పన్ను తీసేసారు

Pannu Tesesaru - Telugu Comedy Story | Jeedigunta Srinivasa Rao
పన్ను తీసేసారు - తెలుగు హాస్య కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 24/11/2026
“పన్ను తీసేశారు” కథలో మధ్యతరగతి కుటుంబానికి ఎదురయ్యే పన్ను నోటీసులు, పెళ్లి ఖర్చులు, అప్పులు, ఆడిటర్ మోసం వంటి సమస్యలను హాస్యభరితంగా చూపించారు. సుధాకర్‌కు పన్ను బాధతో పాటు పంటి నొప్పి కూడా ఎలా చుక్కలు చూపించిందో చదివితే నవ్వు ఆగదు.
"ఇదిగో చూశావా మన మధ్యతరగతి మనుషుల పరిస్థితి! మొన్న మనం అమ్మిన ఇంటిమీద మీకు లాభం వచ్చింది, అందుకే నాలుగు లక్షలు పన్ను కట్టమని నోటీసు వచ్చింది."
"అదేమిటండీ? ఇల్లు టాక్స్ కట్టిన తరువాతే కొనుక్కున్నాము, ఇప్పుడు పిల్ల పెళ్ళికి అని అమ్ముకుంటే మళ్ళీ పన్నులు ఏమిటండీ? మన వల్ల కాదు అనే చెప్పేసేయండి" అంది జానకి. "నువ్వు చెప్పు, నీ పేరేగా" అన్నాడు సుధాకర్.
"అయినా ఇల్లు కొనుక్కున్న అతనికి ఉన్న జాలి లేదు వీళ్ళకి. పాపం 'మీ అమ్మాయి పెళ్ళి చేసుకున్న తరువాత ఇల్లు అప్పగించండి' అన్నాడు" అంది.
"కోట్లు సంపాదించే వాళ్ళు టాక్స్ కడతారా? మన వెంట పడతారు! సరే, ఎలాగో పెళ్ళికి పది లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది, ఈ నాలుగు లక్షలు కూడా అప్పు చేద్దాం. లేదంటే జైలులో కూర్చోబెడతారు" అన్నాడు భార్యతో సుధాకర్.
"మొన్న టీవీలో ఇంటర్వ్యూ చూశాను. జైలు అంటే మరీ భయపడక్కర్లేదట! భోజనం వాళ్ళే వండి పెడతారు, నాకు ఈ వంట చేసే బాధ తప్పుతుంది" అంది జానకి.
"ప్రతిదానికి ముందు వెళ్ళి 'ఆ భోజనాలు రెడీ, మీరు రండి' అంటావుగా! ఈసారి కూడా అలాగే కానివ్వు" అన్నాడు నవ్వుతూ.
మొత్తానికి ఒక ఆడిటర్‌ని సంప్రదించి పరిస్థితి వివరించాడు. "భలేవారే! దీనికే అంత కంగారు ఎందుకు? నోటీసు ఇచ్చి ఇట్టే మరచిపోతారు.
వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది మీ వెంటపడటానికి? మీరు ఒక పదివేలు నాకివ్వండి, నేను ఆఫీసులో అంతా సరిదిద్దుతాను" అని పదివేలతో పాటు నోటీసు కాగితం తీసుకుని సుధాకర్‌ని పంపించేశాడు.
'అమ్మయ్య ఒక పీడ వదిలింది' అనుకుంటూ నడుస్తున్న సుధాకర్‌కి బండిమీద పాప్‌కార్న్ అమ్ముతూ ఉండటం చూసి, 'ఎప్పుడో సినిమా హాలులో తిన్నాను, ఇప్పుడు సినిమాలన్నీ టీవీలోనేగా! ఈ రోజు పాప్‌కార్న్ తింటూ టీవీలో సినిమా చూడాలి' అనుకుని ఒక ఇరవై రూపాయల పాప్‌కార్న్ పొట్లం కట్టించుకుని ఇంటికి వచ్చాడు.
చేతిలో పొట్లం చూసి "ఏమిటి నాన్నా?" అని అడిగింది కూతురు. "మా చిన్ననాటి అనుభవాలు చెబుతాను టీవీలో సినిమా చూస్తూ" అన్నాడు.
టేబుల్ మీద పాప్‌కార్న్ పొట్లం పెట్టి భార్యకి ఆడిటర్ అన్న మాటలు చెప్పి, ఉండబట్టలేక పొట్లం విప్పి గుప్పెడు పాప్‌కార్న్ నోట్లో వేసుకుని నములుతూ ఉండగా అసలే నోట్లో పిప్పి పన్ను, దానిలోకి పాప్‌కార్న్ వెళ్ళి గుచ్చుకుంది.
భరించలేని బాధ అనిపించింది సుధాకర్‌కి.
"ఇదిగో సూది ఉంటే ఇస్తావా?" అని వంటచేసుకుంటున్న జానకిని అడిగాడు. "ఇప్పుడు ఏ చొక్కా కుట్టుకోవాలిట? పెళ్ళి అయిన తరువాత కుట్టుకుందురుగాని" అంది.
మొత్తానికి పిన్నీసుతో పంటికి శస్త్రచికిత్స చేసి హమ్మయ్య అనుకున్నాడు.
భోజనంలో అరటికాయ వేపుడు ముక్క మళ్ళీ వెళ్ళి పంట్లో కూర్చొని "నువ్వు ఫెయిల్" అని నవ్వింది. "అదేంటి తినకుండా లేచిపోయారు?" అని అడిగింది జానకి.
"కడుపులో బాగుండలేదులే" అంటూ మందుల సంచిలోనుంచి ఏదో టాబ్లెట్ తీసుకుని వేసుకున్నాడు.
సాయంత్రానికి నొప్పి కొద్దిగా ఎక్కువ అయ్యింది. మూడ్ మార్చుకోవాలి అనుకుంటూ సెల్ ఫోన్ తీసుకుని మెయిల్స్ చూస్తూ ఉండగా ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళ నోటీసు ఉంది, ఇంతకు ముందు సంవత్సరాలనుండి రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే అప్‌లోడ్ చేయమని.
'ఏడ్చినట్టు ఉంది! ఇన్‌కమ్ లేదు అని రిటర్న్ ఫైల్ చేయలేదు, ఇప్పుడు ఎలా?' అనుకుంటూ "ఇదిగో మళ్ళీ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసు వచ్చింది.
అలా ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళి పదివేలు తీసుకుని కూర్చొని ఉన్నాడు, ఏం చేశాడో అడుగుతా" అన్నాడు సుధాకర్.
"ఏమండీ, ఏదైనా పూజ చేసి ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి మతిమరుపు వచ్చేటట్టు చేయమని కోరుకుంటా" అంది.
"దేవుడి నుంచే టాక్స్ వసూళ్ళు చేస్తూ ఉంటే దేవుడు కూడా కడుతున్నాడు, మనమెంత! ముందు ఆడిటర్ ఏమంటాడో అడిగి ఆ తరువాత పూజ గురించి ఆలోచిద్దాం" అన్నాడు బుగ్గపట్టుకుని.
"రండి సుధాకర్ గారు! ఆఫీస్‌లో మేనేజ్ చేశాను, ఇక నోటీసులు రావు. 'ఇల్లు పెళ్ళికోసం అమ్ముకుంటున్నారు' అనగానే జాలిపడి సరేలెండి అన్నారు" అన్నాడు ఆడిటర్ అబద్ధం.
"మరి ఈ రోజు వచ్చిన ఈ నోటీసు సంగతి ఏమిటి?" అని అడిగాడు. తెల్లబోయిన ఆడిటర్ "ఏదో కింద ఉద్యోగస్తులు తెలియక పంపి ఉంటారు.
పోనీ ఈ గొడవ ఎందుకు? ఇల్లు అమ్మిన డబ్బుతో ఇంకో ఇల్లు కొనుక్కుంటే టాక్స్ కట్టక్కర్లేదు" అన్నాడు అబద్ధం.
"ఆయనే ఉంటే అన్నట్టుగా డబ్బులు లేకే ఇల్లు అమ్ముకుంటున్నాము, పెళ్ళికి ఇంకా డబ్బు అప్పు చేయాలి. అటువంటిది ఇల్లు అమ్మి ఇల్లు కొనడం ఏమిటి సార్? అసలు మీరు మాకు సహాయం చేయగలరా, లేదా?" అని అడిగాడు సుధాకర్ అసహనంతో.
"ఇదిగో ఇలా చేస్తే ఏ గొడవ ఉండదు! ఇంటి మీద వచ్చిన లాభం మీద కదా టాక్స్? అది కట్టేసి హాయిగా ఇంకొద్దిగా ఎక్కువ అప్పు చేసి పెళ్ళి చేసేయండి. మనశ్శాంతిగా ఉంటుంది" అన్నాడు.
"మరి ఈ సలహాకా పదివేలు మీకు ఇచ్చింది? నా డబ్బులు నాకు రేపు సాయంత్రం లోపల ఇవ్వండి లేదా ఒక పదిలక్షలు అప్పు ఇవ్వండి, ఆ పదివేలు ఈ నెల వడ్డీ అనుకోండి" అంటూ కోపంగా పళ్ళు కొరుకుతూ బయటకు నడిచాడు సుధాకర్.
'అబ్బో పన్ను నొప్పి మిగిలిన పళ్ళకు కూడా వ్యాపించినట్టు ఉంది, లాభం లేదు' అనుకుంటూ సెంటర్‌లో ఉన్న డెంటల్ హాస్పిటల్‌కి వెళ్ళాడు.
'ఇక్కడ పళ్ళు ఊడగొట్టబడును, కొత్త పళ్ళు సృష్టించగలము' అని ఉంది. లోపల నుంచి అరుపులు, మూలుగులు వినిపించడంతో భయంతో డాక్టర్ గారు చూపించిన కుర్చీలో కూర్చొని నోరు తెరిచాడు.
"ఎన్నాళ్ళు అయ్యింది బ్రష్ చేసి?" అని అడిగాడు మాస్క్ పెట్టుకుంటూ. "ఏదీ, రెండు రోజుల నుంచి పన్ను నొప్పి. బ్రష్ చేయలేకపోయాను" అన్నాడు మూగగా.
"బాగానే ఉంది! లోపల పాప్‌కార్న్, ఏదో వేపుడు ముక్క, పల్లీలు ఉన్నాయి. నోరు ఏమైనా బీరువా అనుకున్నారా ఇన్ని దాచారు? సరే, క్లీన్ చేసి పన్ను పీకాలి" అన్నాడు.
"పీకేటప్పుడు మళ్ళీ క్లీన్ చేయడం ఎందుకు సార్? కొద్దిగా పీకకుండా చూడండి, మీ ఫీజు ఇస్తాను" అన్నాడు.
"మీ ఇష్టం! ఇలాగే వదిలేస్తే కన్ను కూడా పీకాలి" అన్నాడు. దానితో భయంతో వణికిపోయి పన్ను పీకించుకున్నాడు. "ఏదో అనుకున్నాను, నొప్పే లేదు సార్" అన్నాడు పన్ను తీసిన తరువాత.
ఆటో ఎక్కి ఇంట్లోకి వస్తూనే భార్యతో "పన్ను తీసేశారు" అన్నాడు హుషారుగా.
"అమ్మయ్య! ఇప్పుడే దేవుడికి మొక్కుకున్నాను 'పన్ను కట్టక్కర్లేకుండా చెయ్యి స్వామి' అని" అంటున్న భార్యతో "ఆ పన్ను కాదే నా పన్ను" అంటూ జరిగింది చెప్పాడు.
"ఏమిటో కలికాలం కాకపోతే ఇల్లు అమ్మినా, పాప్‌కార్న్ తిన్నా ఈ పన్ను బాధ తప్పలేదు" అని నిట్టూర్చింది.
పన్ను తీసేటప్పుడు ఇచ్చిన మత్తు వదలడంతో నొప్పి మొదలై "అమ్మా!" అనుకుంటూ ఐస్ బ్యాగ్‌తో దవడకి హత్తుకున్నాడు.
- శుభం -
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.























Comments