అబద్ధాల గూడు
- Munipalle Vasundhara Rani

- Feb 1
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #AbaddhalaGudu, #అబద్ధాలగూడు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 19
Abaddhala Gudu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 01/02/2026
అబద్ధాల గూడు - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
ఆదివారం మధ్యాహ్నం చింటు వాళ్ళ అమ్మ "చింటూ, హోంవర్క్ పూర్తి చేశావా? రేపు స్కూల్ ఉంది" అని అడిగింది. చింటు అప్పుడే తన ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు. "అయిపోయింది మమ్మీ, ఎప్పుడో పూర్తి చేసేశాను!" అని ఒక అబద్ధం చెప్పి బ్యాట్ పట్టుకుని పరుగు తీశాడు. తీరా ఆదివారం రాత్రి అయ్యేసరికి ఆడుకుని వచ్చి అలసిపోయి నిద్రపోయాడు. సోమవారం పొద్దున్న నిద్రలేవగానే వాడికి తత్వం బోధపడింది—హోంవర్క్ బుక్ ఖాళీగా ఉంది!
టీచర్ తిడతారన్న భయంతో చింటు మెల్లగా మొహం నలుపుకుంటూ బయటకొచ్చాడు. "అమ్మో! బామ్మా, నా కడుపులో ఏదోలా ఉంది.. చాలా నొప్పిగా ఉంది" అని కడుపు పట్టుకుని సోఫాలో పడిపోయాడు. అమ్మ కంగారు పడి, "నిన్న ఏదైనా బయట తిన్నావా? సరేలే, ఈరోజు స్కూల్ మానేసి రెస్ట్ తీసుకో" అంది. ఒక అబద్ధం సక్సెస్ అయిందని చింటు సంబరపడ్డాడు. కానీ అక్కడే చిక్కు మొదలైంది.
కొంచెం సేపటికి బామ్మ వచ్చి, "చింటూ, కడుపు నొప్పి కదా.. రా ఈ కషాయం తాగు, తగ్గిపోతుంది" అని గ్లాసు పట్టుకొచ్చింది. ఆ కషాయం వాసన చూస్తేనే చింటుకి భయం వేసింది. దాన్ని తప్పించుకోవడానికి, "వద్దు బామ్మా! ఇప్పుడు కడుపు నొప్పి తగ్గింది కానీ.. నాకు తలనొప్పి మొదలైంది" అని రెండో అబద్ధం చెప్పాడు. సరే అని బామ్మ తలకి ఘాటైన తైలం పూయబోతుంటే, "అమ్మో అది కళ్ళలోకి వెళ్తుంది బామ్మా.. ఇప్పుడు తలనొప్పి కూడా తగ్గింది కానీ, నా కాలు బెణికినట్టు ఉంది, అడుగు వేయలేకపోతున్నాను" అని మూడో అబద్ధం ఆడాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అబద్ధాలు అల్లుకుంటూ పోతున్నాడు.
అప్పుడు బామ్మ వాడి పక్కన కూర్చుని : "చింటూ! నీ కడుపు నొప్పి, తలనొప్పి, కాలు నొప్పి ఇవన్నీ చూస్తుంటే నాకు అబద్ధాల గూడు అల్లిన ఒక సాలీడు గుర్తొస్తోంది. ఒక సాలీడు ఒక చిన్న పురుగును పట్టుకోవడానికి సన్నని దారాలతో గూడు అల్లిందట. కానీ ఆ గూడు ఎంతగా అల్లేసిందంటే, చివరకు ఆ గూడులో తనే చిక్కుకుని కదలలేక ఇబ్బంది పడింది.
నువ్వు కూడా ఇప్పుడు సరిగ్గా అలాగే చేస్తున్నావు.
నిన్న 'హోంవర్క్ అయిపోయింది' అని చెప్పిన ఒక చిన్న అబద్ధాన్ని దాచడానికి.. ఇప్పుడు కడుపు నొప్పి, తలనొప్పి, కాలు నొప్పి అని మూడు కొత్త అబద్ధాలు చెప్పావు. ఒక అబద్ధాన్ని కాపాడుకోవడానికి వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. రేపు స్కూల్‌కి వెళ్ళినప్పుడు టీచర్ 'నిన్న ఎందుకు రాలేదు?' అని అడిగితే ఏం చెప్తావు? 'మా ఇంట్లో అందరికీ తెలుసు' అంటావు.. అప్పుడు నేను 'వీడికి కడుపు నొప్పి, తలనొప్పి వచ్చాయి' అని చెప్తాను. అప్పుడు టీచర్ డాక్టర్ సర్టిఫికెట్ అడుగుతారు. దానికోసం మళ్ళీ డాక్టర్ దగ్గర ఇంకో అబద్ధం ఆడాలి. ఇలా నువ్వు అబద్ధాల గూడు అల్లుకుంటూ పోతే.. ఒకరోజు నువ్వే అందులో చిక్కుకుని అందరి ముందు దొరికిపోతావు. అబద్ధం అనేది ఒక నూలు దారం లాంటిది చింటూ, అది ఎప్పుడో ఒకప్పుడు తెగిపోతుంది. కానీ నిజం అనేది ఇనుప గొలుసు లాంటిది, అది నిన్ను ఎప్పుడూ కాపాడుతుంది."
బామ్మ మాటలకు చింటు సిగ్గుతో తలదించుకున్నాడు. "సారీ బామ్మా! నిజానికి హోంవర్క్ చేయలేదన్న భయంతోనే ఇన్ని అబద్ధాలు చెప్పాను" అని ఒప్పుకున్నాడు. బామ్మ అప్పుడు, "అదిగో.. నిజం చెప్పగానే నీ కడుపు నొప్పి, తలనొప్పి అన్నీ మాయమైపోయాయి చూడు! నా మాట విని స్కూల్‌కి వెళ్ళు, టీచర్‌కి నిజం చెప్పి నిన్నటిది, ఇవాల్టిది హోంవర్క్ పూర్తి చేసి రేపు సబ్మిట్ చేస్తానని రిక్వెస్ట్ చెయ్యి. మళ్ళీ ఇలా ఎప్పుడూ చేయనని టీచర్‌కి ప్రామిస్ చేసి, బ్రేక్ చేయకుండా చూడు మా నమ్మకాన్ని, టీచర్‌కి చేసిన ప్రామిస్‌ని" అని వాడిని వెన్నుతట్టి స్కూల్‌కి పంపింది.
***
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments