top of page
Original.png

మాసానాం మార్గశీర్షోహం

#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #మాసానాం మార్గశీర్షోహం, #TeluguDevotionalArticle

ree

 

Masanam Margaseershoham - New Telugu Story Written By R C Kumar

Published In manatelugukathalu.com On 18/12/2025

మాసానాం మార్గశీర్షోహం - తెలుగు కథ

రచన: ఆర్ సి కుమార్

మార్గశిరం ఏమిటి? ధనుర్మాసం ఏమిటి? ఒకే కాలాన్ని సూచించే రెండు పేర్లు ఎందుకు అనే సందేహం కలుగక మానదు. చాంద్రమానం ప్రకారం పూర్ణిమ నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే 'మార్గశీర్షం' అంటారు, సౌరమానం ప్రకారం సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నెలను 'ధనుర్మాసం' అంటారు; రెండు పేర్లు ఒకే కాలాన్ని సూచిస్తాయి. మార్గశీర్షం అనేది చాంద్రమాన పద్ధతిలో నెల పేరు, ధనుర్మాసం అనేది సౌరమాన పద్ధతిలో అదే కాలానికి ఉన్న పేరు. ఇవి రెండూ హేమంత ఋతువులో వస్తాయి. ధనుర్మాసం తెలుగు క్యాలెండర్‌ లో ముఖ్యమైన నెల. మార్గశీర్షం అనగా భగవత్‌ ప్రాప్తిని కలిగించే శ్రేష్ఠమైన మార్గం అని అర్థం. మార్గం అంటే దారి లేదా ఉపాయం, శీర్షం అంటే తల లాగా ప్రధానమైనదని అర్థం. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసం.


 శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించిన రోజు మార్గశీర్ష మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి. "మాసానాం మార్గశీర్షోహం /ఋతూనాం కుసుమాకరః" అని పదవ అధ్యాయంలో తన విభూతుల గురించి వివరిస్తూ మాసాలలో ధనుర్మాసాన్ని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మార్గశిరం మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది.‌ మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఈ మాసమునకు మార్గశిర మాసమని పేరు. ఇది దక్షిణాయానంలో ఆఖరి మాసం. ఈ నెలలో తెల్లవారుజామున విష్ణువును పూజించడం, తిరుప్పావై పఠించడం, తిరుమల వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వినడం వంటివి చేయడం వల్ల వేయి సంవత్సరాల విష్ణుపూజతో సమానమైన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. 


 పవిత్రమైన ఈ ధనుర్మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కొత్త ప్రారంభాలకు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో పండుగలు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం, వ్యాపారం ప్రారంభించడం, ఇతర వైదిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అంటారు. ఒకవైపు భగవద్గీత బోధించబడిన పవిత్రమైన మాసం అని, శ్రీమహావిష్ణువు ప్రీతిపాత్రమైనదని దాని ప్రాశస్త్యాన్ని చెప్పుకుంటూనే మరోవైపు ఈ మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు పండితులు. పవిత్రమైన మాసాన్ని మూఢ మాసంతో పోల్చడం పరస్పర విరుద్ధంగా ఉంది కదా ! ఎందుకలా అని లోతుగా పరిశోదించుకుంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించేటప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది అనుకున్నాం కదా. ఈ రాశికి అధిపతి గురువు. సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు సూర్య భగవానుడి శక్తి, ప్రభావం తగ్గిపోతుంది. గ్రహాల స్థానం కూడా శుభ దిశలో కాకుండా వేరే దిశలో కదులుతాయి. అందుకే ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెడితే అడ్డంకులు రావచ్చు.


మరి ఏం చేయాలి? ఈ మాసంలో ఆధ్యాత్మిక సాధనలు, పవిత్ర కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని పండితులు చెబుతారు. ఇది ఆధ్యాత్మిక పవిత్రత కలిగి ఉన్న మాసం. ఈ నెల మొత్తం దైవారాధన, భక్తి, ధ్యానానికే అంకితం చేయాలి. ఇది దేవతలకు బ్రహ్మ ముహూర్త సమయం, అందుకే కొన్ని పనులు చేయకూడదంటారు. ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఈ మాసం ఉంటుంది. ఈ సమయంలో చాలా పవిత్రమైన జీవితం గడపాలి. అందుకే అయ్యప్ప స్వాములు కూడా ఎక్కువగా ఈ నెలలోనే దీక్షలో ఉంటారు. ఈ మాసంలో సూర్యాలయాలు, వైష్ణవ ఆలయాలు సందర్శించడం ఎంతో పుణ్యప్రదం. అసలు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం అనేది హిందు సంప్రదాయంలో ముఖ్యంగా తెలుగు, తమిళ సంస్కృతిలో ఒక భాగం.


ధనుర్మాసం వచ్చిందంటే చాలు. పండుగ హడావిడిని గుర్తు చేస్తూ ఇంటి ముందు అందమైన ముగ్గులను తీర్చిదిద్దుతారు. రంగవల్లుల పోటీలు కూడా పెట్టుకుంటారు. వైష్ణవ ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన నెల కావడం వల్ల వైష్ణవులు నియమ నిష్ఠలతో ధనుర్మాస వ్రతాన్ని (శ్రీ వ్రతం) ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించి, తరించింది కాబట్టే ఈనాటికీ వైష్ణవాలయాల్లో ఆండాళ్ పూజలు అందుకుంటోంది.


 మనం జాగ్రత్తగా గమనిస్తే, పవిత్రమైన తిరుమల కొండపై ధనుర్మాసంలో నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. తిరుమలలో ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం 2025 డిసెంబర్ 30 నుండి జనవరి 8, 2026 వరకు ఉంటుంది, ముఖ్యంగా డిసెంబర్ 30న తెల్లవారుజామున 3:30 గంటల నుండి ప్రారంభమై, మొత్తం పది రోజుల పాటు భక్తులకు ఈ ప్రత్యేక దర్శనం లభిస్తుంది, దీని కోసం తిరుమలలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతాయి.


ఈ మాసంలో ఆళ్వారుల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది. ద్వాదశ ఆళ్వారుల ఎవరు వారి నేపథ్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆళ్వారులు అంటే కాపాడేవారు అని అర్థం. వైష్ణవ భక్తాగ్రేసరులైన ఆళ్వారులు దైవభక్తిలో మునిగి ఆధ్యాత్మిక లోతు తెలుసుకున్నవారు. విష్ణువును కీర్తిస్తూ తమిళంలో భక్తి గీతాలు రచించిన 12 మంది గొప్ప భక్తులు. వీరు 5 నుండి 9వ శతాబ్దాల మధ్య కాలంలో జీవించారు. ఈ మాసంలో అన్ని వైష్ణవ ఆలయాల్లో ముఖ్యంగా 1) ఆండాళ్‌ పూజ, 2) తిరుప్పావై పఠనం, 3) గోదా కళ్యాణం వంటివి నిర్వహిస్తారు.


 ఆండాళ్ పూజ

 +++++++++

ఆండాళ్ పూజ (లేదా గోదా దేవి పూజ) అనేది విష్ణువు పట్ల అచంచలమైన భక్తిని చాటిన మహిళా ఆళ్వార్ అయిన ఆండాళ్ (గోదా దేవి) ని స్మరిస్తూ చేసే విశిష్టమైన ఆరాధన. ఆమెను లక్ష్మీ దేవి లేదా భూదేవి అవతారంగా భక్తులు భావిస్తారు. ఆండాళ్ పూజ చేసేటప్పుడు ఆమెకు ఇష్టమైన తులసి మాలలు సమర్పించడం మరియు పొంగలిని నైవేద్యంగా పెట్టడం ఆచారం.


తిరుప్పావై పఠణం

 ++++++++++++

సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ స్వయంగా రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం అని, పావై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారమే ఈ తిరుప్పావై. 8వ శతాబ్దానికి చెందిన ఆళ్వార్‌ కవయిత్రి గోదాదేవి (ఆండాళ్) రచించిన 30 దివ్య పాశురాలను (భక్తి గీతాలను) తిరుప్పావై గా పారాయణం చేస్తారు. తెలుగులో దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి వారు ఈ పాశురాలకు అనువాదాలు చేశారు. ఆండాళ్ ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలనీ ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ తమిళ భాషలో ఛందోబద్ధంగా కూర్చిన భక్తి గీతాలు లేదా కీర్తనలే పాశురాలు. అలా 30 పాశురాలను ఆ మాసంలోని 30 రోజుల్లో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఈ పాశురాలు భగవంతుని పట్ల శరణాగతిని, అనన్య భక్తిని చాటిచెబుతాయి.


పాశురాలలో ఏమి ఉంది?

 a) లోకా సమస్తా సుఖినోభవంతు అనే భావన తిరుప్పావై లోని 3వ పాశురంలో చెప్పబడింది

b)మనందరం పాటించవలసిన గుణం దానగుణం అని 4వ పాశురంలో చెప్పబడింది

c) 20వ పాశురం పారాయణం చేయడం వలన కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం కలుగుతుంది.

d) 29వ పాశురంలో గోదాదేవి అయోధ్య గురించి గొప్పగా కీర్తించింది

 గోదాదేవి, గోదా కళ్యాణం :

+++++++++++++++++

గోదా కళ్యాణం అంటే గోదాదేవి (ఆండాళ్) మరియు శ్రీ రంగనాథ స్వామిల దివ్య వివాహ మహోత్సవం, ఇది ధనుర్మాసం ముగింపులో, ముఖ్యంగా భోగి రోజున వైష్ణవ ఆలయాల్లో జరుగుతుంది, ఇక్కడ భూదేవి అవతారమైన గోదాదేవి, శ్రీకృష్ణుడిని తన భర్తగా భావించి, ఆయనలో ఐక్యం అవ్వడమే ఈ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

8వ శతాబ్దంలో శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే ఆళ్వారుకు (పెరియాళ్వార్) తులసి వనంలో తవ్వుతుండగా పసి పాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారం. సీతమ్మ, ద్రౌపతి వలనే ఈవిడ కూడా అయోనిజ. దృపదుడు ద్రోణుడు కూడా అయోనిజలే. ద్రోణుడు భరద్వాజ మహర్షి కుమారుడు, ఆయనజననం ఒక 'ద్రోణము' (కుండ) నుండి జరిగింది, అందువల్ల ఆయనను "అయోనిజుడు" అంటారు.


విష్ణుచిత్తుడు ప్రతి దినం శ్రీరంగనాధుడికి అన్ని రకాల కైంకర్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి ఉండేవాడు. గోదాదేవి తండ్రిని అనుసరిస్తూ శ్రీకృష్ణ లీలలు శ్రద్ధగా వింటూ అపర భక్తురాలుగా మారింది. చిన్న వయసు నుంచే శ్రీకృష్ణుని తన భర్తగా భావిస్తూ, ఆయన కోసం అల్లిన పూలమాలలను ముందుగా తాను ధరించి సరిచూసుకొన్న తరువాతే భగవంతునికి సమర్పించేది. ఒకసారి పూలదండలో కనిపించిన వెంట్రుక చూసి విష్ణు చిత్తుడు విషయం తెలుసుకొని కలవరపడి గోదా దేవిని గట్టిగా మందలిస్తాడు. అప్పుడు స్వయంగా శ్రీరంగనాయకుడే విష్ణు చిత్తునికి స్వప్నంలో కనిపించి గోదాదేవి ధరించిన ఆ మాలలే తనకు ఇష్టమని చెప్పాడట. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద గోదాదేవి మరియు శ్రీ రంగనాదుల కళ్యాణ గాధ. ఆముక్త" అంటే ధరించిన, "మాల్యద" అంటే పూమాల. అంటే తాను ధరించిన పూమాలను భగవంతునికి సమర్పించినది.


 యుక్తవయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలచి ఆమె తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకు ఎవరంటే ఇష్టమని అడగగా గోదాదేవి మానవ మాత్రులని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది.‌ ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలని పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలోని 30 రోజుల్లో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెతో వివాహానికి సమ్మతించి శ్రీరంగం రమ్మని ఆహ్వానిస్తాడు.

ఆయన చూస్తే భగవంతుడు. ఈమె చూస్తే మానవకన్య. ఈ వివాహం ఎలా జరుగుతుందా అన్న ఆందోళనతో నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో శ్రీరంగనాయకుడు కనిపించి గోదా దేవిని తీసుకొని మేళతాళాలతో శ్రీరంగం రమ్మని చెప్తారు. అక్కడ సాక్షాత్తూ పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో, (రాజుల గౌరవార్థం ఉపయోగించే రాజ లాంఛనాలు), మణి మాణిక్యాలతో అలంకరించబడిన దంతపు పల్లకిలో ఎక్కించి వారిని సగౌరవంగా ఆహ్వానిస్తాడని, అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని" చెబుతాడు.


విగ్రహరూపంలో ఉన్న భగవంతుడు గోదాదేవిని ఎలా వివాహం చేసుకుంటాడో చూడాలని కుతూహలంతో ఊళ్ళో వాళ్ళందరూ తండోపతండాలుగా గుడికి వచ్చి చేరుకున్నారు. విష్ణుచిత్తుడు రంగనాయకుడు కలలో కనిపించి చెప్పిన విధంగానే గోదాదేవిని, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. పెళ్లి కూతురిగా దంతపు పల్లకిలో అంతరాలయంలో ప్రవేశించిన గోదాదేవి రంగనాథుని పాదాలకు నమస్కారం చేసిన వెంటనే అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు.


నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని కొందరు పెద్దలు చెప్తుంటారు. కానీ ఇందులోని సాహితీ విలువలు, ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనంచేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు లభించే ఒక అరుదైన అవకాశం, దీని ద్వారా ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని నమ్మకం, ఎందుకంటే ఈ రోజున విష్ణువు తన వైకుంఠానికి ఉత్తర ద్వారమును తెరిచి ఉంచుతాడని, ముక్కోటి దేవతలు కూడా ఈ దర్శనం కోసం వస్తారని పురాణాలు చెబుతాయి.


 ధనుర్మాసం ఫలశ్రుతి:

ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయిన మనసా వాచ కర్మణా యదాశక్తిగా పూజించిన యెడల 1000 యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలో కానీ లేక ఏదైనా ఒక పవిత్రమైన పుణ్య స్థలంలోని కోనేటిలో ఒక్క మునుగు మునిగితే ✓అశ్వమేధయాగం చేసిన ఫలితము దక్కుతుంది.

స్వస్తి

*ఆర్ సి కుమార్ 


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page