ శివరావు సెల్ నుంచే ఆమెతో మాట్లాడాడు చక్రధర్.


“నాన్నాగారూ! చాలా రోజులకి ఫోన్ చేశారు. అన్నయ్య వాళ్లింట్లోనే ఉన్నారా? ఎంతైనా మీ ముద్దుల మనవరాలు అలేఖ్య పెళ్లి కదా! నాలుగు రోజుల ముందైనా అన్నయ్య మిమ్మల్ని తీసుకెళ్లకుండా ఎలా ఉంటాడు?” అంటూ పెళ్లి కబుర్లు సంతోషంగా చెబుతూ అటుపక్కన ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోకుండా గలగలా మాట్లాడేస్తోంది లావణ్య.


“లావణ్యగారు ఒక్క నిమిషం ఆగండి. నేను ఆశ్రమం మేనేజర్ చక్రధర్‌ని మాట్లాడుతున్నాను. 


మీకు ఓ బాధాకరమైన వార్తను తెలియజేయాల్సి వచ్చింది. మీ తల్లిగారు ఒక అరగంట క్రితమే శివైక్యం చెందారు,” అంటూ ఆమె అన్నయ్య నాగేంద్ర చెప్పిన విషయం అంతా వివరంగా చెప్పాడు చక్రధర్.


అన్నీ విన్న లావణ్య, “సార్! మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఓ అరగంటలో అక్కడికి వస్తాను,” అంటూ కాల్ కట్ చేసి, ఈ విషయం భర్తకి చెప్పటానికి కంగారుగా వెళ్లింది. చెప్పిన సమయానికంటే ముందుగానే ఆశ్రమానికి చేరుకుంది లావణ్య.


“చక్రధర్‌గారు! మీరు నాకు కాస్త సహాయం చేయాలి. మావారు శ్మశానవాటిక దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. నేను ఇటు వచ్చాను,” అంటూ తండ్రిని ఓదార్చటానికి వెళ్లి తండ్రి ఒడిలో కుప్పకూలిపోయింది.


“ఇలా అయ్యిందేమిటి నాన్నగారూ? తనకు ఆరోగ్యం బాగుండని విషయం నాతో చెబితే ఏదైనా హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం చేయించేదానిని. తన ముద్దుల మనవరాలి పెళ్లి చూడకుండానే వెళ్లిపోయింది. 


పాపం అలేఖ్య తన అమ్మానాన్నలకి తెలియకుండా కనీసం వారంలో ఒక్కసారన్నా ఆశ్రమానికి వచ్చి నానమ్మను పలకరించి, మీకు కావలసిన పళ్లు ఇచ్చి కొంత సమయం మీతో గడిపేది.


‘నాకు పిల్లలతో రావటం కుదరటం లేదే’ అని దాని దగ్గర అన్నప్పుడు, ‘నీ తరఫున కూడా నేనే తాతయ్య నానమ్మలతో కబుర్లు చెబుతానులే అత్తా’ అంటూ నా బాధను తగ్గించేది. 


కిందటి నెలలో నేను పుట్టినరోజని వస్తే ఈ ‘పసుపుకుంకుమలు’ తప్ప ‘ఇంట్లో ఉన్నప్పుడు ఇచ్చినట్లుగా చీరసారెలు ఇవ్వలేకపోతున్నాను’ అని చెబుతూ అమ్మ కంట నీరు పెట్టుకుంది. 


నాకు ఏ చిన్న కష్టమొచ్చినా దానికి పరిష్కారం చూపించి నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచేది అమ్మ. అలాంటి అమ్మ ఇప్పుడు కనుమరుగయ్యింది నాన్నా!” అంటూ కాసేపు బాధపడి, తనని తాను సంభాళించుకుంది లావణ్య.


“నాన్నాగారూ ఇలా రండి,” అంటూ శివరావుని డైనింగ్‌హాల్‌కి తీసుకెళ్లి అల్పాహారం చేయించి టీ ఇచ్చి, “నాన్నగారూ! బాధపడకండి. 


చక్రధర్‌గారు నాతో అన్నయ్యల విషయం అంతా చెప్పారు. అన్నయ్యలు రాకపోతే పోనీయండి, నేను మీకు అండగా నిలబడి, మీ అల్లుడిగారి సహాయంతో అమ్మకి అంత్యక్రియలు చేయిస్తాను,” అంటూ తండ్రిని ఓదార్చింది లావణ్య. 


అంబులెన్స్ పిలిపించి, చక్రధర్‌గారి సహాయంతో తల్లి శవాన్ని పూలమాలలతో అలంకరించి అంబులెన్స్‌లోకి ఎక్కించి తండ్రితో పాటు శ్మశానవాటికకు బయలుదేరింది.


బయలుదేరే ముందుగా అన్నలతో మాట్లాడి తాను చేయదలచుకున్న కార్యక్రమం గురించి చెప్పింది లావణ్య. 


నాగేంద్ర ఫోనులో మాట్లాడుతూ, “అంబులెన్స్‌ని నేనుండే వీధిగుండా కాక వేరే దారిలో తీసుకెళ్లమని, పిల్ల పెళ్లి దృష్ట్యా తల్లి మరణవార్త మరెవరితోనూ మాట్లాడవద్దని” మానవత్వం మరచిన మనిషిగా చెప్పటం లావణ్య మనసుని కదిలించింది. 


“విలువలు లేని చోట మాట్లాడకూడదు, ప్రేమలు లేని చోట ఆశపడకూడదు,” అని లావణ్యకి అనిపించింది. ఆ విధంగా నాగేంద్ర చెప్పినట్లుగా వేరే మార్గంలో అంబులెన్స్ శ్మశానవాటికకు చేరుకుంది.


లావణ్య భర్త ‘కార్తీక్’ ఎదురొచ్చి తన మామగారికి ఆసరాగా నిలబడ్డాడు. వారి ఆచారం ప్రకారం అత్తయ్యగారికి ‘మహాప్రస్థానం’లో కావలసిన ఏర్పాట్లన్నింటినీ అతను చేయిస్తున్నాడు. 


శివరావు భార్యకి “పసుపుకుంకుమలు” సమర్పించాడు. తల్లిని తాను తెచ్చిన కొత్తచీరతో అలంకరించింది లావణ్య. 


అల్లుడు కూతుళ్ల సాయంతో భార్య అంత్యక్రియలను చిత్తశుద్ధితో పూర్తిచేసిన శివరావుకి ఆత్మతృప్తి కలగలేదు. “పెద్దకొడుకు చేతితో కడతేరాలన్న నీ కోరికను మాత్రం తీర్చలేకపోయాను. ఆ లోటు ఎప్పటికీ లోటుగానే నాకనిపిస్తుంది పార్వతీ!” అంటూ బాధపడ్డారాయన.


ఆ తరువాత లావణ్య కారులో శివరావుని ఆశ్రమానికి తీసుకొచ్చారు. చక్రధర్‌గారితో మాట్లాడుతూ, “అమ్మలేని లోటు నాన్నను బాధిస్తుంది. ఇకనుంచి నా తండ్రి బాధ్యతను నేను తీసుకుంటాను. ఆయనకే లోటు రానీయను. అందుకే ఆయనను నాతో తీసుకువెళ్తాను,” అని చెప్పింది లావణ్య.


“మీ ఇష్టం నెరవేరాలంటే మీ నాన్నగారు కూడా అందుకు ఒప్పుకోవాలిగా?” అంటూ శివరావు వైపు చూశాడు చక్రధర్.


“నాన్నా! ఇప్పుడు మా ఇంటికి వెళ్లిపోదాం సరేనా?” అంది లావణ్య.


“లేదమ్మా! నీకెంతో ఇష్టమైన మేనకోడలి పెళ్లి ఇక రెండు రోజులలో ఉంది కదా! అమ్మ ఉన్నట్లయితే ఆ పెళ్లికి మమ్మల్ని తీసుకెళ్లేవాడేమో నీ అన్నయ్య. 


నానమ్మ, తాతయ్యలు ఇక దానికి లేనట్లే. అందుకే మేనత్తవి నువ్వు దగ్గరుండి అలేఖ్య పెళ్లి జరిపించు. 


పెళ్లికూతురిని చేసిన దగ్గరనుండి పిల్ల అత్తవారింటికి వెళ్లేవరకు జరిగే ప్రతి పనిలోనూ నీ అవసరం వాళ్లకు ఉంటుంది. అలేఖ్యకి పెళ్లిపనులలో నువ్వు తోడుగా నిలబడి దానికే విధమైన బాధను రానీయవద్దు. 


రేపు నీకు నచ్చిన నెక్లెస్ కొని అలేఖ్యకి ఈ తాతయ్య నానమ్మల తరఫున ‘పెళ్లికానుక’గా ఇవ్వమ్మా. డబ్బులు నేను నీకు పంపిస్తాను. కనీసం మా ఆనందాన్ని నీ ద్వారా అలేఖ్యకి అందించు లావణ్యా! మీరు పెళ్లి పనులు పూర్తిచేసుకుని వచ్చిన తరువాత నా గురించి మనం ఆలోచిద్దాం,” అన్నాడు శివరావు.


“లావణ్యా! ఇంకొక్క మాట చెప్పాలి. నీ పెళ్లి సమయంలో ‘పసుపుకుంకుమ’ల కింద పదెకరాల భూమిని నీ పేరున రాశాను కదా! నిన్ను అత్తవారింటికి పంపించిన వెంటనే నీ అన్నయ్యలు తమ వాటాలను కూడా ఇచ్చేయమని నాపై ఒత్తిడి తెచ్చారు. 


‘కడుపు చించుకుంటే కాలిమీద పడుతుంది’ అంటారు. అలాగే నా పిల్లల గురించి నేను ఎవరితో చెప్పుకోవాలి? అయినా వాళ్లపై నమ్మకముంచి నీ స్నేహితురాలు ‘లాయర్ అఖిల’ సమక్షంలో నా స్థిరచరాస్తులను పంపకం చేసేశాను. 


అన్నయ్యలకు కూడా నీకు ఇచ్చిన విధంగానే తలో పదెకరాల భూమిని రాశాను. ఇక నా పేరుతో ఐదెకరాల మామిడితోట, మన ఊరిలో ఉన్న ఇల్లు, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకున్నాను. మేమూ పెద్దవాళ్లమయిపోయాం. 


ఈ ముదిమి వయసులో మా అవసరాల గురించి పిల్లల దగ్గర చేయి చాచటం నాకు ఇష్టం లేదు. మామిడి తోటపై వచ్చే ఆదాయం మాకు సరిపోతుంది. అనుకోని ఖర్చులు వచ్చినా సర్దుబాటు చేసుకోగలుగుతాను.


పోయినేడాది అన్నయ్య మమ్మల్ని తన దగ్గరకు రమ్మంటే వాడి కపటప్రేమను గ్రహించలేక, మాకెన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిన ఇంటిని, తోటని, ఊరిని వదిలి వాడితో కలిసి ఈ ఊరికి చేరుకున్నాం. 


మేం వచ్చిన దగ్గరనుండి అన్నయ్య, ‘ప్రస్తుతం ఊరిలోని ఇంటిని రియల్ ఎస్టేట్‌వారికి అమ్మితే చాలా డబ్బు వస్తుంది. అలేఖ్య పెళ్లికి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నాకు సాయం చేయవచ్చు’ అని ‘సెంటిమెంటల్ బ్లాక్‌మెయిలింగ్’ చేయటం మొదలుపెట్టాడు. 


తన మాటల ద్వారానే కాక చేతలతోనూ మామీద ఇంటిని అమ్మడానికి ఒత్తిడి తీసుకువచ్చాడు.

ఆ ఇంటిని వదులుకోలేక, ‘మా తదనంతరం మీరు ఆ ఇంటిని ఏమైనా చేసుకోండి గానీ, మేముండగా దాన్ని ఎట్టిపరిస్థితులలోనూ అమ్మడానికి ఒప్పుకోం. నా మనవరాలి పెళ్లికి ఏ విధంగా సాయం చేయాలో నేను ముందుగానే నిర్ణయించుకున్నాను’ అని గట్టిగానే చెప్పాను. 


దాంతో వాడికి మాపై కోపం పెరిగి విచక్షణ లోపించి, జన్మనిచ్చిన తల్లిదండ్రులమని కూడా చూడకుండా ‘పొమ్మనలేక పొగపెట్టి’ ఆ బాధతో మా అంతట మేమే ఈ ఆశ్రమానికి వచ్చేలా చేశాడు.


మీ అమ్మకి ఇక్కడికొచ్చాక తన మాటల్లో మనవరాలి పెళ్లి గురించిన ఆలోచనలే ఎక్కువగా చోటు చేసుకునేవి. 


ఆమె ఎప్పుడూ మన ఇంటి గురించిన కబుర్లను తోటివారికి కథలుకథలుగా చెబుతూ ఉండేది. 


ఓ రోజు ఇక్కడ బాగా వేడి అనిపించి బాధపడుతూ ఉంటే, ‘ఏమండీ! మీకు గుర్తుందా? మన పెద్దోడు ఇంటర్ పరీక్షలకు చదువుతూ “నాన్నా! ఎంత వేడిగా ఉందో! ఈ ఎండలు భరించలేకపోతున్నాను. 


చదువుపై మనసు పెట్టటం కంటే చెమటలు తుడుచుకోవటానికే ఎక్కువ సమయం పడుతోంది. ఓ కూలర్‌గానీ, A.C. గానీ కొనకూడదా?” అని అడిగాడు.


“కూలర్ అయితే దాని శబ్దం నీ చదువుకు ఆటంకంరా” అని చెప్పి వాడి రూంకి వెంటనే A.C. పెట్టించారు’ అని పాత జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటూ, అంతలోనే ‘మరి ఇప్పుడేమిటండీ వాడు మన అవసరమే లేదన్నట్లు మనల్ని ఇలా పంపేశాడు?’ అంటూ బాధపడింది.


నాకు లోలోపల మీ అమ్మ ఇంత దిగులు పెట్టేసుకుని ఏమైపోతుందో అని భయం వేసేది. నా చింతనకు తగ్గట్లుగానే ఆ దిగులే మీ అమ్మను నాకు దూరం చేసేసింది.


మా కొడుకు మాత్రం తక్కువ తిన్నాడా? ‘అమ్మకి మాత్రం చల్లదనం కావద్దా?’ అని అనుకునే అమ్మ శవాన్ని తాను వచ్చేదాకా ఐస్‌బాక్స్‌లో పడుకోబెట్టమన్నాడటమ్మా! అందుకే నా మనసు విరిగిపోయింది. 


అమ్మ జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఆ ఇంటిని వాడి స్వార్థానికి వదిలిపెట్టను. త్వరలోనే ఆ ఇంటి విషయంలో ఓ నిర్ణయం తీసుకుని వీలునామా రాస్తాను. అయితే ఈ విషయం మాత్రం నువ్వు ఎవ్వరితోనూ మాట్లాడవద్దు,” అంటూ తన మనసులోని బాధను కూతురితో పంచుకున్నాడు శివరావు.


అంతా విన్న లావణ్య, “నాన్నా! మీ మాటలు, బాధ, అన్నయ్య చేతలు వింటూంటే నాకు వాడింటికి వెళ్లాలనిపించటం లేదు,” అంది కన్నీళ్లతో.


“లేదమ్మా! నువ్వు వాడికోసం కాదుగా అక్కడికి వెళ్లేది? అలేఖ్య కోసం నువ్వు తప్పనిసరిగా దాని పెళ్లికి వెళ్లాలి. 


దానికి మేమంటే పిచ్చి ప్రేమ. అది సంతోషంగా ఉండాలంటే నువ్వు దాని దగ్గరే ఉండాలి. అయితే ఇక్కడి విషయాలేవీ అక్కడ చెప్పవద్దు,” అంటూ లావణ్యను ఒప్పించి మనవరాలి పెళ్లికి పంపించాడు శివరావు.


లావణ్య తన ఇంటికి వెళ్లిపోయి మరునాడు ఉదయమే భర్త, పిల్లలతో కలిసి పెళ్లికి బయలుదేరి వెళ్లింది. 


అత్తను చూస్తూనే పరిగెత్తుకొచ్చిన అలేఖ్య, “చూడత్తా! రేపే పెళ్లయినా నానమ్మా తాతయ్యలు ఇంకా రాలేదు,” అంటూ బుంగమూతి పెట్టుకుని అడిగింది.


“నానమ్మకి నీరసంగా ఉంది. ఇక్కడికొచ్చినా రూంలోనే పడుకుని ఉండాలి. ‘పెళ్లింట్లో అలా రోగిష్టిదానిలా పడుకోవటం నాకు ఇష్టం లేదనే ఇంకా పెళ్లికి వెళ్లలేదు. 


లగ్నం సమయానికి వచ్చేస్తాం’ అని ఫోనులో నాకు చెప్పిందమ్మా. లేకపోతే ఈ మనవరాలి పెళ్లి సంబరంలో తాను లేకుండా ఉండగలదా?” అని అలేఖ్యని సముదాయించటానికి ప్రయత్నిస్తున్న లావణ్యకి దుఃఖం ఆగక పక్క రూంలోకి హడావిడిగా వెళ్లిపోయింది.


ఉదయం పదిగంటలకే పెళ్లి ముహూర్తం. బంధువులు, నాగేంద్ర సన్నిహితులు, అలేఖ్య స్నేహితులు అందరూ కల్యాణమంటపానికి చేరుకుంటున్నారు. 


వాతావరణం అంతా సందడిగా ఉంది. లావణ్య చక్రధర్‌గారికి ఫోన్ చేసి, “మా నాన్నగారికి మనవరాలి పెళ్లి చూపించండి,” అంటూ లింక్ పెట్టింది. ఆశ్రమంలోని వారందరూ అలేఖ్య పెళ్లిని లైవ్‌లో చూసి ఆనందిస్తున్నారు.


“అదుగో వాడే నా రెండో కొడుకు, నా మనవడితో కలిసి అందరినీ పలకరిస్తున్నాడు. అదిగో నా చిట్టితల్లి పెళ్లికూతురి ముస్తాబులో బంగారు బొమ్మలా ఉంది. 


దాని కళ్లు మాత్రం ఎవరి కోసమో వెతుకుతున్నట్లుగా దిగాలుగా ఉన్నాయి,” అంటూ శివరావు వ్యాఖ్యానం చేస్తూ తన వాళ్లను సహచరులకి పరిచయం చేస్తున్నాడు.


“ఇంకా ఎప్పుడొస్తారు అత్తా తాతయ్యా వాళ్లు?” అంటూ లావణ్యని పిలిచి అడుగుతోంది అలేఖ్య.

శివరావుకి గుండెల్లో వేదన మొదలయ్యింది.


“ప్చ్! ఎంతగా తహతహలాడిందో మనవరాలి పెళ్లి కళ్లారా చూడాలని! అంతలోనే ఇలా...” అనుకుంటూ చెమర్చిన కళ్లను తుడుచుకున్నాడు శివరావు.


ఒక్కొక్కటిగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెళ్లికొడుకు, పెళ్లికూతురు వచ్చి పెళ్లిపీటలపై కూర్చున్నారు. ‘గట్టి మేళం’ అంటూ పురోహితుడు మైకులో అరిచి చెప్పి వధూవరులతో ‘జీలకర్రాబెల్లం’ ముహూర్త సమయానికి పెట్టించారు. 


అంతా అక్షింతలు వధూవరులపై వేస్తున్నారు. అప్రయత్నంగా శివరావు చెయ్యి పైకెత్తి, అంతలోనే అది ఆశ్రమమని గుర్తెరిగి ‘దీర్ఘసుమంగళీభవ’ అంటూ మనవరాలిని నిండు మనసుతో దీవించాడు.


‘మంగళసూత్రధారణ’ అయిన తరువాత వధూవరులనుద్దేశించి, “మీ నూతన దంపతులిరువురూ పెద్దలందరికీ నమస్కరించి ఆశీర్వచనం తీసుకోండి. ఓ గంట తరువాత మిగిలిన వివాహ తంతు జరిపిస్తాను,” అంటూ లేచారు బ్రహ్మగారు.


వధూవరులకు ఫ్రూట్‌జ్యూస్ అందించింది లావణ్య. అలేఖ్య భర్త ‘నందన్‌’ని పక్కకు తీసుకెళ్లి చెవిలో ఏదో చెప్పింది. 


ఫ్రూట్‌జ్యూస్ తాగిన వధూవరులు కల్యాణమంటపం బయటకు వచ్చి కారెక్కారు. కారు కదిలింది. లావణ్యకి అర్థమయ్యింది వారు ఎక్కడికి బయలుదేరారో! పది నిమిషాలలో కారు శివరావుగారున్న ఆశ్రమానికి చేరుకుంది.


తన చీరచెంగుకు కట్టుకువచ్చిన అక్షింతలను చేతిలోకి తీసుకుని భర్తతో కలిసి తాతగారున్న గదిలోకి వచ్చింది అలేఖ్య. 


“తాతా! నానమ్మ ఎక్కడుంది? బయట గార్డెన్‌లో కూర్చుందా? నేనిలా వస్తానని తెలియదు కదా! పెద్దలు మీరే మొదటగా మా జంటను ఆశీర్వదించాలి. 


ఆ తరువాతే మిగిలినవారందరూ. అందుకే వేరే ఎవరితోనూ అక్షింతలు వేయించుకోవటం ఇష్టం లేక వెంటనే ఇక్కడికొచ్చేశాం,” అంది అలేఖ్య.


శివరావుగారికి ‘ఓ కంట పన్నీరు మరోకంట కన్నీరు’ పెల్లుబికాయి. “తల్లీ! కూర్చో. నీ దగ్గర ఓ విషయం దాచాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం మీ నానమ్మ...” అంటూ జరిగినదంతా వివరంగా చెప్పుకొచ్చారు. 


“నీ పెళ్లి ఆగిపోకూడదని మౌనంగా ఈ దుఃఖాన్ని దిగమింగుతున్నానమ్మా,” అంటూ అలేఖ్యను కౌగిలించుకుని విలపించాడు శివరావు.


“ఇంత జరిగినా అమ్మానాన్నలు మాటమాత్రం కూడా నాతో అనలేదు. లావణ్య అత్త కూడా నాకేమీ చెప్పకుండా దాచేసింది. ఆ రోజు అత్త ఏడుస్తూ పక్క గదిలోకి వెళ్లినప్పుడు నేను గమనించినా పెళ్లి హడావిడిలో మళ్లీ అత్తను విషయమేమిటో అడగలేకపోయాను.


నేను మీ వారసురాలిని తాతా! మీ పెంపకంలో పెరిగాను. నానమ్మ ప్రేమని ఇన్నేళ్లూ ఎవరూ పొందనంతగా ఆస్వాదించాను. 


నేను ఉద్యోగంలో చేరాక మొదటినెల జీతంలో మీ ఇద్దరికీ బట్టలు తెచ్చాను. నానమ్మకి కొన్న పట్టుచీరను పండుగనాడైనా కట్టుకోమంటే, ‘నీవిచ్చిన చీరను నీ పెళ్లిలోనే కట్టుకుంటాను. 


ఫొటోలలో ఘనంగా కనపడుతుంది’ అని ఆ చీరను కట్టుకోనేలేదు నానమ్మ. ఇప్పుడు పెళ్లికి తానే లేకుండా పోయింది. కాదు కాదు నాన్నావాళ్ల ప్రవర్తనే నాకు నానమ్మను దూరం చేసింది,” అంటూ గట్టిగా ఏడ్చింది అలేఖ్య. 


శివరావు, నందన్ ఆమెను ఓదార్చటంలో విఫలమవుతున్నారు. కాసేపటికి తేరుకున్న అలేఖ్య నందన్‌తో కలిసి శివరావుగారితోనూ, మిగిలిన పెద్దలతోనూ దీవెనలందుకున్నారు.


“తాతా! పెళ్లిపందిరిలో ఇంకాసేపట్లో విందు మొదలవుతుంది. ఇక్కడ ఆశ్రమంలో వారికి కూడా అదే విందు ఏర్పాటు చేయాలని నేను, అత్తా కలిసి ముందే అనుకున్నాం. 


మీతో కలిసి ఇక్కడందరూ కూడా మా పెళ్లిభోజనం చేయాలని మా దంపతుల కోరిక. పదండి. ఈ పాటికి భోజనాలు డైనింగ్‌హాల్‌కి వచ్చి ఉంటాయి,” అని తాతని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ దిశగా కదిలారు నందన్, అలేఖ్యలు.


పెళ్లిభోజనం వధూవరులు స్వయంగా వడ్డించగా అంతా ఆనందంగా భోజనాలు చేస్తున్నారు. 


“లడ్డూలంటే నానమ్మకి భలే ఇష్టం,” అనే విషయం అలేఖ్యకి గుర్తుకొచ్చి, వెంటనే ఓ లడ్డూ తీసుకుని తాతకిచ్చి, “ఇది నానమ్మ ముద్ద, నా నోట్లో పెట్టు తాతా,” అంది గద్గద స్వరంతో. 


భోజనం చేస్తున్న పెద్దలందరికీ ఆ దృశ్యం చూడగానే కన్నీరు వచ్చింది.


“అమ్మా అలేఖ్యా! అక్కడ మన బంధువులు, నీ అత్తింటివారు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మీరు బయలుదేరండి,” అంటూ వారిని సాగనంపాడు శివరావు. తాతను వదిలి వెళ్లలేక బాధపడుతూ, “తాతా! నీ కోసం మళ్లీ త్వరలోనే వస్తాను. 


ఏ ఇంటనైతే మీ ఇరువురూ ప్రేమాపేక్షలతో గడిపారో ఆ ఇంటి పరమార్థాన్నే ‘పసుపుకుంకుమలు’గా నా అత్తవారింటికి పట్టుకెళ్తాను.


మీ ఆరోగ్యం జాగ్రత్త,” అంటూ అందరి దగ్గరా సెలవు తీసుకుని నందన్‌తో కలిసి కదిలింది అలేఖ్య.


పెళ్లిమంటపంలో అంతా వధూవరుల కొరకు కంగారు పడుతూ ఎదురుచూస్తున్నారు. 


“పసుపుబట్టలతో రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లి పెళ్లిని రిజిస్టర్ చేయించుకొస్తారేమో?” అనుకుంటూ అంతా తలో వ్యాఖ్యానం చేస్తున్నారు. వాళ్లు ఎక్కడికి వెళ్లింది ఒక్క లావణ్యకి మాత్రమే తెలుసు.


పెళ్లిపందిరికి చేరిన అలేఖ్య సరాసరి తన గదిలోకి వెళ్లింది. నాగేంద్రకి కూతురి ముఖం చూడగానే విషయం అర్థమయ్యింది. 


వెనుకనే వెళ్లాడు. “నాన్నా! చాలా తప్పు చేశారు. నానమ్మ చనిపోయిన విషయం దాచి నాకు పెళ్లి చేయటమేమిటి? నందన్ వాళ్ల నాన్నగారు ఎంత విశాల హృదయం కలవారో మీకు తెలుసు కదా! పెళ్లి మాటల్లో ‘కట్నకానుకలు లేకుండా, నిరాడంబరంగా పిల్లని నా కొడుకుకి ఇచ్చి వివాహం జరిపించండి. 


నేను నా వివాహం అలాగే చేసుకున్నాను. నందన్‌కి కూడా అదే ఇష్టం’ అని కదా చెప్పారు! వాళ్లకు నానమ్మ చనిపోయిన విషయం చెబితే కాదంటారా? ‘మీ అమ్మగారి అంత్యక్రియలు కానివ్వండి. మరో మంచి ముహూర్తం చూసి పిల్లల పెళ్లి చేద్దాం’ అని కచ్చితంగా అనేవారు.


కానీ మీరేం చేశారు? ఆడంబరాలకి పోయి లక్షలు ఖర్చు చేసి, పెళ్లి వాయిదా పడితే ఆ లక్షలు నష్టపోతామని నానమ్మ చనిపోయిన విషయం దాచి మరీ పెళ్లి చేశారు. 


నా పెళ్లి పందిరిలో నానమ్మా తాతయ్యలు కనబడకపోతే నేను ఏం జరిగిందో తెలుసుకోలేని అమాయకురాలిననుకున్నారు. 


నానమ్మని దిక్కులేనిదానిగా...” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది అలేఖ్య. పార్వతి విషయం తెలిసిన ముఖ్యమైన వారే అలేఖ్యను ఓదార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు.


“నానమ్మ చనిపోయిన విషయం దాచిపెట్టి, తాతయ్యను తన ముద్దుల మనవరాలి పెళ్లిని చూడనీయకుండా చేసిన తల్లిదండ్రులతో మాట్లాడటం మానేయడమే వారికి తగిన శిక్ష,” అనుకుంది అలేఖ్య. నందన్ ఆమె బాధను గ్రహించాడు.


అప్పగింతలు పూర్తయి పెళ్లికూతురితో పాటు లావణ్య జంట బయలుదేరారు. కారుని వృద్ధాశ్రమం దగ్గర ఆపించింది అలేఖ్య. 


నందన్ వాళ్ల అమ్మానాన్నలతో ముందే మాట్లాడటం, ఫోనులో అత్త ద్వారా శివరావుకి విషయం చెప్పటంతో అక్కడ అంతా శివరావుకి వీడ్కోలు పలకటానికి సిద్ధంగా ఉన్నారు.


చక్రధర్‌తో, “నేను నా పెళ్లికి మా నాన్నగారు ఇవ్వబోయే వాటినివేటినీ తీసుకెళ్లటం లేదు. కేవలం ఇదిగో ఈ వెలకట్టలేని ‘మమతల మనిషి’ని నా వెంట పెట్టుకుని మా అత్తగారింటికి వెళ్తున్నాను. 


తాతగారిని నాతో ఉండటానికి అంగీకరించిన నా అత్తమామలకు, నా భర్త నందన్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా తాతగారే నా పుట్టింటి నుండి వచ్చే ‘పసుపుకుంకుమలు’,” అంటూ అందరి దగ్గరా సెలవు తీసుకుని తాతని వెంటబెట్టుకుని అత్తగారింటికి బయలుదేరింది అలేఖ్య.


***



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y







మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు: 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page