ఆరు రుచుల ప్రయాణం

Aaru Ruchula Prayanam - Telugu Moral Story | Naga Suneetha Pokala
ఆరు రుచుల ప్రయాణం - తెలుగు నీతి కథ | నాగ సునీత పోకల
Published in manatelugukathalu.com on 01/11/2026
జీవితం అంటే సుఖదుఃఖాలు, విజయాపజయాలు కలిసిన ఆరు రుచుల ప్రయాణం. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలనే గొప్ప జీవిత పాఠాన్ని అందించే తెలుగు స్ఫూర్తిదాయక కథ “ఆరు రుచుల ప్రయాణం.”
అదొక పెద్ద సభ. సభ నిండా లైట్లు, చల్లదనం కోసం ఏసీలు, ఫ్యాన్లు, కూర్చోవడానికి సోఫాలాంటి కుర్చీలు, ఎంతో మనోహరంగా అలంకరించబడిన స్టేజి.
కిక్కిరిసిన జనసమూహం! వీళ్లంతా ఎదురుచూస్తున్నది ఓ వ్యక్తి కోసం... ఆయనే పేరుమోసిన ఓ గొప్ప వ్యాపారవేత్త.
కొందరు ఆయన ఎలా ఉంటారో చూడాలని వచ్చారు; మరికొందరు ఆయనతో వ్యాపార సంబంధాలు కుదుర్చుకోవడానికి వచ్చారు.
ఇంకొందరు ఆయన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి లైకులు సంపాదించుకోవడానికి వచ్చారు. కారణం ఏదైనా, ఆ సభ మొత్తం జనాలతో నిండిపోయింది.
ఎంతసేపటి నుంచో ఆ జనమందరూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ వ్యక్తి వచ్చే సమయం ఆసన్నమైంది. ఆయన్ని ఆహ్వానించడానికి పూలదండలు, బొకేలు ఎదురుచూస్తున్నాయి. చివరికి ఆ సమయం వచ్చేసింది!
ఓ పెద్ద కారులో నుంచి మంచి ఖరీదైన సూటు, బూటు వేసుకున్న ఓ వ్యక్తి దిగాడు. ఆయన దిగగానే మీడియా ఆయన చుట్టూ చేరి, బయటి నుంచే ఆయన్ని లైవ్‌లో చూపిస్తోంది. ఆయన సభలోకి అడుగుపెట్టాడు.
అంతే, ఒక్కసారిగా సభ మొత్తం మౌనముద్ర దాల్చింది! అందరూ ఆయన వైపు కనురెప్ప ఆర్పకుండా చూస్తూ ఉండిపోయారు.
ఆయన వెళ్లి స్టేజీ మీద కుర్చీలో కూర్చున్నాడు. ఒకాయన లేచి ఆయన గురించి పేజీలు పేజీలు చెబుతున్నాడు, ఇది వినే వారికి కొంచెం బోరింగ్‌గానే అనిపించింది.
ఇప్పుడు ఆ వ్యాపారవేత్త మాట్లాడే సమయం వచ్చింది.
అసలతను ఏం చెబుతాడా అని చెవులు రిక్కించారు. ఓ వైపు యువత, “ఇప్పుడు అతను ఇంగ్లీషులో మాట్లాడతాడా లేక తెలుగులో మాట్లాడతాడా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్!” అంటూ రీల్స్ పెడుతున్నారు.
పెద్దవాళ్లేమో ఇతను తన వ్యాపారం గురించి, తన బిజినెస్ ప్రగతి గురించి మాట్లాడతాడేమోనని ఎదురుచూస్తున్నారు. మరికొందరేమో, ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ అయిపోతుందా, మనం వెళ్లి ఆయనతో పార్టనర్షిప్ కుదుర్చుకుందామా అని ఎదురుచూస్తున్నారు.
ఇలా రకరకాలుగా అక్కడున్న జనం ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు ఆయన మైక్‌ను తన నోటి దగ్గరకు తీసుకుని, ఉత్సాహవంతమైన గంభీరత, కోమలత్వం కలగలిసిన మృదువైన స్వరంతో... “మనిషి జీవితం అనేది ఆరు రుచుల ప్రయాణం” అనే మాటను వదిలారు.
అంతే, ఒక్కసారిగా సభ మొత్తం ఆశ్చర్యపోయింది! అసలు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాక బిక్కమొహం వేశారు. మీడియా అలర్ట్ అయింది, టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నవాళ్లు ఆత్రుతగా చూస్తున్నారు. ఆయన తన ఉపన్యాసాన్ని ఇలా కొనసాగించారు:
“అవును! ఇది అక్షరాలా సత్యం. మానవుని జీవితం అనేది ఆరు రుచుల కలయిక. ఈ విషయం మనకెప్పుడు అర్థమై, వీటిని మనం సమపాళ్లలో ఒకే విధంగా తీసుకుంటామో, అప్పుడే మనం ఉన్నత స్థితికి చేరుకోగలం. దీనికి నిలువెత్తు నిదర్శనం నేనే!
నేను మీకు ఓ గొప్ప వ్యాపారవేత్తగానే పరిచయం.
మరి, జీవితం మీద విరక్తి చెంది, అసమర్థుడనై ఆత్మహత్య వరకు వెళ్లిన వివేక్‌గా తెలుసా?”
ఈ మాటలు విన్న ఆ సభ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. నిజమే, ఆ సభలో ఉన్నవారందరికీ ఆయన 'ది గ్రేట్ బిజినెస్‌మ్యాన్' వివేక్గానే తెలుసు, కానీ ఆత్మహత్య వరకు వెళ్లిన వివేక్‌గా తెలియదు.
ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ మన గెలుపును మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది; కానీ ఆ గెలుపు వెనుక మనం పడిన కష్టాలను, ఎదుర్కొన్న సవాళ్లను అస్సలు పట్టించుకోదు!
ఆ సభలో ఉన్నవారు, తర్వాత అతను ఏం చెబుతాడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వివేక్ గారు తన కథను చెప్పడం ప్రారంభించారు:
“అదో రాత్రి! నా జీవితాన్ని బంగారు బాటగా మార్చే రాత్రని నేనసలు ఊహించలేదు. ఆ రోజు నేను ఎంతో బాధతో జీవితం పట్ల విరక్తి చెంది, ఎలా బతకాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను.
అప్పటికే తిని రెండు రోజులైంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఏమైనా తిందామా అంటే జేబు ఖాళీ. అప్పుడర్థమైంది నాకు... నేనెంత దీనస్థితిలో ఉన్నానోనని! ఛా! నాదొక బతుకేనా అని అనిపించింది.
ఆ క్షణంలో నా వెంట ఎవరూ లేరు, ఒక్క నల్లని రాత్రి తప్ప! నాకు ముందు ఏమీ కనిపించలేదు, ఒక్క చీకటి తప్ప! రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలీదు, ఎక్కడ ఆగాలో తెలీదు... గమ్యం లేని పోరాటం నాది! నా మనసంతా చీకటిమయమైంది.
ఆ క్షణంలో చనిపోవాలని నిశ్చయించుకున్నాను. ఆ నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు, మొత్తానికి ఈ లోకం వదిలి వెళ్లాలని గట్టిగా అనుకున్నాను. కానీ ఎలా?
ఎదురుగా వస్తున్న లారీ ముందు నిలబడ్డాను.
కానీ ఆ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి, ‘ఏరా! కళ్లు కనిపించడం లేదా? పక్కకు తప్పుకో!’ అని అరిచాడు. పక్కకు తప్పుకున్నాను.
ఈసారి కారు ముందు నిల్చున్నాను, అప్పుడూ అదే పరిస్థితి! ఈసారి ఇలా కాదని వెళ్లి రైలు పట్టాలపై స్తంభంలా నిల్చున్నాను. గుండె వేగం పుంజుకుంది. దూరంగా రైలు కూత... అది నాకు యమపాశం వేసిన ధ్వనిలా అనిపించింది! కానీ గుండెను రాయి చేసుకుని, బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాను.
రైలు వస్తూ ఉంది... దగ్గరికొచ్చే కొద్దీ ధైర్యం చాలలేదు. గట్టిగా కళ్లు మూసుకున్నాను, రైలు దగ్గరికి వచ్చేసింది. కానీ నన్ను గుద్దే ఒక్క క్షణం ముందే ఎవరో నన్ను పక్కకు లాగి చెంపమీద ఛెళ్లుమని కొట్టారు! బుగ్గ ఎరుపెక్కింది.
చూస్తే ఆయన పెద్దవాడిలా ఉన్నాడు. ప్రశాంతమైన ముఖం, పెదవిపై చిరునవ్వు... ఇదే ఆయన ముఖచిత్రం. ఆయన రాకతో నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. మనిషి జీవితం అనేది షడ్రుచుల కలయిక అని నాకు తెలియజేసిన మనిషి ఆయన!
ఆయన పేరు రాఘవయ్య, రిటైర్డ్ అయిన బ్యాంకు ఉద్యోగి. మొత్తానికి ఆయన నన్ను కాపాడారు. కాపాడిన తర్వాత, ‘నన్నెందుకు కాపాడావు? నాకు బతకాలని లేదు, చావనివ్వు!’ అని అరిచాను.
అప్పుడు రాఘవయ్య గారు ఇలా అన్నారు:
“అబ్బే! ఏంటబ్బాయ్ ఈ పాడు ఆలోచన? ఏదైనా బతికి సాధించాలి కానీ, చచ్చి ఏం సాధిస్తావ్?”
కానీ ఆ మాటలు నాకు రుచించలేదు. అప్పుడు నేను ఇలా అన్నాను, “బతికి ఏం సాధించాలండి? జీవితం అనేది ఓ చదరంగం.
ఇక్కడ తెలివైనవారు, సమర్థులే ఉండాలి. నాలాంటి దద్దమ్మలు, అసమర్థులు కాదు!” అని కన్నీరు పెట్టుకున్నాను.
అది విన్న ఆయన ఫక్కున నవ్వాడు, “ఓస్నీ! ఇదేంటబ్బాయ్, ఇలా అనేశావ్? నువ్వేమీ నాకు అంత మూర్ఖుడిలా కానరావడం లేదే! పైగా కండలు తిరిగిన అందగాడిలా ఉన్నావు. ఇలా చెప్పడం నీకు ఓసంత కూడా సిగ్గనిపించడం లేదా?” అని అన్నాడు.
అప్పుడు నేను ఇలా చెప్పాను, “నేను అసమర్థుణ్ణి కాకపోతే ఇంకేంటయ్యా? పూట తిండికి గతి లేదు, ఇక నేనేం సమర్థుణ్ణి? నేనెవరికీ అవసరం లేదు, ఈ సమాజంలో నా పాత్రేముంది? తిని రెండు రోజులైంది,” అని అన్నాను.
ఈ మాటలు విన్న ఆయన ఏమీ మాట్లాడకుండా ఇడ్లీ బండి దగ్గరికి నన్ను తీసుకెళ్లి ఇడ్లీలు పెట్టించాడు. గోరంత మొహమాటం కూడా లేకుండా మూడు ప్లేట్ల ఇడ్లీలు సునాయాసంగా తినేశాను. ఆయన నవ్వుతూ ఆ మూడు ప్లేట్ల ఇడ్లీలకు డబ్బులిచ్చాడు.
కన్నీళ్లతో ఆయనకు నమస్కరించాను. అప్పుడాయన నవ్వుతూ, “భలే పిల్లకాయలా ఉన్నావేబ్బాయ్! నువ్వు ఏకంగా దండమే పెట్టేస్తున్నావ్!” అని అన్నాడు.
నిజమే! అప్పుడాయన నాకు మూడు ప్లేట్ల ఇడ్లీలు పెట్టించి ఉండవచ్చు, కానీ ఆ ఇడ్లీలు నా రెండు రోజుల ఆకలి కేకలను మాన్పాయి.
నిజంగా తినకుండా ఒక్కపూట ఉండడమే చాలా కష్టం, దానికంటే మించిన నరకం మరొకటుంటుందా? కానీ ఆ నరకాన్ని నేను రెండు రోజులు అనుభవించాను. రాఘవయ్య గారి వల్ల నాకు ఆ నరకం తప్పింది. కానీ నా మనసుకు మాత్రం ఊరట లభించలేదు.
నా బాధను గుర్తించిన ఆయన పక్కనే ఉన్న బెంచీపై నన్ను కూర్చోబెట్టి, తానూ కూర్చొని, “ఇప్పుడు చెప్పబ్బాయ్, నీ కష్టం ఏంటి?” అని నన్ను అడిగారు.
“నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదులే పెద్దాయనా! పేరుకే చదువుకున్నోణ్ణి, ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఊరికే బేకారీగా తిరుగుతూ ఉంటాను. ఇంట్లో వాళ్లకు భారమైపోయాను.
ప్రేమించిన అమ్మాయి వదిలేసింది, స్నేహితులకు చులకనయ్యాను, ఇంట్లో నుంచి గెంటేేశారు. ఓ వైపు ఏం చేయాలో తెలీదు, ఇంకో వైపు ఆకలి. నా జీవితంలో సుఖాలు, సంతోషాల కంటే కష్టాలే ఎక్కువైపోయాయి.
కష్టాలు చెడుగుడు ఆడుతున్నాయి. నాకే ఎందుకిలా? అందుకే చావాలని నిశ్చయించుకున్నాను,” అని నా బాధను ఆయనతో చెప్పుకున్నాను.
ఇది విని ఆయన, “ఓస్నీ! దీనికే చావాలనుకుంటున్నావా? అయితే నాకు తెలిసి అందరూ చావాల్సిందే కదా! లేకపోతే ఏంటయ్యా? ప్రతి కష్టానికి చావే మార్గమా? అలాగైతే ఒక్క కష్టం కూడా అనుభవించని మనిషంటూ ఈ భూమ్మీద ఉంటాడా? అయితే అందరూ చావాల్సిందే కదా! మరెందుకు చావలేదు? నిజం చెప్పాలంటే నీదొక కష్టం కాదురా నాయనా!” అని అన్నారు.
కానీ ఆ సమయంలో ఆయన అంతరార్థాన్ని నేను గ్రహించలేకపోయాను. అప్పుడాయన మనిషి జీవితం గురించి చెప్పనారంభించారు:
“చూడు యువకా! జీవితం అనేది షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులుంటాయో, మనం కూడా మన జీవితంలో ఆ రుచులన్నింటినీ చవిచూడడం జరుగుతుంది.”
ఆయన చెప్పిన విషయం నాకేమీ బోధపడలేదు, అదే ఆయనకు చెప్పాను.
అప్పుడాయన, “అబ్బా! ఈ తరం పిల్లలతో ఇదే చావు కదా! పెద్దోళ్ల మాటల రసాన్ని అస్సలు అర్థం చేసుకోరు. వివరంగా చెప్తా, ఆలకింపు చేసుకో!
ఉగాది పచ్చడిలో ఆరు రుచులుంటాయి.
అవి తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు. ఎప్పుడైతే ఈ రుచులన్నీ సమపాళ్లలో ఉంటాయో, అప్పుడే ఉగాది పచ్చడి రుచి బాగుంటుంది. ఇట్లే మానవుని బతుకులో ఇవన్నీ ఉంటేనే జీవితం సార్థకమవుతుంది.
ఉగాది పచ్చడిలో:
తీపి — సంతోషం, విజయాలకు
పులుపు — ఆశ్చర్యం, అనూహ్య పరిణామాలకు
లవణం (ఉప్పు) — ఆసక్తి, అనుభవాల రుచికి
కారం — కోపం, ఉద్వేగాలకు
చేదు — దుఃఖం, బాధలకు
వగరు — భయం, అసహనానికి ప్రతీకలు.
ప్రతి మనిషి తన జీవితకాలంలో ఈ రుచులన్నింటినీ చవిచూడడం జరుగుతుంది. సుఖాలు వచ్చాయని ఆనందపడడం, కష్టాలు, బాధలు వచ్చాయని చావడం ఏమైనా న్యాయమా? చెప్పు!” అని నన్ను నిలదీశాడు.
కానీ నాకు ఆయన ఉపన్యాసమంతా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది, మనసుకెక్కలేదు. “నీకేంటయ్యా! ఖాళీగా ఉన్నావని ఉపన్యాసాల మీద ఉపన్యాసాలిస్తావు. అనుభవించే నాకు కదా దాని నొప్పి తెలిసేది!” అని మొండిగా బదులిచ్చాను.
అప్పుడాయన గంభీరమైన ముఖం పెట్టి ఇలా అన్నాడు, “అయ్యో పాపం! పట్టుమని పాతికేళ్లు లేవు, ఎన్ని కష్టాలొచ్చినాయో పసిపిల్లాడికి!” అని వ్యంగ్యంగా అన్నారు.
“నా కష్టాలతో పోల్చుకుంటే నీవెంత? ఆవగింజంత! అన్నీ అనుభవించిన నేనే ఇలా ఉన్నాను,” అని తన కథను చెప్పడం ప్రారంభించారు:
“నా పేరు రాఘవయ్య. మాది మారుమూల ఓ పల్లె. చదువంటే బాగా ఇష్టం. పదో తరగతి దాకా మా ఊళ్లోనే చదువుకున్నాను, ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినాను. ఆడదాకా బాగానే ఉంది గానీ, ఆ నుంచే కదా అసలు సమస్య మొదలైంది! కాలేజీ పట్టణంలో ఉంది, నాయనేమో వద్దంటాడు. బ్యాంక్ మేనేజర్ అవ్వడం నా కల.
'చదివింది చాలు గానీ, పొలం పని చేసుకో, అదే నీ కడుపు నింపుతాది' అని మా నాయన. ఎంత చెప్పినా వినకపోయేసరికి చేసేదేమీ లేక ఇంట్లోంచి వచ్చేశాను.
ఎక్కడికెళ్లాలో తెల్వదు, ఏం చేయాలో తెల్వదు... ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టయింది నాకు! ఏదైతేనేం, ఓ మంచి కాలేజీలో సీటు సంపాదించినాను. అప్పుడు కలిగిన ఆనందం నాకెన్నడూ కలగలేదు.
ఇదే నాయనా... 'తీపి' రుచికి సంకేతం!
అది బాగానే ఉంది గానీ, అప్పుడే కదా నా అసలు కష్టం మొదలైంది! కాలేజీ సీటైతే సంపాదించినాను గానీ, మరి కాలేజీ ఫీజు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి? నువ్వు రెండు రోజులు కూడు లేక అల్లాడావు కదా! మరి నేను తిండి దొరకని ఎన్ని రాత్రులను చవిచూశాన్రా కుర్రాడా!
ఏదైతేనేం, కొవ్వొత్తులు తయారు చేసే వ్యక్తి దగ్గర పనిలో చేరాను. పగలంతా కాలేజీలో, రాత్రంతా కొవ్వొత్తుల తయారీలో... ఇక నాకు నిద్రెక్కడిది నాయనా! ఆ పని చేయగా వచ్చిన డబ్బుతోనే కడుపు నింపుకున్నాను, నా కాలేజీ ఫీజు కట్టుకున్నాను. ఆ సమయంలో నేను అనుభవించిన కష్టాలు, నరకాలు వర్ణనలకు అంతుచిక్కనివి.
ఇదే నాయనా... 'చేదు' రుచి!
అలా నా కాలేజీ చదువు అయింది, మంచి మార్కులతో బయటకొచ్చినాను. ఇప్పుడేం చేయాలో తెల్వదు. ఓ వైపు మా అమ్మ రోజూ ఫోన్ చేసి, ‘రా నాయనా! మనింటికొచ్చేయ్. ఒక్కడివే ఎలా ఉంటావురా? ఎలా బతుకుతావురా? మీ అయ్యను నేనొప్పిస్తాను రా నాయనా!’ అని బతిమిలాడేది.
కానీ నేను చాలా మొండిపట్టు పట్టాను. ‘లేదమ్మా! బ్యాంక్ మేనేజర్ అయ్యాకే నేనక్కడికొచ్చేది, మీ ముఖాలు చూసేది! అంతవరకు మన ఊరికి కాదు కదా, మన ఊరి గాలి కూడా పీల్చను’ అని కరాఖండిగా చెప్పేవాణ్ణి.
రోషమైతే బాగుంది గానీ, ఇప్పుడెలా బతికేది? కాలేజీ చదువేమో అయిపోయింది, అటు చూస్తే పట్టణాల్లో రూమ్ రెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నాకొచ్చే ఆ కొద్దిపాటి కొవ్వొత్తుల జీతంతో ఎలా గడిపేది? ఓ పూట తిండి తిని, రెండు పూటలా పస్తులున్న రోజులెన్నో చుక్కల్లాగా లెక్కించడానికి లెక్కకు రావు! కానీ నేనెన్నడూ చావలేదు.
ఇవన్నీ కష్టాలు కావా? నేను తట్టుకోలేదా? ఆ చేదును జీర్ణించుకుని బతకలేదా?” అని నాతో చెప్పారు.
ఆ మాటలతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆయన అనుభవించిన కష్టాలలో పావు భాగం కూడా నేననుభవించింది లేదు!
ఆయన కథ అంతటితో అవ్వలేదు, ఇంకా ఉంది. అతను తన కథను ఇలా చెప్పడం ప్రారంభించారు:
“ఎలాగోలా నా చావు నేను చస్తూ కష్టపడి బ్యాంక్ మేనేజర్నయ్యాను. ఆ సమయంలో నాకు కలిగిన ఆనందం కొలవలేనిది, వర్ణించలేనిది! నేను పడ్డ కష్టాలకు ఫలితం వచ్చిందానాడు. నేరుగా ఇంటి ముఖం పట్టాను, మా అయ్య కాళ్లు మొక్కాను.
మా అయ్య కళ్లల్లో పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు! నన్ను అక్కున చేర్చుకుని, ‘నన్ను క్షమించరా అయ్యా!’ అని చిన్నపిల్లకాయలా బోరున ఏడ్చేసినాడు.
నాకు ఏడుపొచ్చింది, ఏడ్చేసినాను... కానీ అది ఏడుపు కాదు, నా విజయోత్సవానికి ప్రత్యక్ష గుర్తులు అవి!
ఇదంతా బానే ఉంది కానీ, అప్పుడే కదా నా అసలైన జీవితం మొదలైంది! నాకు తెలిసి దీన్ని నేను అనుభవించిన 'పులుపు' జీవితం అని కూడా అనొచ్చు.
జాబులో చేరాక ఎన్నో అనూహ్య పరిణామాలు, అబ్బురపరిచే సంఘటనలు. ఓ సమస్య పోతే ఇంకో సమస్య ఉక్కిరిబిక్కిరి చేసింది అనుకో నాయనా! అప్పుడు నేను చావలేదు కదరా నాయనా! ఆ సమస్యలన్నింటినీ ఆత్మవిశ్వాసంతో కూలగొట్టాను, నా ఉనికిని చాటుకున్నాను. నాతో పాటు పనిచేసేవాళ్లకు నేనంటే ఓ గౌరవం.
ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకే నా పెళ్లి తంతులు మొదలైనాయి. మొత్తానికి నా పెళ్లి జరిగిపోయింది. అప్పటినుంచే కదా నా కొత్త జీవితం మొదలైంది! ఓపక్క ఆఫీసు నుంచి లేటొస్తే ఆమెతో చివాట్లు, ఇంకోపక్క కుటుంబ బాధ్యతలు... అంతేనా? మరోవైపు ఆఫీసు వ్యవహారాలు, టెన్షన్లు! ఉక్కిరిబిక్కిరి అయిపోయానురా కుర్రాడా!
అవన్నీ తట్టుకోలేక ఇంట్లో పెళ్లాంతో గొడవలు. ఆమె గమ్మునుంటుందా అంటే అదీ లేదు, నేనొకటంటే ఆమె పది అంటది! అలిగి పుట్టింటికెళ్తాది, మళ్లీ నేనే బుజ్జగించి తోడ్కొని వచ్చేవాణ్ణి. ఉద్యోగంలో ఎన్నో అనుకోని మార్పులు, ఎన్నో అనుభవాల రుచులు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను.
ఇదే నాయనా... 'ఉప్పని' జీవితం! ఉగాది పచ్చడిలో ఉండే ఉప్పు మాదిరిగా.
కొన్ని రోజులకు మాకు తోడుగా నా కొడుకు ఆనంద్ పుట్టాడు. అప్పుడు మేమిద్దరం ఎంతో సంతోషించాం. వాడు చేసే అల్లరి పనులు, చిట్టిపొట్టి మాటలు, వేసే తప్పటడుగులు... అబ్బా! ఇంకెన్నో... స్వర్గసుఖం కంటే మించిన ఆనందాన్ని తెచ్చిపెట్టినాయి. ఇవే కదా మధురమైన తీపి జ్ఞాపకాలు!
కాలం అలానే ఉండదు కదా! కాలంతో పాటు నా కొడుకు పెద్దోడయ్యాడు, మంచి స్థాయికెదిగినాడు. అప్పటినుంచే కదా నా అసలైన చేదు, వగరుల జీవితం మొదలైంది!
మనం ఏం చేస్తాం? పిల్లల్ని కనగలం కానీ, వారి బుద్ధుల్ని కనగలమా? వాడు వేరే కాపురం పెట్టేసినాడు.
వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు. వాడిని పంచప్రాణాలనుకుని బతుకుతున్న మమ్మల్ని నిర్జీవుల్ని చేసినాడు. ఎంతో బాధపడ్డాం కానీ లాభం లేకపోయింది. కంటిమీద కునుకు పట్టదు, కూడు తినే ప్రతిసారీ వాడే గుర్తుకొస్తాడు... ఇంకెక్కడ కూడు కడుపులోకి దిగుతాది?
ఆ పరిస్థితుల్లోనూ నేను చావలేదు.
అంతటితో అయిందా అంటే అదీ లేదు, మా సుపుత్రుడి మీద బెంగతో మా ఆవిడ మంచం పట్టింది. మంచం పట్టిన మూడు నెలలకే ఆకాశాన్ని పట్టింది... నన్నొంటరివాణ్ణి చేసేసి!
అప్పుడు నేను చావలేదు, ఇప్పుడు చావలేదు, ఇంకెప్పుడూ కూడా నాకు నేను చావాలని ప్రయత్నించను... ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా!
మరి నువ్వు బాబూ?” అని ఆశగా అడిగారు.
ఇదంతా విన్న తర్వాత నేనేమంటాను? ఇంకెప్పుడూ ఆత్మహత్య చేసుకోనని ఆయనకు మాటిచ్చాను.
అక్కడితో ఆయన నన్ను వదిలేశారా అంటే అదీ లేదు. నాకు జీవిత పాఠాలు నేర్పడానికి ఓ పది రోజులు ఆయన నన్ను తన దగ్గరే ఉంచుకుని నన్ను పోషించారు, చివరికి నన్ను మంచి స్థితిలో నిలబెట్టారు. ఇలాంటి ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగినవారు చాలా అరుదుగా ఉంటారు కదా!
చూశారు కదా! ఒక్క రాత్రి మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందో! ఒక్క పూట తిండి సంపాదించుకోలేని నేనెక్కడ... లక్షలమందికి ఉద్యోగాలు ఇచ్చి వారి కడుపు నింపుతున్న నేనెక్కడ?
కష్టాలు, బాధలు ఎదురైనప్పుడు కుమిలిపోతూ అక్కడే ఆగిపోకూడదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మన కష్టకాలం పోయి సుఖకాలం మొదలవుతుంది. మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, చెడు జ్ఞాపకాలు, అనూహ్య పరిణామాలు, బాధలు సహజం.
అందుకే నేను మొదటే మానవుని జీవితం అనేది ఆరు రుచుల సమ్మేళనమని అన్నాను. ఈ రుచులన్నింటినీ మనిషి తన జీవితకాలంలో అనుభవించక తప్పదు. అందుకే మనం ఎలాంటి తీవ్రమైన పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా తయారవ్వాలి... అప్పుడే చరిత్రలో మనకంటూ ఓ స్థానం లభిస్తుంది!
ఇక ఉంటాను, ధన్యవాదములు!” అని వివేక్ గారు తన ఉపన్యాసాన్ని ముగించారు.
ఆ మాటలు విన్న అక్కడున్న జనమంతా ఆపకుండా చప్పట్లు కొట్టారు.
అవి అలవాటుగా ఏదో అన్నట్లు కొట్టిన చప్పట్లు కావు; తమకు మంచి జీవిత పాఠం చెప్పినందుకు కృతజ్ఞతగా, రాఘవయ్య గారి మార్గదర్శకత్వానికి, వివేక్ యొక్క కార్యదీక్షతకు కొట్టిన చప్పట్లు!
***
నాగ సునీత పోకల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం: నాగ సునీత పోకల









Comments