కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Adajanma' Telugu Story Written By Madhukar Vaidhyula
రచన: మధుకర్ వైద్యుల
బాధ్యత లేని వ్యక్తి వాళ్ళ ఆ కుటుంబం ఎంతో బాధ పడుతుంది.
ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని అతను చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ మధుకర్ వైద్యుల గారి కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం
కరీంనగర్ జిల్లా.. గోదావరిఖని సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లయిన్ కాలనీ. 2006 అక్టోబర్ 12 ఉదయం తొమ్మిది కావస్తోంది.
అప్పుడే లేచి బ్రెష్ చేసుకుని టీ తాగుతూ పేపర్ తిరిగేస్తున్నా. ట్రింగ్..టింగ్..టింగ్...ఇంట్లో ల్యాండ్పోన్ ఒకటే మోత.
ఎవరిపనిమీద వారుండడంతో నేనే పోన్ ఎత్తి ‘హాలో ’ అన్నా.
‘సార్ నేను హోంగార్డు శేఖర్ను మాట్లాడుతున్నా’ అన్నాడు. పోలీస్స్టేషన్ నుంచి కాల్ అని అర్థమైంది.
‘ఆం.. చెప్పు.’ అన్నాను.
‘ఎన్సీ క్వార్టర్లో సూసైడ్ జరిగిందట. సి.ఐగారు బయలు దేరుతున్నారు. మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు’ అని శేఖర్ చెప్పాడు.
‘అవునా? సరే..సరే నేను బయలు దేరుతున్న.’ అని పోన్ పెట్టేశా.
‘ఇంతకు నాకెందుకు పోన్ చేశారని మీకు అర్థం కాలేదు కదూ! నేను ఆ ఏరియా విలేకరిని. అందుకే న్యూస్ కవర్ చేయడానికి.’
నాకు అప్పటికీ బైక్ గానీ, స్కూటర్ గానీ లేదు. కేవలం సైకిల్ మాత్రమే ఉండే. దానిమీదే బయలుదేరా. మా ఇంటి నుంచి సంఘటన స్థలానికి అరకిలోమీటర్ దూరం ఉంటుందేమో. అంతే.... వెళ్తూ వెళ్తూ లక్ష్మి బుక్స్టాల్లో ఒక వైట్ పేపర్, పెన్ను తీసుకుని వెళ్లా....
సంఘటన జరిగిన క్వార్టర్ దగ్గరికి వెళ్లేప్పటికీ జనాలు తండోపతండాలుగా ఉన్నారు. సింగరేణి సంస్థలో పెద్ద స్థాయి ఉద్యోగాల్లో పనిచేసే అధికారులకు ఎన్సీ క్వార్టర్స్ను సంస్థ కేటాయిస్తుంది.అధికారి ఇంట్లో ఆత్మహత్య అనేసరికి ఎవరా? అన్న సందేహంతో చాలామంది వచ్చారు. జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్లా. జనం అంతా కూడా క్వార్టర్ ముందు కాకుండా క్వార్టర్ పక్కనుండే కారు షెడ్డు ముందు గుమికూడి ఉండడం నాకు ఆశ్చర్యమనిపించింది. అంటే ఆత్మహత్య జరిగింది కారు షెడ్డులో అన్నమాట అని నిర్ధారించుకున్నా.
అప్పటికే సి.ఐ, ఇద్దరు ఎస్.ఐలు, మరో పదిమంది కానిస్టేబుల్స్, నాతో పాటు పనిచేసే ఇతర పత్రికల విలేకర్లు అక్కడ ఉన్నారు. నేను వెళ్లి వాళ్ల పక్కనే నిలబడ్డా..
కారు షెడ్డుకు పైనున్న ఇనుపరాడుకు చీరతో ఉరివేసుకున్నట్లు ఎదురుగా ఒక మహిళ శవం కనిపిస్తోంది. మొఖం అటువైపు తిరిగి ఉండడంతో ఎవరో తెలియడం లేదు.
(సింగరేణిసంస్థలో అధికార్లు తమ ఇళ్లలో పనిచేసేవారికి కారు షెడ్డును వారు ఉండడానికి కేటాయిస్తుంటారు. క్వార్టర్ ముందు ఖాళీ స్థలం ఉంటుంది కనుక కారును అక్కడ పెట్టుకుంటుంటారు.)
ఆ అధికారి క్వార్టర్కు తాళం వేసి ఉంది. పక్క క్వార్టర్ వారిని సి.ఐ విచారిస్తున్నాడు. ‘ వాళ్లు తిరుపతికి వెళ్లి వారం రోజులవుతోంది. ఈమె వీళ్లింట్లోనే వంటపని చేస్తూ కారు షెడ్డులో ఉంటుంది. ఆరు నెలలవు తుందేమో వీళ్లింట్లో పనిచేయబట్టి. మంచి ఆవిడా. ఆమెకు ఎవరు లేరు. ఒక్కతే ఇక్కడ ఉంటుంది. నిన్న రాత్రి కూడా మాతో మాట్లాడింది. పొద్దున లేచాక ఎలాంటి అలికిడి లేకపోవడంతో నేనే గేటు తీసుకుని ఇటు వచ్చేసరికి ఇలా కని పించింది.’ పక్క కార్టర్ కారు షెడ్డులో ఉండే ఒక కుటుంబం చెబుతోంది. పోలీసులు, పాత్రికేయులు ఎవరికి వారు రాసుకుంటున్నారు.
ఈ లోపు సి.ఐ స్థానికులను పిలిచి శవాన్ని కిందికి దింపమని చెప్పడంతో నలుగురు వ్యక్తులు ఆ ప్రయత్నంలో ఉన్నారు. నేను అప్పటికీ పక్కింటి వారితో మాట్లాడుతూ ఉన్నా.
‘ఆమె పేరు ఏంటీ?’
‘ప్రమీల’
ఒక్కసారిగా నా గుండెలో చిన్నగా నొప్పి అనిపించింది. ఎక్కడో విన్నపేరు. భాగా దగ్గరగా... ఎక్కడా? ఆలో చిస్తూనే...
‘వయస్సు ఎంత ఉంటుంది?’
‘ఓ నలభై ఉంటాయోమో’
నా అనుమానం బలపడుతుండగా శవం వైపు కదిలాను. అప్పటికే శవాన్ని కిందకు దింపి కింద పడుకోబెట్టారు. అందరూ చుట్టు గుమికూడి చూస్తున్నారు.
‘ఆమేనా..? కాదనుకుంటా?.. వేరే వాళ్లు అయ్యుండచ్చుగా... ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది. జనాన్ని పక్కకు తోస్తూ ముందుకు వెళ్లి చూశా.....ఆమె..
‘ఒక్కసారిగా..గుండెలు పిండెసినట్లయింది. అవును ఆమెనే....పద్మ వాళ్ల అమ్మ.. ఏం చేయాలో తెలియలేదు. నాకు తెలియకుండానే కళ్లనిండా నీళ్లు నిండుకున్నయి. వెనుకకు వచ్చేశా.
సి.ఐ జీ.వి. రెడ్డి. నన్ను గమనించాడు. దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లాడు.
‘ఏంటీ మధు.. అలా అయిపోయావు. భయపడ్డావా? అడిగాడు.
‘లేదు సార్.. నాకు ఆమె తెలుసు’ అన్న.
‘నీకు తెలుసా? ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు.
‘సార్ నేను ఒకప్పుడు స్కూల్ టీచర్గా పనిచేశా. అప్పుడు పద్మ అని ఒకమ్మాయి మా స్కూల్లో ఏడవ తరగతి చదువుతుండేది. వాళ్ల అమ్మ సార్ ఈమె.’
‘ అవునా? మరి ఎవరు లేరు అంటున్నారు.’
‘ఆత్మాభిమానంతో ఎవరికీ చెప్పుకోలేదనుకుంటా సార్. పద్మ ఒక్కతే కాదు. ప్రశాంతి అని మరో కూతురు, భర్త మల్లారెడ్డి కూడా ఉన్నారు’.
‘అవునా? ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా?
‘భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ. పెద్ద కూతురికి పెళ్లయింది. వేరే ఊరిలో ఉంటుంది. చిన్న కూతురు ఈ మధ్యే ప్రేమపెళ్లి చేసుకుంది. ఇక్కడే టీవన్ క్వార్టర్లో ఉంటుంది.’అని నాకు తెలిసిన మరిన్ని విషయాలు చెప్పా.
‘ఒకే మధు థాంక్యూ. మన వాళ్లను పంపి వాళ్లన రప్పిస్తా. అంటూ మళ్లీ అటువైపు వెళ్లి పోయాడు.
నాకు అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే సైకిల్ తీసుకుని ఇంటికి వచ్చేశా...ఏదో రాయాలి కదా అని రాసి న్యూస్ పంపేశా. ఆలోచిస్తూ అలాగే కుర్చిలో ఉండిపోయా!
ఒక్కసారి నా మనసు ఆరేడు సంవత్సరాలు వెనుకకు వెళ్లింది.
* * * * * ** ***
అప్పటి వరకు ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేసిన నేను స్నేహితులతో కలసి స్వంతంగా స్కూల్ పెట్టాను. పనిచేసింది ఒక్క ఏడాదే అయినా అక్కడి పిల్లలతో పెంచుకున్న అభిమానంతో చాలామంది పిల్లలు నాతో పాటు మా స్కూల్కు వచ్చారు. తొలి ఏడాదే నాలుగువందల మంది పిల్లలతో స్కూల్ కళకళలాడుతోంది. అందరూ పిల్లల్ని ఒకేలా చూసినప్పటికీ నా మీదా నమ్మకంతో వచ్చిన పిల్లల మీదా ప్రత్యేక అభిమానం ఉండేది. అందుకే ఉదయం స్కూల్కు రాగానే అన్ని క్లాసులు తిరిగి అందరూ పిల్లల్ని పలకరించి రావడం పనిగా పెట్టుకున్న. పిల్లలు కూడా నాతో మాట్లాడకుండా ఉండేవాళ్లు కాదు. అలా మూడు నెలలు గడిచింది.
రోజులాగే అ రోజు కూడా అన్ని క్లాసులు తిరుగుతూ ఏడో తరగతి క్లాసుకు వెళ్లా. అందర్నీ పలకరిస్తూ ఒక అమ్మాయి లేకపోవడం గమనించా.
ఎవరూ అని ఆలోచించే అవసరం లేకుండానే పద్మ రాలేదని అర్థమైంది.
‘పద్మ రాలేదారా? మిగిలిన ఆడపిల్లల్ని అడిగా.
‘లేదు సార్... వాళ్ల అమ్మ నాన్న ఆమెను చదువుమానిపిస్తున్నారట.’ సంగీత అనే అమ్మాయి చెప్పింది.
‘అదేంటీ? చదువు మాన్పించడమా? ఎందుకంటా? ఆశ్చర్యంగా అడిగా.
‘ఏమో సార్’ అందరూ ముక్తకంఠంతో అన్నారు.
‘సరే సరే మీరు చదువుకోండి. నేను ఇప్పుడే వస్తా’ అని భయటకు వచ్చి సైకిల్ తీసుకుని పద్మ వాళ్లింటివైపు బయలుదేరా?
నాకు ఆ అమ్మాయి ఆరవతరగతిలోనే పరిచయం. వాళ్ల అమ్మనాన్నలు అంతగా పరిచయం లేదు. ఒకటి రెండు సార్లు వాళ్ల అమ్మ స్కూల్కు వచ్చినట్లు గుర్తు. అప్పుడు స్కూల్ మనది కాకపోవడం వల్ల పెద్దగా పట్టించుకోలేదు. మా స్కూలుకు మాత్రం ఇంత వరకు వాళ్ల అమ్మగాని, నాన్న గానీ వచ్చినట్లు చూడలేదు. తన క్లాస్మేట్స్తో కలసి తను కూడా వచ్చి స్కూల్లో చేరిందే తప్ప. ప్రత్యేకంగా వాళ్లింటికి వెళ్లింది కూడా లేదు. కాకపోతే. క్యాన్వాసింగ్ సమయంలో వాళ్ల ఇళ్లు చూసిఉండడంతో బయలు దేరా? వాళ్లవి షిర్కే క్వార్టర్లు. పై క్వార్టర్ కావడంతో సైకిల్ కింద పెట్టి పైకి వెళ్లా. ఇంటి తలుపు పెట్టి ఉంది. వెళ్లి తలుపుకొట్టా.
వెంటనే తలుపు తెరుచుకుంది. ఎదురుగా పద్మనే. నన్ను చూడగానే కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటూ తల దించుకుని డోరు తీసి లోనికి వెళ్తూ ‘మమ్మీ సార్ వచ్చిండే’ అంది.
నేను తలుపు బయటే నిలబడ్డా. నిమిషం తరువాత వాళ్ల అమ్మ, మరో అమ్మాయి ( పద్మ వాళ్ల చెల్లి అనుకుంటా.) బెడ్రూం నుంచి ముందు రూమ్కు వచ్చారు. రావడంతోనే..
‘అయ్యో సార్. బయటనే నిలబడ్డరా? లోపలికి రండి. కూర్చోండి’. అంటూ కుర్చి వేసింది.
నేను వెళ్లి కూర్చున్న. వాళ్లిందరూ నాకు ఎదురుగా నిలబడ్డారు. ఇళ్లు చూస్తే పెద్దగా వస్తువులు ఉన్నట్లు అనిపించలేదు. ముందు రూమ్లో రెండు కుర్చీలు, ఒక మంచం, ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ, పిల్లల పుస్తకాల బ్యాగులు కనిపించాయి.
‘పద్మ సార్కు చాయ్ పెట్టే’ అంది వాళ్ల అమ్మ.
‘వద్దమ్మా... ఇప్పుడు నేను తాగను. నేను పద్మ కోసం వచ్చా. ఒక్కసారి పద్మను పిలవండి.’ అన్న. నా మాట వినగానే పద్మ వచ్చి వాళ్ల అమ్మపక్కన నిలబడింది.
‘ఏంటీ పద్మ స్కూల్కు ఎందుకు రాలేదు? సూటిగా అడిగా.
ఆ అమ్మాయి తల దించుకుంది. ఎవరూ మాట్లాడడం లేదు. మళ్లీ నేనే అడిగా...
‘చెప్పమ్మా! ఎందుకు రాలేదు’
పద్మ తలదించుకునే ఉంది. కానీ ఏడుస్తున్న ఆమె కండ్ల నుంచి రాలిన నీళ్లు నేలపై పడుతున్నాయి. వాళ్ల అమ్మ, చెల్లి వైపు చూశా. వాళ్లు కూడా తలదించుకుని ఏడుస్తున్నారు.
‘నా మనసంతా అదోలా అయిపోయింది. రెండు నిమిషాలు ఏం మాట్లాడలేకపోయా? తరువాత మళ్లీ అడిగా.
‘ఏంటమ్మా ఏమన్న ప్రాబ్లమా? నాతో చెప్పమ్మా’ అన్న.
‘ఏం చేయమంటరు సార్. నాకున్నది ఇద్దరే పిల్లలు. వాళ్లను భాగా చదివించి మంచి అయ్యను చూసి పెళ్లి చేయాలని నాకూ ఉంటది. కానీ ఏం లాభం. నా జీవితం లాగే నా బిడ్డల జీవితం నాశనమయ్యేట్లుంది. పద్మ వాళ్ల అమ్మ ఏడుస్తూనే చెబుతోంది.
‘ అసలేం జరిగిందమ్మా?
‘ మా ఆయన మల్లారెడ్డి తాగుబోతు. రోజు తాగి రావడం వచ్చి ఇంట్లో గొడవలు. నిన్న రాత్రి కూడా గొడవ చేసి ఇద్దరూ పిల్లల్ని చదువుమానేయ్యమని తిట్టిండు. రాత్రంతా గొడవనే. పిల్లల పుస్తకాలు తీసి ఇసిరేసిండు. అడ్డంబోయిన నా మీదా చేయి చేసుకున్నడు. రాత్రంతా గొడవే. ముగ్గురం కూడా ఏం తినకుండానే ఏడుస్తూ కూర్చున్నం. ఆయన పొద్దు లేస్తేనే ‘ఈ రోజు నుంచి స్కూల్ లేదు ఏం లేదు’ అని వార్నింగ్ ఇస్తూ వెళ్లిండు. ఆయనతో ఏంటీ నేను పంపిద్దామనుకుంటే ఒక పైస ఇయ్యడు. వీళ్ల ఫీజులు ఎట్ల కట్టాలే? అర్థం కావడం లేదు.’ ఏడుసుకుంటూ చెప్పింది.
‘ఆయన సింగరేణి జాబ్ చేస్తారుగా? డబ్బులకు ఇబ్బందేముంది? అడిగా.
‘పేరుగే జాబ్ ఏనాడు పోడు. నెలకు పదిరోజులు కూడా చేయడు. చేసిన వచ్చిన డబ్బులు తాగడానికే సరిపోవు. ఇంట్లో అడపిల్లలు ఉన్నారనే విషయం కూడా మరిచిపోయి నోటికి ఎంతోస్తే అంతే తిట్టడం, బూతులు, నన్ను కొట్టడం ఇదే పని. ఇది భరించలేక చచ్చిపోదామనుకుంటే ఇద్దరూ పిల్లలు అనాధలవుతా రని భయం. పోని ఎక్కడన్న పనిచేద్దామనుకుంటే మాట్లాడిన ప్రతి ఒక్కరికీ సంబంధం అంటగడుతడు.’
ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒకనిమిషం ఆలోచించా..
‘సరే అమ్మా! స్కూల్ ఫీజు గురించే మీ ఇబ్బంది అనుకుంటే పద్మకు ఫీజు కట్టకున్న పర్వాలేదు. నేను చూసుకుంటా. మంచిగా చదివే అమ్మాయిని ఎందుకు స్కూల్ మాన్పిస్తరు.’ అన్న.
‘ఫీజు గురించనే కాదు సార్. అసలు పిల్లలు చదువుకోవడమే ఆయనకు ఇష్టం లేదు.’ అంది.
‘సరే ఆయన ఎప్పుడు వస్తాడు. నేను మాట్లాడి ఒప్పిస్తా’.
‘ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో మాకే తెలియదు. ఏమని చెప్తం సార్. ఆయన మంచోడు కాదు. మీరు కాదు కదా ఎవరు చెప్పిన వినడు.’
‘సరేనమ్మా నా ప్రయత్నం నేను చేస్తా. సరే చిన్న పాప ఎక్కడ చదువుతుంది. ఏ క్లాసు? అడిగా.
‘గోదావరిఖని ఇంగ్లీష్మీడియంలో చదువుతోంది. ఇప్పుడు ఆరవ తరగతి.’ అంది.
‘నీ పేరేంటమ్మ’ ఆ పాపను అడిగా.
‘ప్రశాంతి సార్.. నవ్వుతూ చెప్పింది.
‘మీ స్కూల్లో కూడా నేను మాట్లాడి చెప్తా. నీవు కూడా స్కూల్కు వెళ్దువు కానీ.’ అన్న.
‘థాంక్యూ సార్’ అంది.
‘సరే నేను మళ్లీ సాయంత్రం వస్తా. వచ్చి మాట్లాడుతా..’ అని లేచి వచ్చేశా. అన్నట్లుగానే సాయంత్రం వెళ్లా. వెళ్లేప్పటికీ ఆ ముగ్గురు కూడా మెట్ల మీదా కూర్చుని ఉన్నారు. నన్ను చూడగానే లేచి ఇంట్లోకి కదిలారు.
నేను వారిని అనుచరించా. వారి వెనుక వెళ్తూనే.. ‘ మీ డాడీ ఉన్నాడా అమ్మ అని అడిగా.
‘ఉన్నాడు సార్’ అన్నారు పిల్లలిద్దరూ.
ఇంట్లోకి వెళ్లెప్పటికీ ముందు రూములో సోయి లేకుండా పడుకుని ఉన్నాడు వాళ్ల నాన్న. అలాగే చూస్తు తలుపు దగ్గరే నిలబడి పోయా.
‘ఓయ్! ఒకసారి లే! పద్మ వాళ్ల స్కూల్ సార్ వచ్చిండు. ఒకసారి లేచి కూర్చో. పద్మ వాళ్ల అమ్మ లేపుతోంది. అతను కొద్దిగా కళ్లు తెరిచి చూశాడు. మరో ఐదు నిమిషాల పాటు లేపుతూనే ఉంది.
‘నీ అబ్బా...లం.....పడుకునుడు కూడా పడుకోనివ్వవా? నీ అవ్వ.. సారాట...సార్.. ఎవడొస్తే నాకేంది.? అంటూ లేచి కూర్చోని బూతులు తిడుతూనే ఉన్నాడు. నాకు మతి పోయినంత పనైంది.
పద్మ ఇంట్లోకి వెళ్లి గ్లాసులో నీళ్లు తీసుకువచ్చి కోపంతో ముఖం మీద పోసింది.
‘నీ అమ్మ...ముం...లార! నా మీదే నీళ్లు పోస్తారా? అంటూ అరుస్తూనే ఉన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
‘సరే అమ్మ... ఇప్పుడు ఆయనకు చెప్పిన అర్థం కాదు. నేను మార్నింగ్ వస్తాలే అని అక్కడి నుంచి వచ్చేసా.
మరునాడు ఉదయం లేవగానే నా స్నేహితుడు కానిస్టేబుల్ లక్ష్మినర్సయ్యకు పోన్ చేశా. రాత్రే విషయం చెప్పి ఉండడం చేత పోన్ చేయగానే ‘పదినిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటా మధు’ అని పెట్టేశాడు.
మా వాడు రాగానే ఇద్దరం ఆయన బండిమీదా పద్మ వాళ్లింటికి వెళ్లాము. తలుపు దగ్గర పెట్టి ఉంది. నేనే తలుపు కొట్టా. పద్మ వచ్చి తలుపు తీసింది. వాళ్లు అప్పడే లేచినట్లున్నారు. అప్పటికీ ఉదయం ఏడు మాత్రమే అవుతుంది.
నేను ఏం మాట్లాడకుండా ముందు రూంలోకి వెళ్లి మంచం మీదా పడుకున్న పద్మ వాళ్ల నాన్నను ‘మల్లారెడ్డిగారు, మల్లారెడ్డిగారు’ అని తట్టి లేపా?
కళ్లు నలుపుకుంటూ లేచి కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న కుర్చీలు తీసుకుని ఒకటి లక్ష్మినర్సయ్యకిచ్చి నేను ఒకదానిలో కూర్చున్న. పద్మ, వాళ్ల అమ్మ, ప్రశాంతి ముగ్గురు అలాగే చూస్తున్నారు.
మమ్మల్నిద్దర్ని చూస్తున్న మల్లారెడ్డి కూడా ఏం మాట్లాడలేదు. నేనే స్టార్ట్ చేశా.
‘చూడండి మల్లారెడ్డి గారు. నా పేరు మధు. నేను పద్మ వాళ్ల స్కూల్ టీచర్ను. పద్మవాళ్లను స్కూల్ మానేయ్య మన్నారట కదా? మీకేం ఇబ్బంది లేదు. ఆడపిల్లలు చదివితే దేశానికి ఎంతో ఉపయోగం. వాళ్లను చదువు కోనివ్వండి.’ సూటిగా చెప్పా.
‘మీరెమన్న పుణ్యానికి చదువు చెప్తారా? వాళ్ల ఫీజులెవ్వరూ కట్టాలే’
‘వాళ్లను కన్నది మీరేకదా? చదివించే బాధ్యత మీది కాదా?’
‘వాళ్లు చదివి ఎవర్ని ఉద్దరించేది లేదు. వాళ్లు చదువుకున్న లేకున్న ఒకటే.
‘అలా అంటారేం? ఈ రోజుల్లో చదువు రాకుంటే ఎలా చూస్తారో తెలుసా?
‘ఎలా అన్న చూడని. నేను చదివించా. వాళ్ల ఫీజులు కట్టే స్థోమత నాకు లేదు.
‘స్థోమత లేదని అనడానికి సిగ్గనిపించడం లేదా? కూలీ పని చేసుకునేవాళ్లు కూడా తమ పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనుకుంటున్నారు. నీవు సింగరేణి ఉద్యోగం చేసుకుంటా. ఇలా మాట్లాడం ఏం బాలేదు.’ కొంచెం ఆవేశంగానే అన్న.
‘నువ్వెవరయ్యా! నా బిడ్డల చదువు గురించి చెప్పడానికి. నా ఇష్టం చదివించ. ఏం చేసుకుంటావో చేసుకో? ఆయన సీరియస్గానే అన్నాడు.
‘నువ్వేం వాళ్లకు ఫీజులు కట్టి చదివించనవసరంలేదు. నేనే చదివిస్తా. నీవు వాళ్లను స్కూల్కు పంపితే చాలు’
‘ నా బిడ్డలను నీవు చదివించడానికి వాళ్లను నేను కన్నానా? నీవు కన్నావా? నా పెళ్లానికి నీకేమన్నా పుట్టిండ్లా వాళ్లు. ’ ఒక్కసారిగా అన్నాడు. నాకు ఎక్కడో కాలింది.
‘నీ దినాలు గాను. నోటికి ఎంతస్తే అంతేనా? ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదా? నీవు చదివియ్యవు. చదువు చెప్తా అని వస్తే వాళ్లనే తిడుతావా? నీ నోట్లే మన్నుబొయ్యా. కడుపుకు అన్నం తింటనవా? గడ్డి తింటున్నవా? పద్మ వాళ్ల అమ్మ అందుకుంది.
‘ ఓయ్ నేనేవరో తెలుసా? పోలీసుని. భార్య పిల్లలను హింసిస్తున్నావని చెప్పి తీసుకుపోయిబోయి బొక్కలు ఇరగ్గొడుతా? ఏమనుకుంటున్నవో? చూడమ్మా వీడు వినడు ఒక పిటిషన్ రాసివ్వు తీసుకెళ్లి కుమ్ముతా నా కొడుకుని.’ అప్పటి వరకు సైలెన్స్గా కూర్చున్న మిత్రుడే కానిస్టేబుల్ లక్ష్మి నర్సయ్య లేచి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు.
‘తీసుకుపోండ్రి. ఆయన ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటే మా ఉసురుపోసుకుంటుండు. తీసుకుపోన్లి. పావే మీరు రెడీ అయ్యి స్కూల్కు పోదురు. ఏం చేస్తడో నేను చూస్తా.’ వాళ్ల అమ్మ అంది.
అప్పటికీ మందు దిగి ఉండడం, పోలీస్ అని చెప్పడంతో ఉన్నది కాస్తా దిగింది. ఏం మాట్లాడకుండా ఉండి పోయాడు.
‘చూడండి మల్లారెడ్డిగారు పిల్లల్ని చదువుకోనివ్వు. మంచి భవిష్యత్తు ఉంటది. నీవు కూడా తాగడం మానేసి రెగ్యులర్గా జాబ్ చేస్తే రేపు వాళ్లను ఒక మంచి అయ్యా చేతిలో పెట్టచ్చు’ అని చెప్పి ఇద్దరం బయటకు వచ్చాం. పద్మ కూడా వచ్చింది. చూడమ్మా మీరు స్కూలుకు రండి. మీ డాడీ గురించి మీరేం ఆలోచించకండి ’అన్న.
థాంక్యూ సార్ అని వాళ్ళు కృతజ్ఞత నిండిన కళ్లతో వాళ్లు చెబుతుంటే నాకు కూడా ఏదో తెలియని ఆనందం కలిగింది.
రోజులు గడిచాయి. పద్మ రెగ్యులర్గా స్కూల్కు వస్తుంది. ఆదివారం ఆదివారం పద్మ, ప్రశాంతి మా ఇంటికి కూడా వచ్చేవారు. మా ఇంట్లో కుక్కపిల్లలు ఉండడం వల్ల వాటితో ఆడుకునే వాళ్లు మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనం చేసేవాళ్లు. ఇంట్లో అన్ని రకాల పూల మొక్కలు ఉండడం వల్ల ఏవో ఒక పూలు కోసుకుని వెళ్లేవారు. అలా పద్మ ఏడవతరగతి పూర్తి చేసింది. నేను జర్నలిజం చేయడానికి హైదరాబాద్ రావలసి వచ్చింది. దాంతో స్కూల్ వదిలేశా. వచ్చెప్పుడు పిల్లలందరికీ చెప్పి వచ్చా.
ఆరునెలల తర్వాత తిరిగి కాలనీకి వెళ్లా. స్నేహితులందర్నీ కలిశాకా. స్కూలుకు వెళ్లా. పద్మ రెండు నెలలుగా రావడం లేదని తెలిసింది. వెంటనే తిరిగి వాళ్లింటికి వెళ్లా. వెళ్లెప్పటికీ ఇంట్లో పద్మ వాళ్ల అమ్మ ఒక్కతే ఉంది. నన్ను చూడగానే నవ్వుతూ కుర్చి వేసింది.
‘ఏంటమ్మ పద్మ మళ్లి స్కూల్కు రావడం లేదట?
‘ అయ్యో మీకు చెప్పడమే మరిచిపోయా సార్. పద్మకు పెళ్లయ్యింది’ నవ్వుతూ చెప్తోంది వాళ్ల అమ్మ.
నా కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. కళ్లు బైర్లు కమ్మినట్లనిపించింది. వెంటనే తేరుకుని ‘ ఏంటీ పెళ్లా? అన్నా.
‘అవును సార్. మా అన్న కొడుక్కే ఇచ్చి చేశా.’
‘అదేంటీ? నిండా పదిహేను సంవత్సరాలు కూడ నిండని అమ్మాయికి పెళ్లేంటీ?
“ఏం చేయమంటరు సార్. ఈయనేమో తాగడం మానలేదు. ఊర్లో నాలుగు ఏకరాల భూమి ఉండే. అప్పుడింత ఇప్పుడింత అమ్ముకోంగా ఇంకో రెండెకరాలే మిగిలింది. దాన్ని కూడా అమ్ముకోను చూస్తుండు. అందుకే మా అన్నతో మాట్లాడి ఆ రెండెకరాలు వాళ్లకే ఇచ్చి పెళ్లి చేసిన. మూడు నెలలయ్యింది.”
నాకేం మాట్లాడాలో తెలియలేదు. లేచి వచ్చేశా.
ఒకటి రెండు సార్లు ప్రశాంతి కలిసింది. ‘మా అక్కకు చదువుకోవాలని చాలా ఉండే సార్. పెళ్లి చేసుకోనని మస్తు ఏడ్చింది. కానీ మా నాన్న ఎలాగు దాని పెళ్లి చేయడు. అందుకే మా మమ్మీ పెళ్లి చేయక తప్పింది కాదు’ అని ఒక సందర్భంలో చెప్పింది.
‘నీవు మాత్రం ఇలాంటి పిచ్చి పనిచేయకు. మంచిగా చదువుకో. నీకు ఏ అవసరం ఉన్న నన్ను అడుగు.’ అని చెప్పా. సరే అంది. అప్పుడప్పుడు ఎక్కడో ఒకదగ్గర కలిసేది. ఎక్కవగా మాట్లాడేది కాదు. అమ్మాయి పెద్దదవుతుంది కదా? మొహమాటమెమో అనుకున్న. అలా రెండు నాలుగుసంవత్సరాలు గడిచాయి. ప్రశాంతి వాళ్లు అక్కడి నుంచి గోదావరిఖనికి వెళ్లారని తెలుసు కానీ ఎక్కడ ఉంటున్నారో మాత్రం తెలియలేదు. సరే ఎక్కడ ఉన్న బాగుంటే చాలు అనుకున్న.
రోజులు గడుస్తున్నాయి. నేను ఒక కాంట్రాక్ట్ వర్క్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యా. ఒకవైపు విలేకరిగా పనిచేస్తూనే జాబ్ చేసేవాన్ని. అక్కడ నేను కొనుగోళ్లు, కిచెన్ సెక్షన్ సూసుకునేవాన్ని. ఒకరోజు ఒక ఆడమనిషి పనికోసం వచ్చిందని ఆఫీసులో ఉన్న నాకు ఎవరో చెబితే సరే రమ్మను అన్న. ఆమె లోపలికి వచ్చింది. చూడగానే నా కళ్లు పెద్దవయ్యాయి. వచ్చింది పద్మ వాళ్ల అమ్మ.
‘ఆమెను చూడగానే లేచి నిలబడి మీరేంటి ఇలా? అని కూర్చి చూపెట్టి కూర్చోమన్న.
‘ఆమె నన్ను గుర్తుపట్టగానే కళ్లు కట్టలు తెగిన చెరువులా వర్షిస్తున్నాయి. నేను ఏం మాట్లాడాలో తెలియక రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయా? తరువాతే ఆమె చెప్పింది.
‘పద్మ పెళ్లి తర్వాత ఆయన మరింత దిగజారాడు. తాగి ఎక్కడెక్కడో పడిపోయేవాడు. రోజు వెతికి తీసుకు వచ్చేదాన్ని. ఓరోజు రోడ్డుమీదా రాత్రి పూట పడిపోయాడు. చీకట్లో చూడకుండా కాలుపై నుంచి లారీ పోయింది. ఒక కాలు పోయింది. హస్పిటల్లో చేరి గాయం తగ్గాక ఇంటికి వచ్చాడు. జాబ్ పోయింది. ఇదిలా ఉండగానే బాయిమీదా నాలుగు లక్షలు వస్తాయని తెలిసి వాళ్ల అక్కవాళ్లు వచ్చి ఎంత చెప్పిన వినకుండా నన్ను ప్రశాంతిని, కొట్టి ఆయనను తీసుకెళ్లారు. ఆయన కూడా ఒక్కమాట మాట్లాడలేదు. ఇద్దరం ఒంటరయ్యాం. దానికోసం అక్కడక్కడ పనిచేసిన. కానీ ఎవర్నో ప్రేమిస్తున్నానని చెప్పి ప్రశాంతి కూడా వెళ్లి పోయింది. ఒంటరిగా ఉండలేక పని దొరికిన నాడు తింటూ లేని నాడు పస్తులుంటున్న. అని చెప్పి ఏడ్చింది.
ఆమె చెప్తున్నంత సేపు నా కళ్లు ధారలా కారుతునే ఉన్నాయి. అంత విన్నాక. ‘సరే ఇక్కడ మట్టి పని మీరేం చేస్తారు కానీ. ఒక వారం రోజుల్లో క్యాంటీన్ స్టార్టవుతుంది. అక్కడ వంట చేద్దురు కానీ’ అప్పటిదాకా ఎక్కడుం టారు? అని అడిగా.
‘ప్రస్తుతం ఎన్సీ క్వార్టర్లో ఫలానా సార్ వాళ్లింట్లో వంట చేస్తున్న. వాళ్ల కారు షెడ్డులోనే ఉంటున్న. అంది.
‘సరే నేను వారంలో మీకు తప్పకుండా పని చూపిస్త. మీరు క్యాంటీన్లోనే ఉందురు కానీ. అన్న. సరే అని లేచి వెళ్లబోతుంటే అప్పటి వరకు ఖర్చులకు ఉండనివ్వండి అంటూ ఐదువందల నోటు చేతిలో పెట్టా.
ఆమె మొహమాటపడుతూనే తీసుకుంది. ఆమె చెప్పిన వివరాలు పట్టుకుని ప్రశాంతి ఉన్న ఇంటికి వెళ్లా.
వాళ్ల అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు. క్యాస్ట్ వేరు కానీ. అబ్బాయి చూడడానికి బాగున్నాడు. కానీ ఇద్దరికీ వయస్సు లేదు. అదే విషయం ప్రశాంతితో మాట్లాడ.
‘కానీ ఇప్పుడు మా అమ్మ ఉన్న పరిస్థితిలో నా పెళ్లి కాదు కదా? కనీసం నన్ను చదివించలేదు. అందుకే ఇలా ధైర్యం చేయాల్సి వచ్చింది. అమ్మను కూడా ఇక్కడే ఉండమన్న కానీ. తను ఉండనని వెళ్లిపోయింది. మేము కూడా మా చదువులు అయ్యాకే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం. దానికి మా అత్తమామ కూడా ఒప్పు కున్నారు.’ విషయమంతా చెప్పింది.
అబ్బాయి వాళ్ల అమ్మ, నాన్న కూడా నాతో మాట్లాడారు. అమ్మాయికి వయస్సు నిండాకే పెళ్లి చేస్తాం అని చెప్పారు. నేను కూడా ఏం మాట్లాడలేక వచ్చేశా.
వారం రోజులు గడిచాయి. క్యాంటీన్ పూర్తయింది. నేను పద్మ వాళ్ల అమ్మను క్యాంటీన్లో పనికి పెడుదామని అనుకున్న. 2006 అక్టోబర్ 12 న మద్యాహ్నం క్యాంటీన్ ఓపెనింగ్. కానీ ఇంతలోనే ఆమె ఇలా.....
ఎందుకలాచేసింది. అందర్నీ దూరం చేసుకుని జీవించలేకపోయిందా? నా అన్నవారే కాదనుకుని వెళ్లిపోయేసరికి తట్టుకోలేకపోయిందా? ఆడజన్మకే ఇన్ని కష్టాలెందుకో? నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలి పోయాయి. ఒక్కరోజు బతికుంటే ఆమెజీవితం మారిపోయే దేమో? ప్చ్... అదంతా గుర్తు చేసుకుంటు న్నంత సేపు నాకు తెలియకుండానే కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇంతలో పోన్ రింగవ్వడంతో ఈ లోకంలోకి వచ్చా.
కాలం కరిగిపోయింది. జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోయాయి.
***సమాప్తం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
పేరు: మధుకర్ వైద్యుల
తండ్రి పేరు: సుధాకర్
చదువు: ఎం.ఎ, పీజీడీసీజే
రచనలు: స్వతంత్రసుమాలు ( కవిత్వం)-2014, నువద్ధి(కథలు)-2021, బొగ్గుపూలు (కవిత్వం)-2021, వలపోత (కరోనా కవిత్వం)-2022,
జర్నలిస్టు, కవి, రచయితగా
మధుకర్ వైద్యుల అను నేను జర్నలిస్ట్గా, కవిగా, రచయితగా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందిస్తున్నాను. ఆయా రంగాల్లో నా ప్రతిభకు తగిన గుర్తింపు కూడా పొంది ఉన్నాను. ఆయా రంగాలకు సంబంధించి పూర్తి వివరాలు.
కవిగా....
నా పదమూడవ ఏటా తొలిసారి కవిత రాశాను. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో మా స్కూల్ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తీసిన ‘శాంతికిరణం’ అనే పాఠశాల మ్యాగజిన్కు ‘జ్ఞాపిక’ అనే కవిత తొలిసారి రాశాను. అప్పటి నుంచి నిరంతర కవితా ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్లో ఉండగా కాలేజీ మ్యాగజిన్ ‘దర్శన’ కోసం ‘వరకట్న పిశాచాలు’ అనే కవిత, ‘అమ్మకావాలి’ అనే కథ రాశాను. ఆ తరువాత అనేక పత్రికలు, మ్యాగజిన్లు, ప్రత్యేక సంచికల్లో నా కవితలు ప్రచురితమయ్యాయి. నా రచనలకు గాను 2005-06 సంవత్సరానికి గాను జిల్లా యువజన సంక్షేమ శాఖ ఉత్తమ యువ రచయిత అవార్డు అందుకున్నాను. ఇక నేను రాసిన కవితలతో 2014 సంవత్సరంలో ‘స్వతంత్ర సుమాలు’ పేరుతో కవితా సంపుటి తీసుకు వచ్చాను. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డిలు ఈ పుస్త కాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ వెలు వరించిన ‘తంగేడువనం’, ‘తొలిపొద్దు’ కవితా బకవుల సంకలనంలోనూ నా కవితలు అచ్చయ్యాయి. రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య తీసుకువచ్చిన ‘వినియోగం’, చెన్నైకి చెందిన మాడభూషి సంపత్కుమార్ స్వర్గీయ అబ్దుల్కలాం మీదా తీసుకువచ్చిన ‘ఒకవిజేత’ ఇలా పలు కవితా సంకలనాల్లో నా కవితలు అచ్చయ్యాయి.
రచయితగా......
కవితలతో పాటు నాటికలు, కథలు రాయడం కూడా చిన్నతనం నుంచే అలవాటయ్యింది. నేను పదవతరగతిలో రాసిన ‘పేరులోనేముంది’ అనే హాస్యనాటిక అనేక వేదికల మీదా ప్రదర్శించబడి పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత పలు కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ‘ అమ్మకావాలి’, ‘బతుకు చిత్రం’, ఒక అమ్ము ఒక అభి’, ‘ప్రేమిస్తే’ ‘కడప టూ హైదరాబాద్ వయా అనంతపూర్ తదితర కథలు ప్రజాశక్తి, సూర్య దినపత్రికల్లో అచ్చయ్యాయి. 2015లో రాసిన ‘మా ఊరి జాడేది’ అనే కథకు గాను నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితివేత్త నోముల సత్యనారాయణ పేరుమీదా ఇచ్చే ‘నోముల కథా పురస్కారం’ అందుకున్నాను.
జర్నలిస్టుగా
నా 1996లో జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టిన నేను పాత్రికేయునిగా కోల్వాయిస్, చర్చ, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో పాత్రికేయునిగా సేవలందించాను. ఆ తర్వాత సూర్య దినపత్రికలో సబ్ఎడిటర్గా చేరి ప్రతిభ చూసి అనతికాలంలోనే ఆదివారం అనుబంధం ఇన్చార్జ్గా, ఫీచర్స్ ఇన్చార్జ్గా పదోన్నతి పొందాను. ప్రస్తుతం నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో సీనియర్ జర్నలిస్ట్గా సేవలందిస్తున్నారు. ఉద్యమసమయంలో ఎంతోమంది తెలంగాణ కళాకారులు, సామాజిక కార్యకర్తలను వెలుగులోకి తీసుకువచ్చి ఉద్యమానికి చేయూతనిచ్చాను. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక కథనాలతో అనేక కవర్స్టోరీలు రాస్తూ పలువురి మన్ననలు అందుకున్నాను.
అందుకున్న ఆవార్డులు
-డా. కాలువ మల్లయ్య సాహితీ స్పూర్తి పురస్కారం-2022
-ఫీచర సునీతారావు సాహితీ పురస్కారం-2022
-బి.ఎస్.రాములు సాహితీ ప్రతిభాపురస్కారం-2019
-తెలంగాణ సాహిత్య అకాడమీ కవితాసప్తాహం-2019
-రాష్ట్ర పర్యాటక శాఖ వారి టూరిజం ఎక్స్‌లెన్స్ ఆవార్డు-2018
-మధురవాణి డాట్.కం(అమెరికా) వారి ఉత్తమ కథా పురస్కారం-2017
-బండికల్లు వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్ జాతీయ కవితల పోటీ-2017
-ప్రపంచ తెలుగు మహాసభల్లో మంత్రి డా౹౹ లక్ష్మారెడ్డితో సత్కారం-2017
-తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ వారి రాష్ట్రకవితల పోటీలో ద్వితీయ
బహుమతి-2017
-సామాజిక రచయితల సంఘం రాష్ట్రస్థాయి కవితల పోటీలో ద్వితీయ బమతి-2017
- తెలంగాణ సాహితీ వేదిక (కరీంనగర్) వారి రాష్ట్రస్థాయి కథల పోటీల్లో ద్వితీయ
బమతి-2016
- రాష్ట్ర పర్యాటక శాఖ వారి టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు-2016
- చీటి జగన్రావు స్మారక జిల్లా ఆత్మీయ సేవా పురస్కారం -2016
- నోముల సత్యనారాయణ కథాపురస్కారం-2015
- జాగృతి కవితా పురస్కారం-2015
- కువైట్ ఎన్నారైస్ డాట్కం ఉత్తమ కవితా పురస్కారం-2015
- సాహితి సేవా ఉత్తమ కవితా పురస్కారం -2014
- జాగృతి కవితా పురస్కారం-2013
- నేషనల్ యూత్ ప్రాజెక్ట్ వారి బెస్ట్ యూత్ అవార్డు-2008
- జిల్లా యువజన సంక్షేమ శాఖ ఉత్తమ యువ రచయిత అవార్డు -2005-06
- ఫోక్ ఆర్ట్ అకాడమీ వారి గ్రామీణ కళాజ్యోతి అవార్డు-2004
- బెస్ట్ జర్నలిస్ట్గా పద్మపీఠం పురస్కారం-2003
- బెస్ట్ వాలంటరీగా శాతావాహన కళోత్సవాలలో సర్టిఫికెట్-2003
- శివజ్యోతి జానపద కళా మిత్ర మండలి వారి జిల్లా ఉత్తమ యువకవి అవార్డు-2002
- నెహ్రూ యువకేంద్రం సర్టిఫికెట్-2001
댓글