'Addam Thirigina Katha' - New Telugu Story Written By D V D Prasad
Published In manatelugukathalu.com On 20/10/2023
'అడ్డం తిరిగిన కథ' తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అప్పుడే అధిష్ఠానం జరిపిన రహస్య సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన రామావతారం, కారులో వెనక సీట్లో కూర్చున్నాడు. అతని పిఏ పరమానందం ముందు సీట్లో కూర్చున్న తర్వాత, కారు రామావతారం ఇంటివైపు కదిలింది. ఎన్నికలు దగ్గర పడటంలో అన్ని రాజకీయ పార్టీలూ చాలా హుషారుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఆయా పార్టీల కార్యకర్తలు. ఎత్తుకు పై ఎత్తులతో రాష్ట్రమంతా రణరంగాన్ని తలపిస్తోంది.
కారులో వెనక్కి జారగిలబడిన రామావతారం మనసులో పార్టీ అద్యక్షుడు జంబూకరావు చెప్పిన విషయాలు అన్నీ మెదలసాగాయి. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి గెలుపు మంత్రాలన్నీ పార్టీ నాయకులకు బోధించాడు అద్దెకు తేబడిన ఉత్తరాదికి చెందిన రాజకీయ సలహాదారుడు. ఇంతకు ముందు ఎన్నో పార్టీలను అందలమెక్కించిన అనుభవం ఉన్న ఆ సలాహాదారుకు దేశమంతటా మంచి పేరుంది. ఆ సలహాలన్నీ మన రాజకీయ నాయకులకు తెలియనివేమీ కావు. అయినా మరోసారి పునశ్చరణ చెయ్యడం విధికదా! అందుకే ఆ రహస్య సమావేశం నిర్వహించబడింది.
ఎన్నికల్లో విజయం సాధించాలంటే రకరకాల తాయిలాలు ఓటర్లకి ఏరచూపాలి. సాధ్యమైనా, కాకపోయినా బోలెడు హామీలు గుప్పించాలి. ఎన్నికలకి ముందు డబ్బులు, మద్యం పంచాలి. మధ్యం మత్తులో తమ పార్టీకే ఓటేస్తారన్న గ్యారంటీ లేదు కాబట్టి, ఓట్లు ఎలా పడతాయో మన ప్రయత్నం మనం చేసుకోవాలి. అన్నిటికన్నా ముందు ఎదుటిపార్టీ ఓట్లు తొలగించడంతో పాటు, కొత్త ఓట్లు నమోదు చేసుకోవాలి. ముఖ్యంగా దొంగ ఓటర్ల పేర్లు కూడా నమోదు చేసి, దొంగ ఓట్లు మన పార్టికే పడేట్లు చేసుకుంటే విజయం తథ్యం అన్న విషయం నొక్కి వక్కాణించాడు ఆ రాజకీయ సలహాదారుడు.
పార్టీ అద్యక్షుడు కూడా సాధ్యమైనంతవరకూ అలాగే చెయ్యాలని అందర్నీ ఆదేశించాడు. ఆ పనులన్నీ రహస్యంగా జరగాలని, మూడో కంటివాడికి తెలియకూడదని కూడా హెచ్చరించాడు. రామావతారం గత రెండు సార్లూ తన నియోజిక వర్గంలో ఎమ్మెల్లేగా గెలుపొందినా ఇంతవరకూ మంత్రి పదవి వరించలేదు. ఈసారి మాత్రం తనకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పాడు. ఈసారి గనుక ఆ నియోజక వర్గంలో భారీగా గెలుపొందితే మంత్రి పదవి తప్పకుండా ఇస్తానని పార్టీ అద్యక్షుడు మాటిచ్చినందుకు రామావతారం సంతోషించినా, ఈ సారి గెలుపొందడం అంత సులభంగా అనిపించడం లేదు.
అందుకు కారణం ముఖ్యంగా పార్టీకి ప్రజల్లో దిగజారిన ప్రతిష్ఠ. కిందటి సారిలా డబ్బులు, మద్యమూ పంచితే తను గెలుపొందేట్లు లేదు. కిందటిసారే, చాలా తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు. ఈసారి అక్రమ పద్ధతులు అవలంబించకపోతే తనకి ఓటమి తప్పకపోవచ్చు. గెలుపు రుచి చూసిన వాడికి ఓడిపోవడమెంత కష్టమో తనకి తెలియంది కాదు. అందుకే తీవ్రంగా ఆలోచనల్లో పడ్డాడు రామావతారం.
ఇలా రామావతారం ఆలోచనలు తెగకుండానే కారు ఇంటివద్ద ఆగడంతో కిందకి దిగాడు. ఇంట్లోకి ప్రవేశించగానే భార్య కాంతం చేటంత మొహంతో అతనికి ఎదురు వచ్చింది. ఆమె మొహం అంతలా ఎందుకు వెలిగిపోతోందే ఏ మాత్రం ఊహకి అందలేదు రామావతారానికి. ఇంతలో కాంతం వెనుకే హఠాత్తుగా ప్రత్యక్ష్యమైన బావమరుదులు కొండబాబు, చిట్టిబాబులను చూడగానే ఆమె మొహంలో కలిగిన మార్పుకి కారణం బోధపడింది. అయితే వాళ్ళిద్దరూ ఎందుకూ పనికిరానివాళ్ళని రామావతారంలో ఓ భావం ప్రగాఢంగా నాటుకుపోయింది. పేరుకి వాళ్ళిద్దరూ కొండబాబు, చిట్టిబాబు అయినా ఇద్దరూ కొండముచ్చులనే రామావతారం నమ్ముతాడు.
"చూసారా! ఎవరొచ్చారో!" అంది కాంతం సంబరంగా.
"బావా!" అన్నారిద్దరూ కోరస్‌గా.
"ఆ చూడకపోవడమేమిటి? అయినా ఈ కోతి మూక ఇక్కడకి ఎందుకొచ్చినట్లు?" మొహం చిట్లించుకొని అన్నాడు రామావతారం సోఫాలో కూర్చుంటూ.
కొండబాబూ, చిట్టిబాబులైతే మొహం ముడుచుకున్నారు. ఆ మాటలు వింటూనే చిర్రెత్తుకొచ్చింది కాంతంకి. "ఏమిటి? మా వాళ్ళైతే కోతి మూకా? మరి మీ వాళ్ళేమిటి?" అంటూ ఇంతెత్తున ఎగిరింది.
"ఆ వంశవృక్షమంతా ఇప్పుడెందుకుగానీ, ఇప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చినట్లూ అది ముందు చెప్పు!" విసుగ్గా అన్నాడు రామావతారం.
"మీరేదో వాళ్ళని ఉద్ధరిస్తారని మా నాన్నగారు పంపించారండీ! కొండకేమో క్రికెట్టూ, చిట్టికేమో సినిమాలు తప్ప ఇంకేమీ తెలియవని మీకు తెలుసు కదండీ!"
"ఆ భేషుగ్గా తెలుసు! ఆ కొండగాడు చదువు ఎగొట్టి ఎప్పుడూ ఆడటమో, టివిలో మేచులు చూడటమో చేస్తాడు కదా, అలాగే చిట్టిగాడు ఏ కొత్త సినిమా రిలీజైనా సినిమా హాళ్ళ ముందు హాజరేసి హంగామా చేస్తాడు. అంతే కదా!"
"అందుకే, కొండబాబు ఏదైనా టీములో ఆడేట్లు చూడండి, కనీసం రంజీలోనైనా. అలాగే మీకు తెలిసిన నిర్మాతలకి చెప్పి చిట్టిబాబుకి ఏ సినిమాలోనో హీరోగా వేషం దొరుకుతుందేమో చూడండి. మీ పలుకుబడితో ప్రయత్నిస్తే తప్పకుండా వాళ్ళు ఆ యా రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు!"చెప్పింది కాంతం.
"కొండబాబు మంచినీళ్ళో, డ్రింక్స్ అందించడానికి మాత్రమే పనికివస్తాడేమో, అలాగే చిట్టిబాబు ఏ కమెడియన్గానో పనికొస్తాడుగాని, హీరోగా ఎవరు తీస్కున్నా తల మీద తువ్వాలు కప్పుకోవలసిందే!" అంటూ వాళ్ళిద్దరివైపు చూసేసరికి వాళ్ళ మొహాలు నల్లగా మాడిపోయాయి.
కాంతానికి మాత్రం కోపం హద్దులు దాటి నోరు తెరిచి ఏదో అనబోయేంతలో హఠాత్తుగా రామావతారంకి ఏదో తట్టింది. వెంటనే, "ఆ విషయం తర్వాత చూద్దాం! ఇప్పుడు ఎలక్షన్లు ముంచుకు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ నాకు సహాయ పడితే, రాజకీయాల్లో పనికి వస్తారేమో చూద్దాం." అన్నాడు.
'ఎగస్పార్టీవాళ్ళ ఓట్లు తొలగించడంతోపాటు, బోగస్ వోటర్లు నమోదు చెయ్యడానికి బావమరుదులిద్దర్నీ వినియోగించుకుంటే ఎలా ఉంటుందన్న ' ఆలోచనతో ఆ మాట అన్నాడో లేదో, కాంతం మొహం చేటంత అయింది.
అలాంటి ఆలోచన తనకి రానందుకు తనని తాను తిట్టుకొని, "అవునండోయ్! వాళ్ళని రాజకీయాల్లో చేరిస్తే మా నాన్నకి ఇంక ఏ బెంగా ఉండదు." అంది.
కొండబాబు, చిట్టిబాబు ఇద్దరి మొహాలు కూడా వెలిగిపోయాయి. "అలాగే బావా! ఏం చెయ్యాలో చెప్పు! సిక్స్ కొట్టినంత ఈజీగా చేసేస్తాను." చెప్పాడు కొండబాబు ఉత్సాహంగా సిక్స్ కొట్టినట్లు అభినయం చేస్తూ.
"చెప్పు బావా! హీరో విలన్ భరతం పట్టినట్లు చెలరేగాలా?" ఉల్లాసంగా ఎగిరాడు చిట్టిబాబు.
"కోతిగంతులే తప్ప మామూలుగా ఉండరా మీరిద్దరూ!" చిరాకు పడ్డాడు రామావతారం.
"నీకు సహాయం చెయ్యడానికి మాలాంటి వాళ్ళే కావాలి బావా!" అన్నాడు కొండబాబు.
"నిజమేనండీ! మీరేమో రామావతారం, మీకు ఆంజనేయుడి లాంటి మా తమ్ముళ్ళు సహాయం చేస్తే ఇక మీకు తిరుగే ఉండందండీ!" అంది కాంతం తమ్ముళ్ళను వెనకేసుకొస్తూ.
"అలాగేలేవే!" అన్నాడు వాళ్ళిద్దరివైపు సాలోచనగా చూస్తూ. ఆ మరునాడు బావమరదులు ఇద్దర్నీ పిలిచి వాళ్ళు చెయ్యవలసిన పని చెప్పాడు, "చూడండి! ఇది చాలా రహస్యంగా జరగాలి. ఎదుటివారికి ఎట్టి పరిస్థితిల్లోనూ తెలియకూడదు. మనకి పోటీగా నిలబడుతున్న పార్టీకి మద్దతు ఇస్తున్న వోటర్ల ఓట్లు కొన్ని గల్లంతు చెయ్యాలి. అలాగే కొన్ని బోగస్ ఓటర్ల పేర్లు నమోదు చెయ్యాలి. ఏవో పేర్లతో కొత్తగా బోగస్ ఓట్లు నమోదు చెయ్యాలి. నకిలీ గుర్తింపు కార్డలతో ఆ ఓట్లు మనకి పడితే ఇక మనం గెలవడం ఖాయం." అని వివరంగా చెప్పాడు.
అంతే! ఆ బావమరుదులిద్దరూ నిలువుగా తలూపి కార్యరంగంలోకి దూకారు. వారం రోజులు కష్టపడి బావ రామావతారం అప్ప చెప్పిన పని పూర్తి చేసారు. ఎదుటి పార్టీ ఓట్లు గల్లంతు చేసి, ఆ స్థానంలో కొత్తగా బోగస్ ఓటర్ల పేర్లు నమోదు చేసారు. వాళ్ళ అంత తొందరగా తను అప్పచెప్పిన పని పూర్తి చేస్తారని ఊహించని రామవతారం వాళ్ళ పనితనానికి ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరికీ జల్సా చేసుకోమని చేరో పాతికవేలు ఇచ్చాడు.
కొండబాబు, చిట్టిబాబు ఆనందానికి అవధులు లేవు. ఇక బావ ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలిచినట్లు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు, తమకి పార్టీలో ఏవో పదవులిచ్చినట్లు తీయని కలలు కనసాగారు ఆ అన్నదమ్ములిద్దరూ. కాంతం కూడా వాళ్ళ జీవితాలు ఓ కొలిక్కి రాబోతున్నందుకు సంతోషించింది.
********
ఓ రెండు నెలలు గడిచిన తర్వాత, ఓ రోజు పార్టీ ప్రెసిడెంట్ రామావతారంని పిలిపించాడు. తను చేసిన పనిని మెచ్చుకొని పిలిపించాడని ఆనందంగా ఆఘమేఘాలమీద బయలుదేరి అతన్ని కలుసుకున్నాడు రామావతారం. అయితే, అతను ఊహించిన దానికి భిన్నంగా పార్టీ ప్రెసిడెంట్ జంబుకరావు రామావతారంపై మండిపడ్డాడు.
"కొంప ముంచావు కదా రామావతారం! పార్టీ పరువు నిలువునా తీసావు. నీ గొయ్య నువ్వే తవ్వుకున్నావు! ఇన్నాళ్ళ నుండి రాజకీయాల్లో ఉన్నావు, రెండు సార్లు గెలిచావు కూడా! ఈ మాత్రం కూడా తెలియదుటయ్యా నీకు? ఇలా చేస్తే మనని అందరూ ఎండగట్టరా? ప్రజలకి మనపై నమ్మకం ఎలా ఉంటుంది, మననెలా గెలిపిస్తారు? అయినా ఇలాటయ్యా చేసేది? నేనూ ఇప్పుడే చూస్తున్నాను, ఆపోజిషన్ వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? కొంపలంటుకు పోవూ? పేపర్లవాళ్ళూ, టివీవాళ్ళూ మనల్ని ఎండగట్టరూ?" అంటూ కోపంగా చేతులో ఉన్న కాగితాల్ని రామావతారం వైపు విసిరాడు.
ఇంతకు ముందు అంత కోపమెప్పుడూ అతని మొహంలో చూడలేదు రామావతారం. తను పార్టీ ఫండ్స్ కూడా భారీగానే ఇస్తున్నాడాయె! అలాంటి తన మీద కోపగించుకుంటాడా? అని రామావతారం కూడా అతనివైపు సూటిగా చూసాడు.
దాంతో చిర్రెత్తుకొచ్చిన జంబుకరావు, "చూడు నువ్వేం చేసావో? ఎగస్పార్టీవాళ్ళ ఓట్లు తొలగించావు సరే, కానీ బోగస్ ఓటర్ల పేర్లు చదువు నీకే తెలుస్తుంది." అన్నాడు.
అప్పుడు ఆ కాగితాలు చేతులోకి తీసుకొని చదివిన రామావతారం ముఖంలో రంగులు మారాయి. అవి తన నియోజికవర్గం ఓటర్ లిస్ట్‌కి సంబంధించినవి. అందులో ఉన్న పేర్లను చదివాడు. అంతే, రామావతారం మొహం ఒక్కసారి పాలిపోయింది. తలెత్తి జంబూకరావువైపు చూడలేకపోయాడు. తను ఎంతో నమ్మకంగా బావమరుదులిద్దరికీ అప్పచెప్పిన పని ఇలా బెడిసి కొడుతుందనుకోలేదు. కథ ఇలా అడ్డం తిరుగుతుందనుకోలేదు.
బోగస్ ఓటర్ల పేర్లు ఏమిటి రాసారో వాళ్ళిద్దరూ చూసుకోకపోవడం నిజంగా తన పొరపాటే! క్రికెట్ అంటే పడి చచ్చే కొండబాబు, తనకి తెలిసిన క్రికెట్ ఆటగాళ్ళ పేర్లన్నీ నమోదు చేసాడు. అలాగే, సినిమాలు అంటే ప్రాణం పెట్టే చిట్టిబాబు సినిమా హీరోల పేర్లే కాక, తనకు తెలిసిన విలన్ల పేర్లు, డైరెక్టర్ల పేర్లు, సంగీత దర్శకుల పేర్లు, కామెడియన్ల పేర్లు కూడా చేర్చాడు. అందులో కొన్ని కీర్తిశేషులైనవాళ్ళ పేర్లు కూడా కొన్ని ఉన్నాయి.
ఆ పేర్లన్నీ చదివిన రామావతారం మొహం మాడిపోయింది. తమ పార్టీ ప్రెసిడెంట్ జంబూకరావు మొహంవైపు చూడటానికి సిగ్గేసింది.
"నిజమే! ఇలా చెయ్యమని చెప్పింది నేనే! కానీ ఇలా క్రికెటర్ల పేర్లు, సినిమా వాళ్ళ పేర్లు చేర్చితే మనం సులభంగా పట్టుబడమా, నవ్వులపాలు అవమా!" అన్నాడు జంబూకరావు అతనివైపు గుర్రుగా చూస్తూ.
జరిగిన విషయం తలుచుకునేసరికి కొండబాబుమీద, చిట్టిబాబు మీదా విపరీతమైన కోపం ముంచుకొచ్చింది రామావతారంకి. 'నిజంగా కోతి మూకే!' అని మనసులో తిట్టుకొని, "తప్పైపోయింది, మళ్ళీ ఎలాగో బతిమాలుకొని అన్నీ మార్పిస్తాను." అని జంబూకరావు కాళ్ళావేళ్ళా పడి ప్రసన్నం చేసుకొనేసరికి అతని తాతలు దిగివచ్చారు.
************
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
留言