top of page

ఆడదే.. ఆధారం


'Adade Adharam' - New Telugu Story Written By Pitta Gopi

'ఆడదే.. ఆధారం' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)సౌమ్య - విఘ్నేష్ కొత్త జీవితంలో కి వచ్చి అర్ద సంవత్సరం అవుతుంది.


చాలా మంచిగా చూసుకుంటున్నాడు విఘ్నేష్.


ఎందుకంటే సౌమ్య పెద్ద చదువులు చదువుకోకపోయినా.. కులం చూడకుండా విఘ్నేష్ ని ప్రేమించింది. అక్కడితో ఆగక తల్లిదండ్రులును ఎదురించి విఘ్నేష్ ని పెళ్లి చేసుకుంది కాబట్టి.


తానే ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ సౌమ్య ని చూసుకుంటున్నాడు. అర్ద సంవత్సరం వరకు బాగానే సాగిన వీళ్ళ కాపురం తర్వాత దారి తప్పింది.


కారణం..


సౌమ్య "నేను కూడా ఏదైనా జాబ్ చేస్తానండి. మీకు తోడుగా నేను ఉంటే వచ్చే నష్టం ఏమిటి.. " అనటం..


దీంతో విఘ్నేష్ మనసు చెడుగా ఆలోచించటం మొదలయ్యింది.


రోజు విఘ్నేష్ మద్యం తాగుతూ ఇంటికి రావటం. సౌమ్య తో ఊరికే గొడవ పడటం చేస్తుండేవాడు.


సౌమ్య సౌందర్య వంతంగా ఉంటుంది. దీంతో విఘ్నేష్ కి ఎక్కడ లేని అనుమానాలు కల్గేవి.


రోజు ఏదో ఒక నెపంతో గొడవపడకుండా ఆఫీసు కి వెళ్ళేవాడే కాదు..


చివరకు కొట్టడం కూడా మొదలట్టాడు.


సౌమ్య బాదని చెప్పుకునేందుకు కన్నవాళ్ళు ని కూడా దూరం చేసుకుంది. అందువల్ల తన బాదని ఓర్చుకుని అన్ని భరిస్తూ రోజులు గడపసాగింది.


ఒకరోజు విఘ్నేష్ ఆఫీసు కి బయలుదేరి వెళ్ళగా సౌమ్య ఇంట్లో ఎప్పటిలాగానే తన పనులు తాను చేసుకుంటుండగా..


బాల్కనీ వద్ద "దబేల్ "అని పెద్ద శబ్దం, మనిషి అరుపులు విని వెళ్లి చూడగా..


విఘ్నేష్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. కంగారు పడిన సౌమ్య తేరుకుని అతికష్టం మీద ఆసుపత్రికి తరలించింది.


ఆసుపత్రిలో నడుము విరిగినట్లు తేలటంతో సౌమ్య విషాదమైన సముద్రంలో పడిపోయినట్లు ఊహించుకుంది.


సర్జరీ కోసం తన ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి పెట్టింది. అవి చాలక పసుపు తాడు కట్టుకుని, మంగళ సూత్రం సహా తన చెవిపోగులు, కాలిమెట్టలు అన్నీ అమ్మి మరీ విఘ్నేష్ కి సర్జరీ చేసింది


అతను కోలుకునేందుకు ఏడాదికి పైగా పడుతుంది. ఈలోగా సరైన ఆహారం తీసుకోకపోతే కోలుకోవటం మరింత ఆలస్యం అవుతుందని డాక్టర్లు చెప్పారు.


ఇక భర్త, కుటుంబ బాధ్యత తన మీద పడింది.


అయితే అందుకు సౌమ్య బాధ పడటంలేదు.. .


అసలు భర్త చేసిన పని తలుచుకుంటే తాను ప్రేమించి తల్లిదండ్రులు ను ఎదురించి పెళ్లి చేసుకున్నవాడేనా అనే ఆలోచన రాకమానదు. ఎందుకంటే..


ఆఫీసుకి వెళ్తున్నట్లు బయటకు వెళ్లి సౌమ్య పై అనుమానంతో.. పక్క మేడ నుండి తమ మేడకు మారి బాల్కనీ దగ్గర గోడ పై నుండి జారి ఈ పరిస్థితి తెచ్చుకోవటమే.


ఇక సౌమ్య గడిచిన దానిని వదిలేసి భర్త సేవ కోసం దారులు వెతుక్కోసాగింది.


ఎంతైనా ఆడదిగా, ఒక బార్యగా భర్త ని చూసుకునేందుకు ఏ పనికైనా సిద్ధం అవుతుంది కదా.. .


తెల్లవారు లేచింది మొదలు భర్త కు సేవలు చేసి మిగిలిన సమయంలో పట్టణంలో హైవే పై తోపుడు బండి మీద కొన్ని కూల్ డ్రింక్స్, తో పాటు చిన్న ఇరానీ టీ షాపు నడుపుతు భర్త కోలుకునే వరకు అంతకంతకూ మెరుగవ్వాలని ఎంతో కష్టపడేది.


ఆ కష్టం తనలాంటి ఆడవారికే తప్ప అనుమానాల తో రగిలిపోయే తన భర్త లాంటి మగవాళ్ళకి అసలు పట్టదు.


తాను బయట ప్రపంచంలో అడుగు పెట్టిన నాటి నుండి తనకు వేదింపులు, లోబరుచుకోడాలు కొత్త కాదు కానీ..


ఎంతో ఇష్టం తో ప్రేమించి తల్లిదండ్రులను ఎదురించి విఘ్నేష్ ని పెళ్ళి చేసుకుంది వేరొకరితో నెరపటానికి కాదుకదా..


కాలం గడుస్తుంది. విఘ్నేష్ మనసులో సౌమ్య పై ప్రేమ పెరగటమే కాదు తన పై జాలి, మమకారం ఎక్కువ అయింది.


ఎందుకంటే విఘ్నేష్ కి అన్నీ తానై, తోడు నీడై సవర్యలు చేసింది. తన కోసం ఎన్నో నిద్ర లేని రోజులు గడిపింది. సర్జరీ డబ్బుల కోసం తాను పడిన వేదన అర్థం చేసుకున్నాడు. సౌమ్య పై ఉన్న దుర్బుద్ది అంతా క్రమక్రమంగా పోతుంది.


ఇక మరో వారం రోజుల్లో విఘ్నేష్ పూర్తిగా కోలుకుంటాడని డాక్టర్లు చెప్పగా సౌమ్య ఎంతో ఆనందించింది. ఆ వారం కూడా తన పనులు కొనసాగించింది.


ఒక రోజు తన షాపు వద్ద ఎండ తీవ్రతలు కారణంగా డ్రింక్స్ కి డిమాండ్ లబించింది. అక్కడికి సౌమ్య తల్లిదండ్రులు కూడా డ్రింక్స్ కోసం వచ్చారు.


ఇరువురు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు.


సౌమ్య మాత్రం మాట్లాడకుండా తలదించుకుంది. ఎందుకంటే తల్లిదండ్రులను కాదనుకుంది కదా..


అందుకే వాళ్ళే మాట్లాడుతారేమోనని, వాళ్ళలో ఏదైనా మార్పు వచ్చిందేమో అని లోలోపల ఆత్రతగా చూసింది. కానీ.. అవి అడిఆశలు అయ్యాయి.


అంతమంది ముందు కన్నకూతుర్ని ఉద్దేశించి

"ఏవండోయ్! ఇంత అందమైన పిల్ల ఇలాంటి పని చేస్తుంది.. ఏమి ఖర్మ వచ్చిందో.. . "అని తల్లి


"అవును.. . కన్నవాళ్ళు మాటలని పెడచెవిన పెట్టి పరాయివాడే ముద్దు అనుకునే వాళ్ళకి ఎప్పుడూ తగిన శిక్ష పడుతుంది కదా.. " అని తండ్రి సూటిపోటి మాటలు అన్నారు.


ఆ మాటలకు సౌమ్య కళ్ళలో కన్నీటి బిందువులు నిండిపోగా, ఏడుపు దరి చేరుతున్న వేళ దాన్ని ఆపుకునేందుకు తన కొంగు అడ్డం పెట్టుకోవల్సి వచ్చింది.


అయితే ఈ తతంగాన్ని దూరం నుండే బార్య కష్టాన్ని చూడ్డానికి వచ్చిన విఘ్నేష్ చూసి మనసులో చలించిపోయాడు.


ఒక ఆడది తనపై నమ్మకంతో ప్రేమించి, నా వెంట నడిచి, నా కోసం తన వాళ్ళని వదులుకుని, నాకోసం తన జీవితాన్ని త్యాగం చేసి వస్తే, తనకు ఇచ్చిన బహుమతి ఇంత దారుణంగా ఉందేంటని బాధపడ్డాడు.


ఇంకో రోజు సౌమ్య షాపు వద్ద ఎవ్వరూ కనిపించటం లేదు.


హైవే పై వాహనాలు పరుగులు తీస్తున్నాయి.


ఒక అకతాయి బైక్ పై అక్కడికక్కడే తిరుగుతూ సౌమ్య ని చూస్తూ.. . కాలర్ ఎగరేస్తూ.. . విజల్ వేస్తూ పోజులు కొడుతూ ఉండగా అదుపు తప్పి కిందపడతాడు.


వెంటనే ఆమె అతడిని పైకి లేపుతుంది. అదృష్టం కొద్దీ దెబ్బలు తగలలేదు. పైకి లేచిన అకాతాయికి చెంపపై లాగి ఒక్కటి కొట్టి తాగటానికి డ్రింక్ ఇస్తూ.. .


"ఒక ఆడది ఇంటి నుండి బయట ప్రపంచంలో కి వచ్చింది అంటే తన కుటుంబం కోసమే తప్ప మీలాంటి చెత్త వెదవలకు లొంగిపోవటానికి కాదురా! రేపు నీకు ఏమైనా అయితే నీ పెళ్ళాం కూడా నాలాంటి పరిస్థితి లో ఉంటుంది.

బయట ఆడదాన్ని గౌరవిస్తే రేపు నీ భార్య నీకు దక్కుతుంది" అంటుంది.


ఆ మాటలు దూరం నుండి వింటున్న విఘ్నేష్ గుండె ఆగినంత పని అయింది.


ఎందుకంటే తాను సౌమ్య పై అనుమానంతోనే ఈ పరిస్థితి లో ఉన్నానని! కానీ తాను మాత్రం బయట ప్రపంచంలో కి వచ్చినా కూడా ఇంత మంచిగా నన్ను ప్రేమించిందని, ఇలాంటి భార్యను ఎన్ని కష్టాలు పెట్టానని..


వెంటనే భార్య దగ్గరకు వెళ్ళి కాళ్ళపై పడి బిగ్గరగా ఏడవసాగాడు.


"ఇన్నాళ్లు ఆడది అంటే కేవలం పిల్లల్ని కనటానికే అనుకున్నానని. కానీ.. ఆడది అంటే ఆదుకునేదని, ఆడది లేకపోతే ఏ మగవాడు లేడని, అసలు ఆడదాని ఆధారంతోనే ఈ భూమి పై ప్రతి మనిషి బతుకున్నాడని ఆలస్యంగా తెలుసుకున్నానని క్షమించ"మన్నాడు


ఆ రోజు నుండి విఘ్నేష్ మాత్రమే ఉద్యోగం చేసేవాడు. కుటుంబ బాధ్యత సౌమ్య నే చూసేది.


అంతేనా.. . తనకి ఏమి ఇష్టం అయితే విఘ్నేష్ కి అదే. తనకు వేరేగా ఏమి ఇష్టాలు ఉండేవే కాదు..

ఎందుకంటే నిజంగా సౌమ్యకు చెడు ఆలోచనలు ఉండి వుంటే, గాయపడినపుడే తనను వదిలి పోయేది కదా.. తన ఆధారం లేకుండా ఈరోజు ఇలా మరలా సాధారణ స్థితికి రాలేను కదా..


ఏ రోజు అయినా తన ఇంట్లో సౌమ్య నవ్వుతూ లేకపోతే ఆ రోజు తనకు చావు కొట్టొచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే సౌమ్య చిరునవ్వే తన ఇంటికి దీపం గా మార్చుకుని జీవించసాగాడు విఘ్నేష్.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


66 views1 comment
bottom of page