top of page
Original.png

చెత్తబ్బాయి


“వర్షంలో కుప్పకూలిన సూర్యాన్ని చెత్త కార్మికుడు రంగడు కాపాడుతున్న దృశ్యం — చేసిన చిన్న సహాయం తిరిగి ప్రాణాలను కాపాడిన కథ.”

Chetthabbayi - Telugu Moral Story | Jeedigunta Srinivasa Rao

చెత్తబ్బాయి - తెలుగు నీతి కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 23/08/2026



“చెత్త తీసుకెళ్లే రంగడికి చేసిన చిన్న సహాయం… అదే రోజు సూర్యం ప్రాణాలను కాపాడుతుందని ఎవరు ఊహించారు?” 


శ్రీనివాసరావు జీడిగుంట గారి చెత్తబ్బాయి కథను వినండి. 


వాన పడుతోంది, "బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తావు?" అని అడిగాడు సూర్యం. 


"పిండి ఏమీ లేదు, ఉప్మా చెయ్యమంటే చేస్తాను. లేదంటే ఈ పూటకి టిఫిన్ మానేసి భోజనం చేద్దాం, త్వరగా వండుతాను" అంది ఆదిత్య.


"పండుగ పూట కూడా పాత బట్టలేనా!" అన్నట్టు, "వెధవ ఉప్మా ఏం బాగుంటుంది వాన పడుతున్నప్పుడు?" అన్నాడు.


"అయితే అలా ఫోన్లో మీ తమ్ముడితో మాట్లాడుకోండి, ఇట్టే వంట చేస్తాను" అంది ఆదిత్య. 


"ఆ, చేస్తావ్! అసలే నాకు షుగరు, దానికి తోడు పెరుగన్నం తిని పడుకున్నానేమో ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. ఏదో ఒకటి తినాలి, అలా వెళ్లి శర్మగారి హోటల్లో వేడి వేడి గారెలు, సాంబార్ తెస్తాను. టిఫిన్ బాక్స్, సాంబార్ కి ఒక స్టీల్ బాక్స్ ఇవ్వు" అన్నాడు.


"వద్దు, కళ్ళు తిరుగుతూ ఎలా వెళ్తారు? అయినా ఈ గారెల పిచ్చి ఏమిటండి? అంతగా అయితే రేపు నేను గారెలు వండుతాను, ఈ రోజుకి రెండు బిస్కట్లు తిని కాఫీ తాగండి" అంది ఆదిత్య.


"బిస్కట్లు నువ్వు తిను, నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్లి వడలు తెచ్చుకుంటాను" అంటూ బయలుదేరాడు సూర్యం, ఎవ్వరి మాట వినడు అన్నట్టుగా.


వానలో గొడుగు వేసుకొని నడుస్తూ, "ఈ శర్మగారికి చాదస్తం! ఆదివారం హోటల్ మూసుకుని కూర్చుంటాడు, మరి ఈ రోజు వానగా ఉంది అని హోటల్ తీశాడో లేదో? చచ్చిచెడి అంతదూరం వెళ్లిన తరువాత హోటల్ లేకపోతే, ఇక ఆ మిల్టరీ వాడి హోటలే దిక్కు" అనుకుంటూ హోటల్ దగ్గరికి వచ్చాడు.  


ఆకలికి వాన ఏమిటి అన్నట్టుగా హోటల్లో జనం బాగానే ఉన్నారు. సూర్యం గారిని చూసి, "రండి సార్! ఈ మధ్య రావడం లేదు ఏమిటి?" అన్నాడు హోటల్ యజమాని శర్మగారు.


"ఊరిలో లేను అండి" అన్నాడు సూర్యం మెనూ బోర్డు చూస్తూ. 


"అదే అనుకున్నాను లేండి. బోర్డు చూడటం ఎందుకు? మీరు గారెలు తప్ప ఏమీ తీసుకోరుగా!" అన్నాడు సూర్యం చేతిలో నుంచి బాక్స్ తీసుకుని, హాట్ ప్యాక్ లో నుండి వడలు తీసి వేస్తూ.


"శర్మగారు.. అవి వద్దు, ఈ వానలో వేడి వేడిగా ఉంటేనే బాగుంటాయి" అన్నాడు. 

"వేడివి అంటే ఆగాలి సార్, అరగంట క్రితం వేసిన వడలు ఇరవై దాకా ఉన్నాయి, మళ్ళీ వాయి అరగంట తరువాత వేస్తాము" అన్నాడు శర్మగారు. 


"అయినా మీరు తీసుకునే నాలుగు వడలకు ఇలా మొండి పట్టు పడితే ఎలా సూర్యం గారు? ఒక పన్నెండు వడలు కొంటాను అంటే ఒక పది నిమిషాలలో వేడివి తయారు చేస్తాము" అన్నాడు.


"బాగానే ఉంది, ఇంట్లో ఉన్నది ఇద్దరం, చెరో రెండు వడలు తింటాము. దాని కోసం డజన్ వడలు కొనమంటే ఎలా?" అంటూ టిఫిన్ తింటున్న జనం వంక చూశాడు. 


ఒక మూల ముడుచుకుని ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని తింటున్న, మా కమ్యూనిటీలో చెత్త తీసుకుని వెళ్ళే రంగడు కనిపించాడు.


వీడికి శర్మగారి హోటల్ కావాల్సి వచ్చిందా అనుకుని, పోనీ ఇడ్లీ తీసుకుని వెళ్దామా అనుకున్నాడు.


"పంతులుగారు! నేను రెండు ఇడ్లీ తిన్నాను, బిల్లు ఎంత?" అని అడుగుతున్న రంగడిని చూసి, "ఒరేయ్ రంగా! నీ బిల్లు నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు" అన్నాడు సూర్యం. 


"సార్ దణ్ణం! ఈ విషయం తెలిస్తే మా బుడ్డోడికి, మా ఆడదానికి కూడా టిఫిన్ కట్టించుకునేవాడిని" అన్నాడు రంగడు చేతులు కట్టుకుని.


"ఇప్పుడు మాత్రం ఏమైందిరా? శర్మగారు! ఆ ఉన్న వడలు ప్యాకెట్ కట్టి ఇతనికి ఇవ్వండి, బిల్లు నేను ఇస్తాను" అన్నాడు సూర్యం. 


"వేడి వడల కోసం ఎంతటి త్యాగం అయినా చేస్తారు సూర్యం గారు!" అంటూ పొట్లం రంగడికి అందించాడు.


సూర్యం గారు ఒక చేత్తో గొడుగు పట్టుకుని, మరో చేత్తో వేడి వేడి గారెలు, సాంబార్ ఉన్న స్టీల్ బాక్సులను జాగ్రత్తగా పట్టుకుని ఇంటి ముఖం పట్టారు. వాన ఇంకా చినుకులు పడుతూనే ఉంది. కళ్ళు తిరుగుతున్నాయన్న సంగతి మరిచి, కేవలం ఆ వేడి వడల వాసన ఇస్తున్న హుషారుతో ఆయన అడుగులు వేగంగా పడ్డాయి. అయితే, షుగర్ తో ఆటలా అన్నట్టుగా ఒక్కసారిగా నీరసం ఆవహించి, డివైడర్ దగ్గర కూర్చొని మైకం లోకి వెళ్ళిపోయాడు.


"అరే, పెద్దాయన పడిపోయాడు!" అంటూ చుట్టూ జనం గుమ్మిగూడారు. 


"పాపం! సాంబారు అనుకుంట, ఒలికిపోయింది" అని ఒక అతను అన్నాడు. 


"ఎవ్వరో? ఎక్కడికి వెళ్తున్నాడో? బహుశా హోటల్ వాళ్ళని అడిగితే తెలుస్తుందేమో" అని ఒకడు సలహా ఇచ్చాడు. రోడ్డు మీద జనం గుంపు చూసి, తను ట్రక్ పక్కగా ఆపి జనాన్ని తప్పించుకుంటూ వచ్చి చూసి, "అయ్యో! మా 54 నెంబర్ ఇంటి సార్! అరగంట క్రితం హోటల్ కి వచ్చారు.” అని “బాబు, కొద్దిగా సాయం పట్టి మా ట్రక్కులో పడుకోబెట్టండి, సార్ ని ఇంటికి తీసుకుని వెళ్లి దింపుతాను" అన్నాడు రంగయ్య.


ఇంటి ముందు ట్రక్ ఆగిన శబ్దం విని ఆదిత్య చెత్త బుట్ట పట్టుకుని బయటకు వచ్చి, "ఏమిటి ఈ రోజు త్వరగా వచ్చేసావు? ఇంకా ఇల్లు తుడుచుకోవడం అవ్వలేదు" అంది ట్రక్ దిగుతున్న రంగడితో.


"చెత్త తీసుకుని వెళ్ళడానికి కాదు తల్లీ వచ్చింది, సార్ హోటల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయారు. నేను అదే సమయంలో నా బండి తీసుకుని పనికి బయలుదేరి సార్ ని చూసి కంగారు పడి తీసుకుని వచ్చాను" అన్నాడు, పక్కన ఇంటి కారు తుడుస్తున్న డ్రైవర్ సహాయంతో సూర్యం ని దింపుతూ.


అయితే చెత్త కంపుతోను, ట్రక్ కుదుపులకి కొద్దిగా కళ్ళు తెరిచి అయోమయం గా చూస్తున్న భర్తని చూసి కంగారుగా లోపలికి తీసుకుని వెళ్లి మంచం మీద పడుకోపెట్టించి, "రంగా! నువ్వు 10 నెంబర్ ఇంట్లో తేజా డాక్టర్ గారిని త్వరగా పిలుచుకుని రా" అని పంపించి, వంటగదిలోకి వెళ్లి పంచదార నీళ్లు కలిపి తీసుకుని వచ్చి భర్త నోట్లో పోసింది.


ఇంతలో తేజా డాక్టర్, "అంకుల్ కి ఏమైంది?" అంటూ వచ్చి మంచం మీద ఉన్న సూర్యం నాడి చూసి, "షుగర్ పడిపోయింది అంతే, పంచదార నీళ్లు ఇచ్చారుగా, ఐదు నిమిషాలలో లేచి కూర్చుంటారు. మొన్న చెప్పాను అంకుల్ కి, వాకింగ్ మన రోడ్డు లోనే చెయ్యండి, బయటకు వెళ్ళొద్దు అని" అన్నాడు డాక్టర్ తేజా.


"ఏం చెప్తాము తేజా! ఆ గారెలు పిచ్చి ఏమిటో వద్దన్నా వినకుండా హోటల్ కి బయలుదేరారు" అంది ఆదిత్య. 


గారెలు మాట వినిపించడంతో, "ఇదిగో తెచ్చాను" అని చెయ్యి పైకి లేపి స్పృహలోకి వచ్చిన భర్తని చూసి మెల్లగా కూర్చోపెట్టి జరిగిన ప్రమాదం చెప్పబోతున్న ఆదిత్యని ఆపి, "ఆంటీ, ముందు రెండు వడలు అంకుల్ కి పెట్టండి" అన్నాడు డాక్టర్ తేజా.


తరువాత విషయం తెలుసుకుని మెల్లగా లేచి జేబులో నుంచి వంద రూపాయలు తీసి, బయట గుమ్మం దగ్గర కంగారుగా చూస్తున్న రంగడి దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకుని, "నీ సహాయం మర్చిపోను" అని వంద రూపాయలు ఇచ్చాడు సూర్యం. 


"వద్దు సార్! మీరు బాగున్నారు అంతే చాలు" అని వంద రూపాయల నోట్ టేబుల్ మీద పెట్టి చెత్త బుట్ట తీసుకొని వెళ్ళిపోయాడు రంగడు.



"చూశావా ఆదిత్య! రంగడికి కుటుంబానికి కొన్ని వడలు ఇప్పించినందుకు, చేసిన ఉపకారం వూరికే పోదు అన్నట్టుగా రంగడే దేముడిలా నన్ను కాపాడాడు. ఆ నడిరోడ్డులో నన్ను ఎవ్వరూ గుర్తు పట్టలేదు, చివరికి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపకుండా రంగడు కాపాడాడు" అన్నాడు.



సంతోషించాములెండి! ఇక మీరు బయటకు వెళ్తే ఊరుకోను. మీకు గారెలు తినాలి అనిపించినప్పుడు నాకు చెప్పండి, నేనే చేస్తాను. అదృష్టం బాగుండి పెద్ద గండం తప్పింది" అంది ఆదిత్య.


“సాంబారు ఒలికిపోయిందే! కావాలని శర్మగారిని అడిగి ఎక్కువ సాంబారు తీసుకున్నాను”, అంటున్న భర్తని ఆశ్చర్యంగా చూసింది ఆదిత్య.



                              శుభం 


— శుభం —

జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):











జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


జీడిగుంట శ్రీనివాసరావు

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page