అడ్డదారి లో సుఖం కోసం
- Srinivasarao Jeedigunta

- Dec 18, 2025
- 6 min read
#AddadariloSukhamKosam, #అడ్డదారి లో సుఖం కోసం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Addadarilo Sukham Kosam - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 18/12/2025
అడ్డదారిలో సుఖం కోసం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“అలా మొద్దు నిద్రపోకుండా కొద్దిగా మొగుడనే వాడు వచ్చేసరికి వేడి వేడి అన్నం, కూరలు వడ్డించాలని తెలియదా, ఎప్పుడు చూసినా నిద్రమొహం తో ఏడుస్తూ ఉంటావు” అంటూ భార్యని తిడుతున్న సోమేశ్వరం ని చూసి, ఏదో రాసుకుంటున్న అతని కొడుకు విజయ్ “ఎందుకు నాన్నా అమ్మని అలా తిడుతున్నావు, యిప్పుడు టైము రాత్రి పదకొండు అయ్యింది, నువ్వు వూరంతా స్నేహితులతో తిరిగి వచ్చి ఈ టైములో వేడిగా అన్నం కావాలి అని గొడవ పెడుతున్నావు, అమ్మ ఉదయం లేచి యిప్పుడే ఒక గంట క్రితం నడుం నొప్పిగా వుంది అని పడుకుంది. ఆవిడలా పడుకోవటానికి నువ్వు పెట్టే తిండి కారణం కాదు. నేను కూడా చదువు మానేసి చిన్న ఉద్యోగం చేసి ఇల్లు గడుపుతున్నాము, ముందు అది తెలుసుకో” అన్నాడు సోమేశ్వరం కొడుకు విజయ్.
“నోర్ముయ్! పెళ్లిపెటాకులు లేని నువ్వు కూడా నాకు చెప్పేవాడివా, రేపు నీకు ఇలాంటి చద్ది కూడు పెడితే తెలుస్తుంది నా బాధ” అని కొడుకు మీద అరిచాడు.
తండ్రి యాగాయితనం భరించలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు విజయ్. అయితే తనుకూడా లేకపోతే తల్లిని కొట్టి చంపేస్తాడేమో అనే భయంతో తండ్రి తిట్టే తిట్లు పడుతున్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బెల్ట్ తీసుకుని తండ్రిని చితకోట్టాలి అని. అలాచేసినా తల్లే బాధపడుతుంది, మనది పుణ్యభూమి కదా.
భర్త అరుపులు విని లేచిన పార్వతి “వచ్చారా.. ఏమిటో నిద్రపట్టేసింది” అంది.
“పట్టదూ, వేడిగా వండుకుని తింటే, నా మొహాన చల్లటి అన్నం పడేసావు” అన్నాడు భార్య వంక కోపంగా చూస్తో.
“అయ్యో మీరు తినకుండా నేను ఎప్పుడైనా ముందు తిన్నానా, ఒక్కనిమిషం అన్నీ వేడి చేసి పెడ్తాను” అంది.
“చూసావా అమ్మని! ఎలా వుందో ఎండిపోయిన పొట్లకాయలా, నీకు జాలి కూడా లేదా నాన్న, నువ్వు నీ స్నేహితులతో తిరిగి ఎప్పుడో వస్తావు అమ్మ సన్యాసి లా అలా బక్కచిక్కి నీకోసం ఎదురు చూసి నీరసంగా పడుకుంటోంది. దయచేసి మారండి నాన్నా” అన్నాడు విజయ్.
కొడుకు మాటలు విని ఒకసారి భార్య వంక చూసి ‘నిజమే బాగా పాలిపోయింది, నా పెళ్ళికి పట్టుచీర కట్టుకుని బంగారు బొమ్మలా వుంది. వాళ్ళ పేదరికం కి నన్ను పెళ్లిచేసుకుని తను బలి అయిపొయింది’ అనుకున్నాడు సోమేశ్వరం మనసులో.
నాలుగు మెతుకులు తినేసి వెళ్లి పడుకున్నాడు.
ఉదయమే లేవబోతున్న భార్యతో “యింకొద్దిసేపు పడుకుని నిద్రపో, ఈ రోజు నేను ఆఫీసుకి వెళ్లడం లేదు” అన్నాడు సోమేశ్వరం.
“ఈ రోజు పడుకుంటే అలవాటు అయిపోయి రేపు ఆలస్యంగా లేస్తే పనులు లేట్ అవుతాయి,” అంటూ లేచి వంటగదిలోకి వెళ్ళింది.
అప్పటికే లేచి కాఫీ కలుపుతున్న కొడుకు విజయని చూసి “నువ్వు ఎందుకు లేచావురా అప్పుడే, ఈ పని నాకు ఎక్కువ అవుతుంది రా పిచ్చి నాయనా, లే వెళ్లి కాసేపు పడుకో, మీ నాన్న ఈరోజు ఆఫీసు కి వెళ్ళటం లేదుట” అంది.
“ఎందుకు వెళ్తాడు అమ్మా, ఈ రోజు మొదటి తారీకు కదా, అప్పులు వాళ్ళు పట్టుకుంటారని భయం” అన్నాడు విజయ్.
“మీ నాన్న అప్పులు చెయ్యాలిసిన అవసరం ఏమొచ్చిందిరా, నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదా. ఒకసారి మీ నాన్న ఎందుకు అప్పులు చేస్తున్నారో తెలుసుకోలేవా, నాకు తెలిసి కోపం తప్ప మిగతా చెడు అలవాట్లు లేవురా” అంది పార్వతమ్మ.
“ఈ రోజు నేను నాన్న పనిచేస్తున్న ఆఫీసుకి వెళ్లి విషయం తెలుసుకుంటానులే, కాని నాన్నకి ఈ విషయం తెలిసి కోపంతో మన ఇద్దరిని చావబాదుతాడేమో” అన్నాడు.
అన్నం వడ్డించి భర్త సోమేశ్వరం తో “ఒక్కగానొక్క కొడుకు. వాడి చదువు మధ్యలో ఆగిపోయింది, చివరికి చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటున్నాడు. వాడికి ఒక పిల్లని చూసి పెళ్ళి చేద్దాం” అంది.
“నువ్వే అడుగు వాడిని, వాడికి నేను విషం అయ్యిపోయాను, నిన్న రాత్రి ఎలా మాట్లాడాడో చూశావుగా” అన్నాడు.
“మీరు నన్ను అలా తిడుతూవుంటే ఎదిగిన కొడుకు కదా, మీరు ఒక వారం రోజులు నన్ను తిట్టకుండా ప్రశాంతంగా వుండి చూడండి, మీకే ఆరోగ్యం బాగుంటుంది” అంది ధైర్యంగా.
“మీ ఆడవాళ్ళకి కొద్దిగా చనువు యిస్తే చాలు సలహాలు యిచ్చేస్తారు, నోరుమూసుకుని కొద్దిగా మజ్జిగ వడ్డించు” అన్నాడు విసుగ్గా.
తండ్రి ఆఫీస్ కి వెళ్లి మేనేజర్ గారిని కలిసి తన తండ్రి ప్రవర్తన గురించి చెప్పి, “ఆలస్యంగా ఇంటికి రావడానికి ఏమైనా చెడు సావాసాలు ఉన్నాయా” అని అడిగాడు.
మేనేజర్ ఒక్కసారి సోమేశ్వరం కొడుకు వంక చూసి, “మీ నాన్న గురించి చెప్పాలి అంటే కష్టజీవి, పని దొంగ కాదు, అలాగే త్వరగా డబ్బులు సంపాదించాలని కోరిక గలిగిన వ్యక్తి. అదే అతని కొంపముంచింది. సాయంత్రం చాలా మంది అయిదుగంటలకు వెళ్ళిపోతే మీ నాన్న డబ్బు ఓవర్ టైము చేసి 8 గంటలకు ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్తాడు. మరి ఇంటికి ఎందుకు అంత లేటుగా వస్తాడో నాకైతే తెలియదు, కాని అతని స్నేహితుడు ఒక్కడే వున్నాడు. వాడిని అడిగితే తెలుస్తుంది, ఎందుకంటే చివరిలో కలిసి బయటకు వెళ్ళేది వాళ్లే” అన్నాడు.
“శ్రమ అనుకోకుండా ఆ విషయం తెలుసుకోండి, మళ్ళీ నాలుగు రోజులకి వస్తాను” అన్నాడు.
“రావక్కరలేదు. నీ ఫోన్ నెంబర్ యివ్వు నేనే చేస్తాను” అన్నాడు మేనేజర్.
మేనేజర్ గారితో మాట్లాడి బస్సులు పట్టుకుని ఇంటికి ఆలస్యంగా చేరుకున్న కొడుకుని చూసి “నాన్నగారి విషయం ఏమైనా తెలిసిందా” అని అడుగుతున్న తల్లిని చూసి, “యింట్లోకి రానియ్యవా.. కంగారెందుకు. చెప్పకుండా వుంటానా” అంటూ కాళ్ళు కడుగుకోవడానికి తొట్టి దగ్గరికి వెళ్ళాడు.
“బాగానే వుంది వరస. ఇంటికి ఆలస్యంగా వచ్చినవాళ్ళు అందరూ తల్లి మీద, వుంటే భార్య మీద అరవడం గొప్ప అనుకుంటున్నారు” అంది పార్వతి.
వంట గదిలోనుంచి రెండు గ్లాసులలో కాఫీ పట్టుకుని వస్తున్న తండ్రిని చూసి గతుక్కుమన్నాడు విజయ్.
“మీరు లోకసంచారం కి వెళ్లలేదా నాన్న” అన్నాడు నవ్వుతూ.
కాఫీ తాగుతున్న కొడుకుతో “అబ్బాయి, త్వరగా నువ్వు పెళ్లిచేసుకుంటే కోడలు నాకు కొద్దిగా సహాయంగా వుంటుందిరా, చూడు ఎలా ఆరోగ్యం పాడైపోయిందో నాకు” అంది.
“అమ్మా! నాన్నలాంటి బాధ్యత లేని వ్యక్తి, భార్యని గౌరవించటం తెలియని యింట్లో నేను పెళ్ళి చేసుకుని యింకో అమ్మాయి జీవితం నాశనం చెయ్యడం ఎందుకమ్మా” అన్నాడు విజయ్.
“మీ నాన్న మొదటి నుంచి యిలా లేరు రా, ఎందుకో కొన్ని ఏళ్ళ నుంచి ఈ చిరాకు ఎక్కువ అయ్యింది. మొదటి నుంచి యిలాగే ఉంటే ఎప్పుడోనో చచ్చిపోయి వుండే దానిని” అంది.
“ఏమోనమ్మా! నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి నాన్న అలాగే వున్నారు, నువ్వు పాత కాలం దానివి కాబట్టి మొగుడు అంటే భయపడుతున్నావు, ఇప్పటివాళ్ళు మొగుడు ఏమైనా అంటే పోలీస్ రిపోర్ట్ యిచ్చి మొత్తం మొగుడి వంశాన్ని జైలుకి పంపుతున్నారు” అన్నాడు.
తన గదిలోనుంచి అంతా విని తన గురించి తన కొడుకు, తన భార్య మనసులో యిటువంటి అభిప్రాయం వుంది అని తెలుసుకుని సిగ్గుపడ్డాడు. చివరికి తన ప్రవర్తన కొడుకు పెళ్ళికి కూడా అభ్యంతరం అయ్యింది అనుకున్నాడు, తను మారడానికి అవకాశం వుందా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు.
రెండు రోజుల నుంచి తండ్రి ఇంటికి త్వరగా వస్తోవుండటం చూసి విజయ్ అపార్ధం చేసుకున్నాడు, తండ్రి ఏదో తప్పు చెయ్యడం వలన బయట తిరగలేక యింట్లో దాక్కున్నాడు అని.
ఆరోజు ఉదయం మేనేజర్ ఫోన్ చేసి “మీ నాన్న తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి అనే ఆశ తో తను డబ్బు వడ్డీకి తీసుకుని ఇతరులకి ఎక్కువ వడ్డీకి ఇవ్వడం, వాళ్ళు ఎగకోట్టేసరికి యింకో అప్పు చేసి పాత అప్పు తీర్చడం అనే వలలో చిక్కుకుని వున్నాడు. అందుకే రాత్రులు ఇంటికి ఆలస్యం గా రావడం, చిరాకు తో అందరిని తిట్టడం అని మీ నాన్న స్నేహితుడు ద్వారా తెలుసుకున్నాను, ‘అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు చేసిన అప్పులు అయిదు లక్షలు కంటే వుండవు అని తెలిసింది’ అని చెప్పాడు. డబ్బు సంపాదించి మిమ్మల్ని సుఖ పెట్టాలి అని అతని ఉద్దేశ్యం. ఎన్నుకున్న మార్గం తప్పుది అంతే” అన్నాడు మేనేజర్.
ఇంటికి వస్తో, ‘నాన్న ఎందుకు యిటువంటి అలవాటు చేసుకున్నాడు, ఎక్కువ వడ్డీ యిచ్చేవాడు ఏడుస్తూ యిస్తాడు లేదా ఎగకొడతాడు, ఇతరుల ఏడ్పు తో మనకి సుఖం ఎలా దక్కుతుంది. యిప్పుడు ఈ అయిదు లక్షలు రేపు ఎంతకి వెళ్తాయో, ఏదో ఒకటి చేసి నాన్నని మార్చాలి, లేదా అమ్మని తీసుకుని నేను వేరుగా వెళ్ళిపోవాలి’ అనుకున్నాడు.
యింట్లో నాన్న బెండకాయలు తరగడం చూసి ఆశ్చర్యంతో, “అమ్మ యింట్లో లేదా” అన్నాడు విజయ్.
“వుంది. నీ కోసం బెండకాయ వేపుడు చేస్తున్నాము” అన్నాడు సోమేశ్వరం.
వంటగదిలోకి వెళ్లి “ఏమిటి నాన్న నీకు సహాయం చెయ్యడం, విచిత్రం గా వుంది” అన్నాడు.
“ఏమో తనే అన్నారు ‘విజయ్ కి బెండకాయ వేపుడు యిష్టం కదా నేను ముక్కలు తరిగిస్తాను నీకు ఓపిక వుంటే వేపుడు చేద్దాం’ అన్నారు.”
“బహుశా తనకి తినాలి అనిపించి ఉంటుంది” అన్నాడు.
భోజనం అయిన తరువాత కొడుకుని “అబ్బాయి, అలా బయటకు వెళ్దాం నాతో రా” అని, “పార్వతి, చేతి సంచి యిస్తే నాలుగు కూరగాయలు తెస్తాము వచ్చేటప్పుడు” అన్నాడు సోమేశ్వరం.
తండ్రి ప్రవర్తనకి అయోమయంతో “సరే పదండి” అని తండ్రి చేతిలో సంచి తను పట్టుకుని బయటకు నడిచాడు. రాత్రి ఎనిమిది అవుతున్నా రోడ్డు మీద జనం విపరీతంగా వున్నారు. కొడుకు భుజం మీద చెయ్యి వేసి “ఏమిటి రా ఈ రోజు మన రోడ్లో కూడా యింత జనం” అన్నాడు సోమేశ్వరం.
“
ఎప్పుడో చిన్నప్పుడు నాన్న ఎత్తుకున్నది తప్ప ఆ తరువాత కోపంతో కొట్టాడానికి చెయ్యి ఎత్తిడం మాత్రమే చూసిన విజయకి తండ్రి, భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వెయ్యటం ఆనందంగా అనిపించింది.
“నాన్న, నడవలేకపోతే కాసేపు ఆ షాప్ దగ్గర కూర్చుందామా” అన్నాడు“అబ్బే అక్కరలేదు పదా” అంటూ “నీకు ఒక విషయం చెప్పాలి, నేను మీ అమ్మ మీద, నీ మీద కఠినంగా వున్నాను అనే చెడు అభిప్రాయం నీకు వుంది కదూ, నా అసమర్ధతే కారణం.
మా పెళ్లి అయిన కొత్తలో నేను మీ అమ్మా సెలవు వస్తే చాలు సినిమాలు చూడటం, చుట్టాలింటికి వెళ్లడం చేసే వాళ్ళం. మీ అమ్మ వచ్చిన వేళావిశేషం నాకు వచ్చే జీతం మాకు హాయిగా సరిపోయేది. మీ అమ్మ వంట చాలా బాగా చేస్తుంది. నువ్వు పుట్టావు. ఎన్నో ఆశలు.. నిన్ను నాలా చిన్న ఉద్యోగం లో కాకుండా పెద్ద ఆఫీసర్ గా చూడాలి అని మా యిద్దరి కోరిక. దానికోసం జీతంలో సగం బ్యాంకులో దాచి సరదాలు తగ్గించుకుని నిన్ను అల్లారుముద్దుగా పెంచుతున్నాము.
అప్పుడు మూర్తి అనే శనిగాడు నాకు స్నేహితుడిగా తగిలాడు. నువ్వు ఎంత దాచినా ఆ డబ్బుతో నీ కొడుకుని బాగా చదివించలేవు, కోరికలు చంపుకునే బదులు డబ్బులు సంపాదించటం కి ఉపాయం చూసుకోవాలి, అని నేను దాచుకున్న యిరవై వేలు ని తనకి తెలిసిన వాడికి వందకి నెలకు రెండు రూపాయలు వడ్డీ వచ్చేటట్లు అప్పుగా యిప్పించాడు.
నెల తిరిగే సరికి నాలుగు వందలు వడ్డీ రూపంలో చేతికి వచ్చేది. దానితో ఆగకుండా ఆఫీస్ లో డబ్బులు లోన్ తీసుకుని అవి కూడా వడ్డీకి యిచ్చాను. కొన్నాళ్ళు బాగానే జరిగింది, తరువాత తీసుకున్నవాళ్లు కనిపించడం మానేసారు. కనిపించినా “యిస్తాము మీకే వడ్డీ ఎక్కువ వస్తుంది” అని అనే వాళ్ళు. అప్పులు తీసుకొని వచ్చి వీళ్ళకి యిస్తే వీళ్ళు టైముకి ఇవ్వకపోవడంతో వేరే వాళ్ళదగ్గర ఎక్కువ వడ్డీకి తీసుకుని పాత బాకీ తీర్చడం, అలా రంగులరాట్నం లా ఈ వలయం లో కొట్టుకుంటో అప్పులు వసూల్ కోసం దొంగల కోసం పోలీస్ తిరిగినట్టు తిరిగి చివరికి ఇంటికి ఆలస్యం గా వచ్చేవాడిని.
అమ్మ పడుకుని ఉండటం, నువ్వు ఏదో రాసుకుంటో ఉండటం చూసి అసహనం తో మిమ్మల్ని తిట్టి సంతృప్తి పడేవాడిని. అదే తెలుసు మీకు, కానీ ఆరాత్రి నిద్రపట్టక చాలా బాధ పడేవాడిని.
తెల్లారితే మళ్ళీ మొదలు. యిప్పుడు నీకు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అప్పులు యిటు ఆఫీసులోనూ బయట ఎక్కువ అయ్యిపోయాయి. అందుకే నేను ఒక నిర్ణయం కి వచ్చాను, మిమ్మల్ని వదిలి పారిపోదాం లేదంటే ఆత్మహత్య చేసుకుందాం అని. నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. చక్కగా పెళ్లి చేసుకుని నా గురించి ఆలోచించకుండా సుఖంగా వుండండి.
ఎక్కడ వున్నానో అనే వెతికే శ్రమ లేకుండా ముందే ఈ విషయం నీకు చెప్పటం” అని ఆగిపోయాడు సోమేశ్వరం.
“నిజంగా మా సుఖం కోసమే మీరు ఈ త్రోవలోకి వెళ్లారు అంటే, మీ అప్పులు నేను వసూలు చేసి మీరు తీసుకున్న అప్పులు తీరుద్దాము. మీరు నిజంగా మారాలి, మీకు నేను వున్నాను, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ తో మీదగ్గర అప్పులు తీసుకున్నవాళ్ళని పట్టుకుని వసూళ్లు చేయిస్తాను. యిహ నేను రాత్రులు పై చదువులకోసం ప్రైవేట్ గా చదువుకుంటున్నాను. మీరు ధైర్యంగా వుండండి” అన్నాడు.
రూపాయి యిస్తే రేపు పది రూపాయలు యిస్తామని చెప్పే మోసగాళ్ల వలలో పడి అడ్డదారులు త్రొక్కి నాశనం అవ్వడం తప్ప ఎటువంటి డబ్బులు వూరికే రావు. నిజాయితీ గా సంపాదించిన డబ్బే ఆనందం, ఆరోగ్యం యిస్తుంది.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






@suryakumarygarimella6335
•12 minutes ago
మీ తియ్యని స్వరంతో మంచి కథ వినిపించారు ❤బాగా చదివారు