top of page
Original.png

మలుపులో మర్రిచెట్టు భయం!


రాత్రి సమయంలో మర్రిచెట్టు దగ్గర జట్కా బండి, ఎదురుగా వస్తున్న రహస్యమైన కారు

Malupulo Marrichettu Bayam! - Telugu Mystery Story | Bhattu Venkata Rao

మలుపులో మర్రిచెట్టు భయం!తెలుగు మిస్టరీ కథ | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 23/08/2026


రాత్రి వేళలో ఒంటరి ప్రయాణం... దారి మధ్యలో భయంకరమైన మర్రిచెట్టు... దాని మీద దెయ్యాలున్నాయనే స్థానికుల నమ్మకం... ఇవన్నీ కలిస్తే సాధారణ ప్రయాణమే ఒక భయానక అనుభవంగా మారుతుంది. “మలుపులో మర్రిచెట్టు భయం!” కథలో ఒక ప్రయాణికుడికి ఎదురైన వింత సంఘటనలు, జట్కా బండివాడి హెచ్చరిక, అనూహ్యంగా కనిపించిన కారు, ఆ కారులోని యువకుడితో జరిగిన సంభాషణ చివరికి ఊహించని అతీంద్రియ మలుపుకు దారితీస్తాయి. నిజం ఏది? భ్రమ ఏది? చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే ఈ తెలుగు హారర్ కథను చదవండి.


రాత్రి ఎనిమిది గంటలు దాటితే అడ్డరోడ్డు నుండి ఆ ఊరికి బస్సులుండవు.

నేను అడ్డరోడ్డు చేరేటప్పటికి రాత్రి ఎనిమిది దాటిపోయింది. నాలుగడుగుల అవతల, చెట్టు కింద ఒక జట్కా బండి కనిపించింది. ఆ బండి దగ్గరికి వెళ్ళి "వస్తావా?" అని అడిగాను. రానన్నాడు.


"చీకటి పడ్డాక బండి కట్టం బాబూ!" అన్నాడు.


"ఏం?" అని అడిగాను, అర్థంగాక.


"మధ్యలో గూడెం దాటాక ఒక పెద్ద మలుపొస్తది. ఆ మలుపు దాటాక ఒక చెరువు, ఆ చెరువు గట్టున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటాయి. మలుపు తిరగంగానే ఆ మర్రి చెట్టును చూసి గుర్రం భయపడతది. ముందుకెళ్ళదు. ఆ చెట్టు మీద దెయ్యాలుంటై!" అన్నాడు.


"అవునా?!" అని ఆశ్చర్యం ప్రకటించి "మరిప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చెయ్యాలి?" అని అతడినే అడిగాను.


వెంటనే ఏం మాట్లాడలేదతను. కాస్త నిశ్శబ్దం తరువాత...

"ఆ ఊళ్ళోవాళ్ళయ్యే కార్లెళుతుంటై బాబూ... ఆపి అడిగితే ఎక్కించుకుంటారు. పది నిమిషాల్లో ఎళ్ళిపోతారు!" అని మార్గాంతరం చెప్పాడు.


పొద్దుటి నుంచి ప్రయాణాలతో బాగా అలిసిపోయి ఉన్నాను. పెద్ద ఆవులింత వచ్చింది.

"అలసటగా ఉంది. అందాకా నీ జట్కా బండిలో కూర్చోవచ్చా?" అని అడిగానతడిని.


"దానికేముంది? కూర్చోండి!" అన్నాడతను.


ఎక్కి కూర్చుని "ఓ పది నిమిషాలు చూస్తాను!" అన్నాను.


"అట్టాగే బాబూ!" అన్నాడతను.


(2)

ఆ జట్కామనిషి అన్నట్లుగానే, కాసేపటికి ఓ కారు ఆ ఊరి రోడ్డులోకి మలుపు తిరగడం కనిపించింది. చెయ్యెత్తి కేకేసి “సార్, ఆపండి సార్” అని అర్థిస్తున్నట్లుగా పిలిచాను.


కారు ఆగింది. అడిగాను. ఎక్కమన్నాడు. లోపల కారు నడుపుతున్న యువకుడు తప్ప మరెవరూ లేరు.


"ఎక్కడి నుండొస్తున్నారు?" అడిగాడు ఆ కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు. బాగా చదువుకున్నవాడిలాగా కనపడ్డాడు.

చెప్పాను.

"ఎనిమిది గంటలు దాటితే ఊరికి బస్సులు తిరగవు. తెలియదా?" అడిగాడతను ఒక రకమైన నవ్వు మొహంతో.


"తెలుసు. ముందుగానే రావాలని ప్రయత్నించాను. కానీ రాలేకపోయాను. జట్కామనిషిని అడిగితే రానన్నాడు!" అన్నాను.


"ఎందుకు రానన్నాడు?" నవ్వుతూ, నా వైపు నర్మగర్భంగా చూస్తూ అడిగాడతడు.


"అక్కడేదో చెట్టుందని, ఆ చెట్టు మీద దయ్యాలున్నాయని, వాటిని చూసి గుర్రం భయపడుతుందని, ముందుకెళ్ళదనీ అన్నాడు!" అని సమాధానం చెప్పాను.


నా సమాధానం విన్న వెంటనే బిగ్గరగా నవ్వాడతను.


"అమాయకులు. ఎన్నో ఏళ్ళనాటి మర్రిచెట్టది. ఊడలు దిగి బాగా కిందికి వ్రేలాడుతూ కనపడతాయి. మలుపు మార్గం కావడాన, మలుపు తిరగంగానే ఒక్కసారిగా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి పెద్ద జడల దయ్యంలా ఆ ఊడలు. చీకట్లో కాస్త భయం వేస్తుంది. అంతే, అంతకు మించి మరేమీ లేదు!" అన్నాడతను.


"అంతేనండీ! మీరన్నట్లుగా అమాయకులు వాళ్ళు... అన్నీ నమ్మేస్తారు!" అని అంటుండగా ఆపుకోలేనంత ఆవులింత వచ్చి పెద్దగా ఆవులించాను.


"బాగా అలిసిపోయినట్లున్నారు. రెస్టు తీసుకోండి. పది నిమిషాల్లో ఊర్లో ఉంటాం!" అన్నాడతను.


నా ప్రయత్నం అవసరం లేకుండానే సీటు మీద వెనక్కు వాలింది నా తల. కళ్ళు వాటంతటవే మూతలుపడ్డాయి. క్షణాలలో మాంచి నిద్రలోకి జారుకున్నాను.


(3)

"లెగండి బాబూ... లెగండి లెగండి... ఊళ్ళోకొచ్చేసాం... లెగండి!" అని నన్ను నిద్రలేపుతున్న జట్కామనిషి మాటలు పెద్దగా అరిచి పిలుస్తున్నట్లుగా వినపడుతున్నాయి.


ఉలిక్కిపడి నిద్రలేచాను. ఒకటి రెండు క్షణాలు నాకేమీ అర్థంకాలేదు. కారులో ఉండాల్సిన నేను, కారులో లేకుండా, జట్కామనిషి నన్నెందుకు నిద్రలేపుతున్నాడో అర్థంకాలేదు.


"నువ్వేంటిక్కడ? కారేది?" అని అడిగాను ఆశ్చర్యపోతూ.


"ఏం కారు బాబూ? ఏ కారూ రాలేదు. బండిలో నిద్రపోయారు. ఎంత లేపినా లేవలా. ఏం జెయ్యాల? ఎట్టాగో లాక్కొచ్చినా!" అన్నాడతను.


"అవునా?! మరి ఆ మలుపు దగ్గర మర్రిచెట్టు మీద దయ్యం రాలా? గుర్రం మొరాయించలా?" అని అడిగాను.


"దాని సంగతి తెలుసుగా! అందుకే మలుపు మొదలయిన కాణ్ణుంచే గుర్రాన్ని లగెత్తించినా. అదే పరుగు... అటూ ఇటూ పైకీ కిందికీ చూసేదేలా... పరుగుపెట్టించినా. ఆ లగెత్తుడు నాకు, నా గుర్రానికి అలవాటేలే. పరుగైపోయే పాటికి ఊళ్ళో ఉన్నాం!" అన్నాడతడు నవ్వుతూ.


"గుర్రాన్ని అంత స్పీడుగా పరిగెత్తించినా లేవనంత మొద్దునిద్ర పోయానా?" అని అడిగాను నమ్మలేక.


"అవును బాబూ, ఏదో దయ్యం పట్టిన నిద్రపోయినట్లు, నిద్రపోయారు!" అన్నాడతడు.


"ఆఁ..." అని నోరువెళ్ళబెట్టి ఉండిపోవడం తప్పించి మరేమీ అనలేకపొయాను.


"ఏదో... మాటవరసకి అన్నానులెండీ... గాబరాపడబోకండి. మీరు దిగాల్సిన ఇల్లెవరిదో చెప్పండి. అక్కడ దింపుతాను!" అన్నాడు జట్కా అతను.


చెప్పాను.


ఒక నిమిషం కంటె ఎక్కువ సమయంపట్టలేదు.

"ఇదే బాబూ, ఆ యిల్లు!" అని బండి ఆపాడు.


నేను జట్కాబండి దిగి డబ్బులిస్తుండగా, ఆ యింట్లోంచి ఒక పెద్దాయన గేటు దగ్గరికి వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించి "రండి రండి. మీ గురించే ఆలోచిస్తున్నా. చీకటిపడిపోయిందిగదా, ఈరోజు వస్తారా రారా... అని!" అంటూ లోనికి తీసుకెళ్ళాడు.


పాతకాలపు ఇల్లు అది. విశాలమైన ముందు గదిలోని ఒక కుర్చీలో కూర్చున్నాను. ఒక ఇత్తడి చెంబులోంచి మంచినీళ్ళు ఒక స్టీలు గ్లాసులో పోసి నాకు ఆయన అందిస్తుండగా, నా చూపు ఎదురుగా గోడకు తగిలించి ఉన్న ఒక ఫోటోపై పడింది. ఆ ఫోటోకు దండ వేసి ఉంది.


నేను ఆ ఫోటోను చూస్తుండడం గమనించిన ఆ పెద్దాయన "మా అబ్బాయి. రెండేళ్ళ క్రితం ఒక కారు ప్రమాదంలో..." అని దిగులు నిండిన స్వరంతో ఆ చివరిమాటను చెప్పకుండా వదిలేశాడు.


అప్పుడే నేను ఆయన చేతిలోంచి మంచినీళ్ళ గ్లాసును అందుకుని, ఒక గుక్క నీళ్ళు గొంతులోకి పోనిచ్చాను. నాకు పొలమారింది. కష్టం మీద తమాయించుకుని "పది నిమిషాల క్రితం అతడితో నేను మాట్లాడాను, నిజానికి అతడితో కారులో ప్రయాణించాను..." అన్నాను.


ఆ మాటలు అంటూండగా నా స్వరం అంత గట్టిగా లేదు. నాలో నేను మాట్లాడుకున్నట్లుగా ఉందనుకుంటాను. కానీ అందులో రెండు మూడు ముఖ్యమైన మాటలు ఆయనకు వినపడినట్లుగా ఉంది...


"ఏమిటీ...?" అన్నాడాయన అర్థంగాని మొహంపెట్టి.


"ఏమీ లేదులెండి... ప్రయాణంలో అలిసిపోయి ఉన్నాను..." అన్నాను సర్దుకుని, కష్టం మీద.


అదే నిజమనుకున్నాడు ఆయన...


"అవునవును. లేచి స్నానం చేసి భోంచేసి పడుకోండి. అన్ని ఏర్పాట్లు చేశాను. వాడు పోయిన దగ్గరి నుంచి, మా అబ్బాయి గది ఖాళీగానే ఉంది. పక్కనే వాడు పెంచిన పూల తోటలోంచి సువాసనతో నిండిన చల్లని గాలి వస్తుంది. హాయిగా నిద్రపడుతుంది. లేవండి. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం..." అని ఇంకా ఏదో చెబుతున్నాడాయన.


ఆయన మాటలను వినిపించుకునే స్థితిలో నేను లేనని ఆయనకు తెలీదు.


భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page