ఆడపిల్ల అదృష్టము
- Gadwala Somanna

- Oct 18, 2025
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AdapillaAdrushtamu, #ఆడపిల్లఅదృష్టము, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 133
Adapilla Adrushtamu - Somanna Gari Kavithalu Part 133 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/10/2025
ఆడపిల్ల అదృష్టము - సోమన్న గారి కవితలు పార్ట్ 133 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
ఆడపిల్ల అదృష్టము
-------------------------------------------
బాలిక బహుమానము
మితిలేని అదృష్టము
నట్టింట తిరిగితే
అంతులేని అందము
ఆడపిల్ల దీపము
ప్రేమకు ప్రతిరూపము
పున్నమి నాటి వోలె
శోభిల్లును సదనము
ఖరీదైన వజ్రము
చూడ ఆణిముత్యము
ధన లక్ష్మీ పోలిక
ధరణిలోన బాలిక
వివక్షత చూపొద్దు
ఇద్దరూ సమానము
నిర్లక్ష్యం కూడదు
జాగ్రత్త వహించుము

ప్రకృతి ప్రబోధ గీతిక
------------------------------
మంచినే చూడాలి
మమతనే పంచాలి
సమస్యలు వచ్చినా
సత్యమే పలకాలి
మేలునే కోరాలి
శుభములే తెలపాలి
పదిమంది క్షేమము
మదిలోన తలవాలి
కుళ్లునే వీడాలి
కలతలే మానాలి
ప్రశాంత జీవనానికి
వైరమే తరమాలి
వివక్షత వదలాలి
సమ భావం రావాలి
అందరూ ఒక్కటని
గళమెత్తి చాటాలి

ఉండాలోయ్! తప్పక
------------------------------------
మనసేమో మంచిగా
మాటేమో ప్రేమగా
ఉండాలోయ్! తప్పక
వ్యక్తిత్వం గొప్పగా
నోరేమో అదుపుగా
పలుకేమో పొదుపుగా
ఉండాలోయ్! తప్పక
బ్రతుకులో హుందాగా
గుణమేమో పసిడిలా
చిన్నారుల నవ్వులా
ఉండాలోయ్! తప్పక
కడిగిన ముత్యంలా
పరిమళించే పువ్వులా
రవళించే మువ్వలా
ఉండాలోయ్! తప్పక
ప్రకాశించే దివ్వెలా

పిల్లలను దిద్దాలి
-----------------------------------------
కొండలా ఉండాలి
అండగా నిలవాలి
పిల్లలు ఎదుగేందుకు
ప్రోత్సాహమివ్వాలి
వృద్ధిలోకి తేవాలి
శ్రద్ధగా పెంచాలి
విద్యబుద్ధులు నేర్పి
గొప్పగా చేయాలి
చదువు విలువ తెలపాలి
సంస్కారం నేర్పాలి
అక్షరాల కోటలో
రాజులా మలచాలి
కాసేవు పిల్లలతో
సరదాగా గడపాలి
శ్రేష్టమైన కథలను
ఇష్టంగా చెప్పాలి

కాదనలేని నిజాలు
-------------------------------------------------
ఉదయించే సూర్యుని
ఆపుట సాధ్యమేనా!
సముద్రంలో నీటిని
ఖాళీ చేయగలమా!
గుబాళించే పూవుల
పరిమళాన్ని వ్యాప్తి
చెందకుండా కాస్త
ప్రయత్నించగలమా!
తలపైన వెంట్రుకలను
నింగిలోని తారలను
లెక్కింప సులభమా!
ఇల ఇసుక రేణువులను
మానవ మేధస్సుకు
మించినవి సృష్టిలో
తెలియని రహస్యాలు
ఎన్నో కలవు కలవు
నాకంటే జ్ఞానము
ఎవ్వరికీ లేదని
విర్రవీగే మనిషీ!
ఇకనైనా తగ్గవా!
దైవాన్ని ఎవరూ
మోసం చేయలేరు
ఎదురించి క్షణమైనా
సత్యమే మనలేరు
ఆభరణము వినయము
ఎదిగేందుకు మూలము
నిప్పు కణిక గర్వము
చేయునోయి భస్మము
-గద్వాల సోమన్న




Comments